వృద్ధులైన తన సేవకులను యెహోవా వాత్సల్యంతో సంరక్షిస్తాడు
వృద్ధులైన తన సేవకులను యెహోవా వాత్సల్యంతో సంరక్షిస్తాడు
“మీరు చేసిన కార్యమును . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీ. 6:10.
తెల్లని జుట్టుతో ఉన్న వృద్ధులెవరినైనా సంఘంలో చూసినప్పుడు మీకు దానియేలు పుస్తకంలోని వృత్తాంతం గుర్తొస్తుందా? యెహోవా దేవుడు దానియేలుకు ఇచ్చిన దర్శనంలో తనకు తెల్లని జుట్టు ఉన్నట్లు చూపించాడు. ఆ దర్శనం గురించి దానియేలు ఇలా రాశాడు: “సింహాసనములను వేయుట చూచితిని; మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను.”—దాని. 7:9.
2 నూలు సాధారణంగా తెల్లగా ఉంటుంది. కాబట్టి తెల్లని జుట్టేకాదు, “మహావృద్ధుడు” అనే బిరుదు కూడ దేవుడు యుగయుగాలనుండి ఉన్నాడని, ఆయన మహాజ్ఞాని అని గుర్తుచేస్తాయి. కాబట్టి మనం ఆయనకు ఎంతో గౌరవమివ్వాలి. మరి మహావృద్ధుడైన యెహోవా దేవుడు నమ్మకమైన వృద్ధ సహోదరసహోదరీలను ఎలా దృష్టిస్తాడు? “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును” అని దేవుని వాక్యం చెబుతోంది. (సామె. 16:31) అవును, నమ్మకమైన క్రైస్తవులకు తెల్లని జుట్టు వచ్చినప్పుడు వారు దేవునికి ఎంతో అందంగా కనిపిస్తారు. మీరు కూడా వృద్ధ సహోదరసహోదరీలను యెహోవా చూసినట్లే చూస్తున్నారా?
వారెందుకు విలువైనవారు?
3 పరిపాలక సభ సభ్యులు, గతంలో ప్రయాణ పైవిచారణకర్తలుగా, ఉత్సాహవంతులైన పయినీర్లుగా సేవచేసినవారేకాక ఇప్పుడు సేవచేస్తున్నవారు, సంఘంలో నమ్మకంగా సేవచేస్తున్న పరిణతి చెందిన వృద్ధ సహోదరసహోదరీలు అందరూ దేవునికి ప్రియులే. ఎన్నో సంవత్సరాలుగా సువార్తను ఉత్సాహంగా ప్రకటించి, తమ మంచి మాదిరి ద్వారా యౌవనులను ప్రోత్సహించి, తమ జీవితాలను మలచుకునేలా వారికి సహాయం చేసిన కొంతమంది మీకు తెలిసే ఉండవచ్చు. మన తోటి విశ్వాసుల్లో కొంతమంది వృద్ధులు బరువైన బాధ్యతలను మోశారు, సువార్త కోసం హింసను సహితం సహించారు. వారందరూ రాజ్య పనికోసం గతంలో చేసిన, ఇప్పుడు చేస్తున్న కృషిని యెహోవానేకాదు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ కూడ ఎంతగానో మెచ్చుకుంటున్నారు.—మత్త. 24:45.
4 యెహోవాకు నమ్మకంగా సేవచేసిన అలాంటి వృద్ధులపట్ల ఇతర సేవకులు మెప్పుదలను, గౌరవాన్ని చూపించాలి. వృద్ధులకు దయ, గౌరవం చూపించడానికీ యెహోవాకు భయభక్తులు చూపించడానికీ మధ్య సంబంధముందని దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. (లేవీ. 19:32) మనం అలాంటి నమ్మకస్థుల కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ, వారు ప్రేమతో చేస్తున్న కృషికోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అపొస్తలుడైన పౌలు చిన్నా పెద్దా నిమిత్తం లేకుండా ప్రియులైన తన తోటిపనివారందరి కోసం ప్రార్థించాడు.—1 థెస్సలోనీకయులు 1:2, 3 చదవండి.
5 అంతేకాక, సంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరూ వృద్ధ క్రైస్తవులతో సహవసించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. యెహోవాకు నమ్మకంగా సేవచేసిన వృద్ధులు అధ్యయనం చేయడం ద్వారా, గమనించడం ద్వారా, అనుభవం ద్వారా ఎంతో విలువైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వారు ఓర్పు, సానుభూతి చూపించడాన్ని నేర్చుకున్నారు. తాము నేర్చుకున్నవాటిని తర్వాతి తరాలవారికి తెలియజేయడంలో వారెంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. (కీర్త. 71:18) యౌవనులారా మీరు లోతైన బావిలో నుండి నీళ్లు ఎలా చేదుతారో అలాగే జ్ఞానయుక్తంగా వారి జ్ఞానం నుండి ప్రయోజనం పొందండి.—సామె. 20:5.
