కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సెంట్‌లేదా పర్‌ఫ్యూమ్‌ వాసనలు పడని సహోదరసహోదరీలకు ఎలా సహాయం చేయవచ్చు?

సెంట్‌ లేదా పర్‌ఫ్యూమ్‌ వాసనలు పడనివాళ్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్లకు, సెంట్‌ వాడే చాలామంది రోజూ ఎదురౌతుంటారు కాబట్టి ఆ వాసనలకు దూరంగా ఉండడం అన్నిసార్లూ కుదరకపోవచ్చు. అయితే మన సహోదరసహోదరీలు కూటాలకు, సమావేశాలకు వచ్చేటప్పుడు సెంట్లు, పర్‌ఫ్యూమ్‌లు కొట్టుకోకుండా రమ్మని వాళ్లకు చెప్పడం సంస్థకు వీలౌతుందేమోనని కొంతమంది అడిగారు.

మన కూటాలకు, సమావేశాలకు వచ్చేవాళ్లను అనవసరంగా ఇబ్బందిపెట్టాలని ఏ క్రైస్తవుడూ కోరుకోడు. వాటిలో పొందే ప్రోత్సాహం మనలో ప్రతీఒక్కరికి అవసరం. (హెబ్రీ. 10:24, 25) కాబట్టి, సెంట్‌ వాసనల వల్ల మరీ ఇబ్బందిపడుతూ, వాటివల్ల కూటాలకు రాలేకపోతుంటే వాళ్లు ఆ విషయం గురించి సంఘ పెద్దలతో మాట్లాడవచ్చు. అలాగని, కూటాలకు వచ్చేవాళ్లకు సెంట్‌, పర్‌ఫ్యూమ్‌ వాడే విషయంలో పెద్దలు నియమాలు పెట్టడం సరికాదు, అలా చేయమని బైబిలు చెప్పడం లేదు. అయితే కొంతమంది పడుతున్న ఇబ్బందుల్ని సంఘంలోని మిగతావాళ్లు అర్థం చేసుకునేలా పెద్దలు సహాయం చేయవచ్చు. ఆ సమస్య గురించి మన సంస్థ ప్రచురించిన సమాచారాన్ని వీలైతే సేవా కూటంలోని స్థానిక అవసరాల్లో చర్చించవచ్చు. లేదా ఆ విషయం గురించి జాగ్రత్తగా ఓ ప్రకటన చేయాలనుకోవచ్చు. a కానీ పెద్దలు ఇలాంటి ప్రకటనలు తరచూ చేయరు. ఎందుకంటే, కొత్తగా సత్యం నేర్చుకుంటున్నవాళ్లు, మరితరులు మన కూటాలకు వస్తుంటారు, వాళ్లకు ఆ సమస్య గురించి తెలీదు. కాబట్టి, మితంగా సెంట్‌ వాడే అలాంటివాళ్లను సాదరంగా ఆహ్వానించాలేగానీ ఇబ్బంది పెట్టకూడదు.

వీలైతే, సంఘ పెద్దల సభ ఆ సమస్యతో బాధపడేవాళ్ల కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకు, వాళ్లు రాజ్యమందిరంలో సెంట్‌, పర్‌ఫ్యూమ్‌ వాసనలకు దూరంగా కూర్చునేలా ఏర్పాటు చేయవచ్చు. కొన్ని రాజ్యమందిరాల్లో, కాన్ఫరెన్స్‌ హాలులో కూర్చుని కూడా కూటాలను వినే సౌకర్యం ఉంటుంది. అయినా వాళ్లలో కొంతమంది ఇంకా ఆ సమస్యతో తీవ్రంగా బాధపడుతుంటే, వాళ్లకోసం కూటాలను రికార్డు చేయవచ్చు. లేదా, ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్న వాళ్లకోసం చేసినట్లే, వీళ్లకు కూడా ఫోన్‌ ద్వారా కూటాలు వినే ఏర్పాటు చేయవచ్చు.

ప్రాదేశిక సమావేశాలకు హాజరయ్యేటప్పుడు సెంట్లు, పర్‌ఫ్యూమ్‌లు పడనివాళ్ల గురించి ఆలోచించమని మన రాజ్య పరిచర్య ఈ మధ్యకాలంలో మనల్ని ప్రోత్సహించింది. చాలాచోట్ల సమావేశాలు ఏ.సీ. హాళ్లలో జరుగుతాయి కాబట్టి ఘాటైన వాసనలు ఉన్న సెంట్లు, పర్‌ఫ్యూమ్‌లు వాడడం తగ్గించమని సలహా ఇచ్చింది. ఆ హాళ్లలో సెంట్‌, పర్‌ఫ్యూమ్‌ వాసనలు పడని వాళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వీలుకాదు కాబట్టి, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోమని చెప్పింది. అయితే ఆ సలహాను సంఘ కూటాలప్పుడు పాటించి తీరాల్సిన నియమంగా మార్చకూడదు. ఆ సలహా ఉద్దేశం అది కాదు.

