సువార్తికులుగా మీ పనిని నిర్వర్తించండి
“సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.”—2 తిమో. 4:5.
1. యెహోవా దేవుడే మొట్టమొదటి సువార్తికుడని మనమెలా చెప్పవచ్చు?
సువార్త ప్రకటించేవాడే సువార్తికుడు. యెహోవా దేవుడే మొట్టమొదటి సువార్తికుడు. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన వెంటనే, దానికి కారణమైన సర్పము అంటే అపవాదియైన సాతాను నాశనం చేయబడతాడనే శుభవార్తను యెహోవా ప్రకటించాడు. (ఆది. 3:15) గడిచిన శతాబ్దాల్లో నమ్మకస్థులైన మనుష్యులను ప్రేరేపించి యెహోవా ప్రాముఖ్యమైన విషయాలను రాయించాడు. తన నామానికి కలిగిన కళంకాన్ని తొలగించడం, సాతాను వల్ల జరిగిన నష్టాన్ని పూరించడం, ఆదాముహవ్వలు చేజార్చుకున్న అవకాశాలను మనందరం తిరిగి సంపాదించుకోవడం ఎలా జరుగుతాయో ఆయన రాయించాడు.
2. (ఎ) సువార్త పనికి సంబంధించి దేవదూతలు ఏ పాత్రను పోషిస్తారు? (బి) సువార్త పని చేసే మానవులకు యేసు ఏ ప్రమాణాన్ని ఏర్పరిచాడు?
2 దేవదూతలు కూడా సువార్తికులే. వాళ్లు సువార్తను ప్రకటించడమే కాక దాన్ని వ్యాప్తి చేయడంలో ఇతరులకు సహాయం చేస్తారు. (లూకా 1:19; 2:10; అపొ. 8:26, 27, 35; ప్రక. 14:6) మరి ప్రధానదూతైన మిఖాయేలు మాటేమిటి? యేసుగా భూమ్మీద ఉన్నప్పుడు, సువార్త ప్రకటించే మానవులకు ఆయన ఓ ప్రమాణాన్ని ఏర్పరిచాడు. అంతెందుకు, సువార్త వ్యాప్తి చేయడానికే యేసు తన జీవితాన్ని అంకితం చేశాడు!—లూకా 4:16-21.
3. (ఎ) మనం ప్రకటించే సువార్త ఏంటి? (బి) సువార్తికులమైన మనం ఏ ప్రశ్నలు పరిశీలించాలి?
3 సువార్త పని చేయమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20; అపొ. 1:8) అపొస్తలుడైన పౌలు తన తోటిపనివాడైన తిమోతికి ఇలా ఉపదేశించాడు: “సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (2 తిమో. 4:5) యేసు అనుచరులుగా మనం ప్రకటించే సువార్త ఏంటి? మన పరలోక తండ్రి యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ప్రకటిస్తాం. (యోహా. 3:16; 1 పేతు. 5:7) యెహోవా దేవుడు తన ప్రేమను చూపించే ఒక ప్రాముఖ్యమైన మార్గం ఆయన రాజ్యమే. అందుకే యెహోవా రాజ్యానికి కట్టుబడి, ఆయనకు లోబడి, ఆయన నీతిని అనుసరించే వాళ్లు ఆయనతో మంచి స్నేహబంధాన్ని ఏర్పర్చుకోవచ్చని మనం సంతోషంగా ఇతరులకు చెబుతాం. (కీర్త. 15:1, 2) నిజానికి, మనుష్యులు అన్యాయంగా అనుభవిస్తున్న బాధనంతటినీ తీసివేయాలని యెహోవా సంకల్పించాడు. బాధపెట్టే జ్ఞాపకాలను కూడా ఆయన తీసివేస్తాడు. ఎంతటి మంచి వార్త ! (యెష. 65:17) మనం సువార్తికులం కాబట్టి, రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను ఇప్పుడు పరిశీలిద్దాం: నేడు ప్రజలు సువార్తను వినడం ఎందుకు ప్రాముఖ్యం? సువార్తికులుగా మనం మన పనిని ఎలా సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు?
ప్రజలు సువార్తను వినడం ఎందుకు ప్రాముఖ్యం?
