మీ జీవితం నక్షత్రాల గుప్పిట్లో ఉందా?
మీ జీవితం నక్షత్రాల గుప్పిట్లో ఉందా?
చుట్టూ చీకటిగావున్న చోటు నుండి, రాత్రి పూట నిర్మలంగా ఉన్న సువిశాలమైన ఆకాశాన్ని చూస్తే, నల్లని పట్టు వస్త్రంపై వేలాది చిన్న చిన్న వజ్రాలు మిలమిల మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. నక్షత్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో, అవి మనకు ఎంత దూరంలో ఉన్నాయో మనిషి కేవలం మూడున్నర శతాబ్దాల క్రితం నుండే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అద్భుతమైన మన విశ్వమంతటిలో పనిచేస్తున్న భారీ శక్తుల గురించి మనం ఇప్పుడిప్పుడే అర్థంచేసుకుంటున్నాం.
అనాదిగా మనుషులు, రాత్రి ఆకాశంలో గ్రహనక్షత్రాదుల ఖచ్చితమైన కదలికలనూ అంతరిక్షంలో వాటి స్థానాలనుబట్టి కాలాల్లో వచ్చే మార్పులనూ గమనిస్తున్నారు. (ఆదికాండము 1:14) చాలామంది, ఇశ్రాయేలు రాజైన దావీదు వ్యక్తపర్చినలాంటి భావాలనే వ్యక్తపర్చారు. ఆయన దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ఇలా రాశాడు, ‘నీ చేతి పని అయిన నీ ఆకాశాలను, నువ్వు చేసిన చంద్ర నక్షత్రాలను చూస్తే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు?’—కీర్తన 8:3, 4.
అయితే, మనకు తెలిసినా తెలియకపోయినా గ్రహనక్షత్రాదులు, వాటి కదలికలు మన జీవితాలను చాలావరకు ప్రభావితం చేస్తాయి. మనుషులు ప్రాథమికంగా రోజులు, సంవత్సరాలతో కాలాన్ని లెక్కిస్తారు. అయితే వాటిని లెక్కించడం, మన భూగ్రహం ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతోందో ఆ సూర్యుని వల్లే సాధ్యమవుతుంది. చంద్రుని మూలంగానే మనకు ‘రుతువులు తెలుస్తున్నాయి.’ (కీర్తన 104:19) సముద్రయానం చేసే నావికులు, అంతరిక్షయానం చేసే వ్యోమగాములు నక్షత్రాల స్థానాలనుబట్టి దారి తెలుసుకుంటారు. ఇదంతా చూసి కొంతమంది నక్షత్రాలు సమయాన్ని, కాలాలను తెలియజేయడం కన్నా, దేవుని సృష్టి మీద మనకున్న కృతజ్ఞతాభావాన్ని పెంచడం కన్నా ఇంకా ఎక్కువే చేస్తాయేమో అనుకుంటున్నారు. అవి మన భవిష్యత్తు గురించి కూడా చెప్తాయా, రాబోయే విపత్తుల గురించి హెచ్చరిస్తాయా?
జ్యోతిశ్శాస్త్ర ఆవిర్భావం, దాని ఉద్దేశం
ఆకాశంలో కనిపించే శకునాలను బట్టి భూమ్మీద తాము ఏంచేయాలో నిర్ణయించుకునే ఆచారం దాదాపు సా.శ.పూ. 3,000 సంవత్సరాల క్రితం ప్రాచీన మెసొపొతమియలో మొదలైంది. పూర్వకాలంలోని జ్యోతిష్కులు ఆకాశంలో జరిగే వాటిని చాలా జాగ్రత్తగా గమనించేవాళ్లు. వాళ్లు చేసిన ప్రయత్నాలవల్ల గ్రహనక్షత్రాదుల గమనాన్ని, నక్షత్రాల స్థానాన్ని, గ్రహణాల్ని పసిగట్టగలిగారు, క్యాలెండర్లను తయారు చేయగలిగారు. అలా ఖగోళవిద్య అనే శాస్త్రం ఆవిర్భవించింది. కానీ జ్యోతిశ్శాస్త్రం సూర్యచంద్రులు మన పరిసరాలపై సహజంగా చూపించే ప్రభావాన్ని గురించి చెప్పడమే కాక, సూర్య చంద్ర నక్షత్రాదుల స్థానాలు, కదలికలు భూమ్మీద జరిగే ప్రాముఖ్యమైన సంఘటనలపై ప్రభావం చూపిస్తాయని, అంతేకాకుండా అవి ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేయగలవని బోధిస్తోంది. ఎలా ప్రభావితం చేస్తాయని అది బోధిస్తోంది?
