బీదవారి మీద దేవుని అనుగ్రహం లేదనగలమా?
బీదవారి మీద దేవుని అనుగ్రహం లేదనగలమా?
“మీలో బీదలు ఉండనే ఉండరు” అని దేవుడు పూర్వకాల ఇశ్రాయేలీయులతో అన్నాడు. ఎందుకంటే దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రంలో బీదవారి గురించి శ్రద్ధ తీసుకోవాలని, చివరికి వారిని రుణవిముక్తుల్ని చేయాలని చెప్పే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. (ద్వితీయోపదేశకాండము 15:1-4, 7-10) యెహోవా వారిని ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీయులలో అసలు బీదవారు ఉండే అవకాశమే లేదు. అయితే వారు ధర్మశాస్త్రానికి లోబడితేనే ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. కాని వారు చాలాసార్లు లోబడలేదు.
బీదవారి మీద దేవుని అనుగ్రహం లేదనీ చెప్పలేం, అలాగని ధనవంతుల మీద దేవుని అనుగ్రహం ఎక్కువ ఉందనీ చెప్పలేం. పూర్వకాలంలో నమ్మకస్థులైన దేవుని సేవకులు చాలామంది బీదవారే. ఆమోసు ప్రవక్త గొర్రెలు కాచుకుంటూ, వ్యవసాయ కూలిగా పనిచేసేవాడు. (ఆమోసు 1:1; 7:14) ఏలియా ప్రవక్త నివసించిన కాలంలో ఇశ్రాయేలులో కరవు వచ్చింది. ఓ పేద విధవరాలు ఆయనకు ఆహారం పెట్టింది. అయితే ఆ కరవు కాలమంతటిలో అద్భుతరీతిగా ఆమె దగ్గరున్న కొంచెం పిండి, నూనె అయిపోలేదు. అంతమాత్రాన ఏలియా గానీ, ఆ విధవరాలు గానీ ధనవంతులు అయిపోలేదు; యెహోవా వారి కనీస అవసరాల్ని మాత్రమే తీర్చాడు.—1 రాజులు 17:8-16.
అనుకోని సంఘటనల వల్ల పేదరికం రావచ్చు. ప్రమాదాలు, అనారోగ్యం వల్ల ఒక వ్యక్తి కొంతకాలం పాటు లేదా అసలు ఎప్పటికీ పని చేయలేకపోవచ్చు. కొందరు తల్లిదండ్రులను, కొందరు భర్తలను పోగొట్టుకుని దిక్కులేని వారుకావచ్చు. ఇలాంటి కష్టాలొచ్చాయంటే దానర్థం దేవుని అనుగ్రహం లేదని కాదు. నయోమి, రూతు ఉదాహరణ యెహోవా బీదవారి గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూపిస్తుంది. నయోమి, రూతు ఇద్దరూ భర్తలను కోల్పోయి, దిక్కులేని వారైనా యెహోవా దేవుడు వారిని ఆదుకొని, వారి అవసరాలు తీరే ఏర్పాటు చేశాడు.—రూతు 1:1-6; 2:2-12; 4:13-17.
కాబట్టి బీదవారిగా ఉన్నంత మాత్రాన వారిపై దేవుని అనుగ్రహం లేదని కాదు. యెహోవా దేవునికి విశ్వాసంగా ఉండేవారు, “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు” అని దావీదు రాజు పలికిన మాటల్ని నమ్ముతారు.—కీర్తన 37:25. (w09 09/01)
[8వ పేజీలోని చిత్రం]
నయోమి, రూతు దిక్కులేని పేదవారైనా దేవుడు ప్రేమతో వారిని ఆదుకున్నాడు