‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాపై నమ్మకం ఉంచండి
‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాపై నమ్మకం ఉంచండి
‘దేవుడు కాలములను, సమయములను మారుస్తున్నాడు, రాజులను త్రోసివేస్తున్నాడు, నియమిస్తున్నాడు.’—దాని. 2:21.
మీరెలా జవాబిస్తారో చూడండి:
యెహోవా చేసిన సృష్టి, గతంలో నెరవేరిన ప్రవచనాలు ఆయన గొప్ప సమయపాలకుడని ఎలా నిరూపిస్తున్నాయి?
యెహోవా ‘కాలములకు, సమయములకు’ దేవుడని గుర్తిస్తే మనం ఏమి చేస్తాం?
లోకంలో జరుగుతున్న సంఘటనలు, మానవ ప్రణాళికలు యెహోవా సంకల్పం నెరవేరడాన్ని ఎందుకు ఆపలేవు?
1, 2. సమయాన్ని యెహోవా పూర్తిగా అర్థంచేసుకోగలడని ఏది చూపిస్తోంది?
యెహోవా దేవుడు మానవుణ్ణి సృష్టించడానికి ఎంతోకాలం ముందే, సమయాన్ని లెక్కించేందుకు వీలు కల్పించాడు. నాల్గవ సృష్టి దినాన యెహోవా ఇలా అన్నాడు, ‘పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాక, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక.’ (ఆది. 1:14, 19, 26) యెహోవా అన్నట్లుగానే అంతా జరిగింది.
2 శాస్త్రవేత్తలు సమయం అంటే ఏమిటో ఇప్పటికీ వివరించలేకపోతున్నారు. ఒక ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది, “ప్రపంచంలోని అత్యంత గొప్ప మర్మాల్లో సమయం ఒకటి. సమయం అంటే ఏమిటో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు.” అయితే, సమయాన్ని యెహోవా పూర్తిగా అర్థంచేసుకోగలడు. ఎంతైనా ఆయన ‘ఆకాశములకు సృష్టికర్త. ఆయనే భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపర్చాడు.’ అంతేకాక, “కలుగబోవువాటిని తెలియజేసేది, పూర్వకాలమునుండి ఇంకా జరుగనివాటిని తెలియజేసేది” కూడా ఆయనే. (యెష. 45:18; 46:10) ఆయన చేసిన సృష్టి, గతంలో నెరవేరిన ప్రవచనాలు ఆయన గొప్ప సమయపాలకుడని ఎలా రుజువు చేస్తున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. అప్పుడు ఆయనపై, ఆయన వాక్యమైన బైబిలుపై మన నమ్మకం బలపడుతుంది.
సృష్టిని పరిశీలిస్తే గొప్ప సమయపాలకునిపై విశ్వాసం కలుగుతుంది
3. యెహోవా చేసిన భౌతిక సృష్టిలోని ప్రతీ దాంట్లో సమయపాలన ఉందని ఎలా చెప్పవచ్చు?
3 ఈ భౌతిక విశ్వంలో చిన్నది పెద్దది అనే తేడా లేకుండా ప్రతీ దాంట్లో నిర్దిష్టమైన సమయపాలన కనిపిస్తుంది. ఉదాహరణకు, పరమాణువులు ఒకే సమయ పరిమితుల్లో కదులుతుంటాయి. పరమాణువుల కదలికల ఆధారంగా నడిచే ప్రత్యేకమైన గడియారాల్లో, 8 కోట్ల సంవత్సరాలు గడిచినా ఒక్క క్షణం కూడా తేడా రాదు. గ్రహాల, నక్షత్రాల కదలికలకు కూడా నిర్దిష్టమైన సమయం ఉంది. విశ్వంలో అవి ఒక స్థలం నుండి మరో స్థలానికి కదిలినప్పుడు అవి ఎక్కడుంటాయనేది ముందుగానే పసిగట్టడం వల్ల మనం కాలాలను తెలుసుకోగలుగుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నప్పుడు దిశను కనుక్కోగలుగుతున్నాం. ఆధారపడదగిన ఈ సహజ “గడియారాలను” సృష్టించిన యెహోవా “అధికశక్తి” గలవాడు, ఆయన మన స్తుతికి అర్హుడు.—యెషయా 40:26 చదవండి.
