పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
“మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” అని యేసు తన శ్రోతలతో అన్నాడు. నేడు, మానవులు ఎలా ‘పరిపూర్ణులుగా ఉండగలరు?’—మత్త. 5:48.
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే, ముందుగా “పరిపూర్ణమైనది,” “పరిపూర్ణత” అనే పదాలు బైబిల్లో ఎలా ఉపయోగించబడ్డాయో అర్థం చేసుకోవాలి. లేఖనాల్లో ‘పరిపూర్ణమైనదిగా’ వర్ణించబడిన ప్రతీది సంపూర్ణ భావంలో పరిపూర్ణమైనది కాకపోవచ్చు. అయితే, యెహోవా మాత్రం సంపూర్ణ భావంలో పరిపూర్ణుడు. ప్రజలు లేదా వస్తువులు కేవలం పరిమిత భావంలోనే పరిపూర్ణంగా ఉండవచ్చు. “పరిపూర్ణమైనది” అని అనువదించబడిన హీబ్రూ, గ్రీకు బైబిలు పదాలు తరచూ, ఒక అధికార మూలం ఏర్పాటు చేసిన ప్రమాణాల ప్రకారం “సంపూర్ణంగా,” “పరిణతిగలవిగా” లేదా “లోపంలేకుండా” ఉన్నవాటిని సూచిస్తాయి.
ఆదాముహవ్వలు నైతిక, ఆధ్యాత్మిక, భౌతిక పరిపూర్ణతతో సృష్టించబడ్డారు. తమ సృష్టికర్త ఏర్పాటుచేసిన ప్రమాణం ప్రకారం వారు పరిపూర్ణులుగా ఉన్నారు. అవిధేయత వల్ల వారు ఆ ప్రమాణాలకు సరితూగలేకపోయారు కాబట్టే వారు, వారి సంతానం పరిపూర్ణతను కోల్పోయారు. అలా ఆదాము ద్వారానే పాపము, అపరిపూర్ణత, మరణం మానవజాతికి సంక్రమించాయి.—రోమా. 5:12.
అయితే, కొండమీది ప్రసంగంలో యేసు స్పష్టం చేసినట్లు, అపరిపూర్ణ ప్రజలు కూడా పరిమిత భావంలో పరిపూర్ణులుగా ఉండవచ్చు. ఆ ప్రసంగంలో ఆయన, పరిపూర్ణమైన లేదా సంపూర్ణమైన ప్రేమకు ప్రమాణాలను ఏర్పాటు చేశాడు. అది మానవజాతిపట్ల యెహోవా దేవుడు చూపించే ప్రేమలాంటిది. యేసు ఇలా చెప్పాడు: “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్త. 5:44, 45) అంతగా ప్రేమను చూపించడం ద్వారా, యేసు శిష్యులు దేవుని పరిపూర్ణ మాదిరిని అనుసరించినవారౌతారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఇతరులను ప్రేమించే విషయంలో అలాంటి ఉన్నతమైన ప్రమాణాన్ని పాటించడానికి కృషిచేస్తారు. అన్ని నేపథ్యాలకు, జాతులకు, మతాలకు చెందిన ప్రజలు బైబిలు సత్యానికి సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని తెలుసుకునేలా సహాయం చేయాలని వారు కోరుకుంటారు. ఇప్పుడు 236 దేశాల్లో, ఆసక్తిగలవారితో సాక్షులు 70,00,000 కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు.
“మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా” అని యేసు అన్నాడు. (మత్త. 5:46, 47) నిజక్రైస్తవులు, ప్రజల చదువు లేదా జాతిని బట్టి పక్షపాతం చూపించరు లేదా తమను తిరిగి ప్రేమించేవారిని మాత్రమే ప్రేమించరు. బదులుగా వారు బీదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి, వృద్ధులకు, పిల్లలకు సహాయం చేస్తారు. ఆ రీతుల్లో యెహోవా ప్రేమను అనుకరించడం ద్వారా క్రైస్తవులు పరిమిత భావంలో పరిపూర్ణులుగా ఉంటారు.
ఆదాము కోల్పోయిన పరిపూర్ణతను మనం ఎప్పటికైనా అనుభవించగలుగుతామా? తప్పకుండా. యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచడం ద్వారా వెయ్యేండ్ల పరిపాలనలో ‘దేవుని కుమారుడైన’ క్రీస్తు ‘అపవాది క్రియలను లయపరచినప్పుడు’ విధేయులైన మానవజాతి పూర్తి భావంలో పరిపూర్ణతకు చేరుకుంటారు.—1 యోహా. 3:8.