కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు

మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు

యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన పరలోక తండ్రి వ్యక్తిత్వాన్ని, ఆయన పనులుచేసే తీరును పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. యేసు ఇలా అన్నాడు: “నా అంతట నేనే ఏమీ చేయను ... తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను. ... నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను.” (యోహాను 8:28, 29; కొలొస్సయులు 1:15) కాబట్టి యేసు స్త్రీలతో నడుచుకున్న తీరును, వాళ్లను చూసిన తీరును పరిశీలించడం ద్వారా దేవుడు స్త్రీలను ఎలా చూస్తాడో, మనం వాళ్లను ఎలా చూడాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవచ్చు.

సువార్తలు రాసే సమయానికి ప్రజలు స్త్రీలను చూసిన తీరుకు, యేసు చూసిన తీరుకు చాలా తేడా ఉందని కొంతమంది పండితులు అంటారు. ఏ విధాల్లో అది వేరుగా ఉంది? మరిముఖ్యంగా, ఆయన బోధలు ఈ రోజుల్లోని స్త్రీలకు కూడా మరింత స్వేచ్ఛను ఇవ్వగలవా?

యేసు స్త్రీలతో ఎలా నడుచుకున్నాడు?

యేసు స్త్రీలను కేవలం మగవాళ్ల కోరికలు తీర్చేవాళ్లు అన్నట్టు చూడలేదు. ఆడవాళ్లకు దగ్గరగా వెళ్లడం వల్ల, లైంగిక కోరికలు పెరగడం తప్ప ఇంకేం జరగదని కొంతమంది యూదా మతనాయకులు అనుకునేవాళ్లు. అందుకే నలుగురిలో ఉన్నప్పుడు స్త్రీలు మగవాళ్లతో మాట్లాడకూడదని, ముసుగు లేకుండా బయటికి రాకూడదని నియమాలు పెట్టేవాళ్లు. అయితే యేసు అలాంటి నియమాలు పెట్టలేదు. బదులుగా, మగవాళ్లే తమ కోరికల్ని అదుపులో పెట్టుకోవాలని, స్త్రీలను విలువైనవాళ్లుగా చూస్తూ వాళ్లను గౌరవించాలని చెప్పాడు.​—మత్తయి 5:28.

యేసు ఇంకా ఇలా చెప్పాడు: “తన భార్యకు ​విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి ​వ్యభిచారం చేస్తున్నాడు, తన భార్య విషయంలో పాపం చేస్తున్నాడు.” (మార్కు 10:11, 12) అలా యేసు, “ఏదైనా ఒక కారణాన్ని బట్టి” పురుషులు తమ భార్యలకు విడాకులు ఇవ్వొచ్చు అని చెప్పే అప్పటి రబ్బీల బోధను తిరస్కరించాడు. (మత్తయి 19:3, 9) భార్య విషయంలో పాపం చేయడం అనే మాట, ఆ కాలంలో చాలామంది యూదులకు కొత్తగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే, వాళ్ల రబ్బీలు కేవలం స్త్రీలు మాత్రమే నమ్మకద్రోహం చేయగలరని, భర్త వ్యభిచారం చేసినా అది ఎప్పటికీ భార్య విషయంలో పాపం చేసినట్టు అవ్వదని బోధించేవాళ్లు! ఒక బైబిలు వ్యాఖ్యానం ప్రకారం, “భార్యతో పాటు భర్తకు కూడా సమాన నైతిక బాధ్యత ఉందని బోధించడం ద్వారా యేసు ఆడవాళ్ల హోదాను, గౌరవాన్ని పెంచాడు.”

యేసు మాటల ప్రభావం ఈ రోజుల్లో: యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘ కూటాల్లో స్త్రీలు ఎలాంటి ఆటంకం లేకుండా పురుషులతో సహవసిస్తారు. ఎవరైనా వంకర చూపులు చూస్తారని, అతి చనువు ప్రదర్శిస్తారని వాళ్లు భయపడనక్కర్లేదు. ఎందుకంటే క్రైస్తవ పురుషులు “వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను స్వచ్ఛమైన మనసుతో అక్కచెల్లెళ్లుగా భావించే” విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.​—1 తిమోతి 5:2.

స్త్రీలకు బోధించడానికి యేసు సమయం కేటాయించాడు. ఆ కాలంలో రబ్బీల ఆలోచనా తీరు కారణంగా స్త్రీలకు ఏమీ నేర్చుకునే అవకాశం ఉండేది కాదు. కానీ యేసు వాళ్లకు చాలా విషయాలు బోధించాడు, తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పనిచ్చాడు. మరియ తన దగ్గర సంతోషంగా నేర్చుకుంటున్నప్పుడు యేసు ఆమెను అడ్డుకోలేదు, అలా ఆడవాళ్లు కేవలం వంటింటికే పరిమితం కాదని చూపించాడు. (లూకా 10:38-42) మరియ సహోదరి మార్త కూడా యేసు బోధించిన వాటివల్ల ప్రయోజనం పొందింది. లాజరు చనిపోయినప్పుడు ఆమె యేసుకు ఇచ్చిన జవాబులు చూస్తే ఆ విషయం అర్థమౌతుంది.​—యోహాను 11:21-27.

స్త్రీల ఆలోచనలకు కూడా యేసు విలువ ఇచ్చేవాడు. ఆ కాలంలో యూదులైన స్త్రీలు యోగ్యుడైన కొడుకును, వీలైతే ఒక ప్రవక్తను కంటే జీవితం సంతోషంగా ఉంటుందని అనుకునేవాళ్లు. ఒకసారి, యేసును చూసి ఒకామె ‘నిన్ను కన్న స్త్రీ సంతోషంగా ఉంటుంది!’ అంది. అప్పుడు యేసు ఆమెకు అంతకన్నా మెరుగైన దాని గురించి చెప్పాడు. (లూకా 11:27, 28) దేవునికి లోబడడం ఇంకా ముఖ్యమని చెప్పడం ద్వారా, యేసు ఆమె దృష్టిని సాంప్రదాయం కన్నా ముఖ్యమైన దానివైపు మళ్లించాడు.—యోహాను 8:32.

యేసు మాటల ప్రభావం ఈ రోజుల్లో: క్రైస్తవ సంఘంలో బోధించేవాళ్లు, సంఘ కూటాల్లో స్త్రీలు చేసే వ్యాఖ్యానాల్ని విలువైనవిగా చూస్తారు. పరిణతి గల స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు, అలాగే నలుగురిలో ఉన్నప్పుడు తమ చక్కని ఆదర్శం ద్వారా ‘మంచి విషయాలు బోధిస్తున్నందుకు’ వాళ్లను గౌరవిస్తారు. (తీతు 2:3) అంతేకాదు, దేవుని రాజ్య సువార్తను ప్రజలందరికీ చెప్పే పనిలో వాళ్ల మద్దతును విలువైనదిగా చూస్తారు.​—కీర్తన 68:11; “ స్త్రీలు మాట్లాడకూడదని అపొస్తలుడైన పౌలు చెప్పాడా?” అనే బాక్సు చూడండి.

యేసు స్త్రీల మీద శ్రద్ధ చూపించాడు. బైబిలు కాలాల్లో కొడుకులకు ఇచ్చినంత ప్రాముఖ్యత కూతుళ్లకు ఇచ్చేవాళ్లు కాదు. టల్మూడ్‌లో అలాంటి ఆలోచన కనిపిస్తుంది, అందులో ఇలా ఉంది: “మగపిల్లలు ఉన్నవాడు ధన్యుడు, ఆడపిల్లలు ఉన్నవాడికి శ్రమ.” కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లను చాలా పెద్ద భారంగా చూసేవాళ్లు. ఎందుకంటే, ఆమె కోసం భర్తను వెదకాలి, కట్నం ఇవ్వాలి, పైగా తాము వృద్ధులైనప్పుడు ఆమె చూసుకుంటుందని ఆశించలేరు.

