కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు పునరుత్థానం—⁠మనకు ఎలా ప్రయోజనకరం?

యేసు పునరుత్థానం—⁠మనకు ఎలా ప్రయోజనకరం?

“ఆయన లేచి యున్నాడు.”—మత్త. 28:6.

1, 2. (ఎ) కొంతమంది మతనాయకులు ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు? పేతురు వాళ్లకు ఎలా జవాబిచ్చాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పేతురు ఆ సందర్భంలో ఎందుకు ధైర్యంగా మాట్లాడగలిగాడు?

 యేసుక్రీస్తు చనిపోయి ఎన్నో రోజులు గడవకముందే, అపొస్తలుడైన పేతురును శత్రువులైన యూదా మతనాయకులు నిలదీశారు. యేసును చంపడానికి కుట్ర పన్నింది కూడా వాళ్లే. పేతురు పుట్టుకతోనే కుంటివాడైన ఓ వ్యక్తిని బాగుచేసినప్పుడు ఏ శక్తితో, ఎవరి పేరున ఆ పని చేశాడో చెప్పమని వాళ్లు ఆయనను సంజాయిషీ అడిగారు. అప్పుడు పేతురు ధైర్యంగా ఇలా జవాబిచ్చాడు, “మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.”—అపొ. 4:5-10.

2 అంతకుముందు, పేతురు భయంతో మూడుసార్లు యేసు ఎవరో తెలియదన్నాడు. (మార్కు 14:66-72) మరిప్పుడు మతనాయకుల ముందు అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు? పరిశుద్ధాత్మ సహాయంతోపాటు, యేసు పునరుత్థానం అయ్యాడని గట్టిగా నమ్మడం వల్లే పేతురు ధైర్యంగా మాట్లాడాడు. యేసు జీవించే ఉన్నాడని పేతురు అంత బలంగా ఎలా నమ్మగలిగాడు? అలాంటి నమ్మకాన్నే మనమూ ఎలా కలిగివుండగలం?

3, 4. (ఎ) అపొస్తలులు పుట్టకముందు ఏయే పునరుత్థానాలు జరిగాయి? (బి) యేసు ఎవరెవర్ని పునరుత్థానం చేశాడు?

3 చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారనే విషయం అపొస్తలులకు కొత్తేమీ కాదు; వాళ్లు పుట్టకముందు కూడా పునరుత్థానాలు జరిగాయి. అలాంటి అద్భుతాలు చేసేలా ప్రవక్తలైన ఏలీయాకు, ఎలీషాకు దేవుడు శక్తినిచ్చాడని వాళ్లకు తెలుసు. (1 రాజు. 17:17-24; 2 రాజు. 4:32-37) సమాధిలో ఉన్న ఎలీషా ఎముకలు తగిలి, చనిపోయిన ఓ వ్యక్తి బ్రతికాడు. (2 రాజు. 13:20, 21) దేవుని వాక్యం సత్యమని మనం నమ్ముతున్నట్లే, తొలి క్రైస్తవులు కూడా ఆ వృత్తాంతాలను నమ్మారు.

4 అదేవిధంగా, యేసు చేసిన పునరుత్థానాల గురించి చదువుతున్నప్పుడు ఆ వృత్తాంతాలు మన మనసుల్ని కదిలిస్తాయి. ఒక విధవరాలి ఒక్కగానొక్క కొడుకును యేసు బ్రతికించినప్పుడు, ఆమె ఆనందానికి అవధులు లేవు. (లూకా 7:11-15) మరో సందర్భంలో, ఆయన 12 ఏళ్ల అమ్మాయిని బ్రతికించాడు. అప్పటిదాకా దుఃఖంలో మునిగివున్న ఆమె తల్లిదండ్రులు ఎంత సంతోషించివుంటారో ఊహించండి! (లూకా 8:49-56) అలాగే, చనిపోయిన లాజరు సమాధిలో నుండి బయటకు రావడం చూసినప్పుడు అక్కడున్నవాళ్లు తమ కళ్లను తామే నమ్మలేకపోయుంటారు.—యోహా. 11:38-44.

యేసు పునరుత్థానం ఎందుకు ప్రత్యేకమైనది?

