కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఓదార్పు పొందండి, ఇతరుల్ని ఓదార్చండి

ఓదార్పు పొందండి, ఇతరుల్ని ఓదార్చండి

మనమందరం అపరిపూర్ణులం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు అనారోగ్యం పాలైవుంటాం, మనలో కొందరైతే తీవ్ర అనారోగ్యంతో కూడా బాధపడి ఉంటారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైతే మనం ఎలా తాళుకోవచ్చు?

కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి విశ్వాసులు అందించే ఓదార్పు ఆ పరిస్థితుల్ని తాళుకోవడానికి ఎంతో సహాయం చేస్తుంది.

స్నేహితులు ప్రేమగా, దయగా మాట్లాడినప్పుడు, ఆ మాటలు ఉపశమనాన్ని ఇచ్చి తిరిగి కోలుకోవడానికి తోడ్పడతాయి. (సామె. 16:24; 18:24; 25:11) కానీ నిజ క్రైస్తవులు కేవలం ఓదార్పు పొందడం గురించి మాత్రమే ఆలోచించరు. ‘దేవుడు [తమను] ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు’ క్రైస్తవులు చొరవ తీసుకుంటారు. (2 కొరిం. 1:4; లూకా 6:31) మెక్సికోలో జిల్లా పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఆంటోన్యో దాన్ని స్వయంగా చవిచూశాడు.

ఆంటోన్యోకి లింఫోమా అనే రక్త క్యాన్సర్‌ ఉందని పరీక్షల్లో తేలినప్పుడు ఆయన ఎంతగానో కుమిలిపోయాడు. అయినప్పటికీ ఆ కృంగుదలను అధిగమించడానికి ఎంతో కృషిచేశాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడు? రాజ్య గీతాల్ని జ్ఞాపకం తెచ్చుకుని వాటిని పాడడానికి ప్రయత్నించేవాడు. అలా వాటిలోని పదాల్ని వింటూ ధ్యానించేవాడు. అంతేకాక బైబిలు చదవడం, బిగ్గరగా ప్రార్థించడం కూడా ఆయనకు ఎంతో ఓదార్పునిచ్చింది.

అయితే, ముఖ్యంగా తోటి విశ్వాసుల నుండే ఎక్కువ ఓదార్పు లభించిందని ఆంటోన్యో అంటున్నాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నేను, నా భార్య తీవ్రంగా కృంగిపోయినప్పుడు, సంఘపెద్దగా సేవచేస్తున్న మా బంధువును మాతో కలిసి ప్రార్థించడానికి ఇంటికి పిలిచేవాళ్లం. దాంతో మేం ఓదార్పును మనశ్శాంతిని పొందేవాళ్లం.” ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు: “మా కుటుంబ సభ్యులు, తోటి విశ్వాసులు చేసిన సహాయానికి వాళ్లకెంతో కృతజ్ఞతలు, దానివల్ల తక్కువ సమయంలోనే కృంగుదల నుండి బయటపడ్డాం.” అంతగా ప్రేమించే, అవసరంలో అండగా నిలిచే స్నేహితులు ఉన్నందుకు ఆయన వాళ్లపట్ల ఎంత కృతజ్ఞత చూపించాడు!

పరిశుద్ధాత్మ కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతగానో సహాయం చేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ ఒక “వరము” అని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (అపొ. 2:38) అది దేవుడు ఉచితంగా ఇచ్చే వరమని సా.శ. 33 పెంతెకొస్తునాడు చాలామంది అభిషేకింపబడినప్పుడు రుజువైంది. పేతురు అభిషిక్తుల గురించే మాట్లాడినా, పరిశుద్ధాత్మ వరాన్ని పొందే అవకాశం మనందరికీ ఉంది. ఆ వరం అంతులేనంతగా అందుబాటులో ఉంది, దాన్ని మెండుగా దయచేయమని అడగడమే మన పని!—యెష. 40:28-31.

బాధల్లో ఉన్నవారిని మనస్ఫూర్తిగా పట్టించుకోండి

అపొస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్ని కూడా ఎదుర్కొన్నాడు. (2 కొరిం. 1:8-10) అయితే పౌలు చావును గురించి అతిగా ఆందోళనపడలేదు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనసులో ఉంచుకుని పౌలు ఓదార్పు పొందేవాడు. ఆయన ఇలా రాశాడు: “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక . . . ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” (2 కొరిం. 1:3, 4) పౌలు సమస్యల వల్ల కృంగిపోలేదు. కానీ తాను పొందిన శ్రమల వల్ల ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం నేర్చుకున్నాడు. దానివల్ల, అవసరంలో ఉన్న వాళ్లకు మరింత ఓదార్పు ఇవ్వగలిగాడు.

ఆంటోన్యో అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత, ప్రయాణ సేవను తిరిగి కొనసాగించాడు. ఆయన అంతకుముందు తోటి విశ్వాసుల పట్ల శ్రద్ధ చూపేవాడు. అయితే ఆ తర్వాత, అనారోగ్యంతో ఉన్న వాళ్లను కలుసుకొని ప్రోత్సహించడానికి ఆయన, ఆయన భార్య ప్రత్యేకంగా కృషి చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక సహోదరుణ్ణి సందర్శించిన తర్వాత, ఆయనకు కూటాలకు వెళ్లాలనిపించడం లేదని ఆంటోన్యోకి అర్థమైంది. ఆంటోన్యో ఇలా వివరిస్తున్నాడు: “ఆయన యెహోవాను, తోటి సహోదరుల్ని ప్రేమించట్లేదని కాదుగానీ, ఆ అనారోగ్యం ఆయనను ఎంతగా కృంగదీసిందంటే ఇక తాను ఎందుకూ పనికిరానని అనుకోవడం మొదలుపెట్టాడు.”

ఆంటోన్యో ఆ సహోదరుణ్ణి ప్రోత్సహించడానికి, సహోదరులు చేసుకున్న ఒక చిన్న పార్టీలో ఆయన్నే ప్రార్థన చేయమని అడిగాడు. అందుకు తాను తగినవాణ్ణి కానని అనుకున్నప్పటికీ ప్రార్థన చేయడానికి ఆయన అంగీకరించాడు. ఆంటోన్యో ఆ సందర్భం గురించి ఇలా చెబుతున్నాడు: “ఆయన ఎంతో చక్కగా ప్రార్థించాడు. ఆ ప్రార్థన తర్వాత ఆయన పూర్తిగా ఓ కొత్త వ్యక్తిలా కనిపించాడు. తాను మళ్లీ యెహోవా సేవలో ఉపయోగపడగలనని భావించడం మొదలుపెట్టాడు.”

అవును, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకవిధమైన బాధను మనందరం అనుభవించే ఉంటాం. అయితే పౌలు చెప్పినట్లు, ఆ అనుభవంతో మనం అవసరంలో ఉన్నవారిని ఓదార్చగలుగుతాం. కాబట్టి తోటి క్రైస్తవులు బాధలు అనుభవిస్తున్నప్పుడు వెంటనే చొరవ తీసుకొని, వాళ్లను ఓదారుస్తూ మన దేవుడైన యెహోవాను అనుకరిద్దాం.