పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
యేసు ఇశ్రాయేలు ప్రాంతమంతటా సువార్త ప్రకటించాడు కదా. అలాంటప్పుడు యూదులూ వారి అధికారులూ ‘తెలియక’ యేసును చంపమన్నారని అపొస్తలుడైన పేతురు ఎందుకు అన్నాడు?—అపొ. 3:17.
మెస్సీయను చంపడంలో యూదుల ప్రమేయం గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పేతురు కొంతమంది యూదులతో, “మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును” అని అన్నాడు. (అపొ. 3:14-17) కొంతమంది యూదులు యేసును ఆయన బోధల్ని అర్థం చేసుకొనుండరు. మరికొందరు దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరికలేకపోవడంవల్ల, తమకున్న దురభిమానం, ఈర్ష్యా, ద్వేషాలవల్ల మెస్సీయను గుర్తించలేదు.
యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక చాలామంది యూదులకు లేదు కాబట్టే వారు యేసు బోధలను పట్టించుకోలేదు. ఆయన బోధిస్తున్నప్పుడు తరచూ ఉపమానాలను వాడేవాడు, అయితే ఎక్కువ తెలుసుకోవాలనుకున్న వారికే వాటిని వివరించాడు. ఆయన బోధలు విన్న కొందరు ఆయన చెప్పినవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండానే అక్కడినుండి వెళ్ళిపోయేవారు. ఒకసారి యేసు అలంకారిక భావంతో మాట్లాడినందుకు కొంతమంది శిష్యులు కూడా అభ్యంతరపడ్డారు. (యోహా. 6:52-66) తమ ఆలోచనలను చర్యలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి యేసు ఉపమానాలను ఉపయోగించాడని వారు గ్రహించలేకపోయారు. (యెష. 6:9, 10; 44:18; మత్త. 13:10-15) మెస్సీయ ఉపమానాలతో బోధిస్తాడని ముందే చెప్పబడిన ప్రవచనాన్ని కూడా వారు పట్టించుకోలేదు.—కీర్త. 78:2.
మరికొందరు దురభిమానం వల్ల యేసు బోధలను పట్టించుకోలేదు. యేసు తన సొంత ఊరు నజరేతులోని సమాజమందిరంలో బోధిస్తున్నప్పుడు ప్రజలు ‘ఆశ్చర్యపోయారు.’ వారు యేసును మెస్సీయగా అంగీకరించాల్సిందిపోయి ఆయన పుట్టిపెరిగిన పరిస్థితుల గురించి ప్రశ్నించారు. “ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? . . . ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా?” అని అన్నారు. (మార్కు 6:1-3) యేసు బీద కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి నజరేతులోనివారు ఆయన బోధలను లెక్కచేయలేదు.
మత నాయకుల విషయమేమిటి? వారిలోని చాలామంది పై కారణాలనుబట్టే ఆయన బోధలను పట్టించుకోలేదు. (యోహా. 7:47-52) అంతేకాక, ప్రజలు ఆయనకు ప్రాధాన్యతనివ్వడాన్ని చూసి అసూయపడి ఆయన బోధలను తిరస్కరించారు. (మార్కు 15:9, 10) వారి వేషధారణనూ, మోసాన్నీ బహిరంగంగా ఖండించినందుకు చాలామంది ప్రముఖులు కోపగించుకున్నారు. (మత్త. 23:13-36) తాను మెస్సీయ అని తెలిసినా తెలియనట్లు నటించినందుకు యేసు, “అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల [రాజ్యంలోనికి] ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురు” అని వారిని ఖండించాడు.—లూకా 11:37-52.
యేసు ఆ ప్రాంతంలో సువార్తను మూడున్నర సంవత్సరాలు ప్రకటించాడు. ఎలా ప్రకటించాలో చాలామందికి నేర్పించాడు. (లూకా 9:1, 2; 10:1, 16, 17) యేసు ఆయన శిష్యులు ఎంతగా ప్రకటించారంటే పరిసయ్యులు, “ఇదిగో లోకము ఆయన వెంట పోయినది” అని చెప్పుకున్నారు. (యోహా. 12:19) కాబట్టి యూదుల్లో చాలామందికి నిజంగా ఏమీ తెలియదని కాదు. కానీ చాలామట్టుకు వారు యేసు మెస్సీయ అనే విషయం ‘తెలియదన్నట్లు’ ఉన్నారు. మెస్సీయ గురించిన జ్ఞానాన్ని, ఆయనపట్ల ఉన్న ప్రేమను వారు పెంచుకొని ఉండాల్సింది. కానీ వారలా చేయలేదు. యేసును చంపడంలో శత్రువులతో చేతులు కలిపారు. అందుకే వారిలో చాలామందితో అపొస్తలుడైన పేతురు, “మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి” అని ప్రోత్సహించాడు. (అపొ. 3:19, 20) ‘యాజకుల్లో అనేకమందితో’ సహా, వేలాదిమంది యూదులు వాక్యాన్ని వినడం గమనించాల్సిన విషయం. వారు ఆ తర్వాత ఏమి తెలియనట్లు ప్రవర్తించలేదు గానీ పశ్చాత్తాపపడి, యెహోవా అనుగ్రహాన్ని పొందారు.—అపొ. 2:41; 4:4; 5:14; 6:7.