దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు
దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు
‘నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృప ఏలును.’—రోమా. 5:21.
1, 2. ఏ రెండు రకాల బహుమానాల గురించి మనం చూశాం? వాటిలో ఏది గొప్పది?
రోమా సామ్రాజ్యపు నియమాలు భావి తరాలకు ఎంతో పనికొచ్చాయని, అవి నాగరికతకు అత్యంత విలువైన బహుమానమని లోకంలోని ప్రజలు అనుకుంటారు. అయితే, దేవుడు మనకు దానికన్నా ఎంతో విలువైన, ప్రేమపూర్వకమైన బహుమానాన్ని ఇచ్చాడని బైబిలు చెబుతోంది. మనం నీతిమంతులుగా తీర్చబడి తనతో మంచి సంబంధాన్ని కలిగివుండడానికీ మనం రక్షణను, నిరంతర జీవితాన్ని పొందడానికీ దేవుడు చేసిన ఏర్పాటే ఆ బహుమానం.
2 దేవుడు ఈ బహుమానాన్ని ఇచ్చిన విధానంలో ఆయన న్యాయం కనిపిస్తుంది. రోమీయులు 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు దాన్ని న్యాయసంబంధమైన అంశాలతో వివరించలేదు. కానీ, పులకరింపజేసే ఈ హామీతో ఆయన దాన్ని మొదలుపెట్టాడు: “విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.” దేవుని బహుమానాన్ని పొందినవారు ఆయనను తిరిగి ప్రేమించాలనుకుంటారు. పౌలు కూడా అలాగే అనుకున్నాడు. ఆయనిలా రాశాడు: “పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.”—రోమా. 5:1, 5.
3. మనం ఏ ప్రశ్నలను పరిశీలించనున్నాం?
3 ఇంతకీ ఆ ప్రేమపూర్వక బహుమానం ఎందుకు అవసరమైంది? దాన్ని దేవుడు అందరికీ న్యాయంగా, నిష్పక్షపాతంగా ఎలా ఇవ్వగలడు? దాన్ని పొందడానికి అర్హులవ్వాలంటే మనం ఏమి చేయాలి? ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను తెలుసుకొని, అవి దేవుని ప్రేమను ఎలా నొక్కి చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
దేవుని ప్రేమ, మానవుల పాపం
4, 5. (ఎ) యెహోవా తన గొప్ప ప్రేమను ఎలా చూపించాడు? (బి) రోమీయులు 5:12ను అర్థంచేసుకోవాలంటే మనం ఏమి తెలుసుకోవాలి?
4 మానవులకు సహాయం చేయడానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించి యెహోవా గొప్ప ప్రేమను చూపించాడు. దాని గురించి పౌలు ఇలా రాశాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమా. 5:8) “మనమింకను పాపులమై యుండగానే” అనే మాట గురించి ఆలోచించండి. ఇంతకీ మానవులు ఎలా పాపులయ్యారు?
5 పౌలు దాని గురించి ఇలా చెప్పాడు: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమా. 5:12) మానవుల ఆరంభం గురించి దేవుడు రాయించాడు కాబట్టే మనం ఆ లేఖనాన్ని అర్థంచేసుకోగలుగుతున్నాం. యెహోవా ముందుగా ఆదాముహవ్వలను సృష్టించాడు. సృష్టికర్తలాగే మన పూర్వీకులైన ఆదాముహవ్వలు కూడా పరిపూర్ణులుగా ఉండేవారు. దేవుడు వారికి ఒకే ఒక్క హద్దును విధించాడు, దాన్ని మీరితే వారికి మరణశిక్ష పడుతుందని ఆయన చెప్పాడు. (ఆది. 2:17) దేవుడు ఇచ్చిన నియమం కష్టమైనది కాకపోయినా దాన్ని మీరి శాసనకర్తగా, సర్వాధిపతిగా ఆయనను వారు తిరస్కరించారు. అలా తమ నాశనాన్ని కొనితెచ్చుకున్నారు.—ద్వితీ. 32:4, 5.
