“ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి”
అధ్యాయం పదహారు
“ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి”
1. యెహోవాసాక్షుల కూటాలకు వచ్చే క్రొత్తవారిని తరచూ ఏది ముగ్ధులను చేస్తుంది?
ప్రజలు యెహోవాసాక్షుల కూటాలకు మొదటిసారి హాజరైనప్పుడు, అక్కడ చూపబడే ప్రేమనుబట్టి తరచూ ముగ్ధులౌతారు. తమకివ్వబడిన ఆహ్వానంలోను, ఆప్యాయతగల సహవాసంలోను వారు ఆ ప్రేమను చూస్తారు. మన సమావేశాలకు వచ్చే సందర్శకులు కూడా ఈ ప్రేమను గమనిస్తారు. ఒక సమావేశం గురించి ఒక పత్రికా విలేఖరి ఇలా వ్రాశాడు: ‘మాదకద్రవ్యాలు, మద్యం సేవించే వారు లేరు. అరుపులు కేకలు లేవు. తోసుకోవడం లేదు. తొక్కిసలాట లేదు. తిట్టేవారు లేదా శాపనార్థాలు పెట్టేవారు లేరు. అశ్లీల హాస్యోక్తులు లేదా బూతులు లేవు. పొగత్రాగేవారు లేరు. దొంగతనం లేదు. మైదానంలో ఖాళీ డబ్బాలు విసిరేవారు లేరు. అది నిజంగా అసాధారణం.’ ఇదంతా ‘అమర్యాదగా నడువని, స్వప్రయోజనాన్ని కోరని’ ప్రేమకు నిదర్శనం.—1 కొరింథీయులు 13:4-8.
2. (ఎ) కాలక్రమేణా మనం ప్రేమ చూపించే విషయంలో ఏది స్పష్టంగా కనిపించాలి? (బి) క్రీస్తును అనుకరిస్తూ మనమెలాంటి ప్రేమను పెంపొందించుకోవాలి?
2 సహోదర ప్రేమ నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నం. (యోహాను 13:35) మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ, ప్రేమను మరింత సంపూర్ణంగా వ్యక్తపరచడం నేర్చుకుంటాము. తన తోటి క్రైస్తవుల ప్రేమ “అంతకంతకు అభివృద్ధిపొందవలెనని” అపొస్తలుడైన పౌలు ప్రార్థించాడు. (ఫిలిప్పీయులు 1: 9) మన ప్రేమ స్వయంత్యాగపూరితమైనదై ఉండాలని అపొస్తలుడైన యోహాను తెలియజేశాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆయన [దేవుని కుమారుడు] మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.” (1 యోహాను 3:16; యోహాను 15:12, 13) మనం నిజంగా మన సహోదరుల కోసం ప్రాణాలు ఇస్తామా? సాధారణంగా అలాంటి అవసరం రాదు, అయితే మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా వారికి సహాయం చేయడానికి మనం ఎంతమేరకు ముందుకు వెళ్తాము?
3. (ఎ) మనం మన ప్రేమను మరింత సంపూర్ణంగా ఎలా వ్యక్తపరచవచ్చు? (బి) నేడు ఒకరి పట్ల ఒకరు మిక్కిలి ప్రేమ కలిగివుండడం ఎందుకు ఆవశ్యకం?
3 స్వయంత్యాగపూరిత స్ఫూర్తిని ప్రతిబింబించే క్రియలతోపాటు, మనకు మన సహోదరులపట్ల యథార్థమైన ఆప్యాయత ఉండాలి. దేవుని వాక్యం మనకు ఇలా ఉద్బోధిస్తోంది: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై” ఉండండి. (రోమీయులు 12:10) మనందరం కొందరి విషయంలో అలాగే భావిస్తాము. కాని ఇంకా ఇతరుల విషయంలో కూడా అలాంటి అనురాగం చూపించడం మనం నేర్చుకోగలమా? ఈ పాత విధానాంతము సమీపిస్తున్న కొద్దీ, మనం మన తోటి క్రైస్తవులకు మరింత సన్నిహితమవడం అత్యావశ్యకం. బైబిలు ఇలా చెబుతోంది: “అన్నిటి అంతము సమీపమైయున్నది. . . . ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.”—1 పేతురు 4:7, 8.