4. చాలామంది దేవుని విషయంలో ప్రజలకు ఎలాంటి కాకమ్మ కథలు చెబుతున్నారు?
4 మీ నాన్న మీ కుటుంబాన్ని గాలికొదిలేసి వెళ్లిపోయాడని ఎవరైనా మీకు చెప్పారని ఊహించుకోండి. మీ నాన్నకు పరిచయస్థులమని చెప్పుకుంటున్న వాళ్లు, ఆయన అందరికీ దూరంగా ఉంటాడని, తన గుట్టుమట్లు ఎవ్వరికీ తెలియనీయడని, మనసులేని మనిషని మీకు చెప్పారు. కొంతమంది, మీ నాన్న చనిపోయాడు కాబట్టి ఆయనను కలవడానికి ప్రయత్నించడం దండగ అని కూడా మిమ్మల్ని నమ్మించవచ్చు. ఒకరకంగా, దేవుని విషయంలో చాలామంది అలాంటి కాకమ్మ కథలే చెబుతారు. దేవుణ్ణి తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదని, ఆయన క్రూరుడని, ఆయన ఓ మర్మమని వాళ్లు బోధిస్తారు. ఉదాహరణకు, దేవుడు చెడ్డవాళ్లను ఓ స్థలంలో ఉంచి నిరంతరం చిత్రహింసలు పెడతాడని కొంతమంది మతనాయకులు చెబుతుంటారు. ఇంకొంతమంది, ప్రకృతి విపత్తుల వల్ల కలిగే ఆపదలకు దేవుడే కారణమని చెబుతారు. వీటివల్ల చెడ్డవాళ్లతోపాటు మంచివాళ్లు కూడా చనిపోతున్నా, అది దేవుడు విధిస్తున్న శిక్షేనని చెబుతారు.
5, 6. పరిణామ సిద్ధాంతం, మరితర అబద్ధ సిద్ధాంతాలు ప్రజలకు ఎలా నష్టాన్ని కలిగిస్తున్నాయి?
5 అసలు దేవుడే లేడని కొంతమంది బల్లగుద్ది వాదిస్తారు. ఉదాహరణకు, పరిణామ సిద్ధాంతాన్నే తీసుకోండి. జీవం దానంతట అదే ఆవిర్భవించిందని, జ్ఞానం గల సృష్టికర్తంటూ ఎవరూ లేరని పరిణామ వాదులు చెబుతుంటారు. మనిషి కూడా ఓ జంతువేనని, అందుకే మనుష్యులు మృగంలా ప్రవర్తించినప్పుడు ఆశ్చర్యపోనవసరం లేదని ఇంకొంతమంది చెబుతుంటారు. బలవంతులు బలహీనులను క్రూరంగా అణగద్రొక్కినప్పుడు, అది ప్రకృతి నియమాల ప్రకారమే జరుగుతుందని వాళ్లు వాదిస్తుంటారు. అందుకే, మనుష్యులున్నంత కాలం అన్యాయం ఉండనే ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇలాంటి తర్కాల వల్ల, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లకు నిజమైన నిరీక్షణంటూ ఏదీ ఉండదు.
6 నిస్సందేహంగా పరిణామ సిద్ధాంతం, మరితర అబద్ధ సిద్ధాంతాలు ఈ అంత్యదినాల్లో మానవాళి దీనావస్థకు ఆజ్యం పోశాయి. (రోమా. 1:28-31; 2 తిమో. 3:1-5) మనుష్యులు పుట్టించిన ఈ బోధలు, శాశ్వత ప్రయోజనాల్నిచ్చే నిజమైన సువార్తను ప్రజలకు అందించలేకపోయాయి. బదులుగా, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, అలాంటివాళ్లు ప్రజలకు “అంధకారమైన మనస్సు” కలగజేస్తూ “దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన” వాళ్లుగా ఉన్నారు. (ఎఫె. 4:17-19) ఇది చాలనట్టు, దేవుని నుండి వచ్చే సువార్తను అంగీకరించకుండా పరిణామ సిద్ధాంతం, తదితర అబద్ధ సిద్ధాంతాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.—ఎఫెసీయులు 2:11-13 చదవండి.
7, 8. సువార్తను ప్రజలు పూర్తిగా అర్థంచేసుకునే ఏకైక మార్గం ఏమిటి?
