బైబిల్లోని పదచిత్రాలు మీకు అర్థమవుతున్నాయా?
బైబిల్లోని పదచిత్రాలు మీకు అర్థమవుతున్నాయా?
వేల పదాలు తెలియజేయగల విషయాన్ని ఒక్క చిత్రం తెలియజేయగలదు. అయితే, కొన్నిసార్లు ఒకటి రెండు పదాలే ఒక చిత్రాన్ని చిత్రించగలవు. పదచిత్రాలు లేదా చదివే వ్యక్తి మనసులో ఒక చిత్రాన్ని చిత్రించే పదాలు బైబిలంతటిలో విస్తృతంగా ఉన్నాయి. a ఉదాహరణకు, యేసు కొండమీది ప్రసంగంలో దాదాపు 50 కన్నా ఎక్కువ పదచిత్రాలను ఉపయోగించాడు.
ఇలాంటి పదచిత్రాలను తెలుసుకోవాలనే ఆసక్తి మీకెందుకు ఉండాలి? వాటిని అర్థం చేసుకుంటే, బైబిలు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది, దేవుని వాక్యానికున్న విలువను గ్రహిస్తారు. అంతేకాదు, పదచిత్రాలను సరిగ్గా గ్రహిస్తే బైబిలు సందేశాన్ని మీరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. నిజానికి, బైబిల్లోని పదచిత్రాలను గ్రహించలేకపోతే విషయం గందరగోళంగా ఉంటుంది. అంతేకాదు, లేఖనాలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
పదచిత్రాలను అర్థం చేసుకోవడం
పదచిత్రం ఒక విషయాన్ని మరో విషయంతో పోలుస్తుంది. పోల్చబడుతున్న దాన్ని విషయం (ఉపమేయం) అంటారు. దేనితో పోలుస్తామో దాన్ని భావచిత్రం (ఉపమానం) అంటారు. ఈ రెండిటి మధ్యవున్న పోలికను సారూప్యత అంటారు. ఈ మూడిటిని గుర్తించి వాటిని అర్థం చేసుకుంటేనే ఒక పదచిత్రం అసలు అర్థాన్ని గ్రహించగలుగుతాం.
కొన్నిసార్లు విషయాన్ని, భావచిత్రాన్ని కొంచెం సులువుగానే గ్రహించవచ్చు. సారూప్యత విషయానికొస్తే అది ఎన్నో రకాలుగా ఉంటుంది. అయితే, పదచిత్రంలోవున్న అసలు సారూప్యతను ఎలా గుర్తించవచ్చు? అది వాడబడిన సందర్భాన్నిబట్టి గుర్తించవచ్చు. b
ఉదాహరణకు, సార్దీస్ సంఘానికి యేసు ఇలా చెప్పాడు: “నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను.” యేసు తన రాకను (విషయం) దొంగ (భావచిత్రం) రాకతో పోల్చాడు. ఇక్కడున్న సారూప్యత ఏమిటి? దీని సందర్భం సారూప్యతను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.” (ప్రకటన 3:3) వీటి మధ్యవున్న పోలిక ఆయన రాకకు కారణాన్ని తెలియజేయట్లేదు. ఆయన ఏదో దొంగతనం చేయడానికి వస్తాననీ చెప్పట్లేదు. బదులుగా అనుకోని విధంగా, అనుకోని సమయంలో రావడమే వీటి మధ్యవున్న సారూప్యత.
1 థెస్సలొనీకయులు 5:2) పౌలు రాసిన సందర్భం ఆ మాటల్లోని సారూప్యతను స్పష్టంగా చూపించట్లేదు. అయితే ఈ పదచిత్రాన్ని, ప్రకటన 3:3లో యేసు వాడిన పదచిత్రంతో పోలిస్తే సారూప్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ పదచిత్రం, నిజ క్రైస్తవులందరూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలని ఎంత ప్రభావవంతంగా గుర్తుచేస్తుందో కదా!