గ్రహాలు, నక్షత్రాలు చూసి భవిష్యత్తు గురించి, జరగబోయే నష్టాల గురించి తెలుసుకోవచ్చని, ఆ జ్ఞానం ఉన్నవాళ్లు
వాటిని అర్థంచేసుకుని ఎన్నో విధాలుగా ప్రయోజనం పొందగలరని జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మే కొంతమంది అనుకుంటారు. మనం ఏమి చేయాలని ముందే నిర్ణయించబడిందో జ్యోతిశ్శాస్త్రం చూపిస్తుందని, కొన్ని పనులు చేయడానికి లేదా కొత్తగా ఏదైనా మొదలుపెట్టడానికి మంచి ముహూర్తాలు చూసుకునేందుకు అది సహాయం చేస్తుందని కొంతమంది నమ్ముతారు. గ్రహనక్షత్రాదుల్లో ప్రాముఖ్యమైన వాటి స్థానాల్ని గమనిస్తే, అవి ఒకదానిపై ఒకటి, అలాగే భూమిపై చూపించే ప్రభావాన్ని “లెక్కిస్తే” అలాంటి సమాచారం తెలుసుకోవచ్చని కొందరు అంటారు. ఒక వ్యక్తి పుట్టుక సమయంలో గ్రహనక్షత్రాదులు ఉన్న స్థానాలనుబట్టి అవి అతని జీవితంపై ప్రభావం చూపిస్తాయని వాళ్లు అంటారు.విశ్వానికి భూమి కేంద్రమని, దాని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఖచ్చితమైన వృత్తాల్లో తిరుగుతుంటాయని, ఆ వృత్తాలు ఒకదాని చుట్టూ మరొకటి చొప్పున చాలా ఉంటాయని పూర్వకాలంలోని జ్యోతిష్కులు ఊహించారు. అంతేగాక, సూర్యుడు సంవత్సరమంతటిలో ఒక నిర్దిష్టమైన మార్గంలో నక్షత్రాల, నక్షత్రరాశుల గుండా ఆకాశంలో ప్రయాణిస్తాడని కూడా వాళ్లు అనుకున్నారు. సూర్యుడు ప్రయాణించే మార్గమని వాళ్లు అనుకున్నదానికి రాశిచక్రం అని పేరు పెట్టారు. దాన్ని వాళ్లు పన్నెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు ప్రయాణిస్తున్న ఒక్కో భాగానికి దానిలోవున్న నక్షత్రరాశి ఆధారంగా పేరు పెట్టారు. ఆ విధంగా, రాశిచక్రాన్ని 12 రాశులుగా చెప్పడం మొదలైంది. “ఆకాశపు ఇళ్లు” అని కూడా పిలిచే ఈ రాశుల్లో, ఒక్కొక్కటి ఒక్కో దేవతకు నిలయమని నమ్మేవాళ్లు. అయితే కొంతకాలానికి, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు గానీ, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దాంతో ప్రజలు అప్పటివరకు శాస్త్రం అని నమ్ముతున్న జ్యోతిష్కానికి చావుదెబ్బ తగిలింది.
