“లోక సంబంధులు కారు”
“లోక సంబంధులు కారు”
‘లోకం వాళ్లను ద్వేషించింది, ఎందుకంటే వాళ్లు లోక సంబంధులు కారు.’—యోహాను 17:14.
ఆ మాటలకు అర్థం ఏంటి? యేసు లోక సంబంధి కాదు కాబట్టి తన కాలంనాటి సామాజిక, రాజకీయ వివాదాల్లో తలదూర్చలేదు. ఆయనిలా అన్నాడు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు. కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహాను 18:36) అంతేకాదు, దేవుని వాక్యం ఖండించే ఆలోచనలకు, మాటలకు, పనులకు దూరంగా ఉండమని ఆయన తన అనుచరులకు చెప్పాడు.—మత్తయి 20:25-27.
తొలి క్రైస్తవులు దాన్ని ఎలా పాటించారు? తొలి క్రైస్తవులు “ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా అంటే అపహసించబడినా, బంధించబడినా, ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినా [యుద్ధంలో] పోరాడడానికి ఒప్పుకోలేదు” అని మత రచయిత జోనాతాన్ డైమండ్ రాశాడు. వాళ్లు తటస్థత విషయంలో రాజీపడడం కన్నా కష్టాలు భరించడానికే ఇష్టపడ్డారు. వాళ్ల నైతిక ప్రమాణాల కారణంగా వాళ్లు ఇతరులతో పోలిస్తే వేరుగా ఉన్నారు. క్రైస్తవుల గురించి బైబిల్లో ఇలా ఉంది: “మీరు ఇక తమతో కలిసి చెడ్డపనులు చేయట్లేదని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు, అందుకే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు.” (1 పేతురు 4:4) క్రైస్తవులు “తమ భక్తితో, మర్యాదతో సుఖాలే జీవితంగా బ్రతుకుతున్న అన్యులను కలవరపెట్టారు” అని చరిత్రకారుడైన విల్ డ్యూరంట్ రాశాడు.
నేడు దాన్ని ఎవరు పాటిస్తున్నారు? క్రైస్తవ తటస్థత గురించి న్యూ క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “మనస్సాక్షిని బట్టి ఆయుధాలు చేపట్టకపోవడం నైతికంగా తప్పు.” ఆఫ్రికన్ రైట్స్ అనే ఒక మానవ హక్కుల సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, 1994 లో రువాండాలో జరిగిన జాతినిర్మూలనలో, “ఒక్క యెహోవాసాక్షులు తప్ప” అన్ని చర్చీలవాళ్లు పాల్గొన్నారని రెఫామీయర్టె ప్రెస్సెలోని ఒక ఆర్టికల్ పేర్కొంది.
నాజీ మారణహోమం గురించి చర్చిస్తూ, ఒక ఉన్నత పాఠశాల టీచర్ ఇలా బాధపడ్డాడు: “ఆ లెక్కలేని అబద్ధాలు, క్రూరత్వం, అరాచకాలకు వ్యతిరేకంగా ఏ గుంపూ లేదా సంస్థ నోరు తెరవలేదు.” అతను యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియంను సంప్రదించిన తర్వాత ఇలా రాశాడు: “ఇప్పుడు నాకు జవాబు దొరికింది.” అన్ని క్రూరహింసలు ఎదురైనా, యెహోవాసాక్షులు తమ నమ్మకాల విషయంలో స్థిరంగా ఉన్నారని అతను తెలుసుకున్నాడు.
వాళ్ల నైతిక ప్రమాణాల విషయం ఏంటి? యూ.ఎస్. క్యాథలిక్ పత్రిక ఇలా చెప్తుంది, “క్యాథలిక్ చర్చీకి వెళ్లే యువతీయువకుల్లో ఎక్కువమంది సహజీవనం, పెళ్లికి ముందు సెక్స్ వంటి విషయాల్లో చర్చీ బోధల్ని అంగీకరించట్లేదు.” అదే పత్రిక ఒక చర్చీ మతపెద్ద ఇలా అన్నాడని రాసింది: “నేను గమనించిన దాని ప్రకారం, పెళ్లి చేసుకోవడానికి వచ్చేవాళ్లలో 50 శాతం కన్నా ఎక్కువమంది అప్పటికే కలిసి జీవిస్తున్నారు.” ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, యెహోవాసాక్షులు “ప్రవర్తన విషయంలో ఉన్నత నైతిక ప్రమాణాలు కలిగి ఉండాలని నొక్కి చెప్తారు” అని చెప్తుంది.