ఒక బాబు ప్రాణం ఎంత విలువైనదో పాప ప్రాణం కూడా అంతే విలువైనదని యేసు చూపించాడు. నాయీను అనే నగరంలోని విధవరాలి కుమారుణ్ణి తిరిగి బ్రతికించినట్టే, యాయీరు కూతుర్ని కూడా తిరిగి బ్రతికించాడు. (మార్కు 5:35, 41, 42; లూకా 7:11-15) ‘చెడ్డదూత 18 సంవత్సరాల పాటు ​బలహీనం చేసిన’ ఒక స్త్రీని బాగుచేసిన తర్వాత యేసు ఆమెను “అబ్రాహాము కూతురు” అన్నాడు. యూదుల రాతల్లో ఆ మాట దాదాపు కనిపించదు. (లూకా 13:10-16) గౌరవం, దయ ఉట్టిపడే ఆ మాట ఉపయోగించడం ద్వారా యేసు, సమాజంలో ఏ ఇతర వ్యక్తి కన్నా ఆ స్త్రీ తక్కువ కాదని చూపించాడు, ఆమెకున్న గొప్ప విశ్వాసాన్ని గుర్తించాడు.—లూకా 19:9; గలతీయులు 3:7.

యేసు మాటల ప్రభావం ఈ రోజుల్లో: ఆసియాలోని ఒక సామెత ఇలా చెప్తుంది: “కూతుర్ని పెంచడం అంటే, పక్కింటి వాళ్ల తోటకు నీళ్లు పోయడం లాంటిది.” కానీ క్రైస్తవులైన ప్రేమగల తండ్రులు అలాంటి ఆలోచనను పక్కనపెట్టి, కొడుకులైనా కూతుళ్లైనా తమ పిల్లలందర్నీ శ్రద్ధగా చూసుకుంటారు. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలందర్నీ చక్కగా చదివిస్తారు, వాళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు.

తాను తిరిగి బ్రతికాననే విషయం గురించి అపొస్తలులకు చెప్పే గౌరవాన్ని యేసు మగ్దలేనే మరియకు ఇచ్చాడు

యేసు స్త్రీల మీద నమ్మకం చూపించాడు. యూదుల న్యాయస్థానాల్లో బానిసల సాక్ష్యానికి ఎంత విలువ ఉండేదో స్త్రీల సాక్ష్యానికి కూడా అంతే విలువ ఉండేది. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసిఫస్‌ఇలా చెప్పాడు: ‘ఆడవాళ్లు ఇచ్చే ఎలాంటి రుజువును అంగీకరించకూడదు, ఎందుకంటే వాళ్లు విషయాల్ని తేలిగ్గా తీసుకుంటారు, తెలివితక్కువ ధైర్యం ప్రదర్శిస్తారు.’

దానికి పూర్తి విరుద్ధంగా యేసు, తాను మళ్లీ బ్రతికిన విషయం గురించి సాక్ష్యం చెప్పడానికి స్త్రీలను ఎంచుకున్నాడు. (మత్తయి 28:1, 8-10) ఈ నమ్మకమైన స్త్రీలు తమ ప్రభువు చనిపోవడం, సమాధి చేయబడడం కళ్లారా చూసినా సరే, అపొస్తలులు వాళ్ల మాటల్ని నమ్మలేకపోయారు. (మత్తయి 27:55, 56, 61; లూకా 24:10, 11) అయితే యేసు ముందుగా స్త్రీలకు కనిపించడం ద్వారా, తన మిగతా శిష్యుల్లాగే ఆ స్త్రీలు కూడా సాక్ష్యం చెప్పడానికి అర్హులని చూపించాడు.—అపొస్తలుల కార్యాలు 1:8, 14.

యేసు మాటల ప్రభావం ఈ రోజుల్లో: యెహోవాసాక్షుల సంఘాల్లో బాధ్యతలు ఉన్న పురుషులు స్త్రీల మాటల్ని లెక్కలోకి తీసుకోవడం ద్వారా వాళ్లను పట్టించుకుంటున్నామని చూపిస్తారు. అలాగే, క్రైస్తవ భర్తలు తమ భార్యలు చెప్పేది శ్రద్ధగా వినడం ద్వారా ‘వాళ్లకు గౌరవం ఇస్తారు.’—1 పేతురు 3:7; ఆదికాండం 21:12.

