కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఆరాధికులు అనుభవించే స్వాతంత్ర్యం

యెహోవా ఆరాధికులు అనుభవించే స్వాతంత్ర్యం

అధ్యాయం 5

యెహోవా ఆరాధికులు అనుభవించే స్వాతంత్ర్యం

1, 2. (ఎ) మొదటి మానవజతకు దేవుడు ఎలాంటి స్వాతంత్ర్యం ఇచ్చాడు? (బి) వారి చర్యల్ని అదుపుచేసిన కొన్ని నియమాల్ని పేర్కొనండి.

యెహోవా మొదటి మానవజతను సృజించినప్పుడు, నేడు మానవులు అనుభవించే ఎట్టి స్వాతంత్ర్యం కంటేనూ ఎంతో ఉన్నతమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించారు. పరదైసు వారి గృహమైయుండెను. ఏ రుగ్మతయు వారి జీవితానందాన్ని పాడుచేయలేదు. మరణము వారికొరకు వేచిలేదు. అయితే అట్టి స్వాతంత్ర్యాన్ని వారు నిర్విఘ్నంగా అనుభవించాలంటే దేవుని నియమాలయెడల గౌరవం చూపడం ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉండెను.

2 ఆ నియమాల్లో కొన్ని, మాటల్లో చెప్పబడకపోవచ్చు అయితే, ఆదాము హవ్వలు అలాంటి నియమాలకు సహజంగానే లోబడేవిధంగా సృజింపబడ్డారు. ఎలాగంటే, ఆకలి ఆహారాన్ని భుజించే అవసరతను, దాహం నీరు త్రాగే అవసరతను సూచించాయి. సూర్యాస్తమయం వారికి కావలసిన విశ్రాంతిని, నిద్రను ప్రోత్సహించింది. అంతేకాకుండ యెహోవా వారితో మాట్లాడి, చేయడానికి వారికి పని కల్పించాడు. నిజానికి వారికివ్వబడిన ఆ పనే ఒక నియమం, ఎందుకంటే అది వారి చర్యల్ని అదుపుచేస్తుంది. అదెంత దయాపూర్వకమైన, ప్రయోజనకరమైన నియమమో గదా! అది వారికి పూర్తి సంతృప్తిని కలుగజేసే పనినిచ్చి, యోగ్యమైన రీతిలో సంపూర్ణంగా వారి జ్ఞానాన్ని ఉపయోగించేటట్లు చేసింది. వారు పిల్లల్ని కనాలి, భూమ్మీది జంతుజాలాల్ని ఏలాలి, అలా వారు చివరకు పరదైసు పొలిమేరల్ని భూవ్యాప్తంగా విస్తరింపజేయాలి. (ఆది. 1:28; 2:15) దేవుడు అనవసర వివరాల భారాన్ని వారిపై మోపలేదు. నిర్ణయాలు తీసుకోవడానికి వారి పరిధిలో వారికి కావల్సినంత స్వేచ్ఛ ఉండెను. అంతకంటే ఎక్కువ ఎవరు అడుగగలరు?

3. నిర్ణయాలు చేయడానికి తన స్వాతంత్ర్యాన్ని తెలివిగా ఉపయోగించుటకు ఆదాము ఎట్లు సహాయం పొందగల్గేవాడు?

3 నిర్ణయాలు చేసే ఆధిక్యత ఆదాముకు ఇవ్వబడిందంటే, దానర్థం అతను ఎలాంటి నిర్ణయమైన చేయవచ్చనీ, అదెలాంటిదైనా మంచి ఫలితాల్నే తీసుకొస్తుందని దాని భావం కాదు. నిర్ణయాలు చేయుటకున్న అతని స్వాతంత్ర్యంలో బాధ్యత చేరివున్నది. తన పరలోకపు తండ్రి చెప్పింది ఆలకిస్తూ, ఆయన కార్యాలను గమనించుట ద్వారా అతడెంతో నేర్చుకొనగలడు. ఆలాగే తాను నేర్చుకున్నది అన్వయించేలా చేయగల తెలివిని దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. ఆదాము దేవుని “స్వరూపము”నందు సృజింపబడినందున, తాను నిర్ణయాలు చేయునప్పుడు దైవ లక్షణాల్ని ప్రతిబింబించడం అతని నైజమైయుండెను. అతను తనకొరకు దేవుడు చేసిన దానిని నిజంగా అభినందించి, దేవుని ప్రీతిపర్చాలని కోరుకునుంటే, అలాచేయుటకు అతడు నిశ్చయంగా జాగ్రత్తపడి ఉండేవాడు.—ఆది. 1:26, 27; యోహాను 8:29 పోల్చండి.

