యేసు తన గురించి తాను ఏమి బోధించాడు?
యేసు తన గురించి తాను ఏమి బోధించాడు?
“యేసుకు తానెవరో, ఎక్కడి నుండి వచ్చాడో, ఈ లోకానికి ఎందుకొచ్చాడో, తన భవిష్యత్తు ఏమిటో కచ్చితంగా తెలుసు.”—హర్బర్ట్ లాక్యర్, రచయిత.
యేసు బోధించిన వాటిని ఒప్పుకుని, వాటిమీద నమ్మకం ఉంచడానికి ముందు మనం ఆయన గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరముంది. నిజానికి యేసు ఎవరు? ఎక్కడ నుండి వచ్చాడు? ఆయన జీవితంలో ఏమి చేయాలనుకున్నాడు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను చదివితే యేసే స్వయంగా వీటికి సమాధానాలు మనకు వివరిస్తున్నట్లు ఉంటుంది.
భూమ్మీద పుట్టకముందే ఉన్నాడు: ఒకసారి యేసు ఇలా చెప్పాడు: ‘అబ్రాహాము పుట్టకముందే నేనున్నాను.’ (యోహాను 8:58) యేసు పుట్టడానికి దాదాపు 2,000 సంవత్సరాల ముందు అబ్రాహాము జీవించాడు. అయినా భక్తిపరుడైన ఆ పూర్వీకుడు పుట్టక ముందే యేసు జీవించాడు. మరైతే యేసు అప్పుడు ఎక్కడున్నాడు? ‘పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఆయన వివరించాడు.—యోహాను 6:38.
దేవుని కుమారుడు: యెహోవాకు ఎంతోమంది కుమారులు ఉన్నారు, వాళ్లంతా దేవదూతలు. అయితే యేసు మాత్రం ప్రత్యేకమైనవాడు. ఆయన తాను ‘దేవుని అద్వితీయకుమారుణ్ణి’ అని చెప్పాడు. (యోహాను 3:18) అంటే యేసును మాత్రమే దేవుడు స్వయంగా సృష్టించాడని అర్థం. దేవుడు ఈ అద్వితీయ కుమారుని ద్వారా మిగతావాటన్నిటినీ సృష్టించాడు.—కొలొస్సయులు 1:16.
“మనుష్యకుమారుడు”: యేసు తన గురించి చెప్తున్నప్పుడు అన్నిటికన్నా ఈ పదాన్నే ఎక్కువగా ఉపయోగించాడు. (మత్తయి 8:20) ఆ విధంగా ఆయన తాను మానవరూపం దాల్చిన దేవదూత కాదని చూపించాడు. ఆయన పూర్తిగా మానవుడు. దేవుడు పరలోకంలోవున్న తన కుమారుని జీవాన్ని తన పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియ గర్భంలోకి మార్చి యేసు భూమ్మీదకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా యేసు పరిపూర్ణుడిగా, పాపంలేని వ్యక్తిగా పుట్టాడు.—మత్తయి 1:18; లూకా 1:35; యోహాను 8:46.
దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ: సమరయ దేశానికి చెందిన ఒక స్త్రీ, “మెస్సీయ వచ్చునని నేనెరుగుదును” అని యేసుతో అంది. దానికి ఆయన “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను” అన్నాడు. (యోహాను 4:25, 26) “క్రీస్తు” అనే పదంలాగే “మెస్సీయ” అనే పదానికి “అభిషిక్తుడు” అని అర్థం. దేవుడు తన వాగ్ధానాలు నెరవేర్చడంలో ఒక ప్రత్యేక పాత్ర నిర్వర్తించడానికి యేసును అభిషేకించాడు లేదా నియమించాడు.
యేసు భూమ్మీదకు రావడానికి ముఖ్య కారణం: ఒకసారి యేసు ఇలా చెప్పాడు: ‘నేను దేవుని రాజ్యసువార్తను ప్రకటించాలి; ఇందుకోసమే నేను పంపబడ్డాను.’ (లూకా 4:43) ఆయన అవసరంలోవున్న ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసినా, తన జీవితంలో దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఆ రాజ్యం గురించి ఆయనేమి బోధించాడో తర్వాత చర్చించబడుతుంది.
యేసు సామాన్యమైన వ్యక్తి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. a మనం చూడబోతున్నట్లుగా, ఆయన పరలోకంలో గడిపిన జీవితం, భూమ్మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలకు మరింత అర్థాన్ని చేకూర్చింది. ఆయన ప్రకటించిన సందేశం, ప్రపంచమంతటా ఉన్న లక్షలాదిమంది జీవితాలను మార్చిందంటే అందులో ఆశ్చర్యమేమైనా ఉందా? (w10-E 04/01)
[అధస్సూచి]
a యేసు గురించి, దేవుని సంకల్పంలో ఆయన పాత్ర గురించి మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 4వ అధ్యాయాన్ని చూడండి.