36వ పాఠం
అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండండి
నిజాయితీగల స్నేహితులు కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. యెహోవా కూడా తన స్నేహితులు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ, నిజాయితీ తక్కువైపోయిన ఈ లోకంలో నిజాయితీగా ఉండడం అంత తేలిక కాదు. అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
1. మనం నిజాయితీగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి?
మనం యెహోవాను ప్రేమిస్తాం, గౌరవిస్తాం కాబట్టి నిజాయితీగా ఉంటాం. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో ప్రతీది యెహోవాకు తెలుసు. (హెబ్రీయులు 4:13) మనం నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన దాన్ని చూసి సంతోషిస్తాడు. “కపట బుద్ధి గలవాళ్లు యెహోవాకు అసహ్యం, నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 3:32.
2. మనం ఏయే విషయాల్లో నిజాయితీగా ఉండాలి?
మనం ‘ఒకరితో ఒకరం నిజమే మాట్లాడాలి’ అని యెహోవా కోరుకుంటున్నాడు. (జెకర్యా 8:16, 17) దానర్థం మనం ఇంట్లోవాళ్లతో, కలిసి పనిచేసేవాళ్లతో, తోటి క్రైస్తవులతో, ప్రభుత్వ అధికారులతో అబద్ధాలాడం, తప్పుడు సమాచారం ఇవ్వం. నిజాయితీగా ఉండేవాళ్లు దొంగతనం చేయరు, మోసం చేయరు. (సామెతలు 24:28 అలాగే ఎఫెసీయులు 4:28 చదవండి.) అంతేకాదు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులన్నీ కడతారు. (రోమీయులు 13:5-7) మనం వాటిలోనే కాదు, మిగతా ‘అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తిస్తాం.’—హెబ్రీయులు 13:18.
3. నిజాయితీగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
మనకు నిజాయితీపరులు అనే పేరు ఉన్నప్పుడు, వేరేవాళ్లు మనల్ని నమ్ముతారు. మనందరం నిజాయితీగా ఉండడానికి కృషిచేస్తాం కాబట్టి, ఒక ప్రేమగల కుటుంబంలో ఉన్నట్టు సంఘంలో కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది. అంతేకాదు మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది. మనం నిజాయితీగా ఉండడం ద్వారా ‘మన రక్షకుడైన దేవుని బోధను అలంకరిస్తాం,’ అలాగే ఇతరుల్ని సరైన ఆరాధన వైపు ఆకర్షిస్తాం.—తీతు 2:10.
ఎక్కువ తెలుసుకోండి
నిజాయితీగా ఉండడం ద్వారా యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చో, మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో చూడండి. జీవితంలోని వేర్వేరు సందర్భాల్లో మీరు ఎలా నిజాయితీగా ఉండవచ్చో తెలుసుకోండి.
4. నిజాయితీగా ఉంటే యెహోవా సంతోషిస్తాడు
కీర్తన 44:21; మలాకీ 3:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
మనం నిజాన్ని దాచగలమని అనుకోవడం ఎందుకు తెలివితక్కువతనం?
-
కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం నిజం చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
పిల్లలు నిజం చెప్పినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. మనం నిజం చెప్పినప్పుడు యెహోవా సంతోషిస్తాడు
5. అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండండి
అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండడం కుదరదని చాలామంది అనుకుంటారు. కానీ, మనం ఎందుకు అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండాలో పరిశీలించండి. వీడియో చూడండి.
హెబ్రీయులు 13:18 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి. మనం ఎలా నిజాయితీగా ఉండవచ్చు . . .
-
ఇంట్లో?
-
పని స్థలంలో లేదా స్కూల్లో?
-
వేరే చోట్ల?
6. నిజాయితీగా ఉంటే మనం ప్రయోజనం పొందుతాం
నిజాయితీగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. కానీ, ఎప్పటికైనా సరే నిజాయితీగా ఉండడమే మంచిది. కీర్తన 34:12-16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
నిజాయితీగా ఉండడం వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?
-
1. నిజాయితీగల భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరౌతారు
-
2. నిజాయితీగల పనివాళ్లు తమ యజమాని నమ్మకాన్ని సంపాదించుకుంటారు
-
3. నిజాయితీగల పౌరులు ప్రభుత్వ అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు
కొంతమంది ఇలా అంటారు: “చిన్నచిన్న అబద్ధాలాడడం తప్పేమీ కాదు.”
-
చిన్నవైనా, పెద్దవైనా అబద్ధాలన్నిటినీ యెహోవా అసహ్యించుకుంటాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు?
ఒక్కమాటలో
తన స్నేహితులు మాటల్లో, పనుల్లో, అలాగే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
-
మనం ఏయే విషయాల్లో నిజాయితీగా ఉండాలి?
-
మనం నిజాన్ని దాచగలమని అనుకోవడం ఎందుకు తెలివితక్కువతనం?
-
అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?
ఇవి కూడా చూడండి
తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీగా ఉండడం ఎలా నేర్పించవచ్చు?
మాట నిలబెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
మనం కట్టే పన్నుల్ని తప్పుగా ఉపయోగించినా మనం వాటిని కట్టాలా?
మోసాలు చేస్తూ బ్రతికిన ఒకతను ఎలా నిజాయితీపరుడిగా మారాడో చదవండి.
“యెహోవా దయ చూపించే, క్షమించే దేవుడని తెలుసుకున్నాను” (కావలికోట, జూలై-సెప్టెంబరు 2015)