యెహోవా సేవమీదే దృష్టిపెట్టండి
‘మరియ యేసు బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకోవడంవల్ల తొందరపడెను.’—లూకా 10:39, 40.
1, 2. యేసు మార్తను ఎందుకు ప్రేమించాడు? ఆమె కూడా అపరిపూర్ణురాలే అని ఎందుకు చెప్పవచ్చు?
లాజరు సహోదరియైన మార్త పేరు వినగానే మీకు ఏమి గుర్తొస్తుంది? ఆమె యేసుకు మంచి స్నేహితురాలని, ఆయన ఆమెను ప్రేమించాడని బైబిలు చెప్తుంది. అయితే యేసు ఇతర దైవభక్తిగల స్త్రీలమీద కూడా అంటే మార్త సహోదరి మరియ మీద, అలాగే తన తల్లి మరియ మీద కూడా స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ చూపించాడు. (యోహా. 11:5; 19:25-27) ఇంతకీ యేసు మార్తమీద ప్రేమ చూపించడానికి కారణం ఏమిటి?
2 మార్త ఎంతో దయ, ఇచ్చే గుణం ఉన్న స్త్రీ. ఆమె చాలా కష్టపడి పనిచేసేది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమెకు బలమైన విశ్వాసం ఉంది. అందుకే యేసు ఆమెను ప్రేమించాడు. ఆమె యేసు చెప్పిన బోధలన్నిటిపై విశ్వాసం ఉంచింది, ఆయనే మెస్సీయ అని నమ్మింది. (యోహా. 11:21-27) అయితే మార్త కూడా మనలా అపరిపూర్ణురాలే, ఆమెకూడా పొరపాట్లు చేసింది. ఉదాహరణకు, యేసు ఒకసారి వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తన సోదరి మరియమీద కోప్పడింది, పైగా ఆమెను మందలించమని యేసును అడిగింది. “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పు” అని మార్త యేసుతో అంది. (లూకా 10:38-42 చదవండి.) మార్త ఎందుకలా అంది? యేసు ఆమెకిచ్చిన జవాబు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
మార్త వేరేవాటి మీద దృష్టిపెట్టింది
3, 4. యేసు మరియను ఎందుకు మెచ్చుకున్నాడు? మార్త ఏ పాఠాన్ని నేర్చుకుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 మార్త, మరియ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు యేసు ఎంతో కృతజ్ఞత చూపించాడు. ఆ సందర్భంలో వాళ్లకు విలువైన సత్యాలు బోధించాలని ఆయన కోరుకున్నాడు. మరియ వెంటనే ఆయన పాదాల దగ్గర కూర్చుని ‘ఆయన బోధ వినడం’ మొదలుపెట్టింది. గొప్ప బోధకుడైన యేసు నుండి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని ఆమె కోరుకుంది. మార్త కూడా అదే పని చేసివుంటే, తన పనులన్నీ ఆపేసి వచ్చి శ్రద్ధగా వింటున్నందుకు యేసు ఆమెను తప్పకుండా మెచ్చుకునేవాడే.
4 కానీ మార్త దృష్టి వేరేవాటి మీద ఉంది. ఆమె యేసుకోసం రకరకాల వంటకాలు తయారుచేయడంలో, ఇతర మర్యాదలు చేయడంలో బిజీగా ఉంది. అయితే మరియ ఆ పనుల్లో సహాయం చేయనందుకు మార్తకు కోపం వచ్చి యేసుకు ఫిర్యాదు చేసింది. మార్త చాలా పనులు పెట్టుకుందని గమనించిన యేసు ఎంతో దయగా, ‘మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు’ అని అన్నాడు. అంతేకాక, ఏదో ఒక్క వంటకం చేసినా సరిపోతుందని ఆమెకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత మరియ శ్రద్ధగా వింటున్నందుకు ఆమెను మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, “మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు.” ఆ రోజు తిన్న భోజనం గురించి మరియ కొంతకాలానికి మర్చిపోయివుంటుంది, కానీ యేసు బోధించిన విషయాల్ని, ఆయన తనను మెచ్చుకోవడాన్ని ఎప్పటికీ మర్చిపోయివుండదు. అపొస్తలుడైన యోహాను దాదాపు 60 సంవత్సరాల తర్వాత ఇలా రాశాడు, ‘యేసు మార్తను ఆమె సహోదరిని ప్రేమించాడు.’ (యోహా. 11:5) ఆ మాటల్ని బట్టి చూస్తే, మార్త యేసు ఇచ్చిన సలహా గురించి ఆలోచించిందని, జీవితాంతం యెహోవాకు నమ్మకంగా సేవ చేసిందని చెప్పవచ్చు.
