దేవుడు మన క్షేమం కోరుతున్నాడని మనకెలా తెలుసు?
దేవుడు మన క్షేమం కోరుతున్నాడని మనకెలా తెలుసు?
దేవునికి మన మీద ప్రేముంటే, మనం ఎందుకిన్ని కష్టాలు పడుతున్నాం? ప్రజలు వేల సంవత్సరాలుగా ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచిస్తున్నారు. మనకు ఇష్టమైనవాళ్లు కష్టపడడం చూడలేం. అందుకే వాళ్లు కష్టాల్లోవుంటే మనకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా సాధారణంగా అలాగే చేస్తారు కాబట్టి, ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుండడం చూసి దేవుడు మన క్షేమం గురించి ఏమీ చేయలేడని చాలామంది అనుకుంటారు. అందుకే, ముందుగా మనం దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడనీ మన క్షేమం గురించి ఆలోచిస్తున్నాడనీ ఎందుకు చెప్పవచ్చో తెలుసుకోవడం ప్రాముఖ్యం.
దేవునికి ప్రేమ ఉందని సృష్టి చూపిస్తోంది
యెహోవా దేవుడు, ‘ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలోని సమస్తాన్ని కలుగజేశాడు.’ (అపొస్తలుల కార్యములు 4:24) యెహోవా దేవుడు సృష్టించిన వాటి గురించి ఆలోచిస్తే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉదాహరణకు, మీకు ఇష్టమైన వాటి గురించి ఒక్కసారి ఆలోచించండి. మనందరం మంచి భోజనాన్ని ఇష్టపడతాం. మనం బ్రతకడానికి యెహోవా ఏదో ఒక్క రకమైన ఆహారం ఇస్తే సరిపోయేది. కానీ, ఆయన నోరూరించే ఎన్నో రకాల ఆహార పదార్థాలను మనకిచ్చాడు! అలాగే మనం జీవితాన్ని సంతోషంగా గడపడానికి యెహోవా దేవుడు ఎన్నో రకాల చెట్లతో, పూలతో, సుందరమైన ప్రదేశాలతో భూమిని అందంగా తీర్చిదిద్దాడు.
ఆయన మనల్ని సృష్టించిన తీరు గురించి కూడా ఆలోచించండి. హాస్యాన్ని, సంగీతాన్ని, అందాన్ని ఆస్వాదించగలగడం ప్రాణం నిలబెట్టుకోవడానికి అంత అవసరమేమీకాదు. అయినా మనం జీవితాన్ని ఆనందించడానికి దేవుడు వాటిని మనకు బహుమతులుగా ఇచ్చాడు. ఇతరులతో మీరు కలిసిమెలిసి ఉండడం గురించి ఆలోచించండి. తమ స్నేహితులతో కలిసివుండాలని, తాము ప్రేమించేవారిని ఆప్యాయంగా హత్తుకోవాలని ఎవరు మాత్రం ఇష్టపడరు? అంతెందుకు, ఎదుటివారిని ప్రేమించగలగడం కూడా, ప్రేమగల దేవుడిచ్చిన బహుమానమే! దేవునికి ప్రేమించే లక్షణం ఉంది కాబట్టే, తను సృష్టించిన మనుషులకు ప్రేమించే శక్తినిచ్చాడు.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని బైబిలు హామీ ఇస్తోంది
దేవుడు ప్రేమాస్వరూపి అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 4:8) ఆయన ప్రేమ ఆయన చేసిన సృష్టిలోనే కాదు ఆయన వాక్యమైన బైబిల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, బైబిలు మంచి ఆరోగ్యానికి దోహదపడే అలవాట్ల గురించి చెబుతుంది, అన్నిట్లో మితంగా ఉండమని ప్రోత్సహిస్తుంది, తాగుబోతుతనానికి, తిండిబోతుతనానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది.—1 కొరింథీయులు 6:9, 10.
ఇతరులతో కలిసిమెలిసి ఉండే విషయంలో కూడా బైబిలు చక్కని సలహా ఇస్తుంది. ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించాలని, ఇతరులతో గౌరవంగా, మర్యాదగా, దయగా మెలగాలని అది మనలను ప్రోత్సహిస్తుంది. (మత్తయి 7:12) చాడీలు చెప్పడం, వ్యభిచారం, హత్యలు, దురాశ, అసూయ వంటి వాటిని బైబిలు ఖండిస్తుంది. ఇవన్నీ ఇతరులను బాధపెడతాయి. ప్రతీఒక్కరూ దేవుని వాక్యంలో ఉన్న సలహాలను పాటించడానికి ప్రయత్నిస్తే లోకంలో ఇన్ని కష్టాలుండవు.
మనుషులను విమోచించేందుకుగాను క్రయధన బలి అర్పించడానికి దేవుడు తన కుమారుడైన యేసును పంపించడం, ఆయనకు మనమంటే ఎంత ప్రేముందో అన్నిటికన్నా ఎక్కువగా చూపిస్తుంది. ‘దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందేలా ఆయన్ని అనుగ్రహించాడు’ అని యోహాను 3:16 చెబుతుంది. ఆ రకంగా చూస్తే, మరణాన్నీ అన్ని రకాల బాధలనూ శాశ్వతంగా తీసేయడానికి యెహోవా ఇదివరకే ఏర్పాటు చేశాడని అర్థమౌతుంది.—1 యోహాను 3:8.
యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఖచ్చితంగా ఎన్నో రుజువులున్నాయి. కాబట్టి, మనం కష్టాలుపడడం ఆయనకు ఇష్టంలేదని తెలుస్తోంది. ఆయన మన కష్టాలను తప్పకుండా తీసేస్తాడు. ఈ విషయం గురించి మనకు తోచినట్టు మనం ఊహించుకోనవసరంలేదు. ఎందుకంటే దేవుడు కష్టాలను ఎలా తీసేస్తాడో బైబిలు చక్కగా వివరిస్తోంది. (w09-E 12/01)
[4వ పేజీలోని చిత్రం]
ప్రేమించగలగడం, ప్రేమగల దేవుడు మనకిచ్చిన ఒక బహుమానం