కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిశుద్ధాత్మ జీవితంలో ఈ శక్తి మీకెంతో అవసరం

పరిశుద్ధాత్మ జీవితంలో ఈ శక్తి మీకెంతో అవసరం

పరిశుద్ధాత్మ జీవితంలో ఈ శక్తి మీకెంతో అవసరం

“నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.” (కీర్తన 51:11) దావీదు రాజు ఘోరమైన తప్పు చేసిన తర్వాత నలిగిన హృదయంతో ప్రార్థిస్తూ ఆ మాటలు అన్నాడు.

పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతమైనదో దావీదు ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తివల్ల ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడే గొల్యాతువంటి భీకరమైన సైనికున్ని చంపగలిగాడు. (1 సమూయేలు 17:45-50) శ్రావ్యమైన కీర్తనలు కూర్చడానికి కూడా ఆ శక్తి ఆయనకు సహాయం చేసింది. “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది” అని దావీదు చెప్పాడు.—2 సమూయేలు 23:2.

దావీదు జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేసిందని యేసుక్రీస్తు కూడా చెప్పాడు. ఒకసారి యేసు తన బోధ వింటున్నవారితో ఇలా అన్నాడు: ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని యెహోవా నా ప్రభువుతో చెప్పెను అని దావీదు పరిశుద్ధాత్మవలన చెప్పాడు.’ (మార్కు 12:36; కీర్తన 110:1) దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కీర్తనలు రాశాడని యేసుకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మనే మనం కూడా పొందగలమా?

“అడుగుడి మీకియ్యబడును”

మీరు కీర్తనలు రాయకపోవచ్చు, కానీ భీకరమైన గొల్యాతులాంటి పెద్దపెద్ద సమస్యలెన్నో మీకు ఎదురుకావచ్చు. ఉదాహరణకు ఇందిర విషయమే తీసుకోండి. a ఇందిర భర్త ఆమెకన్నా చిన్నవయసున్న మరో స్త్రీ కోసం ఆమెను వదిలేశాడు. అతను చాలా అప్పులు చేసి వాటిని తీర్చే భారాన్ని ఆమె మీద వదిలేశాడు. అంతేకాక చిన్నవయసున్న ఇద్దరు కూతుర్లను పెంచడానికి డబ్బు సహాయం కూడా చేయలేదు. “నా భర్త నన్ను మోసగించాడని, ఎందుకూ పనికిరానిదానిలా చూశాడని నాకనిపించింది. అయినప్పటికీ, అతను నన్ను వదిలేసిన దగ్గర నుండి దేవుని పరిశుద్ధాత్మ నన్ను కాపాడి, నడిపించడం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను” అని ఆమె చెబుతోంది.

ఇందిర ఎలాంటి ప్రయత్నం చేయకుండానే తనకు పరిశుద్ధాత్మ సహాయం దొరుకుతుందని అనుకుందా? లేదు. పరిశుద్ధాత్మను దయచేయమని ఆమె రోజూ దేవుణ్ణి వేడుకుంది. భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవాలన్నా, పిల్లలను చక్కగా పెంచాలన్నా, దెబ్బతిన్న తన ఆత్మాభిమానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలన్నా తనకు దేవుని సహాయం అవసరమని ఆమె అర్థం చేసుకుంది. “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును” అని యేసు చెప్పిన మాటల్ని ఆమె పాటించింది.—మత్తయి 7:7, 8.

తనకు పరిశుద్ధాత్మ అవసరమని రాజు అనే వ్యక్తికి కూడా అనిపించింది. అయితే ఆయన వేరే సమస్యను పరిష్కరించుకోవడానికి అలా కోరుకున్నాడు. ఆయన ఎప్పుడూ పొగాకు, గంజాయి పీలుస్తూ వాటికి బానిసయ్యాడు. ఆ వ్యసనాన్ని మానుకోవాలని ఆయన రెండు సంవత్సరాలపాటు కష్టపడ్డాడు. అయినా చాలాసార్లు అతను వాటికి దూరంగా ఉండలేకపోయాడు. “మత్తుమందులు తీసుకోవడం మానేస్తే చాలా ఆందోళనగా ఉంటుంది. అవి అందకపోతే శరీరం తట్టుకోలేదు, ఎలాగైనా వాటిని తీసుకోవాలనే కోరిక రోజురోజుకు పెరిగిపోతుంది” అని రాజు చెప్పాడు.