కొన్నిసార్లు, బైబిల్లోని ఒక భాగంలో ఉపయోగించబడిన పదచిత్రం మరో భాగంలోవున్న అదేలాంటి పదచిత్రాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, యేసు వాడిన పదచిత్రాన్నే అపొస్తలుడైన పౌలు కూడా వాడుతూ ఇలా రాశాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.” (దేవుని గురించి బోధించే పదచిత్రాలు
యెహోవా దేవుడు ఎలాంటివాడు, ఆయనకు ఏ సామర్థ్యాలున్నాయి అనేవాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం మనుషులకు సాధ్యం కాదు. ప్రాచీన కాలంలో దావీదు రాజు యెహోవా “మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది” అని రాశాడు. (కీర్తన 145:3) దేవుడు సృష్టించిన వాటిలో కొన్నిటిని పరిశీలించిన తర్వాత యోబు ఇలా అన్నాడు: “ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?”—యోబు 26:14.
మన పరలోక దేవుని గొప్పతనాన్ని మనం పూర్తిగా గ్రహించలేకపోయినా బైబిల్లోని పదచిత్రాలు ఆయన అద్భుత లక్షణాలను కొంతమేరకు గ్రహించడానికి మనకు సహాయం చేస్తాయి. యెహోవా మనం గౌరవించాల్సిన వ్యక్తిగా అంటే రాజుగా, శాసనకర్తగా, న్యాయాధిపతిగా, యోధునిగా వర్ణించబడ్డాడు. ఆయన మనం ప్రేమించగల వ్యక్తిగా అంటే కాపరిగా, ఉపదేశకునిగా, బోధకునిగా, తండ్రిగా, స్వస్థపరిచేవానిగా, రక్షకునిగా కూడా వర్ణించబడ్డాడు. (కీర్తన 16:7; 23:1; 32:8; 71:17; 89:26; 103:3; 106:21; యెషయా 33:22; 42:13; యోహాను 6:45) సులభంగా అర్థమయ్యే ఈ వర్ణనలన్నీ ఎన్నో సారూప్యతలున్న చాలా విషయాలను మనకు గుర్తుచేస్తాయి. అలాంటి పదచిత్రాలు, వేల పదాలు తెలియజేయగల దానికన్నా ఎంతో ఎక్కువే తెలియజేస్తాయి.
బైబిలు, యెహోవాను నిర్జీవ వస్తువులతో కూడా పోలుస్తోంది. ఆయన “ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గము,” “శైలము,” “కోట” అని వర్ణించబడ్డాడు. (2 సమూయేలు 23:3; కీర్తన 18:2; ద్వితీయోపదేశకాండము 32:4) వాటిలోవున్న సారూప్యతలు ఏమిటి? ఎలాగైతే ఒక దుర్గము బలంగా పునాదివేయబడి, కదలకుండా ఉంటుందో అలాగే యెహోవా దేవుడు కూడా ఒక దుర్గంలా మీకు భద్రతనిస్తాడు.
కీర్తనల గ్రంథం, యెహోవా ఎలాంటి దేవుడు అనేదాని గురించి అనేక వివరాలు తెలియజేసే పదచిత్రాలతో నిండివుంది. ఉదాహరణకు, యెహోవా ‘సూర్యుడు, కేడెము’ అని కీర్తన 84:11 చెప్తోంది. ఎందుకంటే, యెహోవాయే వెలుగుకు, జీవానికి, శక్తికి, భద్రతకు మూలం. దీనికి భిన్నంగా, “నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును” అని కీర్తన 121:5 చెప్తోంది. నీడగల చోటు ఎలాగైతే మిమ్మల్ని ఎండనుండి కాపాడుతుందో, అలాగే యెహోవా కూడా తన సేవకులకు తన “చేతి” కింద లేదా తన “రెక్కల” కింద నీడలాంటి రక్షణనిస్తూ వారిని విపత్తుల వేడినుండి కాపాడతాడు.—యెషయా 51:16; కీర్తన 17:8; 36:7.
యేసును వర్ణించే పదచిత్రాలు
బైబిలు యేసును ఎన్నోసార్లు “దేవుని కుమారుడు” అని పేర్కొంటోంది. (యోహాను 1:34; 3:16-18) దేవునికి అక్షరార్థమైన భార్యలేదు, ఆయన మానవుడు కాదు కాబట్టి, క్రైస్తవులు కానివారికి దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. మనుషులు పిల్లల్ని కన్నట్లు దేవుడు పిల్లల్ని కనడు. కాబట్టి, “దేవుని కుమారుడు” అనే ఈ వర్ణన ఒక పదచిత్రం. ఒక మానవ కుమారునికి తన తండ్రితో ఎలాంటి సంబంధం ఉంటుందో యేసుకు దేవునితో అలాంటి సంబంధం ఉందని పాఠకుడు అర్థం చేసుకోవడానికి ఈ పదచిత్రం వాడబడింది. అంతేకాదు, యేసును యెహోవా సృష్టించాడు కాబట్టి ఆయనకు జీవమిచ్చింది యెహోవాయే అని కూడా ఈ పదచిత్రం నొక్కిచెప్తోంది. అదేవిధంగా, మొదటి మానవుడైన ఆదాము కూడా “దేవునికి కుమారుడు” అని వర్ణించబడ్డాడు.—లూకా 3:38.
దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తను నిర్వర్తించాల్సిన వివిధ పాత్రలను వర్ణించడానికి యేసు పదచిత్రాలను ఉపయోగించాడు. ఉదాహరణకు, “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు” అని ఆయన అన్నాడు. ఆ తర్వాత తన శిష్యులను ద్రాక్షతీగలతో పోల్చాడు. (యోహాను 15:1, 4) ఈ పదచిత్రం ఏ ప్రాముఖ్యమైన విషయాలను నేర్పిస్తోంది? నిజమైన ద్రాక్షతీగలు సజీవంగా ఉండి ఫలించాలంటే ద్రాక్షవల్లిని అంటుకొని ఉండాలి. అలాగే, క్రీస్తు శిష్యులు కూడా ఆయనతో ఏకమై ఉండాలి. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” అని యేసు అన్నాడు. (యోహాను 15:5) ద్రాక్షతోటను నాటిన వ్యక్తి ఎలాగైతే ద్రాక్షవల్లులు ఫలాన్నివ్వాలని ఆశిస్తాడో అలాగే యెహోవా దేవుడు కూడా క్రీస్తుతో ఏకమైవున్నవాళ్లు ఆధ్యాత్మిక ఫలాలను ఫలించాలని ఆశిస్తాడు.—యోహాను 15:8.
సారూప్యతలను సరిగ్గా అర్థం చేసుకోండి
సారూప్యతను అర్థం చేసుకోకుండా ఒక పదచిత్రాన్ని చదివితే మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు రోమా 12:20 లోని ఈ మాటల్నే తీసుకోండి: “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.” శత్రువు తలమీద నిప్పులు కుప్పగా పోయడమంటే కక్ష తీర్చుకోవడమని అర్థమా? కాదు, సారూప్యతను గ్రహిస్తే విషయం అది కాదని అర్థమౌతుంది. లోహాలను కరిగించే ప్రాచీన ప్రక్రియ ఆధారంగా ఈ పదచిత్రం వచ్చింది. లోహాన్ని కరిగించేందుకు దాన్ని నిప్పులమీద పెట్టేవారు. అలా పెట్టిన తర్వాత ఆ లోహంపైన కూడా నిప్పులను కుప్పగా పోసేవారు. ఈ ప్రక్రియవల్ల లోహం కరిగి దానిలోవున్న మలినాలన్నీ పోయి అది శుద్ధమయ్యేది. అలాగే, మనం దయగా వ్యవహరించినప్పుడు ఒక వ్యక్తి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, అతను మంచి గుణాలను అలవర్చుకుంటాడు.
పదచిత్రాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మనం ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తాం, అంతేకాదు మన హృదయం కూడా స్పందిస్తుంది. బైబిలు, పాపాన్ని అప్పుతో పోల్చినప్పుడు మనం అది ఎంత బరువైనదో అర్థం చేసుకుంటాం. (లూకా 11:4) కానీ, యెహోవా మనల్ని క్షమించి మనం తీర్చాల్సిన అప్పును కొట్టేస్తే మనకెంత ఉపశమనం కలుగుతుందో కదా! మన “పాపములకు ప్రాయశ్చిత్తము” చేస్తాడనీ లేదా పలక మీద రాసినదాన్ని తుడిచేసినట్లు పాపాలను ‘తుడిచివేస్తాడనీ’ అన్నప్పుడు, యెహోవా భవిష్యత్తులో మన పాపాలను మళ్లీ ఎన్నడూ గుర్తు చేసుకోడనే హామీ మనకివ్వబడుతోంది. (కీర్తన 32:1, 2; అపొస్తలుల కార్యములు 3:19, 20) రక్తమంత ఎర్రగావున్న మన పాపాలను యెహోవా మంచంత తెల్లగా చేయగలడని తెలుసుకోవడం మనకెంత ఓదార్పునిస్తుంది!—యెషయా 1:18.
దేవుని వాక్యమైన బైబిల్లోవున్న వందలాది పదచిత్రాల్లో ఇవి కొన్ని మాత్రమే. కాబట్టి మీరు బైబిలు చదువుతున్నప్పుడు పదచిత్రాలను జాగ్రత్తగా గమనించండి. సమయం వెచ్చించి వాటిలోవున్న సారూప్యతను సరిగ్గా అర్థం చేసుకోండి, వాటిని ధ్యానించండి. అలా చేస్తే బైబిలు లేఖనాలపట్ల మీకున్న అవగాహన పెరుగుతుంది, దేవుని వాక్యానికున్న విలువను గ్రహిస్తారు. (w09 5/1)
[అధస్సూచీలు]
a ఈ ఆర్టికల్‌లో ఉపయోగించబడినట్లుగా “పదచిత్రం” అనే పదం, అన్ని రకాల అలంకారాలను అంటే రూపకాలంకారాలను, ఉపమాలంకారాలను లేదా సూచనార్థకమైన ఇతర పదప్రయోగాలను సూచిస్తుంది.
b యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే రెండు సంపుటిల బైబిలు సర్వసంగ్రహ నిఘంటువు నేపథ్య సమాచారాన్ని అందిస్తుంది. ఆ సమాచారం, సారూప్యతలను అర్థం చేసుకోవడానికి చాలావరకు సహాయం చేస్తుంది.
[19వ పేజీలోని బాక్సు]
పదచిత్రాలు ఎలా సహాయం చేస్తాయి?
పదచిత్రాలు మనకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాయి. సాధారణంగా, గ్రహించడానికి కష్టమయ్యే ఒక విషయాన్ని సులభంగా అర్థమయ్యే దానితో పోల్చవచ్చు. ఒక విషయంలోవున్న వివిధ అంశాలను విడమర్చి చెప్పడానికి ఒకటికన్నా ఎక్కువ పదచిత్రాలను ఉపయోగించవచ్చు. ప్రాముఖ్యమైన విషయాలను పదచిత్రాలతో నొక్కిచెప్పవచ్చు లేదా మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేయవచ్చు.
[20వ పేజీలోని బాక్సు]
వివిధ అంశాలను గుర్తించండి
పదచిత్రం: “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు.” (మత్తయి 5:13)
విషయం: మీరు (యేసు శిష్యులు)
భావచిత్రం: ఉప్పు
ఈ సందర్భంలోవున్న సారూప్యత: పాడుకాకుండా కాపాడే సామర్థ్యం
పాఠం: ఎంతోమంది ప్రాణాలను కాపాడే సందేశం శిష్యుల దగ్గర ఉంది
[21వ పేజీలోని బ్లర్బ్]
“యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు.”—కీర్తన 23:1