5. యెహోవా సేవమీదే దృష్టి పెట్టడం మనకాలంలో ఎందుకు కష్టంగా ఉంది? మనం ఏ ప్రశ్నను పరిశీలిస్తాం?
5 యెహోవా సేవ నుండి మన దృష్టిని మళ్లించే విషయాలు బైబిలు కాలాల్లో కన్నా ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. కావలికోట సెప్టెంబరు 15, 1958 (ఇంగ్లీషు) సంచిక, సాంకేతిక పరిజ్ఞానం వల్ల యెహోవా సేవ నుండి దృష్టి పక్కకు మళ్లకుండా చూసుకోమని సహోదరసహోదరీల్ని హెచ్చరించింది. అప్పట్లోనే దాదాపు ప్రతీరోజు ఏదోక కొత్త వస్తువు మార్కెట్‌లోకి వచ్చేది. ఆకర్షణీయంగా కనిపించే పత్రికలు, రేడియోలు, సినిమాలు, టీవీల వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే అంతానికి దగ్గరయ్యేకొద్దీ, మన దృష్టిని మళ్లించే విషయాలు బహుశా ఇంకా ఎక్కువౌతాయని ఆ సంచిక చెప్పింది. అలాంటి విషయాలు ఇంతకుముందెన్నడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరియలా యెహోవా సేవమీదే దృష్టి పెట్టాలంటే ఏమి చేయాలి?
లోకాన్ని పూర్తిగా ఉపయోగించుకోకండి
6. యెహోవా ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకున్నారు?
6 యెహోవా ప్రజలు సువార్త ప్రకటించడానికి లోకంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు 1914కు ముందు, ఆ తర్వాతి కాలంలో వాళ్లు “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” ప్రదర్శనను ప్రజలకు చూపించారు. రంగురంగుల స్లైడ్లు, చలన చిత్రాలు, సౌండ్ ఉన్న ఆ ప్రదర్శన సహాయంతో దేవుని ప్రజలు చాలా దేశాల్లో లక్షలమందికి సువార్త ప్రకటించగలిగారు. ఆ ప్రదర్శన చివర్లో, యేసు వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో భూమ్మీద ఉండే శాంతికరమైన పరిస్థితుల్ని చూపించారు. యెహోవా ప్రజలు ఆ తర్వాత, రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి రాజ్య సందేశాన్ని వినిపించారు. నేడు మనం కంప్యూటర్లు, ఇంటర్నెట్ సహాయంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో సహా భూమి నలుమూలలా సువార్త ప్రకటిస్తున్నాం.
7. (ఎ) లోకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ఎందుకు ప్రమాదకరం? (బి) మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? (అధస్సూచి చూడండి.)
7 అయితే లోకంలో ఉన్నవాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ప్రమాదకరమని బైబిలు హెచ్చరిస్తుంది. (1 కొరింథీయులు 7:29-31 చదవండి.) లోకంలో ఉన్నవన్నీ చెడ్డవి కాకపోయినా అవి మన సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తాయి. ఉదాహరణకు, కొన్ని హాబీలు, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, కొత్త ప్రాంతాలకు వెళ్లడం, షాపింగ్ చేయడం అంటే మనలో కొంతమందికి ఇష్టం ఉండవచ్చు. లేదా కొత్తగా వచ్చే ఫోన్‌లు, ట్యాబ్‌లు, విలాసవంతమైన వస్తువుల గురించి తెలుసుకోవడాన్ని ఇష్టపడుతుండవచ్చు. చాలామందికి ఆన్‌లైన్ చాటింగ్ చేయడం, మెసేజ్‌లు లేదా మెయిల్స్ పంపించడం, ఎప్పటికప్పుడు వార్తల్ని లేదా క్రీడల స్కోర్ తెలుసుకోవడమంటే ఇష్టం. అయితే కొంతమంది వాటికి బానిసలౌతారు. a (ప్రసం. 3:1, 6) మనం అనవసరమైన విషయాలకోసం ఎక్కువ సమయం వృథా చేస్తుంటే, అన్నిటికన్నా ముఖ్యమైన యెహోవా ఆరాధనకు తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు.—ఎఫెసీయులు 5:15-17 చదవండి.
8. మనం లోకంలో ఉన్నవాటిని ఎందుకు ప్రేమించకూడదు?
