పత్రిక ముఖ్యాంశం | దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
దేవుడు క్రూరుడు అనే అబద్ధం
చాలామంది ఏం నమ్ముతారు?
“చనిపోయిన వెంటనే, పాపభరిత స్థితిలో చనిపోయినవాళ్ల ఆత్మలు నరకానికి వెళ్తాయి, అక్కడ అవి నరక శిక్షల్ని, అంటే ‘నిత్యాగ్నిని’ అనుభవిస్తాయి.” (కాటకిజమ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్) నరకంలో ఉన్నవాళ్లు దేవుని నుండి పూర్తిగా వేరుగా, ఆయనకు దూరంగా ఉంటారని కొంతమంది మత నాయకులు అంటారు.
బైబిలు చెప్పే సత్యం
“చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.” (ప్రసంగి 9:5) చనిపోయినవాళ్లకు ఏమీ తెలీకపోతే, వాళ్లు “నిత్యాగ్ని” శిక్షను లేదా శాశ్వతంగా దేవునికి దూరమవ్వడం అనే శిక్షను ఎలా అనుభవించగలరు?
బైబిల్లో, “నరకం” అని తరచూ అనువదించబడిన హీబ్రూ, గ్రీకు పదాలు నిజానికి మానవజాతి సాధారణ సమాధిని సూచిస్తున్నాయి. ఉదాహరణకు, యోబుకు బాధాకరమైన జబ్బు వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాడు: “మీరు నన్ను నా సమాధిలో [“నరకంలో,” డోయే-రైమ్స్ వర్షన్] దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ.” (యోబు 14:13, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) యోబు, చిత్రహింసలు పెట్టే స్థలంలో లేదా దేవునికి దూరంగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకోలేదు కానీ సమాధిలో విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నాడు.
అది ఎందుకు ప్రాముఖ్యం?
దేవుడు క్రూరుడైతే మనం ఆయనకు దగ్గరవ్వాలని కోరుకోం, బదులుగా ఆయనకు దూరంగా ఉండాలనుకుంటాం. మెక్సికోలో ఉంటున్న రోసీయో ఇలా అంది, “పసితనం నుండే నాకు నరకాగ్ని సిద్ధాంతం గురించి నేర్పించారు. నేను ఎంత భయపడేదాన్నంటే, దేవునికి మంచి లక్షణాలు ఉన్నట్లు ఊహించుకోలేకపోయాను. ఆయన కోపిష్ఠి అని, తప్పు చేస్తే అస్సలు ఊరుకోడని అనుకున్నాను.”
దేవుని తీర్పుల గురించి, చనిపోయినవాళ్ల స్థితి గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకున్నాక, దేవుని విషయంలో రోసీయో అభిప్రాయం మారిపోయింది. ఆమె ఇలా అంటుంది, “ఇప్పుడు నా మనసు తేలికైంది, పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. దేవుడు మనకు మంచే చేయాలని కోరుకుంటాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, నేను కూడా ఆయన్ని ప్రేమించగలనని నాకు నమ్మకం కుదిరింది. ఆయన, పిల్లల చేయి పట్టుకొని వాళ్లకెప్పుడూ మంచే చేయాలని కోరుకునే తండ్రి లాంటివాడు.”—యెషయా 41:13.
చాలామంది నరకాగ్ని భయం వల్లే దేవుడంటే భయభక్తులతో జీవించారు. అయితే దేవుడు, మనం భయంతో తనను సేవించాలని కోరుకోవట్లేదు. బదులుగా యేసు ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను … ప్రేమించాలి.” (మార్కు 12:29, 30) దేవుడు ప్రస్తుతం అన్యాయం చేయట్లేదని మనం అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో ఆయన తీర్చే తీర్పుల మీద కూడా నమ్మకం పెరుగుతుంది. యోబు స్నేహితుడైన ఎలీహు లాగే మనం కూడా “సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!” అని ధైర్యంగా చెప్పగలం.—యోబు 34:10.