ప్రేమ చూపించేలా క్రీస్తు ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తోంది
ప్రేమ చూపించేలా క్రీస్తు ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తోంది
“యేసు . . . లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.”—యోహా. 13:1.
1, 2. (ఎ) యేసు చూపించిన ప్రేమలోని గొప్పతనం ఏమిటి? (బి) ప్రేమను చూపించడానికి సంబంధించి మనం ఏయే విషయాలను ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం?
ప్రేమ చూపించే విషయంలో యేసు పరిపూర్ణమైన మాదిరి ఉంచాడు. ఆయన ప్రవర్తన, మాటలు, బోధలు, తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ఇలా ఆయన చేసిన ప్రతీదానిలో ప్రేమ కనబడుతుంది. ఆయన భూమ్మీద గడిపిన చివరి క్షణం వరకు తనను కలుసుకున్నవారి పట్ల, మరిముఖ్యంగా తన శిష్యుల పట్ల ప్రేమ చూపించాడు.
2 ప్రేమ విషయంలో యేసు ఎంతో చక్కని మాదిరిని ఉంచాడు. అలా ఆయన ప్రేమ చూపించే విషయంలో తన అనుచరులకు ఉన్నత ప్రమాణాన్ని ఉంచాడు. సహోదరసహోదరీల పట్ల, ఇతరుల పట్ల అలాంటి ప్రేమను చూపించేందుకు కూడ ఆయన ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తోంది. తప్పిదాలు చేసినవారి పట్ల, చివరకు ఘోరమైన తప్పులు చేసినవారి పట్ల ప్రేమ చూపించే విషయంలో సంఘ పెద్దలు యేసు నుండి ఏమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, విపత్తులు ఎదుర్కొన్న, అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరులకు సహాయం చేసేందుకు ఆయన ప్రేమ క్రైస్తవులను ఎలా ప్రోత్సహిస్తుందో కూడ చూస్తాం.
3. పేతురు ఘోరమైన తప్పు చేసినప్పటికీ యేసు ఆయనతో ఎలా వ్యవహరించాడు?
3 యేసు మరణానికి ముందు రోజు రాత్రి, తన అపొస్తలుడైన పేతురే ఆయన ఎవరో తనకు తెలియదని మూడుసార్లు అన్నాడు. (మార్కు 14:66-72) అయితే, యేసు అంతకుముందు చెప్పినట్లే ఆయన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడినప్పుడు యేసు ఆయనను క్షమించాడు. యేసు పేతురుకు బరువైన బాధ్యతలను అప్పగించాడు. (లూకా 22:32; అపొ. 2:14; 8:14-17; 10:44, 45) ఘోరమైన తప్పులు చేసినవారితో యేసు వ్యవహరించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
తప్పిదస్థులతో వ్యవహరిస్తున్నప్పుడు క్రీస్తును అనుకరించండి
4. ప్రాముఖ్యంగా ఎలాంటి సందర్భంలో క్రీస్తులాంటి మనసును చూపించాల్సివస్తుంది?
4 ఎన్నో సందర్భాల్లో మనం క్రీస్తు మనసును కనబరచవచ్చు. వాటిలో ఒక దానిని మనం ఇప్పుడు చూద్దాం. కుటుంబంలో లేదా సంఘంలో ఎవరైనా తీవ్రమైన తప్పు చేస్తే మనకు ఎంతో బాధేస్తుంది. బాధాకరమైన విషయమేమిటంటే, సాతాను వ్యవస్థకు నాశనం దగ్గరపడుతుండగా లౌకికాత్మ ప్రభావం వల్ల ఎంతోమంది నైతికంగా దిగజారిపోతున్నారు. లోకం మంచిచెడుల గురించి అంతగా పట్టించుకోవడంలేదు. ఈ లక్షణం చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనలో ఎవరినైనా ప్రభావితం చేసి మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. మొదటి శతాబ్దంలోని కొందరిని క్రైస్తవ సంఘం నుండి వెలివేయాల్సివచ్చింది. మరికొందరిని గద్దించాల్సివచ్చింది. మన కాలంలో కూడా అలాగే జరుగుతుంది. (1 కొరిం. 5:11-13; 1 తిమో. 5:20) అయితే, అలాంటివారిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పెద్దలు క్రీస్తులాంటి ప్రేమను చూపిస్తే అది తప్పిదస్థుని మీద ఎంతో ప్రభావం చూపించగలదు.
