కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు స్వస్థతలు చేస్తారా?

యెహోవాసాక్షులు స్వస్థతలు చేస్తారా?

మా పాఠకుల ప్రశ్న

యెహోవాసాక్షులు స్వస్థతలు చేస్తారా?

▪ యెహోవాసాక్షులు ఎప్పుడూ స్వస్థతలు చేయలేదు. యేసులాగే వాళ్లు, దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రకటించడం తమ ప్రాథమిక బాధ్యతని నమ్ముతారు. స్వస్థతలు చేసేవాళ్లు కాదుగానీ అంతకంటే ప్రాముఖ్యమైనది చేసేవాళ్లే నిజక్రైస్తవులుగా గుర్తింపు పొందుతారని వాళ్లు నమ్ముతారు.

యేసుక్రీస్తు సా.శ. మొదటి శతాబ్దంలో కనికరంతో రోగులను స్వస్థపర్చడం మనందరికీ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని సూచిస్తుంది. అలా చేయడం ద్వారా, దేవుని రాజ్యానికి రాజుగా తను పరిపాలిస్తున్నప్పుడు, ‘నాకు దేహంలో బాగోలేదని అందులో నివసించే వాళ్లెవరూ అనరు’ అని హామీ ఇచ్చాడు.—యెషయా 33:24.

మరి ఈ రోజుల్లో సంగతేమిటి? క్రైస్తవమత శాఖల్లోని వాళ్లు, వేరే మతాలకు చెందిన వాళ్లు అద్భుత స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అయితే యేసే, తన నామమున “అనేకమైన అద్భుతములు” చేశామని చెప్పుకుంటున్న వాళ్లను గట్టిగా హెచ్చరించాడు. ఆయన వాళ్లతో, ‘నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా, నా దగ్గర నుండి పొండి’ అని అంటాడు. (మత్తయి 7:22, 23) అయితే, ఇప్పుడు స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్లు చేస్తున్నవి, వాళ్లకు నిజంగా దేవుని ఆమోదం లేదా ఆశీర్వాదం ఉందని సూచిస్తున్నాయా?

యేసు చేసిన స్వస్థతల గురించి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి. లేఖనాల్లో ఉన్న ఆ వృత్తాంతాలను ఇప్పుడు స్వస్థతలు చేస్తున్న వాళ్ల పద్ధతులతో పోలిస్తే, ఇప్పుడు జరుగుతున్న స్వస్థతలు దేవుని సహాయంతో జరుగుతున్నాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

యేసు స్వస్థతలు చేసింది అనుచరులను లేదా పెద్ద పెద్ద గుంపులను సంపాదించుకోవడానికి కాదు. నిజానికి ఆయన చాలా స్వస్థతలు అందరి ముందు చేయలేదు. అంతేకాదు, చాలాసార్లు ఆయన తాను స్వస్థపర్చిన వాళ్లను ఆ అద్భుతం గురించి ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు.—లూకా 5:13, 14.

యేసు అద్భుతాలు చేసినందుకు ఎప్పుడూ డబ్బులు అడగలేదు. (మత్తయి 10:8) అలాగే, అద్భుతాలు చేయడంలో ఆయనకు ఎప్పుడూ ఓటమి ఎదురవ్వలేదు. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు అందరూ పూర్తిగా స్వస్థత పొందారు, అంతేకాకుండా ఎవరికి ఎంత విశ్వాసం ఉందనే దానితో సంబంధం లేకుండా ఆ స్వస్థతలు జరిగాయి. (లూకా 6:19; యోహాను 5:5-9, 13) అంతెందుకు, చనిపోయిన వాళ్లను ఆయన మళ్లీ బ్రతికించాడు!—లూకా 7:11-17; 8:40-56; యోహాను 11:38-44.

యేసు ఆ అద్భుతాలు చేసినా, అలాంటి అద్భుతాలతో మైమరపించి చాలామందిని తనకు శిష్యులుగా చేసుకోవాలన్నది ఆయన పరిచర్య ఉద్దేశం కాదు. దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించడమే ఆయనకు అప్పగించబడిన ప్రాముఖ్యమైన పని. యేసు తన అనుచరులను శిష్యుల్ని తయారుచేసేవారిగా వ్యవస్థీకరించాడు, వాళ్లు దేవుని రాజ్యంలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం గురించి ఇతరులకు బోధిస్తారు.—మత్తయి 28:19, 20.

నిజమే, మొదటి శతాబ్దంలో ఉన్న యేసు అనుచరుల్లో కొంతమందికి స్వస్థపర్చే వరాలు ఉండేవి, కానీ అవి ఆ తర్వాత నిలిపి వేయబడ్డాయి. (1 కొరింథీయులు 12:29, 30; 13:8, 13) ఈ రోజుల్లో నిజ క్రైస్తవులనే గుర్తింపు స్వస్థతలు చేయడం ద్వారా కాదుగానీ ఒకరిపట్ల ఒకరు నిస్వార్థమైన ప్రేమ చూపించుకోవడం వల్ల వస్తుంది. (యోహాను 13:35) ఇప్పుడు జరుగుతున్న స్వస్థతలు, వివిధ జాతులకు, జీవన నేపథ్యాలకు చెందిన వాళ్లందరూ నిస్వార్థ ప్రేమతో ఒక నిజమైన క్రైస్తవ కుటుంబంగా ఉండేవిధంగా చేయలేకపోయాయి.

అయితే, అలాంటి ప్రేమతో ఐక్యమైన క్రైస్తవుల గుంపు ఒకటి ఉంది. వాళ్ల మధ్య ఉన్న ప్రేమ ఎంత ప్రగాఢమైనదంటే వాళ్లు ఘోరమైన యుద్ధాలు జరుగుతున్న సమయాల్లో కూడా ఒకరికొకరు హాని చేసుకోరు, వేరేవాళ్లకు హాని చేయరు. ఇంతకీ ఎవరు వాళ్లు? వాళ్లే యెహోవాసాక్షులు. క్రీస్తు చూపించినలాంటి ప్రేమను చూపిస్తారని వాళ్లు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు. వివిధ జాతులకు, దేశాలకు, సంస్కృతులకు, వర్గాలకు చెందిన ప్రజలను ఐక్యపర్చడం నిజంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు, అది దేవుని పరిశుద్ధాత్మ వల్లే సాధ్యమైంది. మీరు వాళ్ల కూటాల్లో ఒక దానికి వెళ్లి స్వయంగా ఎందుకు తెలుసుకోకూడదు? (w10-E 10/01)

[27వ పేజీలోని చిత్రం]

ఇప్పుడు స్వస్థతలు చేస్తున్న వాళ్లు (కుడివైపున ఉన్న చిత్రం) నిజంగా దేవుని సహాయంతోనే చేస్తున్నారా?