4. సృష్టిలోని వివిధ ప్రాణుల సమయపాలన దేవునికి ఉన్న జ్ఞానాన్ని ఎలా రుజువుచేస్తుంది?
4 జీవం గల వివిధ ప్రాణులు కూడా సమయాన్ని పాటిస్తాయి. చాలా మొక్కలు, జంతువులు సహజసిద్ధంగానే వాటివాటి సమయాలను పాటిస్తాయి. అందుకే, ఎప్పుడు వలస వెళ్లాలో చాలా పక్షులకు సహజసిద్ధంగానే తెలుస్తుంది. (యిర్మీ. 8:7) మానవ శరీరం కూడా సమయాన్ని పాటిస్తుంది. సాధారణంగా అది 24 గంటలుండే రాత్రింబగళ్లకు తగిన విధంగా నడుచుకుంటుంది. ఒక వ్యక్తి విమానంలో ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి సమయానికి ఆయన శరీరం అలవాటుపడాలంటే కొన్ని రోజులు పడుతుంది. సృష్టిలోని వివిధ ప్రాణుల సమయపాలనను చూస్తే ‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవా ఎంత జ్ఞానవంతుడో, శక్తివంతుడో తెలుస్తుంది. (కీర్తన 104:24 చదవండి.) గొప్ప సమయపాలకుడైన యెహోవాకు ఉన్నంత జ్ఞానం, శక్తి ఈ విశ్వంలో ఎవ్వరికీ లేవు. కాబట్టి, యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చగలడనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు.
సమయానికే నెరవేరిన ప్రవచనాలను పరిశీలిస్తే విశ్వాసం కలుగుతుంది
5. (ఎ) మానవుల కోసం ఎలాంటి భవిష్యత్తు వేచి ఉందనేది మనం ఎలా మాత్రమే తెలుసుకోగలుగుతాం? (బి) జరగబోయే విషయాలను, అవి నెరవేరే సమయాన్ని యెహోవా ఎందుకు ఖచ్చితంగా చెప్పగలడు?
5 సృష్టిని పరిశీలిస్తే యెహోవా ‘అదృశ్య లక్షణాల’ గురించి ఎంతో తెలుసుకోవచ్చు కానీ, మానవుల కోసం ఎలాంటి భవిష్యత్తు వేచి ఉందనే ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు మాత్రం తెలుసుకోలేం. (రోమా. 1:20) దానికి జవాబు తెలుసుకోవాలంటే, ఆయన తన వాక్యమైన బైబిల్లో బయలుపర్చిన విషయాలను పరిశీలించాలి. అలా పరిశీలిస్తే, సరిగ్గా సమయానికే నెరవేరిన ఎన్నో ప్రవచనాలను మనం కనుక్కోవచ్చు. భవిష్యత్తును యెహోవా ఖచ్చితంగా తెలుసుకోగలడు కాబట్టి జరగబోయే వాటిని ఆయన బయలుపర్చగలడు. అంతేకాక, తాను అనుకున్న సమయానికే తన సంకల్పం నెరవేరేలా యెహోవా పరిస్థితులను మలుపు తిప్పగలడు కాబట్టి లేఖనాల్లో చెప్పబడిన విషయాలు సరైన సమయానికే నెరవేరతాయి.
6. బైబిలు ప్రవచనాల నెరవేర్పును మనం అర్థంచేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నట్లు ఎలా చెప్పవచ్చు?
