‘ఆహా, దేవుని బుద్ధి ఎంత గంభీరం!’
‘ఆహా, దేవుని బుద్ధి ఎంత గంభీరం!’
“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు.” —రోమా. 11:33.
1. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులకు లభించిన అత్యంత గొప్ప గౌరవం ఏమిటి?
మీకు లభించిన అత్యంత గొప్ప గౌరవం ఏమిటి? ఆ ప్రశ్న విన్నప్పుడు, బహుశా మీరు పొందిన ఏదైనా నియామకం లేదా ఘనత మీకు గుర్తుకువచ్చివుంటుంది. అయితే, అద్వితీయ సత్యదేవుడైన యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుండడమే బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులకు లభించిన అత్యంత గొప్ప గౌరవం. దానివల్ల మనం యెహోవాకు తెలిసినవారమయ్యాం.—1 కొరిం. 8:3; గల. 4:9.
2. యెహోవా మనకూ, మనం యెహోవాకూ తెలిసివుండడం మనకు లభించిన అత్యంత గొప్ప గౌరవమని ఎందుకు చెప్పవచ్చు?
2 యెహోవా మనకూ, మనం యెహోవాకూ తెలిసివుండడం మనకు లభించిన అత్యంత గొప్ప గౌరవమని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఆయన విశ్వంలో అందరికన్నా గొప్పవాడు. అంతేకాదు, ఆయన తనను ప్రేమించేవారిని రక్షిస్తాడు. నహూము ప్రవక్త దైవప్రేరణతో ఇలా రాశాడు: “యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.” (నహూ. 1:7; కీర్త. 1:6) అంతెందుకు, మనం నిరంతర జీవితం పొందాలంటే సత్యదేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి.—యోహా. 17:3.
3. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి?
3 దేవుణ్ణి తెలుసుకోవాలంటే, ఆయన పేరును తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. మనం ఒక స్నేహితునిలాగే ఆయన ఇష్టాయిష్టాలను అర్థంచేసుకోవాలి, వాటి ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అలా చేస్తే ఆయన మనకు బాగా తెలుసని చూపించవచ్చు. (1 యోహా. 2:4) అయితే, యెహోవాను నిజంగా తెలుసుకోవాలంటే అది మాత్రమే సరిపోదు. ఆయన చేసిన కార్యాలను తెలుసుకోవడమే కాక, వాటిని ఎలా చేశాడో, ఎందుకు చేశాడో కూడా తెలుసుకోవాలి. మనం ఆయన సంకల్పాలను అర్థంచేసుకునేకొద్దీ, ‘దేవుని బుద్ధి ఎంతో గంభీరమైనదని’ గ్రహించి ముగ్ధులమౌతాం.—రోమా. 11:33.
సంకల్పంగల దేవుడు
4, 5. (ఎ) ‘సంకల్పం’ అనే పదాన్ని బైబిల్లో ఎలా ఉపయోగించారు? (బి) ఒక సంకల్పాన్ని అనేక విధాలుగా ఎలా సాధించవచ్చో ఉదాహరణతో వివరించండి.
4 యెహోవా సంకల్పంగల దేవుడు. ఆయన “నిత్యసంకల్పము” గురించి బైబిలు చెబుతోంది. (ఎఫె. 3:8-11) అసలు ఆ మాటకు అర్థమేమిటి? అనేక విధాలుగా చేరుకోగల ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సూచించడానికి బైబిలు ‘సంకల్పం’ అనే పదాన్ని ఉపయోగిస్తుంది.