4. (ఎ) ఆదాముకివ్వబడిన నిషేధాజ్ఞ అతనికి స్వాతంత్ర్యం లేకుండ చేసిందా? (బి) అదెందుకు సరియైన అవసరతయైయుండెను?

4 తన సృష్టికర్త మరియు జీవదాతపై మానవుడు ఆధారపడటాన్ని గుర్తుచేయుటకు, యెహోవా “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని” అతనికాజ్ఞాపించాడు. (ఆది. 2:16, 17) ఆ నియమం మానవున్ని స్వాతంత్ర్యం లేకుండ చేసిందా? నిశ్చయంగా అలా చేయలేదు. లోబడుటకు లేదా తిరగబడుటకు ఆదాముకు స్వేచ్ఛ ఉండెను. ఆ నిషేధం ఎలాంటి భారాన్ని ఉంచలేదు. ఆ ఒక్క వృక్షాన్ని తాకనవసరం లేకుండానే తినడానికి అతనికి సమృద్ధిగా ఉండెను. అయితే, తాను నివసించే భూమి దేవునిదని, సృష్టికర్తగా దేవుడు తన సృష్టిపై పరిపాలనా హక్కు కలిగివున్నాడని అతడు గుర్తించాలి.—కీర్త. 24:1, 10.

5. (ఎ) వారు కలిగివున్న మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని ఆదాము హవ్వలు ఎలా పోగొట్టుకున్నారు? (బి) దాని స్థానంలో ఏమి వచ్చింది, మనమెలా దాని ప్రభావానికి లోనయ్యాము?

5 అయితే ఏమి జరిగింది? స్వార్థకోరికతో పురికొల్పబడిన ఒక దేవదూత తనే ఒక నిజమైన మార్గదర్శియన్నట్లు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనికి హామీయిస్తూ హవ్వను మోసగించాడు. తన తండ్రికి లోబడటానికి బదులుగా ఆదాము అపరాధం చేయడంలో హవ్వతో చేతులు కలిపాడు. తమకు చెందని దాన్ని తీసుకొని ఆదాము హవ్వలు తాము కలిగివున్న మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నారు. పాపము వారి యజమానికాగా, దేవుడు హెచ్చరించినట్లుగానే మరణము వారికొరకు నిశ్చయంగా వేచియుండెను. తత్ఫలితంగా, ఎట్టి వారసత్వం వారి సంతానానికి అందజేయబడింది? ఆ పాపమే జన్మతః తప్పుచేసే స్వభావంలో, రోగగ్రస్తులు కావడంలో, చివరకు వయస్సుపెరిగి క్రమేపి క్షీణించి, మరణించడంలో కనబడుతోంది. సాతాను ప్రభావంచే మరింత తీవ్రతరం చేయబడి తప్పుచేయాలనే ఆ వారసత్వ స్వభావం, ప్రతివారికి ప్రమాదభరితంగా తయారైన జీవితంగల సమాజాన్ని తయారుచేసింది. ఆరంభంలో మానవజాతికి దేవుడిచ్చిన స్వాతంత్ర్యానికి ఎంత భిన్నంగా ఉన్నది!—రోమా. 5:12; యోబు 14:1; ప్రక. 12:9.

స్వాతంత్ర్యం ఎక్కడ లభించగలదు

6. (ఎ) ఎక్కడ నిజమైన స్వాతంత్ర్యం లభించగలదు? (బి) యోహాను 8:31, 32 లో యేసు ఎటువంటి స్వాతంత్ర్యాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు?