6. (ఎ) దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు ఆదాము పిల్లలు ఎందుకు చనిపోయారు, ఇచ్చిన తర్వాత ఎందుకు చనిపోతున్నారు? (బి) వారసత్వంగా సంక్రమించే వ్యాధులతో దేన్ని పోల్చవచ్చు?
6 ఆదాము పాపం చేసిన తర్వాతే పిల్లలను కన్నాడు కాబట్టి వారికి పాపాన్ని, దాని చెడు ఫలితాలను వారసత్వంగా ఇచ్చాడు. ఆ పిల్లలు ఆదాముకు దేవుడు ఇచ్చిన నియమాన్ని మీరలేదు కాబట్టి ఆ పాపం వారిమీద మోపబడలేదు. అంతేకాక, అప్పటికి వేరే నియమాలేవీ ఇవ్వబడలేదు. (ఆది. 2:17) అయినా, ఆదాము పిల్లలు పాపాన్ని వారసత్వంగా పొందారు. ఆ విధంగా, దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేంతవరకు పాపం, మరణం రాజ్యమేలాయి. ఆ ధర్మశాస్త్రం వారు పాపులని స్పష్టంగా చూపించింది. (రోమీయులు 5:13, 14 చదవండి.) పాపపు ప్రభావాన్ని వారసత్వంగా సంక్రమించే వ్యాధులతో లేదా లోపాలతో పోల్చవచ్చు. కొన్నిసార్లు పిల్లలు వాటితో బాధపడకపోయినా ఆ వ్యాధిని లేదా లోపాన్ని తర్వాతి తరాలవారికి సంక్రమింపజేసే అవకాశం ఉంటుంది. కానీ పాపం విషయంలో అలా కాదు. ఆదాము నుండి వచ్చిన పాపమనే లోపం తప్పనిసరిగా సంక్రమిస్తుంది, దాని ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. దానివల్ల తప్పక మరణం కలుగుతుంది. అది ఆదాము పిల్లలందరికీ సంక్రమించింది. అయితే ఆ పెద్ద సమస్య నుండి ఎప్పటికైనా విడుదల పొందగలరా?
యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన ఏర్పాటు
7, 8. ఇద్దరు పరిపూర్ణ మానవులు ప్రవర్తించిన తీరు వల్ల ఎలాంటి భిన్నమైన ఫలితాలు వచ్చాయి?
7 వారసత్వంగా వచ్చిన పాపం నుండి మానవులు విముక్తి పొందేలా యెహోవా ప్రేమతో ఒక ఏర్పాటు చేశాడు. తర్వాత వచ్చిన మరో పరిపూర్ణ మానవుని ద్వారా అంటే రెండవ ఆదాము ద్వారా వారు విముక్తి పొందడం సాధ్యమౌతుందని పౌలు వివరించాడు. (1 కొరిం. 15:45) ఆ ఇద్దరు పరిపూర్ణ మానవులు ప్రవర్తించిన తీరు వల్ల ఎంతో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఎలా?—రోమీయులు 5:15, 16 చదవండి.
8 “అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు” అని పౌలు రాశాడు. ఆదాము అపరాధి కాబట్టి న్యాయంగానే ఆయన తీవ్రమైన శిక్షను అంటే మరణాన్ని పొందాడు. అయితే, చనిపోయింది ఆయనొక్కడే కాదు. మనమిలా చదువుతాం: “[ఆ] ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయిరి.” ఆదాముకు విధించబడిన న్యాయమైన శిక్ష అపరిపూర్ణులైన ఆయన పిల్లలందరికీ, అంటే మనకు కూడా వర్తిస్తుంది. అయితే, పరిపూర్ణ మానవుడైన యేసు దానికి పూర్తిగా భిన్నమైన ఫలితాన్ని తీసుకురాగలిగాడని తెలుసుకొని మనం ఊరట పొందవచ్చు. ఆ ఫలితం ఏమిటి? దానికి సమాధానం పౌలు రాసిన ఈ మాటల్లో ఉంది: “మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడు[తుంది].”—రోమా. 5:18.
9. రోమీయులు 5:16, 18లో చెప్పబడినట్లు దేవుడు మానవులను నీతిమంతులుగా తీర్పుతీర్చడానికి ఏమి చేస్తున్నాడు?
