ఆనాటి జ్ఞాపకాలు
“నా ఇల్లు ఎప్పుడూ నాతోనే”
అమెరికా అంతటా, 1929 ఆగస్టు-సెప్టెంబరు మధ్యకాలంలో 9 రోజులపాటు సుడిగాలిలా సాగిన ఓ ప్రచార కార్యక్రమంలో 10,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు పాల్గొన్నారు. వాళ్లు ఆ ప్రచారంలో సుమారు రెండున్నర లక్షల పుస్తకాలను, చిన్న పుస్తకాలను ప్రజలకు అందించారు. ఆ రాజ్య ప్రచారకుల్లో దాదాపు వెయ్యిమంది కల్‌పోర్చర్లు కూడా ఉన్నారు. వాళ్ల సంఖ్య ఎంత అమాంతంగా పెరిగిందో! 1927-1929 మధ్య కాలాల్లో పయినీర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది ఊహకు అందని పెరుగుదల’ అని బులెటిన్ a చెప్పింది.
ఆ సంవత్సరం ఆఖర్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. బ్లాక్ ట్యూస్‌డేగా పిలువబడిన మంగళవారం రోజున అంటే, 1929 అక్టోబరు 29న, న్యూయార్క్ స్టాక్‌మార్కెట్ కుప్పకూలడంవల్ల తీవ్రమైన ఆర్థిక మాంద్యం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వేలాది బ్యాంకులు దివాలా తీశాయి. వ్యవసాయం దాదాపు స్తంభించిపోయింది. పెద్దపెద్ద ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. 1933లో ఒక్క అమెరికాలోనే, తీసుకున్న అప్పులు తీర్చని కారణంగా సగటున రోజుకు 1000 మంది ఇళ్లను జప్తు చేశారు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పూర్తికాల ప్రచారకులు ఎలా నెట్టుకురాగలిగారు? వాళ్లు తమ కార్లనే ఇళ్లుగా మలచుకుని అందులో నివసించడం మొదలుపెట్టారు. అద్దెలు, పన్నులు కట్టనక్కర్లేని అలాంటి హౌజ్ కార్లలో లేదా కదిలే ఇళ్లలో నివసించడం వల్ల చాలామంది పయినీర్లు అతి తక్కువ ఖర్చులతో పయినీరు సేవ చేయగలిగారు. b సమావేశాలప్పుడు అలాంటి కదిలే ఇళ్లే ఉచిత హోటల్ గదుల్లా పనికొచ్చేవి. చిన్నవైనా, సౌకర్యంగా ఉండే ఇళ్లుగా తమ కార్లను ఎలా మార్చుకోవచ్చో 1934లో వచ్చిన బులెటిన్ కొన్ని సలహాలు ఇచ్చింది. నీటి సరఫరా, స్టౌవ్, మడత మంచం వంటివాటిని కారులో ఎలా అమర్చుకోవాలో, చలి నుండి కాపాడుకోవడానికి ఏమి చేయాలో అది తెలియజేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది తెలివైన ప్రచారకులు అలా తమ వాహనాలను ఇళ్లుగా మార్చుకున్నారు. విక్టర్ బ్లాక్‌వెల్ అనే సహోదరుడు ఇలా గుర్తుచేసుకున్నాడు: ‘నోవహుకు ఓడ కట్టిన అనుభవం లేదు. అలాగే, నాకూ ఈ హౌజ్ కార్‌ను తయారుచేసే విషయంలో ఏ మాత్రం అనుభవం, అవగాహన లేవు.’ కానీ ఆయన దాన్ని తయారుచేశాడు.
ఏవరీ బ్రిస్టో, లోవీన్యాకు ఓ హౌజ్ కార్ ఉండేది. “నా ఇల్లు ఎప్పుడూ నాతోనే” అని ఏవరీ అన్నాడు. ఈ దంపతులు, హార్వీ కాన్రో, ఆన్‌లతో కలిసి పయినీరు సేవ చేశారు, వాళ్లు కూడా ఓ హౌజ్ కార్‌లో ఉండేవాళ్లు, ఆ ఇంటికి తారుతో చేసిన అట్టముక్కలే గోడలు. వాళ్ల వాహనం కదిలిన ప్రతీసారి ఆ అట్టముక్కలు ఊడి పడుతుండేవి. “అప్పటివరకు ఇలాంటి ట్రేయిలర్‌ను ఎవ్వరూ చూడలేదు, ఆ తర్వాత కూడా ఎవ్వరూ చూడలేదు” అని ఏవరీ గుర్తుచేసుకున్నాడు. కానీ ఇద్దరు అబ్బాయిలున్న కాన్రో దంపతులది “ఎంతో సంతోషకరమైన కుటుంబం” అని ఏవరీ అన్నాడు. హార్వీ కాన్రో ఇలా రాశాడు: “మాకు ఎప్పుడూ ఏ లోటు రాలేదు. యెహోవా సేవలో, ఆయన ప్రేమపూర్వక కాపుదలలో ఎంతో సురక్షితంగా ఉన్నట్లు భావించాం.” ఆ తర్వాత కాన్రో దంపతులు, వాళ్ల అబ్బాయిలు గిలియడ్ పాఠశాలకు హాజరై, మిషనరీలుగా పెరూలో సేవచేశారు.