సమస్యలు తలెత్తినప్పుడు
4. (ఎ) సంఘ సభ్యుల మధ్య సమస్యలు ఎందుకు తలెత్తవచ్చు? (బి) అన్ని సందర్భాల్లోను బైబిలు ఉపదేశం అన్వయించుకోవడానికి మొగ్గు చూపకపోయినప్పటికి, మనం దానిని అన్వయించుకుంటే ఎలాంటి సత్ఫలితాలు రావచ్చు?
4 మనం అపరిపూర్ణులుగా ఉన్నంత కాలం, మనం అప్పుడప్పుడు ఇతరుల మనస్సు నొప్పించే పనులు చేస్తూనే ఉంటాము. మన సహోదరులు కూడా వివిధ రీతుల్లో మనపట్ల పాపం చేయవచ్చు. (1 యోహాను 1:8) మీకలాంటి పరిస్థితి ఎదురైతే మీరేమి చెయ్యాలి? లేఖనాలు మనకు అవసరమైన నడిపింపునిస్తున్నాయి. అయితే లేఖనాలు చెప్పేది, అపరిపూర్ణ మానవులుగా మనం చేయడానికి మొగ్గు చూపేవాటితో ఏకీభవించకపోవచ్చు. (రోమీయులు 7:21-23) అయినప్పటికి, బైబిలు ఉపదేశం అన్వయించుకోవడానికి మనం చేసే మనఃపూర్వక కృషి, యెహోవాను సంతోషపరచాలనే మన యథార్థ కోరికను స్పష్టం చేస్తుంది. అలా చేయడం, ఇతరులపట్ల మన ప్రేమను మరింత అధికంచేస్తుంది.
5. మనలను ఎవరైనా గాయపరిస్తే, మనమెందుకు పగతీర్చుకోకూడదు?
5 ప్రజలు గాయపడినప్పుడు, కొన్నిసార్లు వారు ఆ గాయపరచిన వ్యక్తిపై పగతీర్చుకోవడానికి అవకాశాల కోసం వెదకుతారు. కాని అది పరిస్థితిని మరింత విషమింపజేస్తుంది. ఒకవేళ ప్రతిదండన అవసరమైతే, మనం దానిని దేవునికే వదలివేయాలి. (సామెతలు 24:29; రోమీయులు 12:17-21) మరికొందరు తమను గాయపరచిన వ్యక్తితో సంబంధం తెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని మనం మన తోటి ఆరాధకుల విషయంలో అలా చేయకూడదు, ఎందుకంటే మన ఆరాధన అంగీకరించబడడమనేది కొంతవరకు మన సహోదరులపట్ల మనం చూపే ప్రేమపై ఆధారపడి ఉంటుంది. (1 యోహాను 4:20) అందుకే పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) మీరలా చేయగలరా?
6. (ఎ) మనం మన సహోదరుణ్ణి ఎంత తరచుగా క్షమించాలి? (బి) దేనిని మనస్సులో ఉంచుకోవడం మనపట్ల చేయబడిన పాపంతో వ్యవహరించడానికి మనకు సహాయం చేస్తుంది?
6 సంఘం నుండి బహిష్కరించేంత గంభీర పాపాలు కాదుగాని, ఒక వ్యక్తి మనపట్ల పదేపదే పాపం చేస్తుంటే, అప్పుడెలా? అలాంటి స్వల్ప పాపాలను “ఏడు మారుల” మట్టుకు క్షమించవచ్చని అపొస్తలుడైన పేతురు సూచించాడు. అయితే “ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్లమారులమట్టుకు” క్షమించమని యేసు చెప్పాడు. మానవులు మనకు రుణపడివుండే దానితో పోలిస్తే, మనం దేవునికి రుణపడివున్నది ఎంతో ఎక్కువ అని ఆయన నొక్కిచెప్పాడు. (మత్తయి 18:21-35) మనం ప్రతిదినం అనేక విధాలుగా అంటే కొన్నిసార్లు స్వార్థపూరితంగా ప్రవర్తించడం ద్వారా, మన మాటలు లేదా మన ఆలోచనల ద్వారా లేదా మనం చేయాల్సింది చేయకపోవడం ద్వారా, మనం పాపం చేస్తున్నామని గ్రహించకుండానే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయవచ్చు. (రోమీయులు 3:23) అయినా దేవుడు మనపట్ల కనికరం చూపిస్తూనే ఉన్నాడు. (కీర్తన 103:10-14; 130:3, 4) మనం పరస్పరం అదే విధంగా వ్యవహరించుకోవాలని ఆయన కోరుతున్నాడు. (మత్తయి 6:14, 15; ఎఫెసీయులు 4:1-3) అప్పుడు మనం “అపకారమును మనస్సులో ఉంచుకొనని” ప్రేమను చూపించే వారిగా ఉంటాము.—1 కొరింథీయులు 13:4, 5; 1 పేతురు 3:8, 9.
7. ఒక సహోదరునికి మనపట్ల విరోధ భావముంటే మనమేమి చేయాలి?
7 కొన్నిసార్లు మనకు మన సహోదరునిపట్ల ఎలాంటి విరోధ భావాలు లేకపోయినప్పటికి ఆయనకు మనపై విరోధ భావముందని మనం గ్రహించవచ్చు. అప్పుడు మనం 1 పేతురు 4:8 సూచించినట్లు ‘దానిని ప్రేమతో కప్పి వేయాలని’ నిర్ణయించుకోవచ్చు. లేదా మనం ఆయనతో మాట్లాడడానికి చొరవ తీసుకొని సమాధానకరమైన సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించవచ్చు.—మత్తయి 5:23, 24.
8. మన తోటి విశ్వాసి మనలను నొప్పించే పనేదైనా చేస్తే, దాని విషయంలో ఏమి చేయవచ్చు?
8 ఒక తోటి విశ్వాసి మనలనే కాక ఇతరులను కూడా నొప్పించే పనేదైనా చేస్తుండవచ్చు. అప్పుడు ఆయనతో మాట్లాడడం మంచిది కాదా? బహుశా మంచిదే. మీరు స్వయంగా ఆ సమస్యను దయాపూర్వకంగా ఆయనకు వివరిస్తే, అది సత్ఫలితాలను తీసుకురావచ్చు. అయితే దానికి ముందు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఆయన నిజంగా లేఖనవిరుద్ధమైన పని చేస్తున్నాడా? లేక నా జీవన నేపథ్యం, నేను పొందిన శిక్షణ ఆయనకు భిన్నమైనవి కాబట్టి అది ఒక సమస్యగా కనిపిస్తోందా?’ మీ స్వంత ప్రమాణాలను ఏర్పరచుకొని, వాటి ప్రకారం తీర్పు తీర్చకుండా జాగ్రత్తపడండి. (యాకోబు 4:11, 12) యెహోవా అన్నిరకాల జీవన నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలను నిష్పక్షపాతంగా అంగీకరిస్తాడు, వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ వారిపట్ల సహనం చూపిస్తాడు.
9. (ఎ) సంఘంలో ఎవరైనా ఘోరమైన పాపంచేస్తే, ఆ విషయమై ఎవరు శ్రద్ధ వహిస్తారు? (బి) గాయపడిన వ్యక్తి మొదట చొరవ తీసుకోవలసిన బాధ్యత ఎప్పుడు ఉంటుంది, ఏ ఉద్దేశంతో అలా చేయాలి?