జ్యోతిశ్శాస్త్రాన్ని పాటించడం మెసొపొతమియలో ప్రారంభమై, ప్రపంచంలోని ఇంచుమించు అన్ని ప్రాంతాలకు విస్తరించి, దాదాపు పెద్ద నాగరికతలన్నిట్లో వివిధ రూపాల్లో నాటుకుపోయింది. పర్షియన్లు బబులోనును జయించినప్పటి నుండి జ్యోతిశ్శాస్త్రం ఐగుప్తు, గ్రీసు, భారత దేశాలకు విస్తరించింది. బౌద్ధమత ప్రచారకులు దాన్ని భారతదేశం నుండి మధ్య ఆసియా, చైనా, టిబెట్టు, జపాను, ఆగ్నేయాసియాలకు తీసుకువెళ్లారు. మాయా నాగరికతకు అది ఎలా చేరిందన్నది ఖచ్చితంగా తెలీకపోయినా, ఆ నాగరికత జ్యోతిశ్శాస్త్రాన్ని బబులోనీయుల్లాగే ఎంతో విస్తృతంగా ఉపయోగించింది. “ఆధునిక” రూపంలోని జ్యోతిశ్శాస్త్రం గ్రీకు సంస్కృతి మిళితమైన ఐగుప్తులో వృద్ధియై యూదుల, ముస్లిమ్‌ల, క్రైస్తవుల ఆలోచనా విధానం మీద చెప్పుకోదగినంత ప్రభావం చూపించింది.
ఇశ్రాయేలు జనాంగం సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో బబులోనుకు చెరగా తీసుకువెళ్లబడడానికి ముందే దానిపై కూడా జ్యోతిశ్శాస్త్ర ప్రభావం పడింది. ‘సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు’ బలులు అర్పించే ఆచారాన్ని రూపుమాపడానికి నమ్మకస్థుడైన యోషీయా రాజు చేసిన ప్రయత్నాల గురించి బైబిలు చెప్తోంది.—2 రాజులు 23:5.
జ్యోతిశ్శాస్త్రానికి మూలం
విశ్వ రూపకల్పన గురించి, దాని పని తీరు గురించి ఉన్న ఘోరమైన తప్పు అభిప్రాయాలే జ్యోతిశ్శాస్త్రానికి ఆధారం. కాబట్టి, అది దేవుని నుండి వచ్చివుండదని స్పష్టమవుతోంది. అది ఆధారపడివున్న ప్రాథమిక అభిప్రాయాలే అసత్యాలు కాబట్టి భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిశ్శాస్త్రం ఖచ్చితమైన మూలమయ్యే అవకాశమే లేదు. దాని వైఫల్యాన్ని తెలుసుకోవడానికి ఆసక్తికరమైన రెండు చారిత్రక సంఘటనలు మంచి ఉదాహరణలు.
బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలిస్తున్న కాలంలో, ఆయనకు వచ్చిన ఒక కల భావాన్ని శకునగాళ్లు, జ్యోతిష్కులు చెప్పలేకపోయారు. సత్యదేవుడైన యెహోవా ప్రవక్త దానియేలు ఆ సమస్యకు కారణమేమిటో ఇలా చెప్పాడు, ‘రాజు అడిగిన ఈ మర్మం జ్ఞానులైనా, గారడీవిద్య గలవారైనా, శకునగాండ్రైనా, జ్యోతిష్కులైనా తెలియజేయలేరు. అయితే మర్మములను బయలుపర్చగల దేవుడొకడు పరలోకంలో ఉన్నాడు, అంత్యదినములలో కలుగబోయేదానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేశాడు.’ (దానియేలు 2:27, 28) అవును, దానియేలు సూర్యచంద్ర నక్షత్రాదుల సహాయంతో కాదుగానీ, ‘మర్మములను బయలుపర్చగల’ యెహోవా దేవుని సహాయంతో రాజుకు సరైన భావాన్ని తెలియజేశాడు.—దానియేలు 2:36-45.