6 తన ఆరాధకులు బైబిల్లోని ప్రవచనాల్ని అర్థంచేసుకొని వాటినుండి ప్రయోజనం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన సమయాన్ని మనం లెక్కించినట్లు లెక్కించకపోయినా, ఫలానా సమయానికి ఏదైనా జరుగుతుందని చెప్పాలనుకుంటే మనకు అర్థమయ్యే పదాలను ఉపయోగించే చెబుతాడు. (కీర్తన 90:4 చదవండి.) ఉదాహరణకు, ప్రకటన గ్రంథంలో ‘అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన నలుగురు దూతల’ గురించి ఉంది. ఆ లేఖనంలో అన్నీ మనకు అర్థమయ్యే సమయకొలతలే ఉన్నాయి. (ప్రక. 9:14, 15) చెప్పబడిన సమయానికే ప్రవచనాలు ఎలా నెరవేరాయో తెలుసుకుంటే ‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాపై, ఆయన వాక్యంపై మనకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
7. యెరూషలేము గురించిన, యూదా దేశం గురించిన ప్రవచన నెరవేర్పు యెహోవా గొప్ప సమయపాలకుడని ఎలా నిరూపిస్తోంది?
7 ముందుగా మనం సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో జరిగిన సంఘటన యెహోవా గొప్ప సమయపాలకుడని ఎలా నిరూపిస్తుందో చూద్దాం. ‘యోషీయా కుమారుడును యూదారాజును అయిన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యూదా ప్రజలందరిని గురించి యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైంది.’ (యిర్మీ. 25:1) యెరూషలేము నాశనం గురించి, యూదా దేశం నుండి యూదులు బబులోనుకు కొనిపోబడడం గురించి యెహోవా ప్రవచించాడు. అక్కడ వాళ్లు “డెబ్బది సంవత్సరములు బబులోనురాజునకు దాసులుగా” ఉంటారని ఆయన ప్రవచించాడు. సా.శ.పూ. 607లో బబులోను సైన్యాలు యెరూషలేమును నాశనం చేసి యూదులను యూదా దేశం నుండి బబులోనుకు తీసుకెళ్లిపోయారు. అయితే, 70 సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుందని ప్రవచించబడింది? యిర్మీయా ద్వారా యెహోవా ఇలా ప్రవచించాడు, “బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.” (యిర్మీ. 25: 11, 12; 29:10) ఆ ప్రవచనం సరిగ్గా సమయానికే అంటే, సా.శ.పూ. 537లో మాదీయపారసీక సైన్యాలు యూదుల్ని బబులోను నుండి విడుదల చేసినప్పుడు నెరవేరింది.
8, 9. మెస్సీయ రావడం గురించి, పరలోక రాజ్యం స్థాపించబడడం గురించి దానియేలు చెప్పిన ప్రవచనాలు, యెహోవా ‘కాలములకు, సమయములకు’ దేవుడని ఎలా నిరూపిస్తున్నాయి?
8 దేవుని ప్రజలకు సంబంధించి ప్రాచీన కాలంలో నెరవేరిన మరో ప్రవచనాన్ని పరిశీలిద్దాం. యెరూషలేమును తిరిగి కట్టమనే ఆజ్ఞ ఇవ్వబడిన 483 సంవత్సరాల తర్వాత మెస్సీయ వస్తాడని యూదులు బబులోనును విడిచి వెళ్లడానికి దాదాపు రెండు సంవత్సరాల ముందు యెహోవా దానియేలు ద్వారా ప్రవచించాడు. సా.శ.పూ. 455లో మాదీయపారసీకుల రాజు ఆ ఆజ్ఞ ఇచ్చాడు. సరిగ్గా 483 సంవత్సరాల తర్వాత అంటే సా.శ. 29లో నజరేయుడైన యేసు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి మెస్సీయ అయ్యాడు. a—నెహె. 2:1, 5-8; దాని. 9:24, 25; లూకా 3:1, 2, 21, 22.
