పత్రిక ముఖ్యాంశం | దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
దేవుణ్ణి ప్రేమించడం ఎందుకు కష్టం అనిపిస్తుంది?
“ ‘నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’ ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా.”—క్రీ.శ. 33 లో యేసుక్రీస్తు. a
దేవుణ్ణి ప్రేమించడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. దేవుడు అందనంత దూరంలో ఉంటాడని, మనం ఆయన్ని ఎప్పటికీ అర్థంచేసుకోలేమని, ఆయన క్రూరుడని వాళ్లు అనుకుంటారు. దేవుని గురించి కొంతమంది ఏమంటున్నారో చూడండి:
“సహాయం కోసం నేను దేవునికి ప్రార్థించాను, కానీ ఆయన చేరుకోలేనంత దూరంగా ఉన్నాడని నాకనిపించింది. నా దృష్టిలో దేవుడు నిజమైన వ్యక్తి కాదు, ఆయనకు ఎలాంటి భావాలు ఉండవు.”—ఇటలీకి చెందిన మార్కో.
“నేను దేవుణ్ణి సేవించాలని నిజంగా కోరుకున్నాను, కానీ ఆయన చాలా దూరంగా ఉన్నట్టు నాకనిపించింది. దేవుడు చాలా కఠినుడని, ఆయన కేవలం మనల్ని శిక్షిస్తుంటాడని నేను అనుకున్నాను. ఆయనకు సున్నితమైన భావాలు ఉన్నాయని నాకు నమ్మబుద్ధి కాలేదు.”—గ్వాటిమాలకు చెందిన రోసా.
“నా చిన్నప్పుడు, దేవుడు మన తప్పుల్ని వెతుకుతూ అవసరమైతే శిక్షిస్తూ ఉంటాడని నమ్మేవాణ్ణి. కాస్త పెద్దయ్యాక, ఆయన మనకు చాలా దూరంగా ఉంటాడని అనుకున్నాను. ఒక ప్రధాన మంత్రిలా ఆయన తాను పరిపాలించే ప్రజలకు సంబంధించిన పనులు చూసుకుంటాడు కానీ వాళ్లమీద ఆయనకు నిజంగా శ్రద్ధ ఉండదని అనిపించేది.”—కెనడాకు చెందిన రేమన్డ్.
మీకు ఏమనిపిస్తుంది? దేవుణ్ణి మనం ప్రేమించలేమా? శతాబ్దాల పాటు క్రైస్తవులు ఆ ప్రశ్నను లేవదీశారు. నిజానికి మధ్యయుగాల్లో క్రైస్తవులమని చెప్పుకున్న చాలామంది సర్వశక్తిగల దేవునికి కనీసం ప్రార్థన కూడా చేయలేదు. ఎందుకని? ప్రజలు ఆయనంటే అంతగా భయపడేవాళ్లు. విల్ డూరంట్ అనే చరిత్రకారుడు ఇలా అంటున్నాడు: “ఒక మామూలు పాపి ఎంతో దూరంలో ఉన్న, వణుకు పుట్టించే దేవునికి ప్రార్థించే సాహసం ఎలా చేయగలడు?”
దేవుడు “ఎంతో దూరంలో ఉన్న, వణుకు పుట్టించే” వ్యక్తి అని ప్రజలు ఎందుకు అనుకున్నారు? దేవుని గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? దేవుని గురించిన సత్యం తెలుసుకుంటే, ఆయన్ని ప్రేమించడం సాధ్యమౌతుందా?