ముఖపత్ర అంశం: ఎందుకు ఇన్ని బాధలు? ఈ గుండెకోత ఆగేది ఎప్పుడు?
అభంశుభం తెలియని ఎంతోమందిని మరణం కాటేసింది!
ఆనంద్ అనే చిన్నారి, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. అతను ఒక రోజు, ఓ నీటి మడుగు దగ్గర తన ఫ్రెండ్‌తో కలిసి బెలూన్‌తో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఆ బెలూన్ నీళ్లలో పడిపోవడంతో, ఆనంద్ దాన్ని తీయడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతను ఆ నీటి మడుగులో పడి మునిగిపోయాడు.
అమెరికాలోని కనెక్టికట్‌లో ఉన్న ఓ స్కూల్లో 2012 డిసెంబరు 14న 26 మంది తుపాకీ కాల్పులకు బలయ్యారు. వాళ్లలో 20 మంది ఆరేడేళ్ల ప్రాయంలో ఉన్న చిన్నారులే. షార్లట్, డాన్యల్, ఓలివీయ, జోసఫీన్ అనే పిల్లలు వాళ్లలో కొందరు. అలా చనిపోయినవాళ్ల జ్ఞాపకార్థం సమావేశమైన ప్రజల సమక్షంలో దేశాధ్యక్షుడు ఒబామా, ఆ చిన్నారుల పేర్లు పైకి చదువుతూ, శోకసముద్రంలో మునిగిపోయిన ప్రేక్షకులతో ఇలా అన్నాడు: “ఈ దారుణాలు ఆగిపోవాలి.”
జి. తిరుపతి అనే విద్యార్థి తన పరీక్షలకు సిద్ధపడడానికని హైద్రాబాద్‌కు వచ్చాడు. దిల్సుఖ్నగర్ వాసియైన తన మిత్రుడు రవితో కలిసి తిరుపతి ఓ రెస్టారెంటుకు వెళ్లాడు. అది ఫిబ్రవరి 21వ తారీఖు. ప్రజలతో వీధులు కిటకిటలాడుతున్న ఆ సాయంకాలం, రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. తీవ్రవాదుల చర్యగా భావించిన ఆ దుర్ఘటనలో, తిరుపతి అక్కడికక్కడే మృతిచెందాడు.
ప్రపంచమంతటా, గుండెల్ని పిండేసే ఇలాంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి. దుర్ఘటనలు, నేరాలు, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, ప్రకృతి విపత్తులు, తదితర విషాదాలు తెచ్చిపెట్టే దుఃఖం, వేదన గురించి ఆలోచించండి. ఉత్తపుణ్యానికి ఎంతోమంది అభంశుభం తెలియనివాళ్ల ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి. దానివల్ల తీరని దుఃఖం మిగులుతోంది.
మనకు ఊపిరి పోసిన సృష్టికర్తకు మనమంటే పట్టింపు లేదంటూ కొందరు దేవుని మీద అబాండాలు వేస్తారు. దేవుడు మనం పడే బాధల్ని చూస్తున్నా, వాటిలో జోక్యం చేసుకోదలచుకోవడం లేదని మరికొందరు అంటారు. మన తలరాత అలా ఉండబట్టే ఆ విషాదాలన్నీ మనల్ని పట్టిపీడిస్తున్నాయని ఇంకొందరు వాపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల అభిప్రాయాలకు అంతు ఉండదు. మరి మనం నమ్మవచ్చనిపించే, మన సందేహాల్ని తీర్చే జవాబులు ఎక్కడ దొరుకుతాయి? ఎందుకు ఇన్ని బాధలు? అవి సమసిపోయేది ఎలా? ఈ ప్రశ్నలకు దేవుని వాక్యమైన బైబిలు ఇస్తున్న జవాబుల్ని తర్వాతి ఆర్టికల్స్‌లో చూస్తాం. (w13-E 09/01)