కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో స్పష్టమవుతున్న దేవుని జ్ఞానం

సృష్టిలో స్పష్టమవుతున్న దేవుని జ్ఞానం

సృష్టిలో స్పష్టమవుతున్న దేవుని జ్ఞానం

‘ఆయన భూ జంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచున్నాడు.’​—⁠యోబు 35:11.

పక్షులకు అద్భుతమైన సామర్థ్యాలున్నాయి. అవి గాల్లో సునాయాసంగా చేసే విన్యాసాలను చూసి విమాన రూపకర్తలు సహితం అచ్చెరువొందుతారు. కొన్ని జాతుల పక్షులు ఎలాంటి గుర్తులుండని మహా సముద్రంగుండా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి, దారితప్పిపోకుండా వాటి గమ్యానికి చేరుకుంటాయి.

పక్షులకున్న మరో విశిష్టమైన సామర్థ్యం శబ్దాల ద్వారా, పాటల ద్వారా సమాచారాన్ని అందించుకోవడం. వాటికున్న ఈ సామర్థ్యం వాటి సృష్టికర్త జ్ఞానాన్ని తెలియ​జేస్తుంది. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

పక్షిభాష

కొన్ని జాతుల పక్షులు, గుడ్డు లోపల ఉన్నప్పుడే అవి ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటాయి. ఉదాహరణకు, ఆడ కౌజుపిట్ట (క్వైల్‌) రోజుకొకటి చొప్పున దాదాపు ఎనిమిది గుడ్లు పెడుతుంది. అయితే అది గుడ్లు పెట్టిన క్రమంలోనే పక్షిపిల్లలు ఎదిగితే, అవి ఎనిమిది రోజుల కాలవ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటిగా బయటకు వస్తాయి. అలా జరిగితే, దాదాపు వారం క్రితం బయటకు వచ్చిన పక్షిపిల్లలను చూసుకుంటూ మిగతా గుడ్లను పొదగాలంటే తల్లిపక్షికి కష్టమవుతుంది. కానీ అలా జరగదు. ఎనిమిది గుడ్లలోని పిల్లలూ ఆరుగంటల వ్యవధిలో బయటకు వస్తాయి. అదెలా సాధ్యం? దానికి పరిశోధకులు సూచిస్తున్న ఒక ముఖ్య కారణమేమిటంటే, పక్షిపిల్లలు పిండ​దశలో ఉన్నప్పుడే ఒకదానికొకటి సంకేతాలు పంపుకుని, అన్నీ దాదాపు ఒకే​సమయంలో బయటకు వస్తాయి.

ఎదిగిన పక్షుల్లో సాధారణంగా మగపక్షి పాడుతుంది. అది ముఖ్యంగా జతకట్టే సమయాల్లో ఫలానా ప్రాంతం తనది అని తెలియజేయడానికి, ఆడ పక్షిని ఆకర్షించడానికి అలా పాడుతుంది. చెప్పాలంటే వేలకొలది పక్షి జాతుల్లో ఒక్కొక్కజాతికి ఒక్కొక్క భాషవుంది, దీనివల్ల ఆడ​పక్షులు తమజాతి మగపక్షులను గుర్తుపట్టగలుగుతాయి.

పక్షులు ఎక్కువగా సూర్యోదయాన లేదా సూర్యాస్తమయాన పాడుతుంటాయి. దానికి మంచి కారణమే ఉంది. ఆ సమయాల్లో గాలి ఎక్కువగా వీయదు, పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. పక్షుల పాటలు మధ్యాహ్నంకన్నా ఉదయం, సాయంకాలం దాదాపు 20 రెట్లు స్పష్టంగా వినిపిస్తాయని పరిశోధకులు కనిపెట్టారు.

పక్షుల్లో ఎక్కువగా మగ పక్షులే పాడతాయి. అయితే ఆడవి, మగవి రెండూ విభిన్నమైన, విలక్షణమైన శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు ఛాఫించ్‌ పక్షులు తొమ్మిది రకాల శబ్దాలు చేస్తాయి. అవి ఇతర పక్షులనుండి ముంచుకొస్తున్న ప్రమాదం గురించి హెచ్చరించడానికి ఒక​రకంగా, జంతువుల నుండి రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి మరోరకంగా అరుస్తాయి.