ఈ లోకంలో జీవించినంతకాలం మనం అపరిపూర్ణత వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే వాటిని తగ్గించడానికి తోటి సహోదరసహోదరీలు ప్రయత్నించినప్పుడు మనమెంతో కృతజ్ఞత చూపిస్తాం. ఇతరులు ఇబ్బంది పడకుండా కూటాలకు రావడం కోసం మనం సెంట్‌ లేదా పర్‌ఫ్యూమ్‌ వాడకుండా ఉండడం ఒకరకంగా త్యాగమే. అయితే వాళ్లమీద ప్రేమ ఉంటే మనం అలా చేస్తాం.

పొంతి పిలాతుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

లాటిన్‌ భాషలో పిలాతు పేరు చెక్కివున్న రాతిపలక

యేసును విచారించి, మరణశిక్ష విధించిన పొంతి పిలాతు గురించి బైబిలు చదివేవాళ్లకు తెలుసు. (మత్త. 27:1, 2, 24-26) అయితే, ఆ కాలంనాటి ఇతర చారిత్రక రుజువుల్లో కూడా ఆయన పేరు చాలాసార్లు కనిపిస్తుంది. “యూదయను పరిపాలించిన ఇతర రోమా అధిపతులకన్నా” పొంతి పిలాతు గురించిన చారిత్రక నివేదికలే “ఎక్కువగా, ఎంతో వివరంగా” ఉన్నాయని ది యాంకర్‌ బైబిల్‌ డిక్షనరీ చెప్తుంది.

యూదా చరిత్రకారుడైన జోసిఫస్‌ రాసిన వాటిలో పిలాతు పేరు ఎక్కువగా కనిపిస్తుంది. యూదయను పరిపాలిస్తున్నప్పుడు పిలాతుకు ఎదురైన మూడు సవాళ్ల గురించి జోసిఫస్‌ రాశాడు. ఆయనకు ఎదురైన నాలుగో సవాలు గురించి మరో యూదా చరిత్రకారుడైన ఫీలో రాశాడు. తిబెరి కైసరు పాలనలో, పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడని రోమా చక్రవర్తుల చరిత్రను రాసిన టాసిటస్‌ కూడా చెప్పాడు.

పురాతన శాస్త్రవేత్తలు 1961⁠లో ఇశ్రాయేలులోని, కైసరయలో ఉన్న ఓ ప్రాచీన రోమా థియేటర్‌లో ఒక రాతి పలకను కనుగొన్నారు. దాని మీద పిలాతు పేరు లాటిన్‌ భాషలో స్పష్టంగా రాసివుంది. (చిత్రంలో చూపిస్తున్నట్లుగా) ఆ పలక మీద చెక్కివున్న మాటలు అసంపూర్ణంగా ఉన్నాయి. అయితే, నిజానికి దానిమీద “యూదయ అధిపతియైన పొంతి పిలాతు [ఈ] టైబిరియమ్‌ను ఘనత వహించిన దేవుళ్లకు సమర్పించాడు” అనే మాటలు ఉండివుంటాయని చరిత్రకారులు అనుకుంటున్నారు. టైబిరియమ్‌ అనేది బహుశా రోమా చక్రవర్తియైన తిబెరి గౌరవార్థం కట్టిన ఆలయమై ఉండవచ్చు.

ఒక ప్రచారకుడు పక్కన ఉన్నప్పుడు, ప్రచారకురాలు బైబిలు అధ్యయనం చేస్తుంటే ఆమె తలమీద ముసుగు వేసుకోవాలా?

బాప్తిస్మం పొందని ఓ ప్రచారకుడు పక్కన ఉండగా, సహోదరి స్టడీ చేస్తుంటే ఆమె తలమీద ముసుగు వేసుకోవాలని కావలికోట జూ 15, 2002 సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” భాగం చెప్పింది. అయితే దానిగురించి మరింతగా పరిశీలించిన తర్వాత, ఆ నిర్దేశంలో మార్పులు చేయడం సముచితం అనిపిస్తుంది.

ఓ సహోదరి కొంతకాలంగా చేస్తున్న ఒక స్టడీకి, బాప్తిస్మం పొందిన ఓ సహోదరుణ్ణి తీసుకెళ్లిందనుకోండి. అప్పుడు ఆమె స్టడీ చేస్తుంటే, ఆమె తప్పకుండా ముసుగు వేసుకోవాలి. సాధారణంగా ఓ సహోదరుడు చేయాల్సిన పనిని ఆమె చేస్తుంది కాబట్టి, ముసుగు వేసుకోవడం ద్వారా ఆమె స్తవ సంఘంలో యెహోవా ఏర్పాటు చేసిన శిరస్సత్వాన్ని గౌరవిస్తున్నట్లు చూపిస్తుంది. (1 కొరిం. 11:5, 6, 10) ఆ సహోదరునికి బోధించే అర్హత ఉంటే, ఆయన్నే ఆ స్టడీ చేయమని ఆమె కొన్నిసార్లు అడగవచ్చు.

కానీ, ఓ సహోదరి క్రమంగా జరిగే స్టడీకి భర్తను కాకుండా, బాప్తిస్మం పొందని మరో సహోదరుణ్ణి తీసుకెళ్తే ఆమె లేఖనాల ప్రకారం ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది సహోదరీలు తమ మనస్సాక్షిని బట్టి ముసుగు వేసుకోవాలనుకోవచ్చు.

a మరింత సమాచారం కోసం, తేజరిల్లు! (ఇంగ్లీషు) ఆగస్టు 8, 2000 సంచికలోని  8-10 పేజీలు చూడండి.