“అయితే దేవునికి నచ్చిన విధంగా ఆయనను సేవించడానికి నా జీవితాన్ని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. బైబిలు చెబుతున్న మంచి విషయాల మీదే మనసు పెట్టడానికి ప్రయత్నించాను. బైబిలు ప్రకారం నా జీవితాన్ని మార్చుకోవడానికి కావలసిన శక్తినివ్వమని పట్టుదలగా ప్రతీరోజు దేవునికి ప్రార్థన చేశాను. నా అంతట నేను సాధించలేనని నాకు తెలుసు. నేను అప్పుడప్పుడూ కోరికను చంపుకోలేక మత్తుమందులు తీసేసుకునేవాణ్ణి. ముఖ్యంగా అలాంటి సమయాల్లో యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. పరిశుద్ధాత్మ నాలో నూతన బాలాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను, ఆయన ఆత్మ సహాయమే లేకపోతే నేనెప్పటికీ నా వ్యసనాల నుండి బయటపడేవాడ్ని కాను” అని కూడా రాజు చెబుతున్నాడు.—ఫిలిప్పీయులు 4:6-8.

“పక్షిరాజులవలె రెక్కలు చాపి” పైకెగురుతారు

ఇందిర, రాజు జీవితాల్లో జరిగినట్లే, తమ జీవితాల్లోనూ పరిశుద్ధాత్మ పనిచేయడం లక్షలాదిమంది యెహోవాసాక్షులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. విశ్వాన్ని సృష్టించడానికి యెహోవా ఉపయోగించిన శక్తి, మీరు కోరుకుంటే మీకు కూడా సహాయం చేస్తుంది. మీరు మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు తన ఆత్మను మీకివ్వాలని ఎంతో కోరుకుంటున్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మను పొందాలంటే, మీరు ఆయన గురించిన సత్యం తెలుసుకోవాలి, ఆయన చిత్తం చేయడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి.—యెషయా 55:6; హెబ్రీయులు 11:6.

దేవుణ్ణి చక్కగా సేవించడానికి, ఎలాంటి సమస్యలొచ్చినా తట్టుకోవడానికి కావల్సిన శక్తిని పరిశుద్ధాత్మ ఇస్తుంది. బైబిలు ఏమని భరోసా ఇస్తుందంటే, ‘యెహోవా సొమ్మసిల్లినవారికి బలమిస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు.’—యెషయా 40:28-31. (w09-E 10/01)

[అధస్సూచి]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[14వ పేజీలోని బ్లర్బ్‌]

‘శక్తినివ్వమని పట్టుదలగా ప్రతీరోజు దేవునికి ప్రార్థన చేశాను. నా అంతట నేను సాధించలేనని నాకు తెలుసు. యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు’

[13వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పరిశుద్ధాత్మ ఎలా పనిచేసింది?

భూమిని, మిగిలిన విశ్వాన్ని సృష్టించడానికి దేవుడు దాన్ని ఉపయోగించాడు. ‘యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నవి! జ్ఞానం చేత నీవు వాటన్నిటిని నిర్మించావు. నీవు కలుగజేసినవాటితో భూమి నిండివుంది. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడతాయి’ అని కీర్తనకర్త ఎలుగెత్తి చాటాడు.—కీర్తన 104:24, 30; ఆదికాండము 1:2; యోబు 33:4.

బైబిలు రాయడానికి అది దైవజనులను ప్రేరేపించింది. ‘ప్రతిలేఖనం దైవావేశమువల్ల కలిగింది, ప్రయోజనకరమైంది’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 తిమోతి 3:16, 17) “దైవావేశము” అని అనువదించబడిన గ్రీకు పదానికి “దేవుడు ఊదెను” అని అర్థం. యెహోవా ఊపిరి లేదా ఆత్మ బైబిలు రచయితల ఆలోచనలకు మార్గదర్శకమైంది. అందువల్ల వారు “దేవుని వాక్యమును” అందించారు.—1 థెస్సలొనీకయులు 2:13.

భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ప్రవచించే శక్తిని అది దేవుని సేవకులకు ఇచ్చింది. ‘ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవల్ల ప్రేరేపింపబడి, దేవుని మూలముగ పలికారు’ అని అపొస్తలుడైన పేతురు వివరించాడు.—2 పేతురు 1:20, 21; యోవేలు 2:28.

దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి, అద్భుతాలు చేయడానికి యేసుకు, ఇతర విశ్వాసులకు అది సహాయం చేసింది. ‘యెహోవా ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగుతుందని ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడు’ అని యేసు అన్నాడు.—లూకా 4:18, 19; మత్తయి 12:28.

[15వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసే వివిధ పద్ధతులు

తప్పుచేయాలనే కోరికను జయించి, హానికరమైన అలవాట్లను విడిచిపెట్టడానికి కావల్సిన బలాన్నిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”—1 కొరింథీయులు 10:13.

దేవుడు ఇష్టపడే లక్షణాలు అలవర్చుకోవడానికి సహాయం చేస్తుంది. “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.”—గలతీయులు 5:22, 23.

పరీక్షల్ని తట్టుకోవడానికి కావల్సిన బలాన్నిస్తుంది. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.