పత్రిక ముఖ్యాంశం
“లోకాంతం”—అంటే ఏంటి?
“అంతం దగ్గరపడింది” అనే మాట మీరెప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. రోజురోజుకి ఘోరంగా తయారౌతున్న లోక పరిస్థితులను చూసినప్పుడు చాలామంది అలానే అంటారు. టీవీలో, వార్తాపత్రికల్లో ఫలానా రోజు అంతం వస్తుందనే వార్తలు చాలాసార్లు వినే ఉంటారు. లోకం ఎలా అంతమౌతుందని మీకనిపిస్తుంది? ప్రకృతి విపత్తుల వల్లనా లేక మూడవ ప్రపంచ యుద్ధం వల్లనా? అంతం వచ్చినప్పుడు భూమ్మీద మనుషులు తుడిచిపెట్టుకుపోతారని మీకనిపిస్తుందా? ఇలాంటివన్నీ ఊహించుకున్నప్పుడు కొంతమంది భయపడతారు, కొంతమంది నమ్మరు, కొంతమందికైతే అంతం అంటే పెద్ద జోక్‌లా అనిపిస్తుంది.
దేవుని వాక్యం “అంతము వచ్చును” అని చెప్తుంది. (మత్తయి 24:14) దేవుని వాక్యం అంతాన్ని “దేవుని మహాదినము,” “హార్‌మెగిద్దోను” అని కూడా పిలుస్తుంది. (ప్రకటన 16:14-16) ఈ విషయం గురించి రకరకాల మతాలు రకరకాలుగా చెప్తున్నాయి. అంతం గురించిన ఊహాగానాలు విచిత్రంగా, భయం కలిగించేలా ఉన్నాయి. అయితే, అంతం అంటే ఏంటి, ఏది కాదు? అంతం దగ్గర్లో ఉందా, లేదా? అన్నిటికన్నా ముఖ్యంగా, అంతం వచ్చినప్పుడు ప్రాణాలతో ఎలా బయటపడవచ్చు? అనే ప్రశ్నలకు దేవుని వాక్యంలో స్పష్టమైన జవాబులు ఉన్నాయి. ముందుగా అంతం గురించిన అపోహలు తీసేసుకుని, నిజానికి అంతం అంటే ఏమిటో చూద్దాం. అసలు అంతం అంటే ఏమిటని దేవుడు చెప్తున్నాడు?
అంతం అంటే ఇది కాదు . . .
-
అంతం అంటే అగ్ని వచ్చి భూమి కాలిపోయి, నాశనమవడం కాదు.
“భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను” అని దేవుని వాక్యంలో ఉంది. (కీర్తన 104:5) దేవుడు భూమిని నాశనం చేయడని, అలా జరగనివ్వడని ఈ మాట, దేవుని వాక్యంలో ఉన్న వేరే మాటలు మనకు భరోసా ఇస్తున్నాయి.—ప్రసంగి 1:4; యెషయా 45:18.
-
అంతం సమయం, తేది లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు వచ్చేది కాదు.
అంతానికి ఖచ్చితమైన సమయం ఉందని, దాన్ని దేవుడు నిర్ణయించాడని ఆయన వాక్యంలో ఉంది. “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.” (మార్కు 13:32, 33) కాబట్టి, అంతం ఎప్పుడు వస్తుందనే విషయంలో దేవుడు (“తండ్రి”) ఒక ఖచ్చితమైన ‘కాలాన్ని’ నిర్ణయించాడని అర్థమౌతుంది.
-
అంతం మనుషుల వల్ల, ఆకాశం నుండి పడే ఉల్కల వల్ల వచ్చేది కాదు.
అంతం దేని వల్ల వస్తుంది? ప్రకటన పుస్తకం 19:11లో “పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు” అని ఉంది, తర్వాత 19వ వచనంలో ఇలా ఉంది: “మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.” (ప్రకటన 19:11-21) ఇక్కడ ఇచ్చిన వర్ణన వెంటనే మనకు అర్థంకాకపోయినా ఒక విషయమైతే స్పష్టమౌతుంది: దేవుడు దేవదూతల సైన్యాన్ని పంపించి తన శత్రువులను నాశనం చేస్తాడు.
అంతం అంటే ఏంటి?
-
ఏమీ చేయలేకపోతున్న మానవ ప్రభుత్వాల అంతం.
“పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము [ప్రభుత్వం] స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దానియేలు 2:44) ఇంతకుముందు 3వ అంశంలో చూసినట్టు “గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము” చేయడానికి వచ్చిన “భూరాజులును వారి సేనలు” నాశనం అవుతాయి.—ప్రకటన 19:19.
దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును” అని దేవుని వాక్యంలో ఉంది. ( -
యుద్ధం, హింస, అన్యాయానికి అంతం.
“[దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.” (కీర్తన 46:9) “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.” (సామెతలు 2:21, 22) “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అని దేవుడు అంటున్నాడు.—ప్రకటన 21:4, 5.
-
దేవున్ని, మనుషులను మోసం చేసిన మతాల అంతం.
“ప్రవక్తలు పరవశులై అబద్ధాలు పలుకుతారు. యాజులు [యాజకులు] సొంత అధికారంతో పెత్తనం చెలాయిస్తారు . . . అయితే అంతం వచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారు?” (యిర్మీయా 5:31, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) “ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.”—మత్తయి 7:21-23.
-
ఇప్పుడున్న లోక పరిస్థితులకు మద్దతునిస్తూ నడిపిస్తున్న మనుషుల అంతం.
యేసు క్రీస్తు ఇలా అన్నాడు: “ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.” (యోహాను 3:19) పూర్వం నోవహు అనే ఒక మంచి మనిషి జీవించిన కాలంలో కూడా భూవ్యాప్తంగా జరిగిన ఒక నాశనం గురించి బైబిలు వివరిస్తుంది. “అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.”—2 పేతురు 3:5-7.
‘తీర్పు, నాశనము జరిగే దినాన్ని’ నోవహు జీవించినప్పటి ‘లోకంతో’ పోల్చారు. ఆ లోకం నాశనమైందా? భూగ్రహం నాశనం కాలేదు కానీ చెడ్డవాళ్లు అంటే దేవుని శత్రువులు నాశనం అయ్యారు. దేవుని శత్రువులుగా ఉండాలని నిర్ణయించుకున్న వాళ్లు కూడా భవిష్యత్తులో జరగబోయే దేవుని ‘తీర్పు దినమున’ నాశనం అవుతారు. కానీ నోవహు, ఆయన కుటుంబంలాగే దేవున్ని ఇష్టపడేవాళ్లు బ్రతుకుతారు.—మత్తయి 24:37-42.
చెడును, చెడు ప్రభావాలను దేవుడు తీసేసినప్పుడు ఈ భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి! అంతం గురించి దేవుడు చెప్తున్నది మంచివార్తే కాని చెడు వార్త కాదు. అయితే ఇప్పుడు, మీరు ఇలా ఆలోచిస్తుండవచ్చు: అంతం ఎప్పుడు వస్తుందని దేవుడు చెప్తున్నాడు? అది దగ్గర్లోనే ఉందా? అంతం వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవచ్చు? (w15-E 05/01)