5. యేసు పునరుత్థానానికీ అంతకుముందు జరిగిన పునరుత్థానాలకూ తేడా ఏమిటి?

5 యేసు పునరుత్థానానికీ అంతకుముందు జరిగిన పునరుత్థానాలకూ తేడా ఉందని అపొస్తలులకు తెలుసు. వాళ్లు భౌతిక శరీరాలతో పునరుత్థానమై, కొంతకాలానికి మళ్లీ చనిపోయారు. కానీ యేసు మాత్రం ఎప్పటికీ నాశనంకాని ఆత్మ శరీరంతో పునరుత్థానమయ్యాడు. (అపొస్తలుల కార్యములు 13:34 చదవండి.) “క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి . . . ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు” అని పేతురు రాశాడు. (1 పేతు. 3:18-22) అంతకుముందు జరిగిన పునరుత్థానాలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవే అయినా, యేసు పునరుత్థానం మాత్రం అత్యంత గొప్ప అద్భుతం.

6. యేసు పునరుత్థానం శిష్యులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

6 యేసు పునరుత్థానం శిష్యులపై గొప్ప ప్రభావం చూపించింది. ఆయన శత్రువులు నమ్ముతున్నట్లు యేసు జీవితం మరణంతో ముగిసిపోలేదు. ఆయన, ఏ మనిషీ హాని చేయలేని శక్తిమంతమైన ఆత్మ ప్రాణిగా తిరిగి బ్రతికాడు. ఆయన దేవుని కుమారుడని ఆ పునరుత్థానం నిరూపించింది. అంతేకాక, దుఃఖంలో మునిగివున్న యేసు శిష్యులు ఆ విషయం తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వాళ్లకున్న భయాలన్నీ పోయి, ధైర్యవంతులుగా మారారు. యెహోవా సంకల్పానికీ, శిష్యులు ఆ తర్వాత ధైర్యంగా ప్రకటించిన సువార్తకూ యేసు పునరుత్థానమే కేంద్రబిందువు.

7. యేసు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? మనకు ఏ ప్రశ్నలు తలెత్తవచ్చు?

7 యేసు ఒక గొప్పవ్యక్తి మాత్రమే కాదని యెహోవా సేవకులమైన మనకు బాగా తెలుసు. ఆయన ప్రస్తుతం సజీవంగా ఉండడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్నాడు కూడా. దేవుని పరలోక రాజ్యాన్ని ఏలుతున్న రాజుగా యేసుక్రీస్తు త్వరలోనే భూమ్మీదున్న చెడుతనాన్ని పూర్తిగా తీసేసి, ప్రజలు నిరంతరం జీవించే పరదైసుగా దాన్ని మారుస్తాడు. (లూకా 23:43) ఒకవేళ యేసు పునరుత్థానం అయ్యుండకపోతే ఇవేవీ సాధ్యం కావు. యేసు పునరుత్థానం అయ్యాడని నమ్మడానికి మనకు ఎలాంటి కారణాలు ఉన్నాయి? ఆయన పునరుత్థానం వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

మరణంపై యెహోవాకున్న శక్తి

8, 9. (ఎ) యేసు సమాధికి కాపలా పెట్టించమని యూదా మతనాయకులు పిలాతును ఎందుకు అడిగారు? (బి) స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది?

8 యేసు చనిపోయిన తర్వాత, ప్రధాన యాజకులూ పరిసయ్యులూ పిలాతు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, “అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు—మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి—ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండును.” అందుకు పిలాతు వాళ్లతో “కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడి” అని చెప్పాడు. వారు వెళ్లి అదే పని చేశారు.—మత్త. 27:62-66.

9 యేసు శరీరాన్ని రాతిలో తొలిచిన ఓ సమాధిలో పెట్టి, దాని ద్వారాన్ని ఒక పెద్ద రాయితో మూసేశారు. యేసు ఆ సమాధిలోనే ఎప్పటికీ నిర్జీవంగా ఉండిపోవాలని యూదా మతనాయకులు కోరుకున్నారు. అయితే యెహోవా దేవుని ఆలోచన మాత్రం మరోలా ఉంది. మగ్దలేనే మరియ, వేరొక మరియ మూడవ రోజున సమాధి దగ్గరకు వచ్చి చూసినప్పుడు, ఒక దూత ఆ రాయిని పక్కకు దొర్లించి దానిమీద కూర్చొనివున్నాడు. సమాధి ఖాళీగా ఉందని, వెళ్లి చూడమని ఆ దూత స్త్రీలకు చెప్పాడు. “ఆయన ఇక్కడ లేడు . . . ఆయన లేచి యున్నాడు” అని దూత అన్నాడు. (మత్త. 28:1-6) అవును, యేసు పునరుత్థానమయ్యాడు!