9 ‘నీతి విధింపబడడం,’ ‘నీతిమంతులుగా తీర్చబడడం’ అని అనువదించబడిన గ్రీకు పదాలకు అర్థమేమిటి? దాని గురించి ఒక బైబిలు అనువాదకుడు ఇలా రాశాడు: “అది న్యాయపరమైన ఒక రూపకాలంకారం. న్యాయపరమైన అంశంలా కనిపించే ఓ విషయాన్ని అది వివరిస్తోంది. ఒకరి వ్యక్తిత్వంలో వచ్చే మార్పు గురించి కాదుగానీ దేవుని ముందు ఆ వ్యక్తికున్న స్థానంలో వచ్చే మార్పు గురించి అది చెబుతోంది. . . . ఆ రూపకాలంకారం, ఓ నిందితునికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న న్యాయాధిపతిగా దేవుణ్ణి చిత్రీకరిస్తోంది. ఆ వ్యక్తి అనీతిమంతుడనే ఆరోపణ మీద దేవుని న్యాయస్థానం ముందుకు తీసుకురాబడ్డాడు. అయితే దేవుడు ఆయనను నిర్దోషిగా తీర్పుతీర్చాడు.”
10. మానవులు నీతిమంతులుగా తీర్చబడేందుకు యేసు ఏమి చేశాడు?
10 “సర్వలోకమునకు తీర్పు తీర్చే” నీతిమంతుడైన న్యాయాధిపతి ఎలా ఓ అనీతిమంతుణ్ణి నిర్దోషిగా తీర్పుతీర్చగలడు? (ఆది. 18:25) దానికోసం ముందుగా ఆయన ప్రేమతో తన ఏకైక కుమారుణ్ణి భూమ్మీదకు పంపించాడు. శోధనలు, తీవ్రమైన ఎగతాళి, దూషణలు ఎదురైనా యేసు తన తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా చేశాడు. హింసాకొయ్యపై చనిపోవాల్సివచ్చినా ఆయన యథార్థతను వదులుకోలేదు. (హెబ్రీ. 2:10) యేసు తన పరిపూర్ణ మానవ జీవాన్ని బలిగా అర్పించడం ద్వారా ఆదాము పిల్లలను పాపమరణాల నుండి విడుదల చేయడానికి విమోచన క్రయధనాన్ని చెల్లించాడు.—మత్త. 20:28; రోమా. 5:6-8.
11. విమోచన క్రయధనంలో ఏది సరిసమానమైనది?
11 మరొక చోట పౌలు దాన్ని ‘సరిసమానమైన విమోచన క్రయధనం’ అని అన్నాడు. (1 తిమో. 2:6, NW) ఇంతకీ ఏది సరిసమానమైనది? ఆదాము వల్ల ఆయన కోట్లాదిమంది పిల్లలకు అపరిపూర్ణత, మరణం వచ్చాయి. పరిపూర్ణ మానవునిగా యేసు కోట్లాదిమంది పరిపూర్ణ పిల్లలకు తండ్రి అయ్యుండేవాడనేది నిజమే. a కాబట్టి అది, యేసు జీవంతోపాటు ఆయన నుండి రాగల పరిపూర్ణ మానవులందరి జీవం, ఆదాముకు ఆయన అపరిపూర్ణ సంతానానికి సమానమైన బలిగా తయారౌతుందనే అర్థాన్ని ఇచ్చింది. కానీ, యేసు నుండి వచ్చే పిల్లలు విమోచన క్రయధనంలో భాగమౌతారని బైబిలు చెప్పడం లేదు. రోమీయులు 5:15-19, కేవలం “ఒకని” మరణం వల్ల విడుదల కలుగుతుందని చెబుతోంది. అవును, యేసు పరిపూర్ణ జీవం ఆదాము పరిపూర్ణ జీవానికి సరిసమానమైనది. కాబట్టి ‘సరిసమానం’ అనే మాట కేవలం యేసుక్రీస్తుకే వర్తిస్తుంది. యేసు చేసిన “ఒక్క పుణ్య కార్యము” వల్ల అంటే మరణం వరకు ఆయన విధేయత, యథార్థత చూపించడం వల్ల మనుష్యలందరూ ఉచితంగా ఈ బహుమానాన్ని, జీవాన్ని పొందడం సాధ్యమైంది. (2 కొరిం. 5:14, 15; 1 పేతు. 3:18) ఇంతకీ ఆ ఫలితం ఎలా వచ్చింది?
విమోచన క్రయధనం ఆధారంగా నిర్దోషులుగా తీర్చబడడం
12, 13. నీతిమంతులుగా తీర్చబడేవారికి దేవుని దయ, ప్రేమ ఎందుకు అవసరం?
12 యెహోవా దేవుడు తన కుమారుడు అర్పించిన విమోచన క్రయధన బలిని అంగీకరించాడు. (హెబ్రీ. 9:24; 10:10, 12) అయితే ఆ తర్వాత కూడా, యేసు నమ్మకమైన అపొస్తలులు, శిష్యులు అపరిపూర్ణులుగానే ఉన్నారు. వారు తప్పు చేయకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నించినా కొన్నిసార్లు తప్పులు చేశారు. ఎందుకు? ఎందుకంటే వారు పాపాన్ని వారసత్వంగా పొందారు. (రోమా. 7:18-20) అయితే దేవుడు ఆ విషయంలో ఏదో ఒకటి చేయగలడు, ఆయన చేశాడు కూడా. ‘సరిసమానమైన విమోచన క్రయధనాన్ని’ ఆయన అంగీకరించాడు, తన సేవకుల కోసం దాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
13 ఆ అపొస్తలులు, ఇతరులు కొన్ని మంచి పనులు చేశారు కదా అని వారి కోసం విమోచన క్రయధనాన్ని ఉపయోగించాల్సిన బాధ్యత దేవునికి లేదు. అయినా దేవుడు దయతో, గొప్ప ప్రేమతో వారి కోసం విమోచన క్రయధనాన్ని ఉపయోగించాడు. అపొస్తలులను, ఇతరులను వారసత్వంగా సంక్రమించిన పాపం విషయంలో నిర్దోషులుగా ఎంచి, వారిని విడుదల చేయాలని ఆయన అనుకున్నాడు. దీన్నే పౌలు ఇలా స్పష్టం చేశాడు: “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.”—ఎఫె. 2:8.
14, 15. దేవునిచే నీతిమంతులుగా తీర్చబడినవారు ఏ ఆశీర్వాదాన్ని పొందుతారు? అయినా వారు ఏమి చేస్తూ ఉండాలి?
14 ఒక వ్యక్తికి వారసత్వంగా వచ్చిన పాపాన్ని, అతను చేసిన తప్పులను సర్వశక్తిమంతుడు క్షమించడం ఎంత గొప్ప బహుమానమో ఒక్కసారి ఆలోచించండి! క్రైస్తవులుగా మారకముందు ఆయా వ్యక్తులు లెక్కలేనన్ని పాపాలు చేసివుంటారు. అయినా విమోచన క్రయధనం ఆధారంగా దేవుడు ఆ పాపాలను క్షమించగలడు. దీని గురించి పౌలు ఇలా రాశాడు: “కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.” (రోమా. 5:16) అయితే ఈ ప్రేమపూర్వక బహుమానాన్ని పొందే (నీతిమంతులుగా తీర్చబడిన) అపొస్తలులు, ఇతరులు విశ్వాసంతో సత్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దానివల్ల భవిష్యత్తులో వారు ఏ ఆశీర్వాదాన్ని పొందుతారు? “కృపాబాహుళ్యమును, నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.” నీతి అనే బహుమానం పాపపు ప్రభావాలను తీసివేయడానికి దోహదపడుతుంది. దానివల్ల చివరకు జీవం లభిస్తుంది.—రోమా. 5:17; లూకా 22:28-30 చదవండి.
15 ఆ బహుమానాన్ని పొందేవారు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి వారు దేవుని ఆత్మ కుమారులు అవుతారు. క్రీస్తు తోటి వారసులుగా వారు యేసుక్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించేలా దేవుని నిజమైన ఆత్మ కుమారులుగా పరలోకానికి పునరుత్థానం చేయబడతారు.—రోమీయులు 8:15-17, 23 చదవండి.
దేవుడు ఇతరులపట్ల కూడా ప్రేమ చూపించాడు
16. భూనిరీక్షణగలవారు బహుమానాన్ని పొందే అవకాశం ఉందని ఎందుకు చెప్పవచ్చు?
16 యథార్థ క్రైస్తవులుగా ఉంటూ విశ్వాసంతో దేవుని సేవ చేసేవారందరూ క్రీస్తుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలించరు. వారిలో చాలామందికి, క్రీస్తుకు పూర్వం జీవించిన దేవుని సేవకులకున్న బైబిలు నిరీక్షణే ఉంది. వారు పరదైసు భూమిపై నిరంతర జీవితం కోసం ఎదురుచూస్తారు. దేవుడు ఇచ్చే ప్రేమపూర్వక బహుమానాన్ని పొంది నీతిమంతులుగా ఎంచబడే అవకాశం వారికి ఇప్పుడు కూడా ఉందా? రోమీయులకు పౌలు రాసిన దాన్ని బట్టి చూస్తే ఆ ప్రశ్నకు ఖచ్చితంగా ‘అవును’ అనే చెప్పవచ్చు.
17, 18. (ఎ) అబ్రాహాము విశ్వాసం చూపించడం వల్ల దేవుడు ఆయనను ఎలా ఎంచాడు? (బి) యెహోవా అబ్రాహామును నీతిమంతునిగా ఎలా ఎంచగలిగాడు?
17 అందుకు మంచి ఉదాహరణగా ఉన్న విశ్వాసంగల అబ్రాహాము గురించి పౌలు మాట్లాడాడు. అబ్రాహాము యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు, పరలోక జీవానికి క్రీస్తు మార్గం తెరవడానికి చాలాకాలం ముందు జీవించాడు. (హెబ్రీ. 10:19, 20) మనమిలా చదువుతాం: “అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలముగానే కలిగెను.” (రోమా. 4:13; యాకో. 2:23, 24) అందుకే, విశ్వాసంగల అబ్రాహామును దేవుడు నీతిమంతునిగా ఎంచాడు.—రోమీయులు 4:20-22 చదవండి.
18 ఎన్నో సంవత్సరాలపాటు యెహోవాను సేవించిన అబ్రాహాము అసలు ఏ పాపమూ చేయలేదని దానర్థం కాదు. ఆయన ఆ భావంలో నీతిమంతుడు కాదు. (రోమా. 3:10, 23) అయితే, అబ్రాహాము అసాధారణ విశ్వాసాన్ని, ఆ విశ్వాసం వల్ల చేసిన క్రియలను అపరిమిత జ్ఞానంగల యెహోవా పరిగణనలోకి తీసుకున్నాడు. ముఖ్యంగా, తన వంశంలో రాబోయే వాగ్దాన ‘సంతానంపై’ అబ్రాహాము విశ్వాసముంచాడు. మెస్సీయ లేదా క్రీస్తే ఆ సంతానం. (ఆది. 15:6; 22:15-18) కాబట్టి, “క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా” న్యాయాధిపతియైన దేవుడు గతంలో చేయబడిన పాపాలను క్షమించగలిగాడు. అందుకే అబ్రాహామూ క్రీస్తుకు పూర్వం జీవించిన ఇతర నమ్మకమైన సేవకులూ పునరుత్థానం చేయబడతారు.—రోమీయులు 3:24, 25 చదవండి; కీర్త. 32:1, 2.
ఇప్పుడు కూడా నీతిమంతులుగా ఎంచబడవచ్చు
19. దేవుడు అబ్రాహామును ఎంచిన తీరును బట్టి నిజక్రైస్తవులు ఎందుకు ప్రోత్సాహాన్ని పొందుతారు?
19 ప్రేమగల దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచాడనే వాస్తవాన్ని చూసి నేటి నిజ క్రైస్తవులు ప్రోత్సాహాన్ని పొందుతారు. ‘క్రీస్తుతోడి వారసులుగా’ ఉండేందుకు పరిశుద్ధాత్మతో తాను అభిషేకించినవారిని యెహోవా ఏ భావంలో నీతిమంతులుగా తీరుస్తాడో ఆ భావంలో అబ్రాహామును నీతిమంతునిగా తీర్చలేదు. ఆ కొద్దిమంది అభిషిక్తులు “పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి,” ‘దేవుని కుమారులుగా’ అంగీకరించబడ్డారు. (రోమా. 1:1-7; 8:14, 17, 33) కానీ విమోచన క్రయధన బలి అర్పించబడకముందే అబ్రాహాము “దేవుని స్నేహితుడు” అయ్యాడు. (యాకో. 2:23; యెష. 41:8) ఇంతకీ, రాబోయే పరదైసులో జీవించాలనుకునే నిజక్రైస్తవుల విషయమేమిటి?
20. అబ్రాహాములాగే నేడు నీతిమంతులుగా ఎంచబడేవారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడు?
20 పరలోకంలో జీవించగలిగేలా వారు “క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా” “నీతి” అనే ఉచితమైన బహుమానాన్ని పొందలేదు. (రోమా. 3:24; 5:15, 17) అయినా వారు దేవుని పట్ల, ఆయన ఏర్పాట్ల పట్ల గట్టి విశ్వాసాన్ని కలిగివుంటారు. అలాగే మంచి పనుల ద్వారా అంటే ‘దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు బోధించడం’ వంటివాటి ద్వారా దాన్ని చూపిస్తారు. (అపొ. 28:31) అందుకే యెహోవా అబ్రాహామును ఎంచినట్లే వారిని కూడా నీతిమంతులుగా ఎంచగలడు. వారు దేవునితో స్నేహం అనే బహుమానాన్ని పొందుతారు. అది అభిషిక్తులు పొందే “ఉచిత” బహుమానం లాంటిది కాకపోయినా వారు ఆ బహుమానాన్ని ఎంతో కృతజ్ఞతతో అంగీకరిస్తారు.
21. యెహోవా ప్రేమ, న్యాయం వల్ల మనం ఏ ప్రయోజనాలు పొందవచ్చు?
21 మీకు భూమిపై నిరంతరం జీవించే అవకాశం ఉన్నట్లయితే, ఎవరో ఒక మానవ పరిపాలకుడు అనాలోచితంగా చేసిన పనివల్ల మీకు ఆ అవకాశం రాలేదని గుర్తించాలి. బదులుగా అది విశ్వసర్వాధిపతి జ్ఞానయుక్తమైన సంకల్పాన్ని చూపిస్తుంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా క్రమంగా కొన్ని చర్యలు తీసుకున్నాడు. అవి ఆయన పరిపూర్ణ న్యాయానికి, మరిముఖ్యంగా ఆయన గొప్ప ప్రేమకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే పౌలు ఇలా చెప్పగలిగాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”—రోమా. 5:8.
[అధస్సూచి]
a ఉదాహరణకు, పిల్లలు లేదా సంతానానికి సంబంధించిన ఆ వివరణ లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), 2వ సంపుటి, 736వ పేజీలోని 4, 5 పేరాల్లో వచ్చింది.
మీకు జ్ఞాపకమున్నాయా?
• ఆదాము పిల్లలు దేన్ని వారసత్వంగా పొందారు? దాని ఫలితం ఏమిటి?
• సరిసమానమైన విమోచన క్రయధనం ఎలా ఇవ్వబడింది? అది ఏ భావంలో సరిసమానమైనది?
• నీతిమంతులుగా తీర్చబడడం అనే బహుమానం వల్ల మీకు ఏ నిరీక్షణ ఉంది?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రం]
పరిపూర్ణ మానవుడైన ఆదాము పాపం చేశాడు. కానీ పరిపూర్ణ మానవుడైన యేసు ‘సరిసమానమైన విమోచన క్రయధనాన్ని’ అర్పించాడు
[15వ పేజీలోని చిత్రం]
యేసు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడవచ్చనేది ఎంత గొప్ప సువార్త!