బైబిలు సూత్రాలు స్త్రీలు సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తాయి

బైబిలు సూత్రాలు పాటించేవాళ్లు స్త్రీలను గౌరవిస్తారు, విలువైనవాళ్లుగా చూస్తారు

పురుషులు క్రీస్తును అనుకరించినప్పుడు, మొదట్లో దేవుడు స్త్రీలకు దక్కాలని కోరుకున్న గౌరవం, స్వేచ్ఛ వాళ్లు పొందుతారు. (ఆదికాండం 1:27, 28) మగవాళ్లు ఆడవాళ్ల కన్నా గొప్ప అని లోకంలోని ప్రజలు అనుకుంటారు. కానీ క్రైస్తవ భర్తలు అలా ఆలోచించరు, బదులుగా వాళ్లు బైబిలు సూత్రాల ప్రకారం నడుచుకుంటారు. అవి భార్యలు సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి.—ఎఫెసీయులు 5:28, 29.

యెలెన బైబిలు స్టడీ మొదలుపెట్టే సమయానికి, ఆమె తన భర్త పెట్టే కష్టాల్ని మౌనంగా భరిస్తోంది. అతను పెరిగిన వాతావరణం అలాంటిది. వాళ్ల దగ్గర, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం, కొట్టడం చాలా సాధారణ విషయం. యెలెన ఇలా అంటుంది: “బైబిలు నుండి నేర్చుకున్న విషయాలు నాకు బలాన్నిచ్చాయి. నన్ను ఎంతగానో ప్రేమించే, పట్టించుకునే, విలువైనదానిగా చూసే వ్యక్తి ఉన్నాడని అర్థంచేసుకున్నాను. నా భర్త కూడా బైబిలు స్టడీ తీసుకుంటే, అతను నాతో మంచిగా ప్రవర్తిస్తాడని నాకర్థమైంది.” కొంతకాలానికి ఆమె భర్త బైబిలు స్టడీకి ఒప్పుకొని, యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆమె కల నెరవేరింది. యెలెన ఇలా అంటుంది: “ఇప్పుడు ఆయన ఎంతో నిగ్రహం చూపిస్తున్నాడు, ఇద్దరం ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోవడం నేర్చుకున్నాం. వివాహ బంధంలో నాకూ విలువ ఉందని అర్థం చేసుకోవడానికి, సురక్షితంగా ఉన్నట్టు భావించడానికి బైబిలు సూత్రాలు నిజంగా సహాయం చేశాయి.”—కొలొస్సయులు 3:13, 18, 19.

అది కేవలం యెలెన అనుభవం మాత్రమే కాదు. లక్షలమంది క్రైస్తవ స్త్రీలు, అలాగే వాళ్ల భర్తలు బైబిలు సూత్రాలు పాటించడం వల్ల ఆ స్త్రీలు చాలా సంతోషంగా ఉన్నారు. తోటి క్రైస్తవుల సహవాసంలో గౌరవాన్ని, ఊరటను, స్వేచ్ఛను పొందుతున్నారు.​—యోహాను 13:34, 35.

క్రైస్తవ పురుషులు, స్త్రీలు తాము పాపం చేసే స్వభావం గల అపరిపూర్ణ మనుషులమని గుర్తిస్తారు. ‘వ్యర్థమైన జీవితానికి లోబర్చబడిన’ సృష్టిలో తాము భాగమని వాళ్లకు తెలుసు. అయితే తమ ప్రేమగల పరలోక తండ్రైన యెహోవాతో చక్కని అనుబంధం ఏర్పరచుకుంటే, త్వరలో “పాపమరణాల బానిసత్వం నుండి విడుదలై, దేవుని పిల్లల మహిమ​గల స్వాతంత్ర్యాన్ని” పొందుతామని ఎదురుచూడవచ్చు. దేవుని సంరక్షణలో ఉన్నవాళ్లకు అది ఎంత చక్కటి బహుమతో కదా!​—రోమీయులు 8:20, 21.