7 దేవునితో సమాధానపడేందుకు ప్రజలు మొదట, యెహోవా ఉన్నాడని, ఆయనకు సన్నిహితమయ్యేందుకు మంచి కారణాలే ఉన్నాయని తప్పకుండా నమ్మాలి. సృష్టిని పరిశీలించమని ప్రోత్సహించడం ద్వారా అవేంటో తెలుసుకునేలా మనం వాళ్లకు సహాయం చేయవచ్చు. ప్రజలు తమ సొంత అభిప్రాయాల్నే పట్టుకువేలాడకుండా సృష్టిని పరిశీలించినప్పుడు దేవుని జ్ఞానం, శక్తి గురించి నేర్చుకుంటారు. (రోమా. 1:19, 20) మన గొప్ప సృష్టికర్త చేసినవాటి గురించి ఆలోచించినప్పుడు ప్రజల్లో భక్తిపూర్వక భయం కలిగేలా, జీవం సృష్టించబడిందా? (ఆంగ్లం) బ్రోషురును, అలాగే జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఆంగ్లం) బ్రోషురును మనం ఉపయోగించవచ్చు. అయినా, సృష్టిని పరిశీలించినంత మాత్రాన జీవితానికి సంబంధించిన ఇలాంటి కలవరపెట్టే ప్రశ్నలకు జవాబులు కనుక్కోలేరు: దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి? నా పట్ల దేవునికి శ్రద్ధ ఉందా?
8 దేవుని గురించిన, ఆయన సంకల్పం గురించిన సువార్తను ప్రజలు పూర్తిగా అర్థంచేసుకునే ఏకైక మార్గం బైబిలు అధ్యయనం చేయడమే. తమ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేయడం మనకు దొరికిన గొప్ప అవకాశం. అయితే, మనం శ్రోతల హృదయాన్ని చేరుకోవాలంటే, వాస్తవాలను తెలియజేస్తే సరిపోదుగానీ వాళ్లను ఒప్పించాలి. (2 తిమో. 3:14, 15) యేసు మాదిరిని అనుకరిస్తే మనం ఒప్పించే కళను మరింత మెరుగుపర్చుకోవచ్చు. ఆయన ప్రజల్ని అంత చక్కగా ఎలా ఒప్పించగలిగాడు? ఒకటి, ఆయన ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించాడు. మరి, ఆయనను మనమెలా అనుకరించవచ్చు?
సత్ఫలితాలు సాధించే సువార్తికులు ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు
9. ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం అందించాలంటే మనమేమి చేయాలి?
9 సువార్త పనిలో మనం యేసులా ప్రశ్నలు ఎందుకు ఉపయోగించాలి? ఈ సందర్భాన్ని పరిశీలిద్దాం: ఒక ఆపరేషన్ చేయించుకుంటే మీ జబ్బు నయమౌతుందనే మంచివార్త డాక్టరు చెప్పాడనుకుందాం. ఆయన చెప్పింది మీరు నమ్మవచ్చు. కానీ, మీ జబ్బు తాలూకు లక్షణాలు కనుక్కోవడానికి ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే మీకు ఆపరేషన్ చేస్తానంటే అప్పుడేమిటి? మీరు ఆయనను నమ్మకపోవచ్చు. ఆ డాక్టరు ఎంతటి గొప్ప నిపుణుడైనా, మీకు సహాయం చేయాలంటే ముందుగా ఆయన ప్రశ్నలు వేసి మీ రోగ లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. అదే విధంగా, ప్రజలు రాజ్య సువార్తను అంగీకరించేలా వాళ్లకు సహాయం చేయాలంటే మనం కూడా సమర్థవంతంగా ప్రశ్నలు వేసే కళలో ఆరితేరాలి. వాళ్ల ఆధ్యాత్మిక స్థితి గురించి స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాతే మనం వాళ్లకు సహాయం చేయగలం.
శ్రోతల హృదయాన్ని చేరుకోవాలంటే, వాళ్లను ఒప్పించాలి
10, 11. యేసులా బోధిస్తే మనం ఏం సాధించగలం?