5. తప్పిదస్థులతో వ్యవహరించే విషయంలో పెద్దలు క్రీస్తును ఎలా అనుకరించాలి?
5 యేసులాగే, పెద్దలూ యెహోవా నీతియుక్త ప్రమాణాలను అన్ని సందర్భాల్లో పాటించాలి. అలా చేస్తే వారు సాత్వికం, దయ, ప్రేమ చూపించడంలో యెహోవాను అనుకరించగలుగుతారు. ఎవరైనా తమ తప్పు తెలుసుకొని ‘విరిగిన హృదయంతో,’ ‘నలిగిన మనస్సుతో’ నిజమైన పశ్చాత్తాపం చూపిస్తే ‘సాత్వికమైన మనస్సుతో అలాంటివారిని మంచి దారికి తీసుకురావడం’ పెద్దలకు అంత కష్టంకాకపోవచ్చు. (కీర్త. 34:18; గల. 6:1) అయితే, ఎదురుతిరిగేవారితో, అసలు పశ్చాత్తాపమే చూపించనివారితో ఎలా వ్యవహరించాలి?
6. తప్పిదస్థులతో పెద్దలు ఎలా వ్యవహరించకూడదు? ఎందుకు?
6 తప్పిదస్థుడు పెద్దలు ఇచ్చే లేఖన ఉపదేశాన్ని తిరస్కరించినప్పుడు లేదా తప్పు వేరేవారిమీద మోపడానికి ప్రయత్నించినప్పుడు పెద్దలకూ, ఇతరులకూ కోపంరావచ్చు. ఆయన అప్పటికే సంఘానికి చేసిన నష్టాన్ని మనసులో ఉంచుకొని ఆ వ్యక్తి చేసిన పనుల విషయంలో, అతని ప్రవర్తనా తీరు విషయంలో తమ కోపాన్ని వెళ్లగక్కాలనిపించవచ్చు. అలా కోపగించుకోవడం వల్ల నష్టమే జరుగుతుంది గానీ “క్రీస్తు మనస్సు”ను కనబరచలేం. (1 కొరిం. 2:16; యాకోబు 1:19, 20 చదవండి.) యేసు తన కాలంలో కొందరిని ఖచ్చితంగా హెచ్చరించినప్పటికీ వారిని ఎప్పుడూ దూషించలేదు లేదా బాధపెట్టే మాటలేవీ అనలేదు. (1 పేతు. 2:23) బదులుగా, పశ్చాత్తాపపడి యెహోవా అనుగ్రహాన్ని తిరిగిపొందవచ్చని తప్పిదస్థులకు తన మాటల్లో చేతల్లో స్పష్టం చేశాడు. ఇంకా చెప్పాలంటే, అసలు యేసు భూమ్మీదకు రావడానికిగల ముఖ్యమైన కారణాల్లో “పాపులను రక్షించడం” ఒకటి.—1 తిమో. 1:15.
7, 8. న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పెద్దలు ఏయే విషయాలను మనసులో ఉంచుకోవాలి?
7 సంఘం నుండి క్రమశిక్షణ పొందాల్సినవారి పట్ల మనకు ఉండాల్సిన అభిప్రాయం విషయంలో మనం యేసు నుండి ఏమి నేర్చుకోవచ్చు? లేఖన ప్రకారం సంఘంలో తీసుకునే న్యాయపరమైన చర్య మందను కాపాడుతుందని, క్రమశిక్షణ పొందిన తప్పిదస్థుడు పశ్చాత్తాపపడేలా ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి. (2 కొరిం. 2:6-8) బాధాకరంగా, కొందరు పశ్చాత్తాపపడరు కాబట్టి వారు సంఘం నుండి వెలివేయబడాలి. అయితే సంతోషకరమైన విషయమేమిటంటే, వారిలో చాలామంది పశ్చాత్తాపపడి యెహోవా దగ్గరకు, ఆయన సంఘంలోకి తిరిగివస్తున్నారు. పెద్దలు క్రీస్తులాంటి మనసును కనబరిస్తే తప్పిదస్థులు పశ్చాత్తాపపడి చివరకు సంఘంలోకి తిరిగిరావడం సులభమౌతుంది. కొంతకాలం తర్వాత ఈ తప్పిదస్థుల్లో కొందరికి పెద్దలు తమకు ఇచ్చిన లేఖన ఉపదేశాలన్నీ గుర్తుండకపోవచ్చు గానీ పెద్దలు తమ పట్ల గౌరవంతో, ప్రేమతో వ్యవహరించారని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు.
8 అందుకే, తప్పిదస్థులు లేఖన ఉపదేశాన్ని తిరస్కరించినప్పటికీ, పెద్దలు ‘ఆత్మఫలంలోని’ లక్షణాలను, ప్రాముఖ్యంగా క్రీస్తులాంటి ప్రేమను చూపించాలి. (గల. 5:22, 23) తప్పిదస్థుని విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తప్పిదస్థులు యెహోవా దగ్గరకు తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు పెద్దలు చూపించాలి. అలా చేస్తే, తప్పిదస్థుడు కొంతకాలం తర్వాత పశ్చాత్తాపపడినప్పుడు తాను సంఘంలోకి తిరిగివచ్చేలా మార్గం సుగమం చేసిన యెహోవాకూ, ‘మనుష్యుల్లో ఈవులైన’ పెద్దలకూ ఎంతో రుణపడివుంటాడు.—ఎఫె. 4:8, 11, 12.
అంత్యదినాల్లో క్రీస్తులాంటి ప్రేమను చూపించండి
9. యేసు తన శిష్యుల పట్ల ప్రేమను చూపించిన ఒక సందర్భం గురించి చెప్పండి.
9 లూకా సువార్త, యేసు అత్యున్నత ప్రేమను చూపించిన ఓ సందర్భం గురించి చెబుతోంది. కొంతకాలానికి, నాశనం చేయబడే యెరూషలేము పట్టణాన్ని రోమా సైన్యం చుట్టుముట్టి ఎవరికీ పారిపోయే అవకాశం లేకుండా చేస్తుంది అని యేసుకు తెలుసు. అందుకే ఆయన తన శిష్యులకు “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి” అని ప్రేమతో హెచ్చరించాడు. అప్పుడు వారేమి చేయాలి? దాని గురించి యేసు ముందుగానే స్పష్టంగా, వివరంగా చెప్పాడు. “అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు” అని అన్నాడు. (లూకా 21:20-22) సా.శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు, విధేయులైనవారు ఆయన చెప్పినట్లు చేశారు.
10, 11. తొలి క్రైస్తవులు యెరూషలేము నుండి పారిపోయినప్పుడు ఎదురైన పరిస్థితులను పరిశీలించడం వల్ల మనం ‘మహాశ్రమల’ కోసం ఎలా సిద్ధపడగలుగుతాం?
10 క్రైస్తవులు యెరూషలేమును విడిచి పారిపోతున్నప్పుడు క్రీస్తు తమ పట్ల ప్రేమ చూపించినట్లే వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించాలి. అంతేకాక, తమ దగ్గరున్నవన్నీ ఇతరులతో పంచుకోవాలి. క్రీస్తు యెరూషలేము నాశనం గురించి చెప్పినప్పటికీ ఆయన ప్రవచనానికి మరో గొప్ప నెరవేర్పు కూడ ఉంది. యేసు ఇలా ప్రవచించాడు: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్త. 24:17, 18, 21) భవిష్యత్తులో రానున్న ‘మహాశ్రమల’ ముందు, మహాశ్రమలప్పుడు మనకు కూడ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయి. క్రీస్తు మనసు ఉంటే మనం వాటిని సహించగలుగుతాం.
11 ఆ మహాశ్రమలప్పుడు మనం యేసులా నిస్వార్థ ప్రేమను చూపిస్తూ ఆయన మాదిరిని అనుసరించాలి. ఈ విషయంలో పౌలు ఇలా ఉపదేశించాడు: “తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు . . . మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.”—రోమా. 15:2, 3, 5.
12. మనం ఇప్పుడు ఎలాంటి ప్రేమను పెంపొందించుకోవాలి? ఎందుకు?
12 యేసు ప్రేమను పొందిన పేతురు కూడ “నిష్కపటమైన సహోదరప్రేమ”ను చూపించమని, ‘సత్యానికి విధేయత’ చూపించమని క్రైస్తవులను ప్రోత్సహించాడు. వారు “యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమిం[చాలి].” (1 పేతు. 1:22) ఇంతకుముందు కన్నా ఎక్కువగా మనం ఇప్పుడు క్రీస్తులాంటి లక్షణాలను పెంపొందించుకోవాలి. ఇప్పటికే దేవుని ప్రజలందరిమీద ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. గతించిపోయే ఈ లోకానికి సంబంధించిన ఏ వ్యవస్థ మీద మనలో ఎవరమూ నమ్మకముంచకూడదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇటీవల ఎదురైన సంక్షోభమే దానికి రుజువు. (1 యోహాను 2:15-17 చదవండి.) అందుకే, ఈ వ్యవస్థ నాశనానికి దగ్గరయ్యే కొద్దీ మనం యెహోవాకు దగ్గరకావాలి, సహోదరులతో మనకున్న స్నేహాన్ని, సంఘంలో సన్నిహిత స్నేహితులను పెంచుకోవాలి. పౌలు ఇలా ఉపదేశించాడు: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమా. 12:10) పేతురు ఈ విషయాన్ని మరింత నొక్కిచెప్పాడు: “అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.”—1 పేతు. 4:8.
13-15. విపత్తులు వచ్చిన ప్రాంతాల్లో కొందరు సహోదరులు క్రీస్తులాంటి ప్రేమను ఎలా చూపించారు?
13 యెహోవాసాక్షులకు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తులాంటి ప్రేమను చూపిస్తారనే పేరుంది. 2005లో అమెరికా దక్షిణభాగంలోని చాలా ప్రాంతాలను తుఫానులు, హరికేన్లు అతలాకుతలం చేశాయి. ఆ సమయంలో సహాయం చేయడానికి ముందుకువచ్చిన సాక్షుల ఉదాహరణ పరిశీలించండి. యేసు చూపించిన ప్రేమనుబట్టి ప్రోత్సహించబడి బాధిత సహోదరులకు సహాయం చేయడానికి 20,000 కన్నా ఎక్కువమంది సహోదర సహోదరీలు ముందుకువచ్చారు. వారు సౌకర్యవంతమైన ఇళ్లను, మంచి ఉద్యోగాలను వదులుకొని మరీ వచ్చారు.
14 ఒక ప్రాంతంలో, తుఫాను వల్ల సముద్రపు నీరు 10 మీటర్ల ఎత్తు ఎగిసిపడుతూ, తీరం దాటి 80 కిలోమీటర్ల వరకు నేలమీదకు వచ్చింది. నీటిమట్టం తగ్గే సమయానికి ఆ తుఫాను వల్ల ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఆ తుఫాను తాకిడికి మూడోవంతు ఇళ్లు, మరికొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. వివిధ దేశాల నుండి స్వచ్ఛందంగా వచ్చిన నైపుణ్యంగల సాక్షులు తమతోపాటు పనిముట్లను, నిర్మాణ సామగ్రిని ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ సహోదరులకు కావాల్సిన సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. బాధిత సహోదర సహోదరీలకు సహాయం చేద్దామని విధవరాళ్ళైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడ ముందుకువచ్చారు. వారు తమ సామానంతా చిన్న లారీలో వేసుకొని 3,000 కి.మీ. ప్రయాణించారు. వారిద్దరిలో చిన్నామె ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే ఉంటోంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న స్థానిక కమిటీకి సహాయం చేస్తూ, ఆమె క్రమ పయినీరుగా పనిచేస్తోంది.
15 మొత్తం 5,600 కన్నా ఎక్కువ ఇళ్లు కట్టారు లేదా మరమ్మత్తులు చేశారు. వాటిలో సాక్షుల ఇళ్లే కాక, మరికొందరి ఇళ్లు కూడ ఉన్నాయి. అసాధారణమైన ఆ ప్రేమను చవిచూసిన స్థానిక సాక్షులకు ఏమనిపించింది? ఓ సహోదరి ఇల్లు నేలమట్టమయింది. ఆమె కారుతున్న పైకప్పు ఉన్న చక్రాలబండిలో ఉండాల్సివచ్చింది. ఆమె దగ్గర పాడైన చిన్న స్టవ్ మాత్రమే మిగిలింది. సహోదరులు ఆమె కోసం చిన్నదే అయినా సౌకర్యవంతమైన ఇల్లు కట్టారు. చూడముచ్చటగా కనిపించే ఆ కొత్త ఇంటి ముందు నిల్చొని యెహోవా పట్ల, తన సహోదరుల పట్ల కృతజ్ఞతతో కంటతడిపెట్టుకుంది. ఇళ్లు పోగొట్టుకున్న అనేకమంది స్థానిక సాక్షులు తాత్కాలిక నివాసాల్లోనే సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం గడిపారు. ఎందుకు? వారు తమ కోసం కట్టిన కొత్త ఇళ్లను సహాయక చర్యల కోసం వచ్చిన సహోదరులు వాడుకోవడానికి ఇచ్చారు. క్రీస్తులాంటి మనసును చూపించే విషయంలో ఎంత చక్కని ఉదాహరణ!
అనారోగ్యంతో ఉన్నవారి పట్ల క్రీస్తులాంటి మనసును చూపించండి
16, 17. అనారోగ్యంతో ఉన్నవారి పట్ల మనం క్రీస్తులాంటి మనసును ఏయే విధాలుగా చూపించవచ్చు?
16 మనలో కొద్దిమంది మాత్రమే పెద్ద పెద్ద విపత్తులను ఎదుర్కొనివుంటాం. కానీ దాదాపు మనలో ప్రతీఒక్కరం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సివస్తుంది. అవి మనకైనా రావచ్చు లేదా మన కుటుంబ సభ్యులకైనా రావచ్చు. అనారోగ్యంతో ఉన్నవారితో వ్యవహరించే విషయంలో కూడా మనం క్రీస్తును అనుకరించవచ్చు. ఆయన వారిని ప్రేమించాడు కాబట్టే వారిపట్ల కనికరాన్ని చూపించాడు. జనసమూహాలు అనారోగ్యంతో ఉన్నవారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చినప్పుడు, ఆయన ‘వారిని స్వస్థపరిచాడు.’—మత్త. 8:16; 14:14.
17 నేడు స్వస్థపరిచే అద్భుత శక్తి క్రైస్తవులకు లేకపోయినా అనారోగ్యంతోవున్నవారి పట్ల క్రీస్తులా కనికరాన్ని చూపిస్తారు. ఎలా చూపిస్తారు? ఉదాహరణకు, సంఘంలో అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసి, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించడం ద్వారా పెద్దలు తమకు క్రీస్తులాంటి మనసు ఉందని చూపిస్తారు. వారు మత్తయి 25:39, 40లో (చదవండి) ఉన్న సూత్రాన్ని పాటిస్తారు. a
18. ఇద్దరు సహోదరీలు మరో సహోదరి పట్ల ఎలా నిజమైన ప్రేమను చూపించారు? దాని వల్ల వచ్చిన ఫలితాలేమిటి?
18 ఇతరులకు మంచి చేయడానికి సంఘ పెద్దే కానవసరంలేదు. క్యాన్సర్ వ్యాధితో బాధపడిన 44 ఏళ్ల షార్లీన్ ఉదాహరణ తీసుకోండి, ఆమె కేవలం పది రోజులే బ్రతుకుతుందని డాక్టర్లు చెప్పారు. షారెన్, నీకోలెట్ అనే ఇద్దరు సహోదరీలు ఆమె అవసరాన్ని గుర్తించారు. అంకితభావంతో ఆమెను చూసుకుంటున్న ఆమె భర్తకు ఆమెను చూసుకోవడం కష్టమౌతుందని కూడా అర్థంచేసుకున్నారు. షార్లీన్ చివరిరోజుల్లో పూర్తిగా ఆమెతోనే ఉంటూ సహాయం చేయడానికి వారు ముందుకువచ్చారు. వారు పదిరోజుల కోసమే వచ్చినప్పటికీ ఆమెకు ఆరు వారాలు సపర్యలు చేయాల్సివచ్చింది. అయినా, చివరివరకు ఆమె పట్ల ప్రేమ చూపించారు. “ఎవరికైనా ఆరోగ్యం బాగుపడే అవకాశంలేదని తెలుసుకున్నప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. కానీ యెహోవా మమ్మల్ని బలపర్చాడు. ఆ అనుభవం వల్ల యెహోవాకు దగ్గరయ్యాం, ఒకరికి ఒకరం దగ్గరయ్యాం” అని షారెన్ చెప్పింది. షార్లీన్ భర్త ఇలా అన్నాడు: “ఆ ఇద్దరు సహోదరీలు దయతో చేసిన సహాయాన్ని నేనెప్పుడూ మరచిపోలేను. సదుద్దేశంతో, మంచి మనసుతో వారు సహాయం చేయడం వల్ల ప్రియమైన నా భార్య తనకు ఎదురైన చివరి పరీక్షల్లో కొంత ఊరట పొందింది. నాకు ఎంతో అవసరమైన శారీరక, మానసిక ఉపశమనం లభించింది. వారికి సదా రుణపడివుంటాను. వారు చేసిన త్యాగం యెహోవా పట్ల నాకున్న విశ్వాసాన్ని, మన సహోదరత్వం పట్ల నాకున్న ప్రేమను పెంచుకునేందుకు తోడ్పడింది.”
19, 20. (ఎ) క్రీస్తు మనసుకు సంబంధించిన ఏ ఐదు విషయాలను మనం పరిశీలించాం? (బి) మీరు ఏమి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?
19 ఈ మూడు ఆర్టికల్స్‌లో మనం క్రీస్తు మనసుకు సంబంధించిన ఐదు విషయాలను పరిశీలించాం. ఆయనలా ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నాం. యేసులా మనం ‘సాత్వికాన్ని, దీనమనస్సును’ కనబరుద్దాం. (మత్త. 11:29) ఇతరుల అపరిపూర్ణతలు, బలహీనతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా వారి పట్ల దయతో వ్యవహరించడానికి మనం కూడా కృషిచేద్దాం. పరీక్షలు ఎదురైనా యెహోవా నియమాలన్నిటినీ ధైర్యంగా పాటిద్దాం.
20 చివరగా, క్రీస్తులా మన సహోదరులందరి పట్ల “అంతమువరకు” ప్రేమ చూపిద్దాం. ఆ ప్రేమను చూసి మనం క్రీస్తు నిజ అనుచరులమని ఇతరులు గుర్తిస్తారు. (యోహా. 13:1, 34, 35) “సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి.” (హెబ్రీ. 13:1) ఏదేమైనా ప్రేమ చూపిస్తూనే ఉండండి! యెహోవాను స్తుతించేందుకు, ఇతరులకు సహాయం చేసేందుకు మీ జీవితాన్ని ఉపయోగించాలనే కృతనిశ్చయంతో ఉండండి! నిజాయితీగా మీరు చేసే కృషిని యెహోవా ఆశీర్వదిస్తాడు.
[అధస్సూచి]
a కావలికోట అక్టోబరు 15, 1986 (ఆంగ్లం) సంచికలోని “‘చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి’ అని చెప్పడం కన్నా ఎక్కువే చేయండి” అనే ఆర్టికల్‌ను చూడండి.
మీరు వివరించగలరా?
• తప్పిదస్థుల పట్ల పెద్దలు క్రీస్తులాంటి ప్రేమను ఎలా చూపించవచ్చు?
• ప్రాముఖ్యంగా ఈ అంత్యదినాల్లో క్రీస్తులాంటి ప్రేమను ఎందుకు చూపించాలి?
• అనారోగ్యంగా ఉన్నవారి పట్ల క్రీస్తులాంటి మనసును ఎలా చూపించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[17వ పేజీలోని చిత్రం]
తప్పిదస్థులు యెహోవా దగ్గరికి తిరిగి రావాలని పెద్దలు కోరుకుంటారు
[18వ పేజీలోని చిత్రం]
యెరూషలేమును విడిచిపెడుతున్నప్పుడు క్రైస్తవులు క్రీస్తులాంటి మనసును ఎలా కనబరిచారు?
[19వ పేజీలోని చిత్రం]
క్రీస్తులాంటి ప్రేమను చూపిస్తారని యెహోవాసాక్షులకు పేరుంది