కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం

మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం

మీరు మీ ప్రాంతంలోవున్న యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని చూసి ‘ఇందులో ఏమి జరుగుతుందో’ అని అనుకునే ఉంటారు. ప్రతీవారం జరిగే వాళ్ల కార్యక్రమాలకు ఎవరైనా రావచ్చని మీకు తెలుసా? మిమ్మల్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

అయితే, మీకు కొన్ని సందేహాలు ఉండొచ్చు. యెహోవాసాక్షులు ఎందుకలా కలుసుకుంటారు? వాళ్ల రాజ్యమందిరంలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి? వాళ్ల కార్యక్రమాలకు వచ్చిన యెహోవాసాక్షులుకాని ఇతరులు వాటి గురించి ఏమి చెప్తున్నారు?

‘ప్రజల్ని సమావేశపర్చండి’

వేల సంవత్సరాలుగా ప్రజలు దేవున్ని ఆరాధించడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి సమావేశమవుతూనే ఉన్నారు. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులకు దేవుడు ఇలా చెప్పాడు: ‘పురుషులను, స్త్రీలను, చిన్నపిల్లలను, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులను అందరినీ సమావేశపర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించడం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వాళ్లు జాగ్రత్తగా విధేయులవుతారు.’ (ద్వితీయోపదేశకాండము 31:12, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అలా, యెహోవా దేవున్ని ఆరాధించాలనీ ఆయనకు విధేయత చూపించాలనీ ఇశ్రాయేలీయుల్లోని పెద్దవాళ్లకేకాక పిల్లలకు కూడా బోధించబడింది.

శతాబ్దాలు గడిచాక, క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు నిజమైన ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగంగానే కొనసాగుతూ వచ్చాయి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కానీ మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం.” (హెబ్రీయులు 10:24, 25, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కుటుంబంలోనివాళ్లు కలిసి సమయం గడిపినప్పుడు ఎలాగైతే వాళ్లమధ్య సంబంధాలు మెరుగవుతాయో అలాగే క్రైస్తవులు ఆరాధన కోసం కలుసుకున్నప్పుడు దేవున్ని సేవించాలని కోరుకుంటున్న ప్రజలమధ్య ప్రేమ బలపడుతుంది.

లేఖనాల్లోని ఈ ఉదాహరణల ప్రకారంగానే, యెహోవాసాక్షులు వారానికి రెండుసార్లు తమ రాజ్యమందిరాల్లో కలుసుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమాలు, బైబిలు సూత్రాలు ఎంత విలువైనవో తెలుసుకొని, వాటిని అర్థం చేసుకొని పాటించడానికి అక్కడికి వచ్చినవాళ్లకు సహాయం చేస్తాయి. వీలైనంతవరకు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ల కార్యక్రమాలన్నీ ఒకేలా జరుగుతాయి. ఒక్కో కార్యక్రమంవల్ల ఒక్కో ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యక్రమాలకు ముందు, అవి ముగిసిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ‘పరస్పరం ప్రోత్సహించుకుంటారు.’ (రోమీయులు 1:12, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) వాళ్ల రాజ్యమందిరాల్లో అసలు ఏయే కార్యక్రమాలు జరుగుతాయి?

బైబిలు ప్రసంగం

బైబిలు ప్రసంగం

రాజ్యమందిరానికి మొదటిసారి వచ్చేవాళ్ళు సాధారణంగా ఈ కార్యక్రమానికే వస్తారు. సాధారణంగా వారాంతంలో జరిగే ఈ కార్యక్రమం ప్రజల కోసం రూపొందించబడింది. యేసుక్రీస్తు తరచూ బహిరంగ ప్రసంగాలు ఇచ్చాడు, వాటిలో ఆయన కొండ మీద ఇచ్చిన ప్రసంగం ప్రసిద్ధమైనది. (మత్తయి 5:1; 7:28, 29) అపొస్తలుడైన పౌలు కూడా ఏథెన్సు ప్రజల ముందు ప్రసంగించాడు. (అపొస్తలుల కార్యములు 17:22-34) అలాగే యెహోవాసాక్షుల కార్యక్రమాల్లో ఒక బైబిలు ప్రసంగం ప్రజల కోసం రూపొందించబడింది, చాలామంది మొదటిసారి ఈ కార్యక్రమానికే వస్తారు.