10 సందర్భానికి తగిన ప్రశ్నలు వేస్తే విద్యార్థి గురించి బోధకునికి తెలియడమే కాక విద్యార్థికి ఆ చర్చ అంతటిలో పాలుపంచుకునే అవకాశం ఉంటుందని యేసుకు తెలుసు. ఉదాహరణకు, వినయం గురించి తన శిష్యులకు బోధించాలనుకున్నప్పుడు, యేసు ముందుగా ఆలోచింపజేసే ప్రశ్న వేశాడు. (మార్కు 9:34) సూత్రాల ఆధారంగా ఆలోచించడమెలాగో పేతురుకు నేర్పించడానికి, యేసు ఓ బహుళైచ్ఛిక (మల్టిపుల్-ఛాయిస్) ప్రశ్న వేశాడు. (మత్త. 17:24-26) ఇంకో సందర్భంలో, ఆయన తన శిష్యుల హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, అభిప్రాయాలను రాబట్టే పలు ప్రశ్నలను వేశాడు. (మత్తయి 16:13-17 చదవండి.) ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా, సూటిగా చెప్పడం ద్వారా యేసు వాస్తవాలను వెల్లడి చేయడం కన్నా ఎక్కువే చేశాడు. సువార్తకు అనుగుణంగా నడుచుకునేలా ప్రేరేపించి యేసు ప్రజల హృదయాలను స్పృశించాడు.
11 యేసులా మనం ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు, మనం కనీసం మూడిటిని చేస్తాం. అత్యుత్తమ రీతిలో ప్రజలకు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకుంటాం, పరిచర్యలో మన సంభాషణను అర్థాంతరంగా ఆపుజేసే వాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం. అంతేకాదు, తమకు ప్రయోజనం కలిగే విధంగా ఎలా నడుచుకోవచ్చో వినయస్థులకు బోధిస్తాం. సమర్థవంతంగా ప్రశ్నలు ఉపయోగించగల మూడు సన్నివేశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
12-14. మీ పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో సువార్తను ప్రకటించేందుకు మీరెలా సహాయం చేయవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.
12 సన్నివేశం 1: తమ క్లాస్‌మేట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, సృష్టికర్త గురించి తమ నమ్మకాలను సమర్థించుకోవడం కష్టంగా ఉందని మీ పిల్లలు చెబితే మీరు ఏం చేస్తారు? రాజ్యసువార్తను ఇతరులకు ప్రకటించే విషయంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేందుకు మీ పిల్లలకు మీరు తప్పక సహాయం చేయాలనుకుంటారు. కాబట్టి, మీ పిల్లలను విమర్శించే బదులు లేదా వెంటనే సలహాలు ఇచ్చే బదులు, యేసులా అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్నలు అడగవచ్చేమో ఆలోచించండి. ఇంతకీ మీరు దాన్ని ఎలా చేయవచ్చు?
13 జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఆంగ్లం) బ్రోషురులో ఉన్న కొంత సమాచారాన్ని మీ పిల్లలతో కలిసి చదివిన తర్వాత, అందులో ఏ తర్కాలు బాగా ఆలోచింపజేసేలా ఉన్నాయో వాళ్లను అడగవచ్చు. సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారో, దేవుని చిత్తం ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పమని మీ పిల్లలను అడగండి. (రోమా. 12:2) ఆ విషయంలో మీకున్న కారణాలే వాళ్లకూ ఉండనవసరం లేదని మీ పిల్లలకు తెలిసేలా చేయండి.