8 సాతాను ఈ లోకంలో ఉన్నవాటిని ఉపయోగించుకుని, మనల్ని యెహోవా సేవనుండి పక్కకు మళ్లించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. సాతాను మొదటి శతాబ్దంలో అలాగే చేశాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు. (2 తిమో. 4:10) అందుకే లోకంలో ఉన్నవాటి గురించి మనమెలా భావిస్తున్నామో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, అవసరమైన మార్పులు చేసుకోవాలి. లోకంలో ఉన్నవాటిని కాకుండా, యెహోవాను ఎక్కువగా ప్రేమించమని బైబిలు మనకు చెప్తుంది. అలా చేసినప్పుడే మనం ఆయన చెప్పేది సులభంగా పాటిస్తాం, ఆయనకు దగ్గరౌతాం.—1 యోహా. 2:15-17.
ముఖ్యమైన వాటిమీద దృష్టి పెట్టండి
9. యేసు తన శిష్యులకు ఏ సలహా ఇచ్చాడు? ఈ విషయంలో ఆయన ఎలా ఆదర్శం ఉంచాడు?
9 ఎక్కువ విషయాలమీద మనసు పెట్టవద్దని యేసు మార్తకు సలహా ఇచ్చినట్లే, అంతకుముందు తన శిష్యులకు కూడా ఇచ్చాడు. యెహోవా సేవమీద, ఆయన రాజ్యంమీద దృష్టి పెట్టమని ఆయన వాళ్లను ప్రోత్సహించాడు. (మత్తయి 6:22, 33 చదవండి.) ఆ విషయంలో ఆయనే చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన దగ్గర ఎక్కువ వస్తువులు లేవు, ఆయనకు ఇల్లుగానీ స్థలంగానీ లేదు.—లూకా 9:58; 19:33-35.
10. పరిచర్య చేసే విషయంలో యేసు మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
10 యేసు పరిచర్య చేసేటప్పుడు ఇతర విషయాలవల్ల తన దృష్టి మళ్లకుండా చూసుకున్నాడు. ఉదాహరణకు, ఆయన ప్రకటనా పని మొదలుపెట్టిన కొంతకాలానికే, కపెర్నహూము అనే ఊరిలోని ప్రజలు ఆయన్ను తమ దగ్గరే ఇంకొంత కాలం ఉండమని వేడుకున్నారు. దానికి యేసు ఎలా స్పందించాడు? ఆయన ప్రకటనా పనికే మొదటిస్థానం ఇచ్చాడు కాబట్టి ఇలా అన్నాడు, ‘నేను ఇతర పట్టణాల్లో కూడా దేవుని రాజ్యసువార్తను ప్రకటించాలి; ఇందునిమిత్తమే నేను పంపబడ్డాను.’ (లూకా 4:42-44) యేసు ఎంత దూరమైనా నడిచే వెళ్లి, వీలైనంత ఎక్కువమందికి సువార్త ప్రకటించాడు, బోధించాడు. ఆయన పరిపూర్ణుడైనా, పరిచర్యలో ఎక్కువ కష్టపడడం వల్ల కొన్నిసార్లు అలిసిపోయేవాడు, దానివల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది.—లూకా 8:23; యోహా. 4:6.
11. ఓ వ్యక్తి సమస్యను యేసు ఎందుకు పరిష్కరించలేదు? ఆ సందర్భంలో యేసు తన శిష్యులకు ఏ పాఠం నేర్పించాడు?
11 ఒకసారి యేసు తన శిష్యులకు ఒక ముఖ్యమైన విషయం బోధిస్తున్నాడు. ఇంతలో ఒకాయన యేసు మాటలకు అడ్డుతగులుతూ ఇలా అడిగాడు, “బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పు.” అప్పుడు యేసు తన శిష్యులకు బోధించడం ఆపేసి ఆ వ్యక్తి సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించలేదు. బదులుగా ఆయన ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని, వస్తుపరమైన విషయాల మీద మనసు పెడితే దేవుని సేవనుండి పక్కకుమళ్లే ప్రమాదం ఉందని తన శిష్యుల్ని హెచ్చరించాడు.—లూకా 12:13-15.
12, 13. (ఎ) కొంతమంది గ్రీసు దేశస్థులు యేసును ఎందుకు కలవాలనుకున్నారు? (బి) దానికి యేసు ఎలా స్పందించాడు?