5 ఉదాహరణకు, ఒక వ్యక్తి ఫలాని ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నాడు. ఆ ప్రాంతానికి చేరుకోవాలనేది ఆయన లక్ష్యం లేదా సంకల్పం. ఏ వాహనంలో వెళ్లాలి, ఏ దారిలో వెళ్లాలనేది ఆయన ఇష్టం. ఆయన ఎంచుకున్న మార్గంలో వెళ్తున్నప్పుడు వాతావరణ పరిస్థితులు మారవచ్చు, ట్రాఫిక్ ఉండవచ్చు, రోడ్డు మూసేసివుండవచ్చు. అలాంటప్పుడు ఆయన మరో మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆయన మార్గాన్ని మార్చుకున్నా అనుకున్న ప్రాంతానికి చేరుకోవడం వల్ల లక్ష్యాన్ని సాధిస్తాడు.
6. యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మారిన పరిస్థితిని బట్టి తన మార్గాన్ని ఎలా మార్చుకున్నాడు?
6 ఆ ప్రయాణికునిలాగే యెహోవా తన నిత్యసంకల్పాన్ని నెరవేర్చడానికి మారిన పరిస్థితులను బట్టి తన మార్గాన్ని మార్చుకున్నాడు. అలా చేసేటప్పుడు, తాను సృష్టించినవారి స్వేచ్ఛా చిత్తాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. ఉదాహరణకు, వాగ్దాన సంతానం విషయంలో యెహోవా తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడో మనం ఇప్పుడు చూద్దాం. మొదట్లో ఆదాముహవ్వలతో యెహోవా ఇలా చెప్పాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆది. 1:28) ఏదెను తోటలో తిరుగుబాటు వల్ల ఆ సంకల్పం నేరవేరకుండా ఆగిపోయిందా? లేదు! పరిస్థితి మారింది కాబట్టి, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా వెంటనే వేరే “మార్గాన్ని” ఎంచుకున్నాడు. తిరుగుబాటుదారులు చేసిన నష్టాన్ని పూరించే “సంతానం” గురించి ఆయన ప్రవచించాడు.—ఆది. 3:15; హెబ్రీ. 2:14-17; 1 యోహా. 3:8.
7. నిర్గమకాండము 3:14లో యెహోవా తన గురించి తాను చెప్పుకున్న దాని నుండి మనకేమి తెలుస్తుంది?
7 యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిస్థితులకు తగ్గట్లు తన మార్గాన్ని మార్చుకోగలడు. ఆయన తన గురించి అలాగే చెప్పుకున్నాడు. తనకు ఇచ్చిన నియామకాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఎదురుకాగల ఆటంకాల గురించి మోషే చెప్పినప్పుడు యెహోవా ఆయనకు, “నేను ఉన్నవాడను అను వాడనై యున్నాను [‘నేను ఎలా కావాలంటే అలా అవుతాను,’ NW]” అనే హామీ ఇచ్చాడు. అంతేకాక, “ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను” అని మోషేకు ఆజ్ఞాపించాడు. (నిర్గ. 3:14) తన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా ఎలా కావాలంటే అలా కాగలడు! అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని ఒక ఉపమానంతో చక్కగా వివరించాడు. అక్కడ ఆయన అలంకారార్థ ఒలీవ చెట్టు గురించి చెప్పాడు. మనం అభిషిక్తులమైనా, వేరే గొర్రెలమైనా ఆ ఉపమానాన్ని పరిశీలించడం వల్ల యెహోవా జ్ఞానం విషయంలో మన ప్రశంస పెరుగుతుంది.
వాగ్దాన సంతానం విషయంలో యెహోవా సంకల్పం
8, 9. (ఎ) ఏ నాలుగు వాస్తవాలను పరిశీలిస్తే మనం ఒలీవ చెట్టు ఉపమానాన్ని అర్థం చేసుకోగలుగుతాం? (బి) ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం? అది యెహోవా గురించి ఏమి తెలియజేస్తుంది?
8 మనం ఒలీవ చెట్టు ఉపమానాన్ని అర్థంచేసుకునే ముందు, వాగ్దాన సంతానం విషయంలో యెహోవా తన సంకల్పం నెరవేర్చడానికి సంబంధించి నాలుగు వాస్తవాలను తెలుసుకోవాలి. మొదటిగా, “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును” అని యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. (ఆది. 22:17, 18) రెండవదిగా, అబ్రాహాము వంశం నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకు “యాజక రూపమైన రాజ్యముగా” రూపొందే అవకాశం ఇవ్వబడింది. (నిర్గ. 19:5, 6) మూడవదిగా, సహజ ఇశ్రాయేలీయుల్లో చాలామంది మెస్సీయను తిరిస్కరించినప్పుడు “యాజక రూపమైన రాజ్యము” ఏర్పాటు చేయడానికి యెహోవా ఇతర చర్యలు తీసుకున్నాడు. (మత్త. 21:43; రోమా. 9:27-29) చివరగా, అబ్రాహాము సంతానంలో ప్రథమ భాగం యేసే అయినప్పటికీ, ఆ సంతానంలో భాగంగా ఉండే అవకాశం ఇతరులకు కూడా ఇవ్వబడింది.—గల. 3:16, 29.
9 ఈ నాలుగు వాస్తవాలను మనసులో ఉంచుకొని ప్రకటన గ్రంథాన్ని పరిశీలిస్తే 1,44,000 మంది రాజులుగా, యాజకులుగా యేసుతోపాటు పరిపాలిస్తారని మనం తెలుసుకుంటాం. (ప్రక. 14:1-4) వారు “ఇశ్రాయేలీయులు” అని కూడా పిలవబడ్డారు. (ప్రక. 7:4-8) అయితే 1,44,000 మందిలోని వారందరూ సహజ ఇశ్రాయేలీయులని లేదా యూదులని దానర్థమా? దాని జవాబును తెలుసుకుంటే, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా తన మార్గాన్ని మార్చుకోగలడని అర్థమౌతుంది. పై ప్రశ్నకు జవాబును అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చూద్దాం.
“యాజక రూపమైన రాజ్యము”
10. ఏ గొప్ప అవకాశం ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ఉండేది?
10 ముందు చూసినట్లుగా “యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను” రూపొందే గొప్ప అవకాశం ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ఉండేది. (రోమీయులు 9:4, 5 చదవండి.) అయితే, వాగ్దాన సంతానం వచ్చినప్పుడు ఏమైంది? అబ్రాహాము సంతానంలోని ద్వితీయ భాగంగా ఉండేందుకు కావాల్సిన 1,44,000 మంది ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులను సహజ ఇశ్రాయేలీయులు అందించగలిగారా?
11, 12. (ఎ) పరలోక రాజ్యంగా ఏర్పడేవారి ఎంపిక ఎప్పుడు ప్రారంభమైంది? ఆ కాలంలోని చాలామంది యూదులు ఎలా స్పందించారు? (బి) అబ్రాహాము సంతానంలో భాగమయ్యేవారి సంఖ్యను యెహోవా ఎలా ‘సంపూర్ణం చేశాడు’?
11 రోమీయులు 11:7-10 చదవండి. ఒక జనాంగంగా మొదటి శతాబ్దపు యూదులు యేసును తిరస్కరించారు. అబ్రాహాము సంతానంలోని సభ్యులను అందించే అవకాశం వారికి మాత్రమే ఉండేది, అయితే ఆ అవకాశాన్ని వారు కోల్పోయారు. అయితే, పరలోకంలో “యాజక రూపమైన రాజ్యముగా” ఏర్పడే వారిని ఎంపిక చేయడం సా.శ. 33 పెంతెకొస్తు దినాన ఆరంభమైనప్పుడు, ఆ ఆహ్వానాన్ని యథార్థహృదయులైన కొంతమంది యూదులు స్వీకరించారు. వారు కేవలం కొన్ని వేలల్లోనే ఉన్నారు కాబట్టి, పూర్తి యూదా జనాంగంతో పోలిస్తే వారు “శేషము” అని చెప్పవచ్చు.—రోమా. 11:5.
12 అబ్రాహాము సంతానంలో భాగమయ్యేవారి సంఖ్యను యెహోవా ఎలా ‘సంపూర్ణం చేస్తాడు’? (రోమా. 11:12, 25) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన జవాబును గమనించండి: “దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; [సహజ] ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు [అబ్రాహాము సంతానంలో భాగం కారు] . . . అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.” (రోమా. 9:6-8) అబ్రాహాము వంశం నుండి వచ్చినవారే వాగ్దాన సంతానంలో భాగమవ్వాలనే నియమాన్ని యెహోవా పెట్టలేదని దీన్నిబట్టి తెలుస్తోంది.
అలంకారార్థ ఒలీవ చెట్టు
13. (ఎ) ఒలీవ చెట్టు, (బి) దాని వేరు, (సి) దాని కాండం, (డి) దాని కొమ్మలు వేటిని సూచిస్తున్నాయి?
13 అబ్రాహాము సంతానంలో భాగమయ్యేవారిని ఒలీవ చెట్టు కొమ్మలతో అపొస్తలుడైన పౌలు పోల్చాడు. a (రోమా. 11:21) మంచి ఒలీవ చెట్టు, అబ్రాహాము నిబంధనకు సంబంధించిన దేవుని సంకల్పం నెరవేరడాన్ని సూచిస్తోంది. చెట్టు వేరు పరిశుద్ధమైనదనే విషయం, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు యెహోవాయే జీవాన్నిస్తున్నాడని సూచిస్తోంది. (యెష. 10:20; రోమా. 11:16) చెట్టు కాండం అబ్రాహాము సంతానంలో ప్రథమ భాగమైన యేసును సూచిస్తోంది. కొమ్మలు, అబ్రాహాము సంతానంలో ద్వితీయ భాగంగా ఉన్నవారందరినీ సూచిస్తున్నాయి.
14, 15. మంచి ఒలీవ చెట్టు నుండి ఎవరు ‘విరిచివేయబడ్డారు’? దానికి ఎవరు అంటుకట్టబడ్డారు?
14 ఒలీవ చెట్టు గురించిన ఉపమానంలో యేసును తిరస్కరించిన సహజ యూదులు ‘విరిచివేయబడిన’ ఒలీవ కొమ్మలతో పోల్చబడ్డారు. (రోమా. 11:17) అలా వారు అబ్రాహాము సంతానంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మరి వారి స్థానంలో ఎవరు చేర్చుకోబడ్డారు? అబ్రాహాము వంశస్థులమని గొప్పలుపోయిన సహజ యూదులు దాని జవాబును ఊహించివుండరు. అయితే, యెహోవా తలచుకుంటే రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని చెప్పడం ద్వారా బాప్తిస్మమిచ్చు యోహాను వారిని ముందే హెచ్చరించాడు.—లూకా 3:8.
15 మరి తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా ఏమి చేశాడు? విరిచివేయబడిన మంచి ఒలీవ చెట్టు కొమ్మల స్థానంలో అడవి ఒలీవ కొమ్మలు అంటుకట్టబడ్డాయని పౌలు వివరించాడు. (రోమీయులు 11:17, 18 చదవండి.) ఆ విధంగా, అన్యజనాంగాల నుండి వచ్చిన ఆత్మాభిషిక్త క్రైస్తవులు ఈ అలంకారార్థ ఒలీవ చెట్టుకు అంటుకట్టబడ్డారు. రోమా సంఘంలోని కొందరు అలాంటివారే. ఆ విధంగా అన్యులు అబ్రాహాము సంతానంలో భాగమయ్యారు. అబ్రాహాముతో చేసిన ప్రత్యేకమైన నిబంధనలో భాగస్థులయ్యే అవకాశం లేని ఆ అన్యులు గతంలో అడవి ఒలీవ కొమ్మల్లా ఉండేవారు. అయితే, ఆధ్యాత్మిక యూదులయ్యే అవకాశం యెహోవా వారికి ఇచ్చాడు.—రోమా. 2:28, 29.
16. కొత్త ఆధ్యాత్మిక జనాంగం ఏర్పడిన తీరు గురించి అపొస్తలుడైన పేతురు ఎలా వివరించాడు?
16 ఆ విషయాన్ని అపొస్తలుడైన పేతురు ఇలా వివరించాడు: “విశ్వసించుచున్న మీకు [క్రైస్తవులుగా మారిన అన్యులతో కూడిన ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులకు], ఆయన [యేసుక్రీస్తు] అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే—ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను. . . . అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.”—1 పేతు. 2:7-10.
17. యెహోవా చేసింది “స్వభావ విరుద్ధము” అని ఎందుకు చెప్పవచ్చు?
17 చాలామంది అస్సలు ఊహించనిదాన్ని యెహోవా చేశాడు. అది “స్వభావ విరుద్ధము” అని పౌలు అన్నాడు. (రోమా. 11:24) ఆయన ఎందుకు అలా అన్నాడు? మామూలుగానైతే మంచి చెట్టుకు అడవి కొమ్మను ఎవరూ అంటుకట్టరు, అది అసహజం. కానీ మొదటి శతాబ్దంలో కొందరు రైతులు అలా చేసేవారు. b అదే విధంగా, యెహోవా అసహజమైన దాన్ని చేశాడు. యూదుల ప్రకారం, అన్యులు దేవుడు ఇష్టపడే ఫలాలను ఫలించలేరు. అయితే, యెహోవా అలాంటివారినే రాజ్య ఫలాన్ని ఫలించే ‘జనాంగంలో’ భాగంగా చేశాడు. (మత్త. 21:43) సున్నతిపొందని అన్యుల్లో మొట్టమొదట కొర్నేలి క్రైస్తవుడిగా మారాడు. సా.శ. 36లో ఆయన అభిషేకించబడినప్పటి నుండి సున్నతిపొందని అన్యులకు అలంకారార్థ ఒలీవ చెట్టులో అంటుకట్టబడే అవకాశం ఇవ్వబడింది.—అపొ. 10:44-48. c
18. సా.శ. 36 తర్వాత సహజ యూదులకు ఏ అవకాశం ఉంది?
18 సా.శ. 36 తర్వాత సహజ యూదులకు అబ్రాహాము సంతానంలో భాగమయ్యే అవకాశం ఇక లేదని దానర్థమా? కాదు. పౌలు ఇలా వివరించాడు: “వారును [సహజ యూదులును] తమ అవిశ్వాసములో నిలువకపోయిన యెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవచెట్టున అంటుకట్టబడరా?”—రోమా. 11:23, 24.
“ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు”
19, 20. అలంకారార్థ ఒలీవ చెట్టు ఉపమానాన్ని బట్టి యెహోవా దేన్ని నెరవేరుస్తాడని తెలుస్తోంది?
19 ‘దేవుని ఇశ్రాయేలుకు’ సంబంధించిన యెహోవా సంకల్పం అద్భుతరీతిలో నెరవేరుతోంది. (గల. 6:16) పౌలు చెప్పినట్లు, ‘ఇశ్రాయేలు జనులందరు రక్షించబడతారు.’ (రోమా. 11:26) యెహోవా అనుకున్న సమయంలో ‘ఇశ్రాయేలు జనులందరూ’ అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులందరూ పరలోకంలో రాజులుగా యాజకులుగా సేవచేస్తారు. యెహోవా సంకల్పం తప్పక నెరవేరుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు!
20 ముందు చెప్పబడినట్లు, “అన్య జనులకు” అబ్రాహాము సంతానము అంటే యేసుక్రీస్తుతోపాటు 1,44,000 మంది ఆశీర్వాదాలు తీసుకొస్తారు. (రోమా. 11:12; ఆది. 22:18) అలా, దేవుని ప్రజలందరూ ఈ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందుతారు. యెహోవా తన నిత్యసంకల్పాన్ని ఎలా నెరవేర్చాడో మనం ఆలోచిస్తే, “దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము” అని తెలుసుకొని ఆశ్చర్యపోతాం.—రోమా. 11:33.
[అధస్సూచీలు]
a ఒలీవ చెట్టు సహజ ఇశ్రాయేలును సూచించడం లేదు. ఎందుకంటే, సహజ ఇశ్రాయేలులో కొంతమంది రాజులుగా, యాజకులుగా ఉన్నప్పటికీ ఆ జనాంగం యాజక రూపమైన రాజ్యంగా తయారుకాలేదు. ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలు రాజులు యాజకులుగా సేవచేయలేరు. కాబట్టి, సహజ ఇశ్రాయేలు ఒలీవ చెట్టును సూచించడం లేదు. “యాజక రూపమైన రాజ్యము” ఏర్పాటు చేయాలనే దేవుని ఉద్దేశం ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల ద్వారా ఎలా నెరవేరిందో పౌలు వివరించాడు. ఈ ఆర్టికల్‌లో కొత్త అవగాహన ఇవ్వబడింది. గతంలో మనకున్న అవగాహనను కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1983, 14-19 పేజీల్లో చూడవచ్చు.
c కొత్త ఆధ్యాత్మిక జనాంగంలో భాగమయ్యేందుకు సహజ యూదులకు మూడున్నర సంవత్సరాల సమయం ఇచ్చిన తర్వాత ఇది జరిగింది. ఒక్కో రోజు ఒక్కో సంవత్సరాన్ని సూచించే 70 వారాల ప్రవచనం ఈ పరిణామం గురించే చెబుతోంది.—దాని. 9:27.
మీకు జ్ఞాపకమున్నాయా?
• యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చే విధానాన్నిబట్టి ఆయన గురించి ఏమి తెలుస్తోంది?
• రోమీయులు 11వ అధ్యాయంలో . . .
ఒలీవ చెట్టు
దాని వేరు
దాని కాండం
దాని కొమ్మలు వేటిని సూచిస్తున్నాయి?
• అంటుకట్టడానికి అనుసరించిన విధానం “స్వభావ విరుద్ధము” అని ఎందుకు చెప్పవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[24వ పేజీలోని బాక్సు/చిత్రం]
అడవి ఒలీవ కొమ్మలను ఎందుకు అంటుకట్టేవారు?
▪ సా.శ. మొదటి శతాబ్దంలో లూషీయస్ జూన్యస్ మాడరేటస్ కాల్యమెల అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఒక రోమా సైనికుడేకాక, వ్యవసాయదారుడు కూడా. పల్లె జీవితం, వ్యవసాయం గురించి ఆయన 12 పుస్తకాలను రాశాడు. వాటినిబట్టి ఆయన ఎంతో ప్రసిద్ధిగాంచాడు.
ఆయన తన ఐదవ పుస్తకంలో ఈ ప్రాచీన సామెతను ఉల్లేఖించాడు: “ఒలీవ తోటను సాగుచేసే వ్యక్తి ఫలం ఇమ్మని చెట్టును అడిగితే, ఎరువేసే వ్యక్తి ఫలం ఇమ్మని చెట్టును బతిమిలాడతాడు, అదే కొమ్మలను విరిచే వ్యక్తి ఫలం ఇమ్మని చెట్టును బలవంతపెడతాడు.”
ఏపుగా పెరిగినప్పటికీ ఫలాన్ని ఇవ్వని చెట్ల విషయంలో ఆయన ఈ సలహానిచ్చాడు: “చెట్టుకు పరికరంతో రంధ్రం చేసి, ఆ రంధ్రంలో అడవి ఒలీవ చెట్టు కొమ్మను గట్టిగా అంటుకట్టి చూడండి. ఫలించే చెట్టు కొమ్మను అలా అంటుకడితే ఆ చెట్టు చక్కగా ఫలిస్తుంది.”
[23వ పేజీలోని చిత్రం]
అలంకారార్థ ఒలీవ చెట్టు ఉపమానాన్ని మీరు అర్థం చేసుకున్నారా?