“నా అదృష్టం బాగుండి బ్రతికాను!”
“నా అదృష్టం బాగుండి బ్రతికాను!”
చెత్త లారీ నడుపుతున్న ఒక డ్రైవరు దాన్ని అదుపుచేయలేకపోవడంతో, ఆ లారీ రోడ్డుపక్కన నడుస్తున్న ఒక జంటను, 23 ఏళ్ల ఒక యువకుణ్ణి గుద్దేసింది. దాంతో ఆ జంట అక్కడికక్కడే చనిపోయిందనీ ఆ యువకుడు స్పృహ కోల్పోయాడనీ న్యూయార్క్ నగరంలోని ఒక వార్తాపత్రిక నివేదించింది. స్పృహ వచ్చిన తర్వాత జరిగింది చూసి ఆ యువకుడు, ‘అసలిదంతా ఎలా జరిగిందో అర్థంకావట్లేదు. దేవుడా నన్ను రక్షించు’ అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత తేరుకొని, “నా అదృష్టం బాగుండి బ్రతికాను!” అన్నాడు.
మీరు ఇలాంటి కథనాలు వినేవుంటారు. ఒక వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పితే, ‘అతని అదృష్టం బాగుండి బ్రతికాడు’ అంటారు. అదే ఒక వ్యక్తి ఘోర ప్రమాదంలో చనిపోతే, ‘అలా రాసిపెట్టివుంది’ అనో ‘దైవ నిర్ణయంవల్లే అలా జరిగింది’ అనో అంటారు. అలా జరగడానికి కారణం విధి, అదృష్టం, తలరాత, దైవ నిర్ణయం అని ప్రజలు రకరకాలుగా అన్నా వారి నమ్మకం మాత్రం ఒక్కటే. వారి జీవితంలో జరిగే సంఘటనలు, వాటి పరిణామాలు ముందే నిర్ణయించబడ్డాయనీ ఇక తమ చేతుల్లో ఏమీ లేదనీ వారు నమ్ముతారు. అయితే, ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే కాదు ఇతర సందర్భాల్లో కూడా అలాగే అంటుంటారు. నిజానికి ప్రజల్లో ఈ నమ్మకం ఎప్పటినుంచో ఉంది.
ఉదాహరణకు, పూర్వకాలంలోని బబులోను ప్రజల విషయమే తీసుకోండి. నక్షత్రాలు, వాటి కదలికలవల్లే మనుషుల రోజువారీ వ్యవహారాలు ఫలాని విధంగా జరుగుతాయని వాళ్ళు నమ్మేవాళ్ళు. కాబట్టి నక్షత్రాల ఆధారంగా రాశి ఫలాలను, శకునాలను చూసి వాటి ప్రకారం పనులు చేసుకునేవాళ్ళు. గ్రీసు, రోమా దేశస్థులు విధి దేవతలను పూజించేవాళ్ళు. ఈ దేవతలకు జీయస్, జూపిటర్ అనే ముఖ్య దేవుళ్ళు నిర్ణయించిన విధిని అంటే అది మంచే గానీ, చెడే గానీ దాన్ని మార్చేశక్తి ఉన్నట్టు నమ్మేవాళ్ళని తెలుస్తుంది.
ప్రాచ్యదేశాల్లోని హిందువులు, బౌద్ధులు ఒక వ్యక్తి గత జన్మలో చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడనీ ఇప్పుడు చేస్తున్నదానికి వచ్చే జన్మలో అనుభవిస్తాడనీ నమ్ముతారు. చర్చీకెళ్ళే చాలామంది క్రైస్తవులతో సహా ఇతర మతస్థులు కూడా విధి సిద్ధాంతాన్ని నమ్మడం ద్వారా దేవుడు అంతా ముందే నిర్ణయించాడనే నమ్మకాన్ని ఒప్పుకుంటున్నారు.
అందుకే, ఎంతో జ్ఞానం పెరిగిందనుకుంటున్న మన ఆధునిక యుగంలో చాలామంది తమ ప్రస్తుత పరిస్థితి, తమ జీవితాల్లో ప్రతీరోజూ జరిగే సంఘటనలు, చివరకు వారికి జరిగేది, ఇవన్నీ విధి చేతుల్లోనే ఉన్నాయనీ దాన్ని తాము మార్చలేమనీ ఇప్పటికీ
నమ్ముతున్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. మీ నమ్మకం అదేనా? మన జీవితంలోని సంఘటనలు, జయాపజయాలు, చివరికి జనన మరణాలు నిజంగా ముందే నిర్ణయించబడ్డాయా? మీ జీవితం విధి చేతుల్లో ఉందా? ఈ ప్రశ్నలకు బైబిలు ఏమి జవాబిస్తుందో చూద్దాం. (w09 3/1)[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Ken Murray/New York Daily News