12 యేసు తన చివరిరోజుల్లో ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. (మత్త. 26:38; యోహా. 12:27) తాను తీవ్రమైన బాధలు అనుభవించి, చనిపోతానని ఆయనకు తెలుసు. అయితే చనిపోయే ముందు తాను చేయాల్సిన పని చాలా ఉందని కూడా ఆయనకు తెలుసు. ఉదాహరణకు నీసాను 9, ఆదివారం రోజున ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వచ్చాడు. అప్పుడు ప్రజలు ఆయన్ను రాజుగా ఆహ్వానించారు. (లూకా 19:38) తర్వాతి రోజు యేసు ఆలయానికి వెళ్లి, అక్కడ ఎక్కువ ధరకు జంతువుల్ని అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్న వ్యాపారుల్ని ధైర్యంగా వెళ్లగొట్టాడు.—లూకా 19:45, 46.
13 పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చిన కొంతమంది గ్రీసు దేశస్థులు యేసు చేసిన వాటిని చూసి ముగ్ధులై, ఆయన్ను కలవాలని అపొస్తలుడైన ఫిలిప్పును అడిగారు. అయితే ఎక్కువమంది ప్రజల మద్దతు సంపాదించుకుని, శత్రువుల నుండి తనను తాను రక్షించుకోవాలని యేసు కోరుకోలేదు. ఆయనకు అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. తన ప్రాణాన్ని బలిగా అర్పించడమే తండ్రి చిత్తం కాబట్టి యేసు దానిమీదే మనసు పెట్టాడు. అందుకే తాను త్వరలోనే చనిపోతానని శిష్యులకు చెప్తూ, తనను అనుసరించే వాళ్లందరూ తమ ప్రాణాల్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని యేసు వివరించాడు. ఆయనిలా అన్నాడు, “తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనును.” తన అనుచరులకు నిత్యజీవం ఇవ్వడం ద్వారా వాళ్లను ‘తండ్రి ఘనపరుస్తాడు’ అని కూడా యేసు చెప్పాడు. ఆ ప్రోత్సాహకరమైన మాటల్ని ఫిలిప్పు ఆ గ్రీసు దేశస్థులకు చెప్పేవుంటాడు.—యోహా. 12:20-26.
14. యేసు ప్రకటనా పనికి మొదటి స్థానం ఇచ్చినా, ఇంకా వేటికోసం సమయం కేటాయించేవాడు?
14 యేసుక్రీస్తు ప్రకటనా పనిమీదే దృష్టిపెట్టినా, వేరే పనుల కోసం కూడా సమయం కేటాయించేవాడు. ఉదాహరణకు, ఓసారి ఆయన ఓ పెళ్లికి వెళ్లాడు. అక్కడ నీళ్లను మంచి ద్రాక్షారసంగా మార్చాడు. (యోహా. 2:2, 6-10) ఆయన అప్పుడప్పుడు తన స్నేహితులతో, సువార్తపట్ల ఆసక్తి చూపించిన ఇతరులతో కలిసి భోజనం చేసేవాడు. (లూకా 5:29; యోహా. 12:2) అన్నిటికన్నా ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం కోసం, ధ్యానించడం కోసం, ప్రార్థించడం కోసం యేసు ఎల్లప్పుడూ సమయం కేటాయించేవాడు.—మత్త. 14:23; మార్కు 1:35; 6:31, 32.
‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టండి’
15. పౌలు క్రైస్తవులకు ఏ సలహా ఇచ్చాడు? ఆ విషయంలో ఆయన ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
15 అపొస్తలుడైన పౌలు క్రైస్తవ జీవితాన్ని ఓ పెద్ద పరుగుపందెంతో పోల్చాడు. వాళ్లు దానిలో చివరిదాకా పరుగెత్తాలంటే, తమ వేగాన్ని తగ్గించే లేదా పూర్తిగా ఆగిపోయేలా చేసే అనవసరమైన భారాల్ని విడిచిపెట్టాలని ఆయన చెప్పాడు. (హెబ్రీయులు 12:1, 2 చదవండి.) ఆ విషయంలో పౌలు చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన యూదామత నాయకునిగా ఎంతో డబ్బును, పేరును సంపాదించేవాడే. కానీ మరింత ప్రాముఖ్యమైన దానిమీద మనసు పెట్టడంకోసం ఆయన వాటన్నిటినీ వదులుకున్నాడు. ఆయన ప్రకటనా పనిలో చాలా కష్టపడ్డాడు. సిరియా, ఆసియా మైనరు, మాసిదోనియ, యూదయ వంటి చాలా ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించాడు. తాను పరలోకంలో పొందబోయే నిత్యజీవం కోసం పౌలు ఎదురుచూశాడు. అందుకే ఆయనిలా చెప్పాడు, ‘వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికోసం వేగిరపడుతూ బహుమానం పొందాలని, గురి వద్దకే పరుగెత్తుతున్నాను.’ (ఫిలి. 1:9-11; 3:8, 13, 14) పౌలు ఒంటరిగా ఉండడంవల్ల, వేరే విషయాల గురించి ఆలోచించకుండా యెహోవా సేవమీదే దృష్టిపెట్టగలిగాడు.—1 కొరిం. 7:32-35.