ప్రతీ కార్యక్రమం యెహోవాకు స్తుతిగీతాలు పాడండి a అనే బ్రోషురులో నుండి ఒక పాట పాడడంతో ప్రారంభమవుతుంది. లేచి నిలబడి పాడాలనుకునే వాళ్ళందరూ పాడవచ్చు. ఒక చిన్న ప్రార్థన తర్వాత, సమర్థుడైన ఒక ప్రసంగీకుడు 30 నిమిషాల ప్రసంగం ఇస్తాడు. (“ అందరికీ ఉపయోగపడే ప్రసంగాంశాలు” అనే బాక్సు చూడండి.) ఆయన ప్రసంగం పూర్తిగా బైబిలుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రసంగిస్తున్న సమయంలో సంబంధిత లేఖనాలను చదువుతున్నప్పుడు తనతోపాటు బైబిలు తెరిచి చూడమని ఆయన ప్రేక్షకులను ప్రోత్సహిస్తాడు. కాబట్టి మీరు మీ సొంత బైబిల్ని తీసుకెళ్లవచ్చు, లేదా కార్యక్రమం మొదలుకాకముందు ఒక బైబిలు ఇవ్వమని యెహోవాసాక్షుల్లో ఎవరినైనా ఒకరిని అడగవచ్చు.

కావలికోట అధ్యయనం

“కావలికోట” అధ్యయనం

దాదాపు యెహోవాసాక్షుల సంఘాలన్నిటిలో బహిరంగ ప్రసంగం తర్వాత కావలికోట అధ్యయనం ఉంటుంది, అది ఒక బైబిలు అంశంపై గంటపాటు సాగే ప్రశ్నజవాబుల చర్చ. ఈ కార్యక్రమం, పౌలు కాలంలో ‘ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి లేఖనాలను పరిశోధించిన,’ బెరయ అనే పట్టణంలోని ప్రజలు చేసినట్టు చేయమని అక్కడికి వచ్చినవాళ్లను ప్రోత్సహిస్తుంది.—అపొస్తలుల కార్యములు 17:11.

కావలికోట అధ్యయనం పాటతో మొదలౌతుంది. అధ్యయనాన్ని నిర్వహించే వ్యక్తి వేసే ప్రశ్నలు, చర్చించే సమాచారం ఈ పత్రిక పేరుతోనే ఉన్న అధ్యయన సంచికలో ఉంటాయి. ఈ సంచికను, మీరు యెహోవాసాక్షుల్లో ఎవరినైనా ఒకరిని అడిగి తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో, “తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి,” “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు,” “బాధలన్నీ త్వరలోనే ఎందుకు అంతమవుతాయి?” వంటి అంశాలు చర్చించబడ్డాయి. ఈ కార్యక్రమం ప్రశ్నాజవాబుల చర్చలా జరిగినా జవాబులు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరు. సాధారణంగా ఆర్టికల్‌ను, ఆర్టికల్‌లో ఇవ్వబడిన లేఖనాలను ముందే చదివి వాటి గురించి ఆలోచించినవారే జవాబులు ఇస్తారు. ఆ కార్యక్రమం పాట, ప్రార్థనతో ముగుస్తుంది.—మత్తయి 26:30; ఎఫెసీయులు 5:19.

సంఘ బైబిలు అధ్యయనం

సంఘ బైబిలు అధ్యయనం

యెహోవాసాక్షులు వారంలో మరో రోజు సాయంత్రం రాజ్యమందిరంలో మళ్లీ కలుసుకుంటారు. అప్పుడు గంట 45 నిమిషాలపాటు ఉండే మూడుభాగాల కార్యక్రమం జరుగుతుంది. మొదట, 25 నిమిషాలపాటు సంఘ బైబిలు అధ్యయనం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వచ్చినవాళ్లు బైబిలుతో బాగా సుపరిచితులౌతారు, తమ ఆలోచనా దృక్పథాన్ని సరిచేసుకోగలుగుతారు, క్రీస్తు శిష్యులుగా తీర్చిదిద్దబడతారు. (2 తిమోతి 3:16, 17) కావలికోట అధ్యయనంలాగే ఇది కూడా ఒక బైబిలు అంశంపై జరిగే ప్రశ్నాజవాబుల చర్చ. వ్యాఖ్యానాలు ఇవ్వాలనుకునేవాళ్లు ఇవ్వవచ్చు. ఈ బైబిలు అధ్యయనం సాధారణంగా యెహోవాసాక్షులు ప్రచురించిన ఒక పుస్తకం నుండి గానీ బ్రోషురు నుండి గానీ జరుగుతుంది.