మాయా నాగరికత జ్యోతిశ్శాస్త్ర సంబంధంగా ఎంతో ఖచ్చితమైన లెక్కలు వేసినప్పటికీ సా.శ. తొమ్మిదవ శతాబ్దంలో ఆ నాగరికత అంతరించిపోకుండా అవి కాపాడలేకపోయాయి. ఈ వైఫల్యాలు జ్యోతిశ్శాస్త్రం ఒక మోసమని, భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఖచ్చితంగా చెప్పే సామర్థ్యం దానికి లేదని చూపిస్తుంది. అంతేగాక, భవిష్యత్తు విషయంలో ఖచ్చితమైన సమాచారం కోసం ప్రజలు దేవుని మీద ఆధారపడకుండా చేయాలన్నదే దాని అసలు సంకల్పమనే విషయాన్ని కూడా ఆ వైఫల్యాలు బట్టబయలు చేస్తున్నాయి.
జ్యోతిశ్శాస్త్రం అసత్యాలపై ఆధారపడివుందన్న వాస్తవం, దానికి మూలం ఎవరో గుర్తించడానికి కూడా సహాయం చేస్తుంది. అపవాదియైన సాతాను గురించి యేసు ఇలా చెప్పాడు, ‘వాడు సత్యంలో నిలిచినవాడు కాడు; వానిలో సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును; వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు.’ (యోహాను 8:44) సాతాను, ‘వెలుగు దూతలా’ నటిస్తాడు, దయ్యాలు, ‘నీతి పరిచారకుల్లా’ మారువేషం వేస్తాయి. నిజానికి వాళ్లు, ప్రజలు మోసమనే వలలో చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నించే మోసగాళ్లు. (2 కొరింథీయులు 11:14, 15) ‘శక్తివంతమైన పని, అబద్ధ సూచనలు, శకునాలు’ ఇవన్నీ ‘సాతాను పనులు’ అని దేవుని వాక్యం తేటతెల్లం చేస్తోంది.—2 థెస్సలొనీకయులు 2:9, 10, NW.
మీరు ఎందుకు దానికి దూరంగా ఉండాలి?
జ్యోతిశ్శాస్త్రం అబద్ధాల మీద ఆధారపడివుంది కాబట్టి, సత్యదేవుడైన యెహోవా దాన్ని అసహ్యించుకుంటాడు. (కీర్తన 31:5) అందుకే, బైబిలు దాన్ని స్పష్టంగా ఖండిస్తోంది, దాంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ప్రజలను కోరుతోంది. ఈజీ-టు-రీడ్ వర్షన్ బైబిలు ప్రకారం, ద్వితీయోపదేశకాండము 18:10-12లో దేవుడు స్పష్టంగా ఇలా చెప్తున్నాడు, ‘భూతవైద్యుల దగ్గర, సోదెచెప్పేవాళ్ల దగ్గర మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచిని అడిగేవాళ్లు, సోదెచెప్పేవాళ్లు ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయిన వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. అలాంటివి చేసే వాళ్లంటే యెహోవాకు అసహ్యం.’
జ్యోతిశ్శాస్త్ర శక్తి వెనక ఉన్నది సాతాను, అతని దయ్యాలు కాబట్టి, ఒక వ్యక్తికి దానితో ఎలాంటి సంబంధమున్నా ఆ వ్యక్తి మీద వాళ్ల ప్రభావం పడే అవకాశముంటుంది. మత్తు పదార్థాలను ప్రయత్నించి చూడాలని అనుకునే వ్యక్తి ఎలాగైతే వాటిని కొనే, అమ్మే వాళ్ల చేతుల్లో చిక్కుకుంటాడో, అలాగే జ్యోతిశ్శాస్త్రాన్ని సంప్రదించాలనుకునే వ్యక్తి పరమ మోసగాడైన సాతాను చేతుల్లో చిక్కుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి, సత్యాన్ని ప్రేమించేవాళ్లు జ్యోతిశ్శాస్త్రానికి పూర్తిగా దూరంగా ఉంటూ, “కీడును ద్వేషించి మేలును ప్రేమించు” అని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని పాటించాలి.—భవిష్యత్తు తెలుసుకోవాలనే కోరిక ప్రజల్లో ఉంది కాబట్టే జ్యోతిశ్శాస్త్రం వర్ధిల్లుతోంది. భవిష్యత్తు గురించి తెలుసుకోవడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే, ఎలా తెలుసుకోవచ్చు? వ్యక్తిగతంగా మనకు రేపో, వచ్చే నెలో, వచ్చే సంవత్సరమో ఏమి జరుగుతుందో తెలుసుకోలేమని బైబిలు చెప్తోంది. (యాకోబు 4:14) అయితే, సమీప భవిష్యత్తులో మానవజాతి అంతటికి ఏమి జరగబోతోందో బైబిలు తెలియజేస్తోంది. ప్రభువు ప్రార్థనలో మనం ఏ రాజ్యం కోసం ప్రార్థిస్తున్నామో, ఆ రాజ్యం త్వరలోనే వస్తుందని అది మనకు తెలియజేస్తోంది. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) మానవులు అనుభవిస్తున్న బాధలు త్వరలోనే అంతమవుతాయని, అలాంటి బాధలు ఇక ఎన్నడూ ఉండవని కూడా బైబిలు చెప్తోంది. (యెషయా 65:17; ప్రకటన 21:4) దేవుడు మానవ జీవితాన్ని ముందే నిర్ణయించలేదు గానీ తన గురించి, వాళ్ల ప్రయోజనం కోసం తను చేయబోయే వాటి గురించి తెలుసుకోమని ప్రజలందర్నీ ఆహ్వానిస్తున్నాడు. ఆ విషయం మనకెలా తెలుసు? ‘మనుష్యులందరూ రక్షణ పొంది సత్యం గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండాలి’ అన్నది దేవుని చిత్తమని బైబిలు స్పష్టం చేస్తోంది.—1 తిమోతి 2:4.
అద్భుతమైన ఆకాశం, దానిలోవున్న సమస్తం మన జీవితాలను అదుపుచేయడానికి సృష్టించబడలేదు. అయితే, అవి యెహోవా శక్తిని, దైవత్వాన్ని తెలియజేస్తాయి. (రోమీయులు 1:20) అవి, అబద్ధాలను నమ్మకుండా, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి నమ్మకమైన నిర్దేశం కోసం, నడిపింపు కోసం దేవుని మీద, ఆయన వాక్యమైన బైబిలు మీద ఆధారపడేలా మనల్ని పురికొల్పగలవు. ‘యెహోవామీద పూర్తిగా నమ్మకం ఉంచండి! మీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. మీరు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచండి. అప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు.’—సామెతలు 3:5, 6, ఈజీ-టు-రీడ్ వర్షన్. (w10-E 06/01)
[23వ పేజీలోని బ్లర్బ్]
మాయా నాగరికత జ్యోతిశ్శాస్త్రాన్ని ఎంతో విస్తృతంగా ఉపయోగించింది
[24వ పేజీలోని బ్లర్బ్]
‘మర్మములను బయలుపర్చగల దేవుడొకడు పరలోకంలో ఉన్నాడు, ఆయన అంత్యదినాలలో కలుగబోయేదానిని తెలియజేశాడు’
[24వ పేజీలోని బ్లర్బ్]
మాయా నాగరికత జ్యోతిశ్శాస్త్ర సంబంధంగా ఎంతో ఖచ్చితమైన లెక్కలు వేసినప్పటికీ, ఆ నాగరికత అంతరించిపోకుండా అవి కాపాడలేకపోయాయి
[23వ పేజీలోని చిత్రం]
EL CARACOL OBSERVATORY, CHICHÉN ITZÁ, YUCATÁN, MEXICO, 750-900 C.E.
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
22, 23 పేజీలు, ఎడమ నుండి కుడికి: నక్షత్రాలు: NASA, ESA, and A. Nota (STScI); మాయా క్యాలెండర్: © Lynx/Iconotec com/age fotostock; మాయా ఖగోళ శాస్త్రజ్ఞుడు: © Albert J. Copley/age fotostock; మాయా ఖగోళ పరిశీలనా కేంద్రం: El Caracol (The Great Conch) (photo), Mayan/Chichen Itza, Yucatan, Mexico/Giraudon/The Bridgeman Art Library