10. యేసు పునరుత్థానం గురించి పౌలు ఏ రుజువు ఇచ్చాడు?

10 ఆ తర్వాత 40 రోజులపాటు జరిగిన కొన్ని సంఘటనలు, యేసు పునరుత్థానమయ్యాడని నిస్సందేహంగా నిరూపించాయి. ఆ సంఘటనలను క్లుప్తంగా చెబుతూ కొరింథీయులకు పౌలు ఇలా రాశాడు, “నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచి యున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను.”—1 కొరిం. 15:3-8.

యేసు పునరుత్థానం అయ్యాడని మనకు ఎలా తెలుసు?

11. యేసు పునరుత్థానం ఏ విధంగా “లేఖనముల ప్రకారము” జరిగింది?

11 మొదటి కారణం, యేసు పునరుత్థానం “లేఖనముల ప్రకారము” జరిగింది. యేసు పునరుత్థానం అవుతాడని దేవుని వాక్యం ముందే చెప్పింది. ఉదాహరణకు, దేవుడు తన ‘పరిశుద్ధుణ్ణి’ సమాధిలో విడిచిపెట్టడని దావీదు రాశాడు. (కీర్తన 16:10 చదవండి.) ఆ ప్రవచన మాటల్ని యేసుకు అన్వయిస్తూ అపొస్తలుడైన పేతురు, సా.శ. 33 పెంతెకొస్తు రోజున ఇలా చెప్పాడు, “క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.”—అపొ. 2:23-27, 31.

12. పునరుత్థానమైన యేసును ఎవరెవరు చూశారు?

12 రెండవ కారణం, పునరుత్థానమైన యేసును చాలామంది ప్రత్యక్ష సాక్షులు చూశారు. పునరుత్థానం తర్వాత యేసు 40 రోజులపాటు తన శిష్యులకు కనిపించాడు. తన సమాధివున్న తోటలో, ఎమ్మాయు అనే ఊరికి వెళ్లే దారిలో, మరితర చోట్ల ఆయన శిష్యులకు కనిపించాడు. (లూకా 24:13-15) ఆ సందర్భాల్లో ఆయన పేతురుతోపాటు కొంతమంది వ్యక్తులతో, గుంపులతో మాట్లాడాడు. ఒకసారైతే, 500 కన్నా ఎక్కువమంది ఉన్న సమూహానికి కనిపించాడు! పునరుత్థానమైన యేసును అంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారనే వాస్తవాన్ని మనం తోసిపుచ్చలేం.

13. యేసు పునరుత్థానం అయ్యాడనే నమ్మకాన్ని, శిష్యులు ఉత్సాహంగా ప్రకటించడం ద్వారా ఎలా చూపించారు?

13 మూడవ కారణం, యేసు పునరుత్థానం గురించి శిష్యులు ఉత్సాహంగా ప్రకటించారు. పునరుత్థానమైన యేసు గురించి ఉత్సాహంగా సాక్ష్యమివ్వడం వల్ల శిష్యులు హింసను, బాధల్ని అనుభవించారు, చివరికి ప్రాణాల్ని కూడా కోల్పోయారు. ఒకవేళ యేసు పునరుత్థానం ఓ కట్టుకథే అయితే, ఆయన్ను ద్వేషించి చంపించిన మతనాయకులకు యేసు పునరుత్థానం గురించి ప్రకటించడానికి పేతురు ఎందుకు ప్రాణాలకు తెగిస్తాడు? యేసు సజీవంగా ఉన్నాడనీ దేవుడు ఇచ్చిన పనిని నిర్దేశిస్తున్నాడనీ పేతురు, మరితర శిష్యులు బలంగా నమ్మారు కాబట్టే అలా చేశారు. అంతేకాక, తాము కూడా పునరుత్థానం అవుతామనే నమ్మకం యేసు పునరుత్థానం వాళ్లలో కలిగించింది. స్తెఫను కూడా అదే నమ్మకంతో చనిపోయాడు.—అపొ. 7:55-60.