9 రాజ్యం గురించి లేఖనాలు ఏమి ప్రవచించాయో ఇప్పుడు పరిశీలిద్దాం. 1914లో మెస్సీయ రాజ్యం పరలోకంలో స్థాపించబడుతుందని బైబిలు ప్రవచనం సూచించింది. ఉదాహరణకు, పరలోకంలో క్రీస్తు పాలన ప్రారంభమవ్వడానికి సంబంధించిన “సూచనలు” ఇస్తూ, ఆ సమయంలో సాతాను పరలోకం నుండి పడద్రోయబడతాడని, దానివల్ల భూమ్మీదున్న ప్రజలకు ఎన్నో కష్టాలు వస్తాయని బైబిలు చెప్పింది. (మత్త. 24:3-14; ప్రక. 12:9, 12) అంతేకాక, ‘అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే,’ పరలోకంలో రాజ్యపరిపాలన ప్రారంభమయ్యే ఖచ్చితమైన సంవత్సరాన్ని కూడా బైబిలు ప్రవచనం సూచించింది. అదే 1914వ సంవత్సరం.—లూకా 21:24; దాని. 4:10-17. b
10. భవిష్యత్తులో ఏ సంఘటనలు సరిగ్గా సమయానికి జరుగుతాయి?
10 యేసుక్రీస్తు ప్రవచించిన మహాశ్రమలు త్వరలో రానున్నాయి. ఆ తర్వాత క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన భూమ్మీద మొదలౌతుంది. ఆ ప్రవచనాలు కూడా సరిగ్గా సమయానికి నెరవేరతాయి. యేసు ఈ భూమ్మీద ఉన్న సమయానికే, ఆ సంఘటనలు జరిగే ‘దినాన్ని, గడియను’ యెహోవా నిర్ణయించాడు.—మత్త. 24:21, 36; ప్రక. 20:6.
‘సమయాన్ని సద్వినియోగం చేసుకోండి’
11. అంత్యదినాల్లో జీవిస్తున్నామని గుర్తించాం కాబట్టి మనం ఏమి చేయాలి?
11 రాజ్య పరిపాలన మొదలైందని, మనం ‘అంత్యకాలంలో’ జీవిస్తున్నామని గుర్తించాం కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలి? (దాని. 12:4) ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ఘోరమైన సంఘటనల్ని చూస్తున్నా, అవన్నీ అంత్యదినాలకు సంబంధించిన బైబిలు ప్రవచనాల నెరవేర్పుగానే జరుగుతున్నాయని చాలామంది గుర్తించడం లేదు. ఏదో ఒకరోజు ఈ వ్యవస్థంతా నాశనమౌతుందని వాళ్లు అనుకుంటారు లేదా ఏదో విధంగా మానవులు శాంతిభద్రతలు తీసుకొస్తారని నమ్ముతారు. (1 థెస్స. 5:3) కానీ మన విషయమేమిటి? సాతాను వ్యవస్థకు మిగిలివున్న చివరి రోజుల్లో మనం జీవిస్తున్నామని గుర్తిస్తే, ‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాను సేవించడానికీ, ఆయన గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడానికీ ఆ మిగిలివున్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. (2 తిమో. 3:1) మనం ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకోవాలి, అంటే సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి.—ఎఫెసీయులు 5:15-17 చదవండి.
12. నోవహు కాలం గురించి యేసు చెప్పిన దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
12 సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకుండా చేసేవి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకోవడం అంత సులభం కాదు. “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును” అని యేసు హెచ్చరించాడు. ఇంతకీ నోవహు కాలంలో పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడున్న లోకం అంతమౌతుందని, భూవ్యాప్తంగా రాబోయే జలప్రళయంలో దుష్టులు నాశనమౌతారని యెహోవా ప్రవచించాడు. ‘నీతిని ప్రకటించే’ వ్యక్తిగా నోవహు నమ్మకంగా దేవుని సందేశాన్ని అప్పటి ప్రజలకు ప్రకటించాడు. (మత్త. 24:37; 2 పేతు. 2:5) కానీ, “వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.” అందుకే యేసు తన అనుచరుల్ని ఇలా హెచ్చరించాడు, ‘మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి.’ (మత్త. 24:38, 39, 44) మనం కూడా నోవహులా ఉండాలి కానీ ఆయన కాలంలోని ప్రజల్లా కాదు. అయితే, మనం ఎలా సిద్ధంగా ఉండవచ్చు?