14 మీరు ఇంటి దగ్గర చేసి చూపించినట్లే తమ క్లాస్‌మేట్స్‌తో మాట్లాడమని మీ పిల్లలకు చెప్పండి. అంటే, మీ పిల్లలు తమ క్లాస్‌మేట్స్‌తో కలిసి కొన్ని వాస్తవాలను పరిశీలించిన తర్వాత, నిర్ధారణకు వచ్చేలా చేసే లేదా అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్నలను అడగవచ్చు. ఉదాహరణకు, జీవం సృష్టించబడిందా? (ఆంగ్లం) బ్రోషురులోని 21వ పేజీలో ఉన్న బాక్సును చదవమని మీ పిల్లలు తమ క్లాస్‌మేట్‌ను కోరవచ్చు. మీ పిల్లలు ఇలా ప్రశ్నించవచ్చు: “సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే విషయంలో మన డీ.ఎన్.ఏ (DNA-డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం)తో నేటి కంప్యూటర్ యుగంలో సాటిరాగలది ఏదీ లేదన్నది నిజమేనా?” అందుకు వాళ్లు అవునని సమాధానమివ్వవచ్చు. అప్పుడు మీ పిల్లలు ఇలా అడగవచ్చు: “కంప్యూటర్ నిపుణులే అలాంటివి సాధించలేనప్పుడు, తెలివిలేని ఓ పదార్థం దానంతట అదే ఎలా సాధించగలదు?” మీ పిల్లలు వాళ్ల నమ్మకాల గురించి మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా, మీరు దగ్గరుండి వాళ్లతో క్రమంగా సాధన చేయించండి. చక్కని ప్రశ్నలు వేయడం పిల్లలకు నేర్పిస్తే, వాళ్లను సమర్థవంతమైన సువార్తికులుగా తయారుచేయవచ్చు.
15. నాస్తికునితో మాట్లాడేటప్పుడు మనం ఎలాంటి ప్రశ్నలు వేయవచ్చు?
15 సన్నివేశం 2: ‘దేవుడు అసలు ఉన్నాడా?’ అని అనుమానించే వాళ్లు మనకు పరిచర్యలో తారసపడవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తాను నాస్తికుణ్ణని చెప్పవచ్చు. అప్పుడు సంభాషణను అర్థాంతరంగా ఆపేసే బదులు, ఆయన ఎంతకాలం నుండి నాస్తికునిగా ఉన్నాడో, అందుకుగల కారణాలేమిటో చెప్పమని మీరు మర్యాదపూర్వకంగా అడగవచ్చు. ఆయన చెప్పేది శ్రద్ధగా విని, ఆ విషయం గురించి లోతుగా ఆలోచించినందుకు ఆయన్ని మెచ్చుకోండి. ఆ తర్వాత, జీవం సృష్టించబడిందని చూపించే రుజువులున్న సమాచారాన్ని చదవడానికి ఆయనకేమైనా అభ్యంతరం ఉందేమో అడగవచ్చు. ఆయన సొంత అభిప్రాయాలను పట్టుకువేలాడే తత్వం లేనివాడైతే, అలాంటి సాక్ష్యాలను పరిశీలించడానికి నిరాకరించడం మూర్ఖత్వమౌతుందని ఆయనే ఒప్పుకోవచ్చు. జీవం సృష్టించబడిందా? (ఆంగ్లం) బ్రోషురును లేదా జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఆంగ్లం) బ్రోషురును మీరు ఆయనకు ఇవ్వవచ్చు. మర్యాదపూర్వకంగా, నేర్పుగా అడిగే ప్రశ్నలు సువార్తకు స్పందించేలా ఓ వ్యక్తి హృదయాన్ని తెరిచే తాళంచెవుల్లా పనిచేస్తాయి.
16. బైబిలు విద్యార్థితో అధ్యయన పుస్తకంలోని జవాబులను చదివి చెప్పించడంతోనే మనం ఎందుకు సరిపెట్టుకోకూడదు?
16 సన్నివేశం 3: బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, అధ్యయన పుస్తకంలోని జవాబుల్నే మీ విద్యార్థితో చెప్పిస్తే సరిపోతుందని మీరనుకోవచ్చు. అయితే, అలా చేయడం వల్ల మీ విద్యార్థి ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడుతుంది. ఎందుకు? విద్యార్థి ధ్యానించకుండా కేవలం జవాబులను చూసి చెబుతుంటే, అతని ఆధ్యాత్మిక వేళ్లు అంతగా చొచ్చుకుపోవు. అలాంటి విద్యార్థి, వ్యతిరేకతా సెగలు తగిలినప్పుడు, ఇట్టే వాడిపోయే ప్రమాదముంది. (మత్త. 13:20, 21) అలా జరుగకూడదంటే, తాను నేర్చుకుంటున్న విషయాల పట్ల ఆయన అభిప్రాయాన్ని చెప్పమని విద్యార్థిని అడగాలి. మీరు చెబుతున్నవాటితో ఆయన ఎంత వరకు ఏకీభవిస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పినా, దానికి గల కారణాల్ని అడిగి తెలుసుకోవడం అన్నిటికంటే ప్రాముఖ్యం. లేఖనాధారంగా తర్కించేలా, చివరకు తనంతట తానే సరైన నిర్ధారణకు వచ్చేలా మీ బైబిలు విద్యార్థికి సహాయం చేయండి. (హెబ్రీ. 5:14) మనం ప్రశ్నల్ని సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు, విద్యార్థులు విశ్వాసంలో బలంగా వేరుపారి, వ్యతిరేకుల లేదా తప్పుదోవ పట్టించేవాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టేలా తయారవ్వొచ్చు. (కొలొ. 2:6-8) సువార్తికులుగా సత్ఫలితాలను సాధించడానికి మనం ఇంకా ఏం చేయవచ్చు?