6 నేడున్న పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు తాము కలిగివున్న దానికంటే అధిక స్వాతంత్ర్యం కొరకు వాంఛించడంలో ఆశ్చర్యం లేదు. అయితే నిజమైన స్వాతంత్ర్యం ఎక్కడ లభించగలదు? యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహా. 8:31, 32) మార్పుకొరకు ఒక రాజకీయ పరిపాలకున్ని లేదా ఒక ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పుడు తమకు లభిస్తుందని ప్రజలు నిరీక్షించే స్వాతంత్ర్యంవలె ఇది పరిమితమైనది కాదు. బదులుగా, ఇది మానవ సమస్యల మూలకారణం దగ్గరకు వెళ్తుంది. యేసు పాపమునుండి, పాపపు దాసత్వాన్నుండి పొందే స్వాతంత్ర్యాన్ని గూర్చి చర్చిస్తున్నాడు. (యోహాను 8:24, 34-36 చూడండి.) ఆ విధంగా ఒకవ్యక్తి యేసుక్రీస్తు నిజ శిష్యుడైనప్పుడు, అది ఆయన జీవితంలో గమనించదగు మార్పుకు, విడుదలకు నడిపిస్తుంది.

7. (ఎ) కాబట్టి, మనమిప్పుడు ఏ భావమందు పాపమునుండి స్వతంత్రులం కాగలం? (బి) ఆ స్వాతంత్ర్యం కలిగివుండటానికి మనమేమి చేయాలి?

7 పాప ప్రవర్తనయెడల జన్మతః వచ్చిన స్వభావం ప్రస్తుతం నిజ క్రైస్తవులపై ఎంతమాత్రం ప్రభావం చూపదని దానర్థం కాదు. భిన్నముగా, వారు దానినిబట్టి ఒక పోరాటాన్ని కలిగివున్నారు. (రోమా. 7:21-25) అయితే ఒకవ్యక్తి నిజంగా యేసు బోధలకు అనుగుణ్యంగా జీవిస్తే, అతనెంత మాత్రం పాపానికి తుచ్ఛమైన దాసునిగా ఉండడు. తను లోబడులాగున పాపమిక ఎంతమాత్రం అతనిపై ఒక రాజువలె ఆజ్ఞలు జారీచేయదు. కలతచెందే మనస్సాక్షిని కలిగించే సంకల్పంలేని జీవన విధానంలో అతనెంతమాత్రం చిక్కుకోడు. క్రీస్తు బలిమీద తనకున్న విశ్వాసాన్నిబట్టి అతని గత పాపాలు క్షమించబడినందున అతడు దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షిని కలిగివుంటాడు. పాప స్వభావాలు వాటి ప్రయత్నం అవిచేస్తాయి, అయితే అతడు క్రీస్తు శుద్ధ బోధలను మనస్సుకు తెచ్చుకొనినందున వాటికి అనుగుణ్యంగా ప్రవర్తించ నిరాకరిస్తే, పాపం తనమీద యజమానిగా లేదని చూపిస్తాడు.—రోమా. 6:12-17.

8. (ఎ) మరే అదనపు స్వాతంత్ర్యాన్ని నిజ క్రైస్తవత్వం మనకిస్తుంది? (బి) లోక పరిపాలకులయెడల మన దృక్పథంపై ఇదెలా ప్రభావం చూపాలి?

8 క్రైస్తవులుగా మనం గొప్ప స్వాతంత్ర్యం అనుభవిస్తున్నాము. అబద్ధబోధల ప్రభావాలనుండి, మూఢనమ్మకాల సంకెళ్లనుండి, పాపపు దాసత్వాన్నుండి మనం విడుదల పొందాము. మృతులను గూర్చిన పునరుత్థానాన్ని గూర్చిన, దివ్య సత్యాలు మనుష్యుల మనస్సాక్షిని అణగద్రొక్కే క్రూరమైన మరణాన్ని గూర్చిన కారణరహిత భయాన్నుండి మనల్ని విడుదల చేశాయి. అసంపూర్ణ మానవ ప్రభుత్వాల స్థానే నీతియుక్తమైన దేవుని రాజ్యం వస్తుందనే జ్ఞానం మనల్ని నైరాశ్యంనుండి విడుదల చేస్తున్నది. అయితే, ఈ పాత విధానం గతించిపోతుందనే నెపంమీద అట్టి స్వాతంత్ర్యం చట్టంయెడల నిర్లక్ష్యాన్ని లేదా ప్రభుత్వాధికారులయెడల అగౌరవాన్ని సమర్థించదు.—1 పేతు. 2:16, 17; తీతు 3:1, 2.

9. (ఎ) మానవులకిప్పుడు సాధ్యమౌతున్న గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి యెహోవా ప్రేమపూర్వకంగా మనకెలా సహాయం చేస్తున్నాడు? (బి) నిర్ణయాలు చేసేటప్పుడు, ఆదాము తన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా కలిగిన ఫలితాన్ని స్పష్టంగా అర్థంచేసుకున్నామని మనమెలా చూపగలము?