13, 14. మనుష్యకుమారుని రాక కోసం ఎదురుచూస్తున్న ఈ సమయంలో, యెహోవా గురించి ఏ విషయాన్ని గుర్తుంచుకుంటే మనం ఆయనను నమ్మకంగా సేవించగలుగుతాం?
13 మనం ఊహించని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడనేది వాస్తవమే అయినా, యెహోవా గొప్ప సమయపాలకుడని మనం గుర్తుంచుకోవాలి. యెహోవా అనుకున్న సమయానికే ఆయన సంకల్పాలన్నీ నెరవేరతాయి. లోకంలో జరుగుతున్న సంఘటనలు, మానవ ప్రణాళికలు దాన్ని ఆపలేవు. (దానియేలు 2:21 చదవండి.) ‘యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును’ అని సామెతలు 21:1 చెబుతోంది.
14 యెహోవా తన సంకల్పాన్ని సరిగ్గా తాననుకున్న సమయానికే నెరవేర్చడానికి సంఘటనల్ని మలుపు తిప్పగలడు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న ప్రాముఖ్యమైన మార్పులన్నీ ప్రవచనాల నెరవేర్పుగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా దేవుని రాజ్య సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే పని కూడా ప్రవచనాల నెరవేర్పుగానే జరుగుతోంది. సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు చోటుచేసుకున్న పరిణామాల గురించి ఒక్కసారి ఆలోచించండి. రాజకీయపరంగా చోటుచేసుకున్న అలాంటి పెనుమార్పులు అంత త్వరగా వస్తాయని చాలామంది ఊహించివుండకపోవచ్చు. అయితే, అలాంటి మార్పుల వల్ల, అంతకుముందు సువార్త ప్రకటనాపని నిషేధించబడిన ఎన్నో దేశాల్లో ఇప్పుడు సువార్త ప్రకటించబడుతోంది. కాబట్టి ‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాను నమ్మకంగా సేవించేలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేద్దాం.
యెహోవా సంకల్పం సమయానికే నెరవేరుతుందనే విశ్వాసం కలిగివుండండి
15. యెహోవా సంస్థ మార్పులు తీసుకొచ్చినప్పుడు మనకు ఆయనపై విశ్వాసం ఉందని ఎలా చూపించవచ్చు?
15 ఈ అంత్యదినాల్లో మనం ప్రకటనాపనిలో కొనసాగాలంటే, యెహోవా సంకల్పం సరిగ్గా సమయానికే నెరవేరుతుందనే విశ్వాసం ఉండాలి. ప్రపంచ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి కాబట్టి, శిష్యుల్ని చేసే పనిలో కూడా మార్పులు చేయడం అవసరం కావచ్చు. సంస్థ అప్పుడప్పుడు, మనం అత్యంత సమర్థవంతంగా ప్రకటించడానికి వీలుగా ప్రకటనాపని చేసే పద్ధతుల్లో కొన్ని మార్పులు చేయవచ్చు. అలాంటి మార్పులు ప్రవేశపెట్టబడినప్పుడు వాటిని పాటిస్తూ, ‘సంఘానికి శిరస్సుగా’ ఉన్న ఆయన ప్రియకుమారుని ఆధ్వర్యంలో నమ్మకంగా సేవ చేయడం ద్వారా మనం ‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాపై నమ్మకాన్ని చూపిస్తాం.—ఎఫె. 5:23.
16. యెహోవా సమయోచితమైన సహాయం చేస్తాడనే విశ్వాసాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చు?
16 అవసరమైనప్పుడు “సమయోచితమైన సహాయము” చేస్తాడనే పూర్తి నమ్మకంతో మనం ఎల్లప్పుడూ తనకు ప్రార్థించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 4:16) యెహోవాకు మనలో ప్రతీ ఒక్కరి మీద ప్రేమపూర్వక శ్రద్ధ ఉందనేందుకు అది రుజువు. (మత్త. 6:8; 10:29-31) యెహోవా సహాయం కోసం క్రమంగా ప్రార్థించడం ద్వారా, మన ప్రార్థనలకు అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా, ఆయన నిర్దేశాన్ని పాటించడం ద్వారా ఆయనపై విశ్వాసం ఉందని చూపించగలుగుతాం. అయితే, మనం తోటి విశ్వాసుల గురించి కూడా ప్రార్థించడం మరచిపోకూడదు.
