మీ పిల్లలకు నేర్పించండి
యిర్మీయా దేవుని సేవ చేయడం ఆపలేదు
మీరెప్పుడైనా నిరుత్సాహపడి, దేవుని సేవ చేయడం ఆపేద్దాం అని అనుకున్నారా?— a చాలామంది అలా నిరుత్సాహపడతారు. చిన్నప్పుడు యిర్మీయా కూడా అలాగే నిరుత్సాహపడ్డాడు. అయితే ఆయన ఇతరుల మాటలను బట్టి లేదా వారు చేసిన పనులను బట్టి దేవుని సేవ చేయడం ఆపలేదు. దేవుడు యిర్మీయాను ఎందుకు ప్రేమించాడో, దేవుడు ఆయనను ప్రేమించినా ఆయన దేవుని సేవ చేయడం ఆపేయాలని ఎందుకు అనుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం.
సత్య దేవుడైన యెహోవా, ప్రజలు తనకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించడం లేదని హెచ్చరించడానికి యిర్మీయా పుట్టకముందే ఆయనను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యిర్మీయా యెహోవాతో ఏమన్నాడో మీకు తెలుసా?— ‘నేను బాలుడను; మాట్లాడడానికి నాకు శక్తి చాలదు.’
దానికి యెహోవా యిర్మీయాతో ఏమన్నాడు?— ఆయన సౌమ్యంగానే అయినా గట్టిగా యిర్మీయాతో ఇలా అన్నాడు: ‘నేను బాలుడనని అనవద్దు; నేను నిన్ను పంపేవారి దగ్గరకు నీవు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. వారికి భయపడవద్దు.’ ఎందుకు భయపడకూడదు? ఎందుకంటే, ‘నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను’ అని యెహోవా చెప్పాడు.—యిర్మీయా 1:4-8.
అయినప్పటికీ, మనం ముందు చెప్పుకున్నట్లు, యిర్మీయా ఆ తర్వాత నిరుత్సాహపడ్డాడు. ఎందుకంటే దేవుని సేవ చేస్తున్నందుకు ప్రజలు ఆయనను ఎగతాళి చేశారు. ‘నేను దినమంతా నవ్వులపాలయ్యాను. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు’ అని అన్నాడు. అందుకే దేవుని సేవ చేయడం ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. ‘యెహోవా పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను’ అని అన్నాడు. అయితే ఆయన దేవుని సేవ చేయడం నిజంగానే ఆపేశాడా?
‘అది నా హృదయంలో అగ్నిలా మండుతూ, నా యెముకల్లోనే మూయబడినట్లుంది; నేను ఓర్చి ఓర్చి విసికిపోయాను’ అని యిర్మీయా అన్నాడు. (యిర్మీయా 20:7-9) ఆయన కొన్నిసార్లు భయపడ్డా, యెహోవా మీదున్న ప్రేమవల్ల ఆయన దేవుని సేవ చేయడం ఆపలేదు. దేవుని సేవ చేయడం ఆపనందుకు యిర్మీయా ఎలా కాపాడబడ్డాడో చూద్దాం.
ప్రజలు తమ చెడు ప్రవర్తన మార్చుకోకపోతే, యెరూషలేము నాశనం చేయబడుతుందని వారిని హెచ్చరించడానికి యెహోవా యిర్మీయాను పంపించాడు. యిర్మీయా ప్రజల్ని హెచ్చరించినప్పుడు వాళ్లు కోపంతో, ‘ఇతను మరణానికి పాత్రుడు’ అని అరిచారు. కానీ యిర్మీయా
‘మీరు యెహోవా మాట వినండి’ అని వారిని అర్థించాడు. ఆ తర్వాత ఆయన వారితో, ‘యెహోవా మీ యొద్దకు నన్ను పంపించాడు గనుక, మీరు నన్ను చంపితే, నిరపరాధిని చంపినట్లే’ అన్నాడు. అప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా?—బైబిలు ఇలా చెబుతోంది: ‘అధిపతులు, జనులందరు యాజకులతో, ప్రవక్తలతో ఇలా అన్నారు—ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామాన్నిబట్టి మనకు ఈ సమాచారం ప్రకటిస్తున్నాడు గనుక ఇతడు మరణానికి పాత్రుడు కాడు.’ యిర్మీయా భయపడి తాను చేస్తున్న పనిని ఆపలేదు కాబట్టి యెహోవా ఆయనను కాపాడాడు. కానీ మరో ప్రవక్త భయంతో దేవుని సేవ చేయడం ఆపేశాడు. ఆయన పేరు ఊరియా. ఆయనకు ఏమి జరిగిందో మనమిప్పుడు చూద్దాం.
‘ఊరియా యిర్మీయా చెప్పిన మాటల రీతిని యెరూషలేముకు విరోధంగా ప్రవచించాడు’ అని బైబిలు చెబుతోంది. అయితే రాజైన యెహోయాకీము ఊరియాపై మండిపడ్డాడు, అప్పుడు ఊరియా ఏంచేశాడో మీకు తెలుసా?— భయపడి దేవుని పని ఆపుజేసి ఐగుప్తుకు పారిపోయాడు. ఊరియాను బంధించి తీసుకువచ్చేందుకు రాజు మనుషులను పంపించాడు. వారలా ఊరియాను బంధించి తీసుకొచ్చినప్పుడు రాజు ఏంచేశాడో మీకు తెలుసా?— ఆయన ఊరియాను ఖడ్గముతో చంపించాడు.—యిర్మీయా 26:8-24.
యెహోవా యిర్మీయాను ఎందుకు కాపాడాడు, ఊరియాను ఎందుకు కాపాడలేదు?— యిర్మీయా కూడా ఊరియాలాగే భయపడి ఉండవచ్చు, కానీ ఆయన యెహోవా సేవ చేయడం ఆపేసి పారిపోలేదు. ఆయన తాను చేస్తున్న పనిని ఆపేయలేదు. యిర్మీయా చేసిన దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?— దేవుడు చెప్పింది చేయడం కొన్నిసార్లు మనకు కష్టం అనిపించవచ్చు, అయితే మనం ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడాలి. (w09-E 12/01)
a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.