సత్ఫలితాలు సాధించే సువార్తికులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు
17, 18. తోటి సహోదరునితో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, మీరిద్దరు ఒక జట్టులా ఎలా పనిచేయవచ్చు?
17 యేసు తన శిష్యుల్ని ప్రకటనాపని కోసం ఇద్దరిద్దరి చొప్పున పంపాడు. (మార్కు 6:7; లూకా 10:1) కొన్నేళ్లకి, ‘సువార్తపనిలో తనతో పాటు ప్రయాసపడిన సహకారుల’ గురించి అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఫిలి. 4:3) లేఖనాల్లోని ఆ ఉదాహరణలను బట్టి, పరిచర్యలో ఇతరులకు తర్ఫీదునిచ్చేందుకు రాజ్య ప్రచారకులు 1953లో ఓ శిక్షణా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
18 తోటి సహోదరునితో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, మీరిద్దరు ఒక జట్టులా ఎలా పనిచేయవచ్చు? (1 కొరింథీయులు 3:6-9 చదవండి.) మీ సహోదరుడు లేఖనాలు తీసి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా బైబిలు తీసి చూడండి. మీ సహోదరుడుగానీ ఇంటివాళ్లుగానీ మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వినండి. అవసరమైనప్పుడు సహాయం అందించగలిగేలా, సంభాషణను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. (ప్రసం. 4:12) అయితే, మీ సహోదరుడు చక్కగా తర్కిస్తున్నప్పుడు, మధ్యలో కలుగజేసుకోవాలనే ఆత్రాన్ని అణచుకోండి. అలా అణచుకోకపోతే, ఆయన నిరుత్సాహపడవచ్చు, ఇంటివాళ్లు అయోమయానికి గురికావచ్చు. చర్చలో పాల్గొనడం కొన్ని సందర్భాల్లో సబబే. అయితే ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, ఒకట్రెండు వాక్యాల్లో ముగించండి. ఆ తర్వాత, సంభాషణను కొనసాగించే అవకాశాన్ని సదరు సహోదరునికే వదిలి పెట్టండి.
19. మనం ఏమి గుర్తుంచుకోవడం మంచిది?
19 పరిచర్యలో ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్తున్నప్పుడు, ఒకరికొకరు ఎలా సహకరించుకోవచ్చు? పరిచర్యలో ఇంకా మెరుగ్గా మాట్లాడడానికి ఏమి చేయవచ్చో చర్చించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పరిచర్య చేస్తున్న ప్రాంతంలోని ప్రజల గురించి నిరుత్సాహకరమైన విషయాలు మాట్లాడుకోకుండా జాగ్రత్తపడండి. తోటి సువార్తికుల్లోని లోపాల గురించి చర్చించుకోకండి. (యాకో. 4:11) మనం మంటి ఘటములమని గుర్తుంచుకోవడం మంచిది. సువార్త పరిచర్య అనే ఐశ్వర్యాన్ని మనకు అప్పగించి, యెహోవా దేవుడు మనపట్ల ఎనలేని కృపను చూపించాడు. (2 కొరింథీయులు 4:1, 7 చదవండి.) కాబట్టి, మనందరం సువార్తికులుగా మనం చేయగలిగినదంతా చేస్తూ ఆ ఐశ్వర్యం పట్ల కృతజ్ఞత చూపిద్దాం.