17, 18. (ఎ) త్వరలోనే యెహోవా తన శత్రువుల్ని ఏమి చేస్తాడు? (బి) మనలో ఏ ఆలోచన కలగకుండా జాగ్రత్తపడాలి?
17 ఇది ‘అవిశ్వాసంతో సందేహించాల్సిన’ సమయం కాదుగానీ మన విశ్వాసాన్ని బలపర్చుకొని ధైర్యంగా ఉండాల్సిన సమయం. (రోమా. 4:20, 21) దేవుని శత్రువులు అంటే సాతాను, అతని అధీనంలో ఉన్నవాళ్లు యేసు అప్పగించిన పని చేయకుండా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. (మత్త. 28:19, 20) యెహోవా ‘మనుష్యులందరికి రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు’ అని మనకు తెలుసు. సాతాను మనమీద దాడి చేసినా, ‘శోధనలో నుండి తన భక్తులను ఎలా తప్పించాలో’ యెహోవాకు తెలుసు.—1 తిమో. 4:10; 2 పేతు. 2:9.
18 త్వరలోనే యెహోవా ఈ దుష్ట విధానం మీదికి అంతం తీసుకొస్తాడు. అయితే ఖచ్చితంగా ఏ సమయంలో తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు అనే వివరాలన్నీ మనకు తెలియకపోయినా, సరిగ్గా సమయానికే దేవుని శత్రువుల్ని క్రీస్తు నాశనం చేస్తాడని, యెహోవా సర్వాధిపత్యం నిరూపించబడుతుందని మనకు తెలుసు. కాబట్టి, మనం జీవిస్తున్న ‘కాలములను, సమయములను’ గుర్తించకపోవడం అవివేకమే అవుతుంది. అందుకే, “సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే” అనే ఆలోచన మనలో కలగకుండా జాగ్రత్తపడదాం.—1 థెస్స. 5:1; 2 పేతు. 3:3, 4.
‘కనిపెట్టుకొని ఉండండి’
19, 20. యెహోవా కోసం ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి?
19 మానవులు తన గురించి, తన అందమైన సృష్టి గురించి నేర్చుకుంటూ ఉండడానికి వీలుగా యెహోవా వాళ్లను నిత్యం జీవించేలా సృష్టించాడు. ప్రసంగి 3:11లో ఇలా ఉంది, “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన [యెహోవా] నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.”
20 మానవుల విషయంలో తనకున్న సంకల్పాన్ని యెహోవా మార్చుకోనందుకు మనం ఎంత సంతోషించాలో కదా! (మలా. 3:6) “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” (యాకో. 1:17) భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందువల్ల మన నీడ పడే స్థానం మారుతూ ఉంటుంది. కానీ యెహోవా విషయానికొస్తే, గడుస్తున్న కాలం ఆయనపై ఎలాంటి ప్రభావమూ చూపించలేదు. ఆయన “సకల యుగములలో రాజు.” (1 తిమో. 1:17) కాబట్టి, మనం ‘రక్షణకర్తయగు దేవునికొరకు కనిపెట్టుకొని ఉందాం.’ (మీకా 7:7) యెహోవా కోసం కనిపెట్టుకొని ఉన్న ప్రజలారా, మీరందరు ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండండి.—కీర్త. 31:24.
[అధస్సూచీలు]
[అధ్యయన ప్రశ్నలు]
[19వ పేజీలోని చిత్రం]
దేవుని ప్రవచనం నెరవేరుతుందని దానియేలు విశ్వసించాడు
[21వ పేజీలోని చిత్రం]
యెహోవా చిత్తం చేయడానికి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా?