మా పాఠకుల ప్రశ్న
క్రిస్మస్కి సంబంధించిన ఆచారాల్లో తప్పేమైనా ఉందా?
క్రిస్మస్ అంటే యేసు జన్మదినాన్ని క్రైస్తవులు పారంపర్యాచారంగా జరుపుకునే పండుగ అని చెప్తారు. ఈ పండుగలో ఉన్న చాలా సంప్రదాయాలను చూస్తే అసలు వీటికీ యేసు జన్మదినానికి సంబంధం ఏంటో అర్థం కాదు.
వాటిల్లో ఒకటి సాంటాక్లాస్ లేదా క్రిస్మస్ తాత గురించి కల్పిత కథ. 1931లో అమెరికాలో, ఒక డ్రింక్స్ తయారు చేసే సంస్థ ఈ క్రిస్మస్ తాతను ఆధునికంగా, సరదాగా ఉండే మనిషిలా చేసి, తెల్ల గడ్డంతో, గులాబి రంగు బుగ్గలతో, ఎర్రటి బట్టలు వేసి ఎడ్వర్టైస్మెంట్ కోసం వాడుకున్నారు. 1950ల్లో కొంతమంది బ్రెజిల్ దేశస్థులు సాంటాక్లాస్ను వాళ్ల పురాణ గాథల్లో ఉన్న గ్రాండ్‌పా ఇండియన్‌గా మార్చేయాలనుకున్నారు. కానీ ఏమి జరిగింది? సాంటాక్లాస్ గ్రాండ్‌పా ఇండియన్నే కాదు, “అసలు బాల యేసునే ఓడించి తనే డిసెంబర్ 25న జరిగే పండుగకు గుర్తు అయిపోయాడు” అని ప్రొఫెసర్ కార్లోస్ ఇ. ఫాంటినాటి అంటున్నారు. కానీ సాంటాక్లాస్ లాంటి కల్పితాలు మాత్రమే క్రిస్మస్లో ఉన్న తప్పా? జవాబు కోసం మనం క్రైస్తవత్వం మొదలైన కాలానికి వెళ్లాలి.
“క్రైస్తవత్వం మొదలైన రెండు శతాబ్దాల వరకు క్రైస్తవత్వం కోసం మరణించిన వాళ్ల జన్మదినాలను జరుపుకోవడాన్ని, అంతెందుకు యేసు జన్మదినాన్ని చేయడాన్ని కూడా ఒప్పుకునే వాళ్లు కాదు” అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటుంది. ఎందుకు? జన్మదిన పండుగలు వేరే మతాల ఆచారాలు అని క్రైస్తవులకు తెలుసు కాబట్టి వాటిని అస్సలు చేయకూడదనే వారు. అసలు యేసు ఏ రోజు జన్మించాడో కూడా మనకు బైబిల్లో కనపడదు.
మొదట్లో క్రైస్తవులు జన్మదినాలు జరుపుకోవడాన్ని అంత గట్టిగా వ్యతిరేకించినా నాల్గవ శతాబ్దంలో, కాథలిక్ చర్చ్ క్రిస్మస్ని మొదలుపెట్టింది. ప్రజల్లో చర్చ్ స్థానాన్ని బలంగా చేసుకునేందుకు ముఖ్య అడ్డంకులుగా ఉన్న ప్రసిద్ధ రోమన్ల మతాలను, చలి కాలంలో వాళ్లు గొప్పగా జరుపుకునే పండుగలను చర్చ్ తీసేయాలనుకుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 17 నుండి జనవరి 1 వరకు, “రోమన్లు పండుగ చేసుకుంటూ, ఆడుతూ, తాగుతూ ఊరేగింపుగా అందరూ కలిసి రకరకాల ఆచారాలను వాళ్ల దేవతల గౌరవార్థం చేసేవాళ్లు” అని పెన్ ఎల్. రీస్టాడ్ రాసిన క్రిస్మస్ ఇన్ అమెరికా అనే పుస్తకంలో ఉంది. డిసెంబర్ 25న రోమన్లు అజేయుడైన సూర్యుని జన్మదినాన్ని చేసేవాళ్లు. ఆ రోజును క్రిస్మస్ అని, సూర్యుని జన్మదినాన్ని యేసు జన్మదినంగా మార్చి రోమన్లను చర్చి మాయ చేసింది. అయినా రోమన్లు “వాళ్ల పండుగల్లో ఉన్న ఆచారాలను ఇంకా చేసుకుంటూనే ఉన్నారు.” నిజానికి వాళ్లు ‘పాత పండుగలకు కొత్త పేర్లు పెట్టారు,’ అని జెరీ బౌలర్ రాసిన సాంటాక్లాస్, ఎ బయాగ్రఫీ అనే పుస్తకంలో ఉంది.
కాబట్టి క్రిస్మస్లో ఉన్న అసలు సమస్య ఏంటంటే, అది వేరే మతాల ఆచారాలనుండి వచ్చింది. స్టీవెన్ నిస్సెన్బోమ్ రాసిన బ్యాటిల్ ఫర్ క్రిస్మస్ అనే పుస్తకంలో ఇలా ఉంది, ‘క్రిస్మస్ పేరుకు మాత్రమే క్రైస్తవుల పండుగ కానీ అందులోవన్నీ వేరే మత ఆచారాలే.’ కాబట్టి క్రిస్మస్ దేవున్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తుని అవమానిస్తుంది. ఇది చిన్న విషయమా? బైబిలు ఇలా ప్రశ్నిస్తుంది: “నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?” (2 కొరింథీయులు 6:14) వంకరగా ఎదిగిపోయాక చెట్టు మొద్దుని తిన్నగా చేయలేము. అలాగే క్రిస్మస్ ఎంత వంకరగా ఉందంటే ఇప్పుడు “దానిని చక్కపరచ శక్యముకాదు.”—ప్రసంగి 1:15. ▪ (w15-E 12/01)