16, 17. మనకు పెళ్లైనా, కాకపోయినా పౌలును ఎలా అనుకరించవచ్చు? ఒక అనుభవం చెప్పండి.
16 పౌలులాగే నేడు కొంతమంది సహోదరసహోదరీలు, యెహోవా సేవను మరింత ఎక్కువగా చేయడం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. (మత్త. 19:11, 12) పెళ్లైన వాళ్లతో పోలిస్తే పెళ్లికాని వాళ్లకు కుటుంబ బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అయితే మనకు పెళ్లైనా, కాకపోయినా మనందరం, యెహోవా సేవనుండి మనల్ని పక్కకు మళ్లించే ‘ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి.’ అందుకోసం మన సమయాన్ని వృథా చేసే కొన్ని అలవాట్లను మానేయాల్సి ఉంటుంది, అప్పుడే యెహోవా సేవను ఎక్కువగా చేయగలుగుతాం.
17 వేల్స్ అనే దేశానికి చెందిన మార్క్, క్లార్ దంపతుల అనుభవం పరిశీలించండి. వాళ్లు చిన్నప్పుడే అంటే తమ స్కూల్ చదువులు అయిపోగానే పయినీరింగ్ మొదలుపెట్టారు. పెళ్లైన తర్వాత కూడా వాళ్లు పయినీరు సేవ కొనసాగించారు. అయితే ఇంకా ఎక్కువ సేవ చేయాలని వాళ్లు కోరుకున్నారు. మార్క్ ఇలా చెప్తున్నాడు, ‘మేము అంతర్జాతీయ నిర్మాణ పనిలో పాల్గొనడం కోసం మా జీవితంలో మరిన్ని మార్పులు చేసుకున్నాం. మా పెద్ద ఇంటిని, మా పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకున్నాం.’ వాళ్లు గడిచిన 20 ఏళ్లలో, ఆఫ్రికాలోని చాలా దేశాలకు వెళ్లి రాజ్యమందిరాలను నిర్మించే పనిలో సహాయం చేశారు. కొన్నిసార్లు వాళ్ల దగ్గర తక్కువ డబ్బులు మాత్రమే ఉండేవి, అయితే యెహోవా వాళ్ల అవసరాలు ఎల్లప్పుడూ తీర్చాడు. క్లార్ ఇలా చెప్తుంది, “ప్రతీరోజును యెహోవా సేవలో ఉపయోగించడం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అలా సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకున్నాం. మాకు ఏ లోటూ లేదు. పూర్తికాల సేవలో మేము పొందుతున్న ఆనందంతో పోలిస్తే, మేము వదులుకున్నవి చాలా చిన్నవి.” చాలామంది పూర్తికాల సేవకులకు ఇలాంటి అభిప్రాయమే ఉంది. b
18. మనం ఏమని ప్రశ్నించుకోవాలి?
18 మరి మీ సంగతేంటి? మీరు ఒకప్పుడు చేసినంత ఉత్సాహంగా ఇప్పుడు యెహోవా సేవ చేయట్లేదని మీకనిపిస్తుందా? వేరే విషయాల వల్ల మీ దృష్టి పక్కకు మళ్లుతోందా? అయితే, బహుశా మీరు బైబిలు చదవడంలో, దాన్ని అధ్యయనం చేయడంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందేమో. దాన్ని ఎలా చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.
a ఈ సంచికలో ఉన్న, “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును” అనే ఆర్టికల్ చూడండి.
b కావలికోట మార్చి 1, 2006 సంచికలోని “సరైనది తెలుసుకొని దానిని చేయడం” అనే ఆర్టికల్‌లో హేడెన్ సాండర్సన్, మెలొడీ జీవిత కథ చూడండి. వాళ్లు ఆస్ట్రేలియాలో మంచి వ్యాపారాన్ని వదిలేసి పూర్తికాల సేవ మొదలుపెట్టారు. ఇండియాలో మిషనరీలుగా సేవచేసే రోజుల్లో వాళ్ల దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసుకోండి.