సమయాన్ని ఎందుకు పాటించాలి?
సమయాన్ని ఎందుకు పాటించాలి?
సమయాన్ని పాటించడం ఎల్లప్పుడూ సులభమేమీ కాదు. సుదూర ప్రయాణాలు చేయాల్సి రావడం వల్ల, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల, చాలా పనులు ఉండడం వల్ల సమయాన్ని పాటించడం కష్టంకావచ్చు. అయినా సమయాన్ని పాటించడం ప్రాముఖ్యం. ఉదాహరణకు, ఉద్యోగ స్థలంలో సమయం పాటించే వ్యక్తిని నమ్మకస్థునిగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే, పనికి ఆలస్యంగా వచ్చే వ్యక్తి విషయానికొస్తే, ఆయన వల్ల ఇతరుల పనికీ కంపెనీ అందించే సేవలకూ ఆటంకం కలగవచ్చు, ఉత్పత్తుల నాణ్యతా దెబ్బతినవచ్చు. పాఠశాలకు తరచూ ఆలస్యంగా వెళ్లడంవల్ల ఓ విద్యార్థి కొన్ని క్లాసులకు హాజరుకాలేక చదువులో రాణించకపోవచ్చు. రమ్మన్న సమయానికి వైద్యుని దగ్గరికి లేదా దంతవైద్యుని దగ్గరికి వెళ్లకపోతే సరైన చికిత్స అందకపోవచ్చు.
కొన్నిచోట్ల సమయపాలనకు అంత ప్రాముఖ్యతనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో, ప్రతీ పనిని ఆలస్యంగా చేయడం అలవాటుగా మారవచ్చు. అది అలవాటుగా మారినట్లైతే సమయాన్ని పాటించాలన్న కోరికను పెంపొందించుకోవడం చాలా అవసరం. సమయపాలన ఎందుకు ప్రాముఖ్యమో అర్థం చేసుకుంటే దాన్ని పాటించడం సులభమౌతుంది. సమయాన్ని పాటించడానికిగల కొన్ని కారణాలేమిటి? సమయాన్ని పాటించాలంటే మనం ఏమి చేయాలి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలొస్తాయి?
యెహోవా సమయపాలకుడు
మనం మన దేవుడైన యెహోవాను అనుకరించాలనుకుంటాం కాబట్టే సమయాన్ని పాటిస్తాం. (ఎఫె. 5:1) సమయాన్ని పాటించే విషయంలో యెహోవాయే అత్యుత్తమ మాదిరి. ఆయన ఏదీ ఆలస్యం చేయడు. తన సంకల్పాలను నెరవేర్చే విషయంలో యెహోవా తాను అనుకున్న సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. ఉదాహరణకు, జలప్రళయం ద్వారా భక్తిహీన లోకాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు యెహోవా నోవహుతో, “చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము” అని ఆజ్ఞాపించాడు. జలప్రళయం వచ్చే సమయం దగ్గరపడుతుండగా యెహోవా నోవహును ఓడలోకి వెళ్లమని చెప్పడమే కాక, “ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదును” అని కూడా అన్నాడు. సరిగ్గా తాను చెప్పిన సమయానికే అంటే “ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను.” (ఆది. 6:14; 7:4, 10) నోవహు, ఆయన కుటుంబం సమయానికి ఓడలోకి ప్రవేశించకపోయుంటే వారికి ఏమి జరిగివుండేదో ఊహించండి! తాము ఆరాధించే దేవునిలాగే వారూ సమయాన్ని పాటించాల్సి వచ్చింది.
జలప్రళయం వచ్చిన దాదాపు 450 సంవత్సరాల తర్వాత, యెహోవా అబ్రాహాముకు ఓ వాగ్దానం చేశాడు. ఆయనకు ఓ కుమారుడు జన్మిస్తాడనీ, ఆ కుమారుని వంశం నుండే వాగ్దానం చేయబడిన సంతానం వస్తాడనీ యెహోవా చెప్పాడు. (ఆది. 17:15-17) “వచ్చు సంవత్సరము ఈ కాలమందు” ఇస్సాకు పుడతాడని యెహోవా దేవుడు చెప్పాడు. మరి అలా జరిగిందా? లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.”—ఆది. 17:21; 21:2.
దేవుడు సమయపాలకుడని చెప్పేందుకు కావాల్సిన ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. (యిర్మీ. 25:11-13; దాని. 4:20-25; 9:25) భవిష్యత్తులో వచ్చే యెహోవా తీర్పు దినం కోసం కనిపెట్టుకొని ఉండమని బైబిలు మనకు చెబుతోంది. ఆ దినం ‘ఆలస్యంగా’ వస్తున్నట్లు అనిపించినా అది “జాగుచేయక వచ్చును” అనే అభయం మనకు ఇవ్వబడింది.—హబ. 2:3.
ఆరాధనలో సమయపాలన ప్రాముఖ్యం
యెహోవా “ఏర్పాటుచేసిన పండుగలను” జరుపుకోవడం కోసం నియమిత స్థలంలో ఇశ్రాయేలీయుల్లోని పురుషులంతా సరిగ్గా సమయానికి హాజరుకావాలి. (లేవీ. 23:2, 4, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఏ బలి ఏ సమయంలో ఇవ్వాలో కూడా యెహోవా నిర్ణయించాడు. (నిర్గ. 29:38, 39; లేవీ. 23:37, 38) ఆరాధన విషయంలో తన ప్రజలు సమయాన్ని పాటించాలని యెహోవా కోరుతున్నట్లు ఈ వృత్తాంతాలు చూపించడంలేదా?
మొదటి శతాబ్దంలో, క్రైస్తవ కూటాలను ఎలా నిర్వహించాలో ఉపదేశిస్తూ అపొస్తలుడైన పౌలు కొరింథీయులను ఇలా ప్రోత్సహించాడు: “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.” (1 కొరిం. 14:39, 40) అందుకే, క్రైస్తవ కూటాలు నియమిత సమయానికే ప్రారంభం కావాలి. సమయాన్ని పాటించే విషయంలో యెహోవా మారలేదు. (మలా. 3:6) కాబట్టి, క్రైస్తవ కూటాలకు సమయానికి హాజరుకావాలంటే మనం ఏమి చేయాలి?
సమయాన్ని పాటించాలంటే మనం ఏమి చేయాలి?
ముందుగా ప్రణాళిక వేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనముందని కొందరు గ్రహించారు. (సామె. 21:5) ఉదాహరణకు, మనం కొంతదూరం ప్రయాణం చేసి, ఫలాని సమయానికి చేరుకోవాలనుకుందాం. అలాంటప్పుడు సరిగ్గా సమయానికి చేరుకునేలా చివరిక్షణంలో బయలుదేరడం తెలివైన పనేనంటారా? దారిలో ఏవైనా ‘అనుకోని సంఘటనలు’ ఎదురైనా సరే మనం ఆలస్యం కాకూడదంటే కొంచెం ముందుగానే బయలుదేరడం తెలివైన పని కాదా? (ప్రసం. 9:11, NW) “ఒకానొక గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో బాగా తెలిస్తే సమయానికి అక్కడికి చేరుకోగలుగుతాం” అని సమయాన్ని పాటించే హోసే అనే యౌవనస్థుడు చెబుతున్నాడు. a
క్రైస్తవ కూటాలకు సరైన సమయానికి చేరుకునేందుకు కొందరు తమ పనిస్థలం నుండి ముందుగా బయలుదేరే ఏర్పాట్లు చేసుకోవాల్సిరావచ్చు. ఇతియోపియాలోని ఓ యెహోవాసాక్షి ఆ పనే చేశాడు. తన షిఫ్టులు మారుతుంటాయి కాబట్టి సంఘ కూటాలకు 45 నిమిషాలు ఆలస్యం అవుతుందని గుర్తించి కూటాలు జరిగే రోజున తాను ఆలస్యం కాకుండా ఉండేలా తన తర్వాత షిఫ్టు చేసే వ్యక్తిని ముందుగా రమ్మని కోరాడు. అలా చేస్తే ఆయన కోసం అదనంగా ఏడు గంటల షిఫ్టు చేస్తానని సాక్షి ఆయనకు మాటిచ్చాడు.
మీకు చిన్న పిల్లలున్నట్లైతే కూటాలకు సమయానికి హాజరు కావడం కొంచెం కష్టమే. పిల్లల్ని తయారుచేసే బాధ్యత సాధారణంగా తల్లిమీదే పడుతుంది. కానీ ఈ విషయంలో కుటుంబ సభ్యులందరూ సహాయం చేయవచ్చు, అలా చేయాలి కూడా. మెక్సికోకు చెందిన ఓ ఒంటరి తల్లి అయిన ఎస్పెరాన్జాకు ఎనిమిది మంది పిల్లలను చూసుకునే బాధ్యత ఉండేది. ఇప్పుడు వారి వయసులు 5 నుండి 23 ఏళ్ల మధ్య ఉంటాయి. తామెలా సమయాన్ని పాటించగలుగుతున్నారో ఎస్పెరాన్జా వివరించింది. ఆమె ఇలా చెప్పింది: “నా పెద్దమ్మాయిలు చిన్నవాళ్లను తయారుచేస్తారు. దీనివల్ల నేను నా ఇంటి పనులను ముగించుకుని, తయారవగలుగుతున్నాను. అలా మేము అనుకున్న సమయానికే కూటాలకు బయల్దేరగలుగుతున్నాం.” అనుకున్న సమయానికి ఇంట్లో నుంచి బయల్దేరాలని వారు నిర్ణయించుకున్నారు. దానికి అందరూ సహకరిస్తున్నారు.
ఆరాధన విషయంలో సమయాన్ని పాటించడం ద్వారా ప్రయోజనం పొందండి
సరిగ్గా సమయానికి క్రైస్తవ కూటాలకు చేరుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచిస్తే సమయాన్ని పాటించడానికి శాయశక్తులా కృషిచేయాలన్న కోరిక, పట్టుదల పెరుగుతాయి. కూటాలకు త్వరగా రావడాన్ని అలవాటు చేసుకున్న సాన్డ్రా అనే యౌవనస్థురాలు ఇలా చెబుతోంది: “కూటాలకు ముందుగా వెళ్లడమంటే హెబ్రీ. 10:24, 25.
నాకు ఎంతో ఇష్టం. దానివల్ల సహోదర సహోదరీలను కలుసుకోగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వారి గురించి బాగా తెలుసుకోగలుగుతున్నాను.” మనం రాజ్యమందిరానికి ముందుగా వెళ్తే అక్కడకు వచ్చే సహోదర సహోదరీల యథార్థత గురించి, సహనం గురించి విని ప్రయోజనం పొందవచ్చు. మనం ముందుగా అక్కడకు వెళ్లడంవల్ల, ప్రోత్సాహకరంగా మాట్లాడడంవల్ల ‘ప్రేమచూపేలా, సత్కార్యములు చేసేలా’ మనం కూడా మన సహోదర సహోదరీలను పురికొల్పగలుగుతాం.—కూటానికి ముందు పాడే పాట, చేసే ప్రార్థన మన ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగాలు. (కీర్త. 149:1) మనం పాడే పాటలు యెహోవాను స్తుతిస్తాయి, మనం పెంపొందించుకోవాల్సిన లక్షణాలను గుర్తుచేస్తాయి, పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేలా మనల్ని ప్రోత్సహిస్తాయి. ప్రారంభ ప్రార్థన విషయమేమిటి? ప్రాచీనకాలంలో యెహోవా తన ఆలయాన్ని “ప్రార్థన మందిరము” అని పిలిచాడు. (యెష. 56:7) నేడు, కూటాల్లో దేవుణ్ణి ప్రార్థించడానికి మనం సమకూడుతాం. ప్రారంభ ప్రార్థనలో యెహోవా నిర్దేశం కోసం, పరిశుద్ధాత్మ కోసం అడుగుతాం. దానివల్ల చర్చించబోయే విషయాలను గ్రహించేలా మన హృదయాలు, మనసులు సిద్ధమౌతాయి. అందుకే కూటాల్లో జరిగే ప్రారంభ పాటకు, ప్రార్థనకు మనం ఉండాలని తీర్మానించుకోవాలి.
కూటాలకు ముందుగా హాజరవడానికిగల కారణాన్ని చెబుతూ 23 ఏళ్ల హెలన్ ఇలా అంది: “అక్కడ అందించబడే సమాచారంతోపాటు ప్రారంభ పాట, ప్రార్థన కూడా యెహోవాయే ఏర్పాటుచేశాడు కాబట్టి ఆయనపట్ల నాకున్న ప్రేమను ఈ విధంగా చూపించాలనుకున్నాను.” మనమూ ఆమెలాగే ఆలోచించాలి. కాబట్టి మనం చేసేవాటన్నిటిలో ముఖ్యంగా, సత్యదేవుని ఆరాధనకు సంబంధించిన విషయాల్లో సమయాన్ని పాటించే అలవాటును పెంపొందించుకునేందుకు కృషి చేద్దాం.
[అధస్సూచి]
a పేర్లు మార్చబడ్డాయి.
[26వ పేజీలోని చిత్రం]
ముందుగా సిద్ధపడండి
[26వ పేజీలోని చిత్రం]
‘అనుకోని సంఘటనల’ కోసం సమయాన్ని పక్కనబెట్టండి
[26వ పేజీలోని చిత్రాలు]
కూటాలకు ముందుగా హాజరవడం వల్ల ప్రయోజనాలను పొందండి