9 సంఘంలోని ఒక వ్యక్తి లైంగిక అనైతికత వంటి ఘోరమైన పాపం చేస్తే దానికి సత్వరమే అవధానమివ్వాలి. కాని ఎవరు అవధానమివ్వాలి? సంఘ పెద్దలు. (యాకోబు 5:14, 15) ఒకవేళ అది ఒక వ్యక్తి పట్ల చేసిన తప్పిదమైతే, బహుశా వ్యాపారానికి సంబంధించి లేదా గాయపరిచేంతగా అదుపుతప్పి మాట్లాడడానికి సంబంధించినదైతే, గాయపడిన వ్యక్తి తప్పిదం చేసిన వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి మొదట ప్రయత్నించాలి. (మత్తయి 18:15) ఆ విధంగా సమస్య పరిష్కారం కాకపోతే మత్తయి 18:16, 17 లో చెప్పబడినట్లు తదుపరి చర్యలు తీసుకోవాలి. తప్పుచేసిన సహోదరునిపట్ల మనకున్న ప్రేమ, ఆయనను ‘సంపాదించుకోవాలనే’ కోరిక, మనం ఆయన హృదయం చేరే విధంగా చర్య తీసుకోవడానికి మనకు సహాయపడుతుంది.—సామెతలు 16:23.
10. ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ విషయాన్ని సరిగ్గా దృష్టించడానికి మనకేది సహాయం చేస్తుంది?
10 పెద్దదైనా చిన్నదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు, యెహోవా దానినెలా దృష్టిస్తాడో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడం మనకు సహాయం చేస్తుంది. ఆయన ఏ విధమైన పాపాన్ని ఆమోదించడు, ఆయన తన నిర్ణీత కాలంలో, పశ్చాత్తాపం చూపకుండా గంభీరమైన పాపాలు చేస్తున్నవారిని తన సంస్థ నుండి తొలగిస్తాడు. అయితే మనందరం అల్పరీతిలో పాపాలు చేస్తామని, మనకు ఆయన దీర్ఘశాంతము, కనికరము అవసరమని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా, మనకు ఇతరుల పాపాలు ఎదురైనప్పుడు మనం అనుకరించేందుకు యెహోవా మనకు మాదిరి ఉంచుతున్నాడు. మనం దయ చూపినప్పుడు ఆయన ప్రేమను మనం ప్రతిబింబిస్తాము.—ఎఫెసీయులు 5: 1, 2.
‘హృదయాలను విశాలపరచుకోవడానికి’ మార్గాలు వెదకండి
11. “హృదయములను విశాలపరచుకొనుడి” అని పౌలు కొరింథీయులను ఎందుకు ప్రోత్సహించాడు?
11 గ్రీసులోని కొరింథు సంఘాన్ని అభివృద్ధి చేసేందుకు పౌలు అనేక నెలలు అక్కడ గడిపాడు. అక్కడి సహోదరులకు సహాయం చేయడానికి ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు, ఆయన వారిని ప్రేమించాడు. కాని వారిలో కొందరు ఆయనపట్ల ఆప్యాయత చూపించలేదు. వారు ఎంతో కఠినంగా ఉండేవారు. అనురాగము చూపించడంలో “హృదయములను విశాలపరచుకొనుడి” అని ఆయన వారికి ఉద్బోధించాడు. (2 కొరింథీయులు 6:11-13; 12:15) మనందరం ఇతరులకు ఎంతమేరకు ప్రేమ చూపిస్తున్నామో పరిశీలించుకొని, మన హృదయాలను విశాలపరచుకోవడానికి మార్గాలు వెదకడానికి ప్రయత్నించడం మంచిది.—1 యోహాను 3:14.
12. సంఘంలోని అందరిపట్ల ప్రేమ చూపించడంలో మనమెలా ఎదగగలము?