ఒక అద్భుతమైన వరం

పక్షులకున్న సహజజ్ఞానం ఎంతో అద్భుతమైనదే. కానీ మానవునికున్న సంభాషణా నైపుణ్యం ఇంకా అద్భుతమైనది. దేవుడు మనుష్యులను ‘ఆకాశపక్షులకంటె ఎక్కువ జ్ఞానముతో’ సృష్టించాడని యోబు 35:⁠11 చెబుతోంది. అర్థంచేసుకోవడానికి కష్టంగా ఉండే, క్లిష్టమైన ఆలోచనలను, ఉద్దేశాలను మాటలద్వారా, సంజ్ఞల ద్వారా తెలియజేసే సామర్థ్యం కేవలం మానవులకే ఉంది.

కష్టమైన భాషలు నేర్చుకునే సామర్థ్యం పిల్లల్లో పుట్టినప్పటి నుండే ఉంటుంది, అయితే ఇతర ప్రాణుల్లో ఆ సామర్థ్యం ఉండదు. అమెరికన్‌ సైంటిస్ట్‌ అనే ఇంటర్నెట్‌ పత్రిక ఇలా చెబుతోంది: “తప్పటడుగులు వేసే పిల్లవాడు, తల్లిదండ్రులు తనతో నేరుగా మాట్లాడకపోయినా భాష నేర్చుకోగలడు. వినికిడి లోపంవున్న పిల్లలు ఇంట్లో తమకెవ్వరూ సంజ్ఞా భాష నేర్పించక​పోయినా తమ సొంత సంజ్ఞా భాషను సృష్టించుకోగలరు.”

మన ఆలోచనలను, భావాలను మాటలద్వారా లేదా సంజ్ఞల ద్వారా వ్యక్తంచేయగలగడం నిజంగానే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం. అయితే ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషించగలగడం ఆయన మానవుల​కిచ్చిన మరింత గొప్ప వరం. నిజానికి, తనతో మాట్లాడమని యెహోవా దేవుడు మనలను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని వాక్యమైన బైబిలు ఇలా చెబుతోంది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”​—⁠ఫిలిప్పీయులు 4:⁠6.

కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు మనం బైబిలును సంప్రదించాలని యెహోవా ఆశిస్తున్నాడు, దానిలో ఎన్నో విషయాలకు, పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మన ప్రయోజనార్థం వ్రాయించి పెట్టాడు. అందులోని నిర్దేశాన్ని ఎలా పాటించాలో తెలుసుకోవడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు. బైబిలు రచయితయైన యాకోబు ఇలా చెబుతున్నాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.”​—⁠యాకోబు 1:⁠5.

మీకేమనిపిస్తోంది?

పక్షులు మనోహరంగా పాడడాన్ని విన్నప్పుడు, చిన్నపిల్లల ముద్దుమాటలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దేవుడు సృష్టించినవాటిలో మీరు ఆయన జ్ఞానాన్ని చూడగలుగుతున్నారా?

కీర్తనకర్తయైన దావీదు తన శరీరనిర్మాణం గురించి బాగా ఆలోచించిన తర్వాత దేవునితో ఇలా అన్నాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్తన 139:​14) దేవుని సృష్టిలో కనబడుతున్న ఆయన జ్ఞానాన్ని మీరు కృతజ్ఞతాపూర్వకంగా పరిశీలించినప్పుడు, ఆయన మీకు మంచి నిర్దేశాన్ని ఇవ్వగలడన్న నమ్మకం మరింత బలపడుతుంది. (w 08 5/1)

[5వ పేజీలోని బ్లర్బ్‌]

సంభాషణా సామర్థ్యం దేవుడిచ్చిన వరం

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Dayton Wild/Visuals Unlimited