అయితే, అలాంటి బైబిలు పుస్తకాలను లేదా బ్రోషురులను వారెందుకు ఉపయోగిస్తారు? బైబిలు కాలాల్లో, కేవలం బైబిలు చదివి వినిపించడం మాత్రమే కాక దాని ‘తాత్పర్యం తెలియజేసి, జనులు బాగా గ్రహించేలా దానికి అర్థం చెప్పేవారు.’ (నెహెమ్యా 8:8) ఇటీవలి సంవత్సరాల్లో యెషయా, దానియేలు, ప్రకటన వంటి గ్రంథాలను వివరించే పుస్తకాలు వారి కార్యక్రమాల్లో చర్చించబడ్డాయి. అవి బైబిల్లోని ఈ గ్రంథాలను అర్థం చేసుకునేందుకు అక్కడికి వచ్చినవాళ్లకు సహాయం చేశాయి.

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల

సంఘ బైబిలు అధ్యయనం తర్వాత, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అనే కార్యక్రమం ఉంటుంది. 30 నిమిషాలపాటు జరిగే ఈ కార్యక్రమం, క్రైస్తవులు ‘బోధనా కళను’ పెంచుకోవడానికి సహాయం చేసేందుకు రూపొందించబడింది. (2 తిమోతి 4:2, NW) ఉదాహరణకు, మీ పిల్లలుగానీ మీ స్నేహితులుగానీ దేవుని గురించి లేదా బైబిలు గురించి ప్రశ్నలు అడిగినప్పుడు సంతృప్తికరమైన జవాబివ్వడం మీకు కష్టమనిపించిందా? అలాంటి కష్టమైన ప్రశ్నలకు ప్రోత్సాహకరమైన, బైబిలు ఆధారం ఉన్న జవాబులు ఎలా ఇవ్వాలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమం మీకు నేర్పిస్తుంది. అప్పుడు, ‘అలసినవాళ్లను మాటలతో ఊరడించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేశాడు’ అని చెప్పిన యెషయా అనే ప్రవక్తలాగే మనమూ చెప్పగలుగుతాం.—యెషయా 50:4.

దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మొదటిగా బైబిలు భాగం ఆధారంగా ఒక ప్రసంగం ఇవ్వబడుతుంది. ఆ కార్యక్రమానికి వచ్చేవాళ్లు ఆ వారానికి నియమించబడిన బైబిలు భాగాలను ముందుగానే చదివి వస్తారు. ప్రసంగం ముగింపులో ప్రసంగీకుడు ఆ వారంలో చదివిన బైబిలు భాగంలో తమకు ప్రయోజనకరమైనవని అనిపించిన అంశాల గురించి క్లుప్తంగా వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడుగుతాడు. దీని తర్వాత పాఠశాలలోని మిగతా భాగాల కోసం నియమించబడిన విద్యార్థులు తమతమ భాగాలను నిర్వర్తిస్తారు.

విద్యార్థులకు వేదికపై నుండి ఒక బైబిలు భాగాన్ని చదివే లేదా ఒక బైబిలు అంశాన్ని ఓ వ్యక్తికి ఎలా వివరించాలో చూపించే నియామకాలు ఇవ్వబడతాయి. ప్రతీ ప్రసంగం తర్వాత దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకం ఆధారంగా ఒక అనుభవంగల సలహాదారుడు విద్యార్థులు సమర్థవంతంగా నిర్వర్తించిన వాటిని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆయన ప్రసంగం ఇచ్చిన వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకొని ఇంకా మెరుగ్గా చేయడానికి సలహాలు ఇస్తాడు.

అరగంట మాత్రమే ఉండే ఈ కార్యక్రమం, దానిలో ప్రసంగాలిచ్చినవాళ్లకే గాక ఆ కార్యక్రమానికి వచ్చి తమ చదివే, మాట్లాడే, బోధించే సామర్థ్యాలను పెంచుకోవాలని అనుకునే వాళ్ళందరికీ సహాయం చేసే విధంగా రూపొందించబడింది. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ముగిసిన తర్వాత బైబిలు లేఖనాల ఆధారంగా తయారు చేయబడిన పాట పాడడంతో సేవాకూటం మొదలౌతుంది.

సేవాకూటం

సేవాకూటం

సేవాకూటమే ఆ రోజు కార్యక్రమంలోని చివరి భాగం. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు బైబిలు సత్యాన్ని సమర్థవంతంగా బోధించడాన్ని నేర్చుకునేందుకు దానిలో ఉండే ప్రసంగాలు, ప్రదర్శనలు, ఇంటర్వ్యూలు, చర్చలు సహాయం చేస్తాయి. యేసు తన శిష్యులను ప్రకటనాపనికి పంపించేముందు వాళ్లనందరినీ సమకూర్చి వాళ్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. (లూకా 10:1-16) అలా వాళ్లు ప్రకటనాపనికి పూర్తిగా సిద్ధపడి వెళ్లడంతో వాళ్లకెన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత, వాళ్ళు తిరిగివచ్చి జరిగినవన్నీ ఆయనకు చెప్పారు. (లూకా 10:17) తమకు ఎదురైన అనుభవాలను తరచూ ఒకరితో ఒకరు పంచుకున్నారు.—అపొస్తలుల కార్యములు 4:23; 15:4.