14. యేసు సజీవంగా ఉన్నాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

14 నాలుగవ కారణం, ఆయన ఇప్పుడు రాజుగా ఏలుతున్నాడనీ క్రైస్తవ సంఘ శిరస్సుగా సేవచేస్తున్నాడనీ నమ్మడానికి మనకు రుజువులు ఉన్నాయి. అందుకే, నిజ క్రైస్తవత్వం అంతకంతకూ వృద్ధి అవుతోంది. యేసు పునరుత్థానం కాకపోయుంటే అది సాధ్యమా? నిజానికి యేసు పునరుత్థానం అయ్యుండకపోతే, బహుశా మనం ఆయన గురించి ఎప్పటికీ వినుండేవాళ్లం కాదు. కానీ యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడనీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్నాడనీ నమ్మడానికి మనకు బలమైన కారణాలు ఉన్నాయి.

యేసు పునరుత్థానం వల్ల మనం పొందే ప్రయోజనాలు

15. యేసు పునరుత్థానం మనకు ప్రకటించే ధైర్యాన్ని ఎందుకిస్తుంది?

15 క్రీస్తు పునరుత్థానం మనకు ప్రకటించే ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని శత్రువులు సువార్త పనిని ఆపడానికి 2,000 సంవత్సరాలుగా అన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తూ వచ్చారు. మతభ్రష్టత్వం, ఎగతాళి, గుంపుగా దాడిచేయడం, నిషేధాలు, చిత్రవధ, చంపడం వంటివి వాటిలో కొన్ని. అయితే ‘మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమూ’ రాజ్యాన్ని ప్రకటించే, శిష్యుల్ని చేసే పనిని ఆపలేకపోయింది. (యెష. 54:17) సాతాను అనుచరులకు మనం భయపడం. యేసు తన మాట ప్రకారం మన వెన్నంటే ఉండి, సహాయం చేస్తున్నాడు. (మత్త. 28:20) శత్రువులు ఎంత ప్రయత్నించినా, మన పనిని ఆపడం వాళ్ల తరం కాదని మనం ధైర్యంగా ఉండవచ్చు.

యేసు పునరుత్థానం మనకు ప్రకటించే ధైర్యాన్ని ఇస్తుంది (15వ పేరా చూడండి)

16, 17. (ఎ) యేసు పునరుత్థానం ఆయన బోధించినవి నిజమేనని ఎలా నిరూపిస్తుంది? (బి) యోహాను 11:25 ప్రకారం దేవుడు యేసుకు ఏ శక్తినిచ్చాడు?

16 యేసు పునరుత్థానం, ఆయన బోధించిన వాటన్నిటికీ హామీ ఇస్తుంది. క్రీస్తు పునరుత్థానం కాకపోయుంటే, క్రైస్తవ విశ్వాసం-ప్రకటనా పని వ్యర్థమని పౌలు రాశాడు. ఓ బైబిలు విద్వాంసుడు ఇలా రాశాడు, “క్రీస్తు ఒకవేళ పునరుత్థానం అవ్వకపోయుంటే, . . . క్రైస్తవులు బాగా మోసపోయిన వెర్రివాళ్లు అయ్యుండేవాళ్లు.” యేసు బ్రతికివుండకపోతే, శత్రువుల చేతుల్లో చనిపోయిన ఓ తెలివైన మంచివ్యక్తికి సంబంధించిన విషాద గాథలుగానే సువార్త వృత్తాంతాలు మిగిలిపోయేవి. కానీ క్రీస్తు నిస్సందేహంగా తిరిగి లేచాడు. అలా భవిష్యత్తుకు సంబంధించిన వాటితోసహా తాను బోధించినవన్నీ సత్యమేనని హామీ ఇస్తున్నాడు.—1 కొరింథీయులు 15:14, 15, 20 చదవండి.