12 మనం సన్నిహితమవడం కష్టమనిపించే వారెవరైనా సంఘంలో ఉన్నారా? వారు కూడా మనలాగే ఉండాలని మనం కోరుకున్నట్లే, మనం వారి వ్యక్తిత్వ విభేదాలను చూసీచూడనట్టు ఉండేందుకు యథార్థంగా ప్రయత్నిస్తే ఇది మనమధ్య సంబంధాలను ఆప్యాయతతో నింపడానికి సహాయపడగలదు. మనం వారిలోని మంచి లక్షణాలను చూసి, వాటిపై దృష్టి నిలిపినప్పుడు కూడా వారిపట్ల మన భావాలు మెరుగుపడతాయి. ఇది నిశ్చయంగా వారిపట్ల మన ప్రేమ అధికమయ్యేలా చేస్తుంది.—లూకా 6:32, 33, 36.
13. మన సంఘంలోని వారిపట్ల ప్రేమ చూపే విషయంలో మనం మన హృదయాలను ఎలా విశాలపరచుకోవచ్చు?
13 నిజమే, ఇతరుల కోసం మనం చేయగల వాటికి పరిమితులుంటాయి. మనం ప్రతి కూటంలో ప్రతి ఒక్కరిని పలకరించలేకపోవచ్చు. మనం స్నేహితులను భోజనానికి ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరిని పిలవడం సాధ్యం కాకపోవచ్చు. కాని మనం మన సంఘంలోని ఒక వ్యక్తితో పరిచయం పెంచుకోవడానికి కేవలం కొన్ని నిమిషాలు వెచ్చించడం ద్వారా మన హృదయాలు విశాలపరచుకోగలమా? మనతో కలిసి క్షేత్ర పరిచర్య చేయడానికి, మనకు అంత బాగా పరిచయంలేని వ్యక్తిని అప్పుడప్పుడు ఆహ్వానించగలమా?
14. క్రితమెన్నడూ కలుసుకొనని క్రైస్తవులమధ్య ఉన్నప్పుడు, వారిపట్ల మనకు మిక్కిలి ప్రేమ ఉందని ఎలా చూపించవచ్చు?
14 మన ప్రేమను విశాలపరచుకోవడానికి క్రైస్తవ సమావేశాలు చక్కని అవకాశాలిస్తాయి. వేలమంది హాజరుకావచ్చు. మనం వారందరిని కలుసుకోలేకపోవచ్చు, కాని మనకు మన సౌలభ్యంకంటే వారి సంక్షేమమే ముఖ్యమని చూపేలా మనం ప్రవర్తించవచ్చు. కార్యక్రమ విరామ సమయాల్లో చొరవ తీసుకొని మన చుట్టుప్రక్కల కూర్చున్నవారిలో కొందరిని కలుసుకోవడం ద్వారా మన వ్యక్తిగత శ్రద్ధ చూపవచ్చు. ఏదోక రోజు ఈ భూమిపై జీవించే వారందరు, మనందరి తండ్రియైన సత్య దేవుని ఆరాధనలో ఐక్యమైన సహోదర, సహోదరీలై ఉంటారు. ఒకరినొకరు తెలుసుకోవడం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కదా! మిక్కిలి ప్రేమ కలిగివుండడం, మనమలా చేయాలని కోరుకునేలా మనలను పురికొల్పుతుంది. ఇప్పుడే ఎందుకు ప్రారంభించకూడదు?
[అధ్యయన ప్రశ్నలు]
పునఃసమీక్షా చర్చ
• క్రైస్తవుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు, వాటినెలా పరిష్కరించుకోవాలి, ఎందుకు?
• మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నకొలది, మన ప్రేమకూడా ఏయే విధాలుగా వృద్ధి కావాలి?
• సన్నిహిత స్నేహితులకు మాత్రమే పరిమితం కాకుండా మిక్కిలి ప్రేమను చూపించడం ఎలా సాధ్యమవుతుంది?
[148వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ ప్రేమ సంఘ కూటాల్లో చూపించినట్లే అనేక విధాలుగా చూపించవచ్చు