9 జీవించుటకేది శ్రేష్ఠమైన మార్గమో మనమే తంటాలుపడి ఏదో విధంగా కనుక్కోవాలని దేవుడు మనల్ని గాలికి వదలివేయడు. మనం నిర్మించబడిన విధానము, మనకేది నిజమైన తృప్తిని, వ్యక్తిగత గౌరవాన్ని ఇస్తుంది, మనకేది శాశ్వతంగా అత్యంత ప్రయోజనకరం ఆయనకు తెలుసు. తన సంకల్పాన్ని నెరవేర్చే కాలమేదో, అందునుబట్టి మనం పాలుపంచుకోవాల్సిన అత్యంత విలువైన కార్యాలేవో కూడ ఆయనకు తెలుసు. ఆలాగే ఒక వ్యక్తి ప్రతిష్ఠను దిగజార్చి లేదా ఇతరులతో అతని సంబంధాల్ని పాడుచేసి, చివరికతడు దేవుని రాజ్యాశీర్వాదాలు పొందకుండాచేసే తలంపులేమిటో, ప్రవర్తనేమిటో కూడ ఆయన ఎరిగియున్నాడు. ప్రేమపూర్వకంగా ఆయన ఈ సంగతులను బైబిలుద్వారా, తన దృశ్య సంస్థద్వారా మనకు తెలియజేస్తున్నాడు. (గల. 5:19-23; మార్కు 13:10; 1 తిమోతి 1:12, 13 పోల్చండి.) కాబట్టి మనమెలా ప్రతిస్పందిస్తామో నిర్ణయించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించడం మనకే వదలివేయబడింది. మొదట్లో మానవజాతి కివ్వబడిన స్వాతంత్ర్యాన్ని ఆదాము ఎలా పోగొట్టుకున్నాడో బైబిలుచెప్పే విషయాల్ని మనం హృదయానికి తీసుకుంటే, మనమా నిర్ణయాల్ని తెలివిగా చేస్తాము. యెహోవాతో మంచి సంబంధం కలిగివుండుటే మన జీవిత ప్రధాన లక్ష్యమని మనం చూపిస్తాము.

మరోవిధమైన స్వేచ్ఛకొరకు తపించుట

10. క్రైస్తవులమని చెప్పుకొనే కొందరు ఎట్టి స్వాతంత్ర్యం కొరకు అర్రులుచాచారు?

10 కొన్నిసార్లు యెహోవాసాక్షులుగా పెంచబడిన కొందరు యౌవనులు, ఆలాగే యౌవనులుకాని మరితరులు తమకు మరోవిధమైన స్వేచ్ఛ కావాలనే తలంపుకు వస్తున్నారు. లోకం ఆకర్షణీయంగా కన్పించవచ్చు, దానిని గూర్చి వారధికంగా తలంచేకొలది లోకస్థులవలెనే తాముచేయాలనే వారికోరిక మరింత బలంగా తయారౌతుంది. అధికంగా మాదక ద్రవ్యాలు సేవించాలని, ఇష్టంవచ్చినట్లు త్రాగాలని లేదా వ్యభిచరించాలని వారు తలంచకపోవచ్చు. అయితే వారు పాఠశాల లేదా ఉద్యోగ సమయం అయిన తర్వాత లోక స్నేహితులతో గడపనారంభిస్తారు. క్రొత్త సహవాసులు తమను అంగీకరించాలని వారు కోరుకుంటారు, అందుకే వారు వారి మాటతీరును, వారి ప్రవర్తనను అనుకరించడం ప్రారంభిస్తారు.—3 యోహా. 11.

11. ఇలాచేయాలనే శోధన కొన్నిసార్లు ఎక్కడనుండి వస్తుంది?

11 కొన్నిసార్లు లౌకిక ప్రవర్తనలో పాల్గొనాలనే శోధన యెహోవాను సేవిస్తున్నానని చెప్పుకొనే మరోవ్యక్తి నుండే వస్తుంది. సాతాను హవ్వను మోసగించినప్పుడు, తనతో ఏకీభవించుమని హవ్వ ఆదామును బలవంతపెట్టినప్పుడు ఏదెనులో అదే జరిగింది. తొలి క్రైస్తవుల మధ్యకూడ ఇట్లే జరిగింది, మనకాలంలో కూడ అదే జరుగుతోంది. అట్టి వ్యక్తులు అమితానందాన్ని ప్రేమిస్తూ, అధిక సుఖభోగాన్నిచ్చే సంగతులకై తపిస్తూవుంటారు. “సరదాగా ఉండమని” వారు ఇతరులను బలవంతపెడతారు. ‘తామే అవినీతికి దాసులై, తామితరులకు స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం’ చేస్తారు.—2 పేతు. 2:18, 19.

12. (ఎ) లౌకిక ప్రవర్తనయొక్క దుఃఖకర ఫలితాలు ఏమైయున్నవి? (బి) చేస్తున్న వారికి వాటిఫలితం తెలిసినా, అలాంటివి చేయాలని వారెందుకు బలవంతపెడ్తారు?

12 తత్ఫలితాలు ప్రీతికరంగా లేవు. అక్రమ లైంగికత్వం భావోద్రేక సంక్షోభాన్ని కలిగిస్తుంది. అది రోగాలకు, కోరని గర్భధారణకు, వివాహా విచ్ఛిత్తికి కూడ దారితీయవచ్చు. (సామె. 6:32-35; 1 కొరిం. 6:18; 1 థెస్స. 4:3-8) మాదకద్రవ్య సేవనం చికాకును, మాట మాంద్యాన్ని, దృష్టిలోపాన్ని, మగతను, సరిగ్గా శ్వాసించలేకపోవడాన్ని, భ్రమల్ని మరియు మరణాన్ని కలిగించవచ్చు. (సామెతలు 23:29-35 పోల్చండి.) అది వ్యసనానికినడిపి, అట్టి వ్యసనపు కోరికను తీర్చుకోవడానికి నేరాలకు పాల్పడేలా చేయగలదు. సాధారణంగా అట్టి ప్రవర్తనగలవారికి తత్ఫలితంగా ఏంజరుగుతుందో తెలుసు. అయితే అమితానందం, లైంగిక సుఖాల కొరకైన వారి తపన తత్‌పరిణామాల విషయమై వారి మనస్సులకు అంధత్వం కలిగిస్తుంది. తమకుతామే వారు దానిని స్వాతంత్ర్యమని చెప్పుకుంటారు, అయితే తాము పాపానికి దాసులమని వారు గ్రహించేటప్పటికి అది అప్పటికే ఆలస్యమైవుంటుంది, పాపమనేది నిజంగా ఎంతటి క్రూరమైన యజమానోగదా! ఇప్పుడే ఈ విషయంపై తర్కించడం అట్టి అనుభవం మనకు కలుగకుండ సంరక్షించుకోవడానికి సహాయపడగలదు.—గల. 6:7, 8.

సమస్యలు ఎక్కడ ఆరంభమౌతాయి

13. (ఎ) ఈ సమస్యలకు దారితీసే కోరికలు తరచు ఎలా రెచ్చగొట్టబడతాయి? (బి) “దుష్టసాంగత్యము” ఏమిటో అర్థంచేసుకోవడానికి, ఎవరి దృక్కోణం మనకు అవసరం? (సి) పేరా చివరగల ప్రశ్నలకు మీరు జవాబిస్తుండగా, యెహోవా దృక్కోణాన్ని నొక్కితెల్పండి. ఒక్కొక్క ప్రశ్నమీదనే వ్యాఖ్యానించండి.

13 ఆ సమస్యలు తరచు ఎక్కడ ఆరంభమౌతాయో కొంచెమాగి ఆలోచించండి. బైబిలిలా వివరిస్తుంది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకో. 1:14, 15) అయితే ఆ కోరికలెలా రెచ్చగొట్టబడతాయి? మనస్సులోనికి ప్రవేశించు వాటిద్వారానే, కాగా ఇది తరచు బైబిలు సూత్రాల్ని అన్వయించని ప్రజలతో సాంగత్యం చేయడం మూలంగా కలుగుతుంది. “దుష్టసాంగత్యాన్ని” విసర్జించాలని మనందరికి తెలుసు. అయితే ప్రశ్నేమంటే, ఏది దుష్టసాంగత్యము? ఈ విషయాన్ని యెహోవా ఎలా దృష్టిస్తున్నాడు? క్రింద ఇవ్వబడిన ప్రశ్నల్ని, లేఖనాల్ని తర్కించడం మనం సరియైన నిర్ణయానికి రావడానికి సహాయపడాలి.