17 “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును” అని యేసు చెప్పాడు. (యోహా. 11:25) యేసు చెప్పిన ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది. పరలోకంలో పరిపాలించబోయే వాళ్లతోసహా, ఈ భూమ్మీద జీవించబోయే కోట్లాదిమందిని పునరుత్థానం చేసే శక్తిని యెహోవా యేసుకు అనుగ్రహించాడు. మరణం ఇక ఉండదని యేసు బలి, ఆయన పునరుత్థానం హామీ ఇస్తున్నాయి. ఎలాంటి కష్టాన్నైనా, చివరికి మరణాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఈ మాటలు మిమ్మల్ని బలపర్చడం లేదా?

18. యేసు పునరుత్థానం ఏ హామీ ఇస్తుంది?

18 యేసు భూనివాసులందరికీ యెహోవా ప్రేమపూర్వక ప్రమాణాల ప్రకారం తీర్పు తీరుస్తాడని ఆయన పునరుత్థానం హామీ ఇస్తుంది. ప్రాచీన ఏథెన్సులోని స్త్రీపురుషులతో మాట్లాడుతూ పౌలు ఇలా చెప్పాడు, “తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును [దేవుడు] నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.” (అపొ. 17:31) అవును, దేవుడే యేసును న్యాయాధిపతిగా నియమించాడు. ఆయన న్యాయంగా, ప్రేమపూర్వకంగా తీర్పు తీరుస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—యెషయా 11:2-4 చదవండి.

19. యేసు పునరుత్థానంపై నమ్మకం మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

19 యేసు పునరుత్థానంపై నమ్మకం, దేవుని చిత్తం చేసేలా మనల్ని పురికొల్పుతుంది. యేసు బలిగా చనిపోకపోయుంటే, పునరుత్థానం అవ్వకపోయుంటే, మనం ఎప్పటికీ పాపమరణాల బంధకాల్లోనే ఉండేవాళ్లం. (రోమా. 5:12; 6:23) మనకు ఎలాంటి నిరీక్షణా ఉండేది కాదు, మనం కూడా “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనేవాళ్లం. (1 కొరిం. 15:32) అయితే మనం జీవితంలోని సుఖాలపై మనసుపెట్టం. బదులుగా నిత్యజీవ నిరీక్షణను అమూల్యంగా ఎంచుతూ, యెహోవాకు ఎల్లప్పుడూ ఇష్టంగా లోబడతాం.

20. యేసు పునరుత్థానం యెహోవా గొప్పతనానికి ఎలా నిదర్శనంగా ఉంది?

20 యేసు పునరుత్థానం, “తన్ను వెదకువారికి ఫలము దయచేయు” యెహోవా గొప్పతనానికి నిదర్శనం. (హెబ్రీ. 11:6) యేసును అమర్త్యమైన పరలోక జీవానికి పునరుత్థానం చేయడంలో యెహోవా ఎంత శక్తిని, జ్ఞానాన్ని చూపించాడో ఆలోచించండి! అంతేకాకుండా, వాగ్దానాలు నెరవేర్చే సామర్థ్యం తనకుందని కూడా యెహోవా రుజువు చేసుకున్నాడు. ఆ వాగ్దానాల్లో, విశ్వసర్వాధిపత్యపు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించే ఒక ప్రత్యేక ‘సంతానం’ గురించిన ప్రవచనాత్మక మాటలు కూడా ఉన్నాయి. ఆ వాగ్దానం నెరవేరాలంటే యేసు చనిపోవాలి, మళ్లీ బ్రతకాలి.—ఆది. 3:15.

21. పునరుత్థాన నిరీక్షణ గురించి మీరెలా భావిస్తున్నారు?

21 పునరుత్థానమనే ఖచ్చితమైన నిరీక్షణ ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎంతో రుణపడివున్నాం. లేఖనాలు ఈ భరోసా ఇస్తున్నాయి, “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” ఆ అద్భుతమైన భవిష్యత్తు గురించి నమ్మకస్థుడైన యోహానుకు చెబుతూ దేవుడిలా అన్నాడు, “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుము.” ఇంతకీ ఈ దర్శనం యోహానుకు ఎవరిచ్చారు? పునరుత్థానమైన యేసుక్రీస్తే.—ప్రక. 1:1; 21:3-5.