ముప్పయి అయిదు నిమిషాలపాటు జరిగే ఈ సేవాకూటంలోని కార్యక్రమాలు ప్రతీ నెల ప్రచురించబడే మన రాజ్య పరిచర్యలో ఉంటాయి. ఇటీవల, “ఒక కుటుంబంగా యెహోవాను ఆరాధించడం,” “మనం పదే పదే ఎందుకు తిరిగి వెళతాం?” “మీ పరిచర్యలో క్రీస్తును అనుకరించండి” వంటి అంశాలు పరిశీలించబడ్డాయి. ఈ కార్యక్రమం ముగింపులో ఒక పాట పాడతారు. ఆ తర్వాత సంఘంలోని ఒక సభ్యుడు ప్రార్థన చేస్తాడు. దాంతో కార్యక్రమం ముగుస్తుంది.

ఈ కార్యక్రమాలకు వచ్చినవాళ్ల అభిప్రాయాలు

సంఘంలోనివాళ్లు వచ్చిన ప్రతీ ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తారు. ఉదాహరణకు, ఆండ్రూ అనే యువకుడు యెహోవాసాక్షుల గురించి తప్పుగా విన్నాడు. కానీ, మొదటిసారి వాళ్ల కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయనను వారు ఆహ్వానించిన తీరు చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆండ్రూ దాని గురించి ఇలా అంటున్నాడు: “అక్కడికి వెళ్లినప్పుడు నేను చాలా సంతోషించాను. వాళ్లు స్నేహపూర్వకంగా నాపైన నిజమైన శ్రద్ధ చూపించడాన్నిబట్టి నేనెంతో ఆశ్చర్యపోయాను.” కెనడాకు చెందిన ఆషెల్‌ అనే యౌవనస్థురాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ఇలా అంది: “అక్కడ జరిగిన కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా ఉంది. విషయాలన్నీ సులభంగా అర్థం చేసుకోగలిగాను.”

బ్రెజిల్‌లో నివసిస్తున్న జూజే అనే వ్యక్తికి కోపిష్ఠివాడనే పేరుంది. అయినా ఆ ప్రాంతంలోవున్న రాజ్యమందిరానికి రమ్మని యెహోవాసాక్షులు ఆయన్ని ఆహ్వానించారు. ఆయనిలా అంటున్నాడు: “నా ప్రవర్తన ఎలాంటిదో తెలిసి కూడా రాజ్యమందిరంలోనివాళ్లు నన్నెంతో ఆప్యాయంగా ఆహ్వానించారు.” జపాన్‌లో నివసిస్తున్న అట్సూషి ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నిజమే, నేను మొదటిసారి యెహోవాసాక్షుల కార్యక్రమానికి వెళ్లినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా, వీళ్లు కూడా సాధారణమైన ప్రజలేనని నాకు తెలిసింది. నేనూ వాళ్లలో ఒకడినని అనుకునేలా చేయడానికి వాళ్లెంతో ప్రయత్నించారు.”

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం

పైన వ్యక్తం చేయబడిన అభిప్రాయాలు చూపిస్తున్నట్లు రాజ్యమందిరంలో జరిగే కార్యక్రమాలకు రావడం నిజంగా మంచి అనుభూతినిస్తుంది. మీరు దేవుని గురించి తెలుసుకోగలుగుతారు, బైబిలు ఆధారంగా అక్కడ ఇవ్వబడే ఉపదేశాల ద్వారా యెహోవా దేవుడు ‘మీకు ప్రయోజనం’ చేకూరేలా బోధిస్తాడు.—యెషయా 48:17.

యెహోవాసాక్షుల కార్యక్రమాలకు రావడానికి మీరు డబ్బులేమీ చెల్లించాల్సిన అవసరం లేదు, చందాలు వసూలు చేయబడవు. మీ ప్రాంతంలోవున్న యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో జరిగే కార్యక్రమాలకు మీరు రావాలనుకుంటున్నారా? అలాగైతే, మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. (w09 2/1)

a ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ప్రచురణలన్నీ యెహోవాసాక్షులు ప్రచురించినవే.