కొందరు గౌరవప్రదమైన వ్యక్తులుగా కన్పిస్తున్నారంటే వారు మంచి సహవాసులేనని దానర్థమా? (ఆదికాండము 34:1, 2, 18, 19 పోల్చండి.)

వారి సంభాషణ, బహుశ వారు విసిరే ఛలోక్తులు వారితో మనకు సన్నిహిత సాంగత్యమున్నదని సూచించగలదా? (ఎఫె. 5:3, 4)

దేవుని సంకల్పాన్ని గూర్చి మనం నమ్మినట్లే వారు నమ్మకపోతే, ఆ విషయంలో మనం చింతించడానికి కారణం ఏదైనావుందా? (1 కొరింథీయులు 15:12, 32, 33 పోల్చండి.)

యెహోవాను ప్రేమించని ప్రజల సాంగత్యాన్ని మనం ఎంచుకొంటే, ఆయన దాన్నెలా భావిస్తాడు? (2 దినవృత్తాంతములు 19:1, 2 పోల్చండి.)

మనం అవిశ్వాసులతో కలిసి పనిచేసినా లేదా వారితో కలిసి పాఠశాలకు వెళ్లినా, వారిని మన సహవాసులుగా ఎంచుకోవడం లేదని మనమెలా చూపగలము? (1 పేతు. 4:3, 4)

దూరదర్శిని చూడటం, పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికలు చదవడం కూడ ఇతరులతో సాంగత్యంచేసే విధానాలే. వీటిలోవచ్చే ఎట్టి అంశాల విషయంలో ఈ దినాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి? (సామె. 3:31; యెష. 8:19; ఎఫె. 4:17-19)

మనం సహవాసుల్ని ఎంచుకొనే విధానం మనమెలాంటి వారమని యెహోవాకు చెబుతుంది? (కీర్త. 26:1, 4, 5; 97:10)

14. ఇప్పుడే దేవునివాక్య సలహాను నమ్మకంగా అన్వయించు వారికి భవిష్యత్తులో ఎట్టి మహిమగల స్వాతంత్ర్యం వేచియుంది?

14 దేవుని నూతన క్రమం మన సమీప భవిష్యత్తులోనే ఉంది. ఆయన రాజ్యం ద్వారా మానవజాతి సాతాను అతని దుష్ట విధానపు లోబరచుకొనే ప్రభావాన్నుండి విడుదల పొందుతుంది. క్రమేపి పాపపు ప్రభావాలన్నీ మానవజాతి నుండి తొలగింపబడతాయి. పరదైసు భూమిపై నిత్యజీవం వారి ముందుంటుంది. చివరకు “ప్రభువుయొక్క [“యెహోవాయొక్క,” NW] ఆత్మకు” పూర్తి అనుగుణ్యంగా సమస్త సృష్టి స్వాతంత్ర్యం అనుభవిస్తుంది. (2 కొరిం. 3:17) ఇప్పుడు దేవుని వాక్యపు సలహాను తేలికగా తీసుకొన్న కారణంగా ఆ సమస్తాన్ని పోగొట్టుకొనే సాహసం చేయడంలో ఏమన్నా అర్థముందా? క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని నేడు మనం అభ్యసించే విధానం మనం నిజంగా “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల” స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నామని స్పష్టంగా చూపించగలదు.—రోమా. 8:21.

పునఃసమీక్షా చర్చ

• మొదటి మానవజత ఎట్టి స్వాతంత్ర్యం అనుభవించారు? మానవజాతి ఇప్పుడనుభవిస్తున్న దానికి అదెట్టి పోలిక కలిగివుంది?

• లోకానికి భిన్నంగా, నిజ క్రైస్తవులెట్టి స్వాతంత్ర్యం కలిగివున్నారు? ఇదెలా సాధ్యము?

• లోకం కలిగివున్న స్వాతంత్ర్యాన్ని వెదకువారు ఎట్టి మూల్యం చెల్లిస్తున్నారు?

• ‘దుష్టసాంగత్యాన్ని’ విసర్జించడం ఎందుకు ప్రాముఖ్యం? ఆదామువలె కాకుండ, చెడు విషయమై ఎవరి నిర్ణయాల్ని మనం అంగీకరిస్తాం?

[అధ్యయన ప్రశ్నలు]