బట్టాయినో కుటుంబంలోని వాళ్లు కూడా కలిసి పయినీరు సేవచేశారు. తమకు పిల్లలు పుట్టబోతున్నారని తెలుసుకున్న జుయిస్టో, విన్సెస్సాలు 1929 నాటి ఓ వాహనాన్ని తమ ఇంటిగా మార్చుకున్నారు, వాళ్లు అంతకుముందు నివసించిన గూడారాలతో పోలిస్తే అది “ఓ అందమైన హోటల్లా ఉండేది.” వాళ్లు తమ చంటిపాపను వెంటబెట్టుకుని, అమెరికాలో ఇటలీ భాష మాట్లాడే ప్రజలకు సువార్త ప్రకటించేవాళ్లు. అలా వాళ్లు తమకిష్టమైన ఆ పనిలో కొనసాగారు.
సువార్తను చాలామంది ప్రజలు వినేవాళ్లు, అయితే పేదవాళ్లు, నిరుద్యోగులు బైబిలు ప్రచురణలు తీసుకున్నప్పుడు చాలా అరుదుగా చందాలు ఇచ్చేవాళ్లు. డబ్బుకు బదులుగా వాళ్లు కొన్ని వస్తువులను ఇచ్చేవాళ్లు. ఆసక్తిగల వాళ్లు తమకు 64 రకాల వస్తువులను ఇచ్చారని ఇద్దరు పయినీర్లు చెప్పారు. ఆ వస్తువుల చిట్టా “షాపులో ఉండే సరుకుల చిట్టాలా ఉంది.”
ఫ్రెడ్ ఆండర్సన్ ఓ రైతుని కలిసినప్పుడు, ఆ రైతు మన సంస్థ ప్రచురించిన కొన్ని పుస్తకాలు కావాలని అడిగాడు. వాటికి చందాగా వాళ్ల అమ్మ వాడిన కళ్లజోడును ఇచ్చాడు. ఆ పక్క పొలంలో ఉన్న మరో ఆయన మన ప్రచురణలంటే ఆసక్తి చూపించినా, “వాటిని చదవడానికి నా దగ్గర కళ్లజోడు లేదు” అని ఫ్రెడ్‌తో చెప్పాడు. అయితే, మొదటి రైతు ఇచ్చిన కళ్లజోడును ఫ్రెడ్ ఈ రైతుకు ఇచ్చినప్పుడు ఆయన ప్రచురణలను చక్కగా చదవగలిగాడు. దాంతో ఆయన పుస్తకాలకు, కళ్లజోడుకు సంతోషంగా చందా ఇచ్చాడు.
హార్బట్ అబ్బోట్, తన కారులో ఒక చిన్న కోళ్ల గూడు తీసుకెళ్లేవాడు. చందాగా ఎవరైనా మూడు లేదా నాలుగు కోళ్లు ఇస్తే ఆయన వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి, అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో కారులో పెట్రోల్ కొట్టించేవాడు. “కొన్నిసార్లు మా దగ్గర డబ్బులుండేవి కావు. అలాంటి పరిస్థితుల్లోనూ మేము మా సేవను ఆపలేదు. యెహోవాపై నమ్మకం ఉంచుతూ, కారులో పెట్రోలు ఉంటే చాలు పరిచర్యకు వెళ్లిపోయేవాళ్లం” అని ఆయన రాశాడు.
యెహోవాపై ఆధారపడడం వల్ల, దృఢ సంకల్పం వల్ల ఆయన ప్రజలు అలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ సేవను కొనసాగించగలిగారు. ఓసారి కుండపోత వర్షంలో, ఒక పెద్ద చెట్టు మాక్స్‌వెల్, ఎమ్మీ లూయిస్‌లు ఉంటున్న వాహనం మీద పడడంతో అది రెండు ముక్కలైంది. అయితే, వాళ్లు దానిలోనుండి బయటకు దూకి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. “ఇలాంటి వాటిని కేవలం సంఘటనలుగానే చూశాం తప్ప అడ్డంకులుగా కాదు. అందుకే, సేవ ఆపేయాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది కాబట్టి ఆ పనిని మేము చేయాలనుకున్నాం” అని మాక్స్‌వెల్ రాశాడు. ఇంత జరిగినా మాక్స్‌వెల్, ఎమ్మీలు ఏ మాత్రం జడియకుండా, ప్రేమగల స్నేహితుల సహాయంతో తమ కదిలే ఇంటిని మళ్లీ నిర్మించుకున్నారు.
ప్రస్తుతం ఉన్న కష్ట కాలాల్లోనూ లక్షలాదిమంది ఉత్సాహవంతులైన యెహోవాసాక్షులు అలాంటి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ప్రకటన పని ముగిసిందని యెహోవా చెప్పేంతవరకు ఆ పనిని చేస్తూనే ఉండాలని ఆ నాటి పయినీర్లలానే మనం కూడా గట్టిగా నిశ్చయించుకున్నాం.