6 యెహోవా వృద్ధులను విలువైనవారిగా ఎంచుతున్నట్లే మీరూ వారిని విలువైనవారిగా ఎంచుతున్నారని తెలియజేస్తున్నారా? దానికి ఒక మార్గం ఏమిటంటే, వారు ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నందుకు మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో, వారి అభిప్రాయాలను ఎంత విలువైనవిగా ఎంచుతున్నారో మీ మాటల్లో చెప్పడమే. అంతేకాక, వారి సలహాలను పాటించినప్పుడు మీరు వారిని నిజంగానే గౌరవిస్తున్నారని చూపిస్తారు. ఎంతోమంది వయసు పైబడిన క్రైస్తవులు, నమ్మకస్థులైన వృద్ధ సహోదరసహోదరీల నుండి పొందిన మంచి సలహాలను, వాటిని పాటించడం వల్ల జీవితమంతటిలో పొందుతున్న ప్రయోజనాలను గుర్తుతెచ్చుకోగలరు.అవసరమైన సహాయం చేయడం ద్వారా వాత్సల్యాన్ని చూపించండి
7 వృద్ధులను సంరక్షించే బాధ్యతను దేవుడు ప్రాథమికంగా వారి కుటుంబాలకే ఇచ్చాడు. (1 తిమోతి 5:4, 8 చదవండి.) కుటుంబ సభ్యులు వృద్ధులను చూసుకునే బాధ్యతను నిర్వర్తించి, యెహోవాలాగే తమకూ వారిపట్ల ఆదరణ ఉందని చూపించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. దేవుడు ఆ కుటుంబాలకు సహాయం చేసి, వారు చేస్తున్న కృషినిబట్టి, త్యాగాలనుబట్టి వారిని ఆశీర్వదిస్తాడు. *
8 అవసరంలో ఉన్న నమ్మకస్థులైన వృద్ధులును చూసుకోవడానికి సత్యంలోవున్న కుటుంబసభ్యులు ఉండకపోవచ్చు, లేక కుటుంబ సభ్యులెవరూ ముందుకురాకపోవచ్చు. అలాంటివారికి స్థానిక సంఘాలు సహాయపడినప్పుడు కూడా యెహోవా సంతోషిస్తాడు. (1 తిమో. 5:3, 5, 9, 10) అలా చేయడం ద్వారా సంఘ సభ్యులు తాము వృద్ధుల ‘సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటున్నామని, సహోదరప్రేమ గలవారమని, కరుణాచిత్తులమని’ చూపిస్తారు. (1 పేతు. 3:8) వారు సంఘంలోని వృద్ధులపట్ల చూపించే శ్రద్ధను పౌలు చక్కగా ఉదాహరించాడు. శరీరంలోని ఒక అవయవం శ్రమపడితే “అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును” అని ఆయన చెప్పాడు. (1 కొరిం. 12:26) వృద్ధులపట్ల కనికరంతో అవసరమైన సహాయాన్ని చేయడం ద్వారా పౌలు ఇచ్చిన ఈ ఉపదేశంలోని సూత్రాన్ని మనం పాటించగలుగుతాం: “ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.”—గల. 6:2.
9 వృద్ధులు ఎలాంటి భారాలను లేక సమస్యలను ఎదుర్కొంటారు? చాలామంది త్వరగా అలసిపోతుంటారు. డాక్టరు దగ్గరికి వెళ్లడం, బిల్లులు చెల్లించడం, ఉత్తరాలు రాయడం, ఇల్లు శుభ్రంచేయడం, వంట చేయడం వంటి మామూలు పనులు కూడా చేయలేమని వారికి అనిపిస్తుండవచ్చు. వయసు పైబడే కొద్దీ అంతగా ఆకలేయదు, దాహంవేయదు. దాంతో వారు ఎక్కువగా తినాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా వారికి అలాగే అనిపించవచ్చు. బహుశా కళ్లు సరిగా కనిపించకపోవడం వల్ల వారు చదవలేకపోతుండవచ్చు, వినికిడి మందగించడంవల్ల కూటాల్లో వినలేకపోతుండవచ్చు. కొన్నిసార్లు కూటాలకు తయారయ్యేసరికే వారు అలసిపోవచ్చు. మరి అలాంటి వారికి ఇతరులు ఎలా సహాయం చేయగలరు?
మీరు ఎలా సహాయపడగలరు?
10 వృద్ధులను చూసుకునే విషయంలో అనేక సంఘాలు మంచి మాదిరిగా ఉన్నాయి. బజారుకు వెళ్లడంలో, వంట చేయడంలో, శుభ్రంచేయడంలో ప్రేమగల సహోదరసహోదరీలు వారికి సహాయం చేస్తారు. వారు అధ్యయనం చేయడానికి, కూటాలకు తయారవడానికి, పరిచర్యకు క్రమంగా వెళ్లడానికి సహాయం చేస్తారు. యౌవనసాక్షులు వారికోసం ప్రయాణ ఏర్పాట్లు చేసి వారితోకూడ వెళ్లివస్తారు. వృద్ధులు కదల్లేని పరిస్థితుల్లోవుంటే ఫోన్ ద్వారా కూటాల్లో జరిగే భాగాలను వినిపించవచ్చు, లేదా రికార్డ్ చేయవచ్చు. సాధ్యమైనప్పుడెల్లా సంఘంలోవున్న వృద్ధుల అవసరాలను తీర్చేలా సంఘ పెద్దలు కావలసిన ఏర్పాట్లు చేసి, వాటిని అమలుపరుస్తారు. *
11 సంఘంగానే కాదు క్రైస్తవులందరూ ఆతిథ్యమివడం ద్వారా, ఉదార స్వభావాన్ని చూపించడం ద్వారా కూడా వృద్ధులపట్ల తమకు శ్రద్ధవుందని చూపించవచ్చు. తన భార్య చనిపోయిన తర్వాత పింఛన్ ఆగిపోవడంతో ఒక వృద్ధ సహోదరునికి ఇంటి అద్దె కట్టడం కష్టమైంది. ఆ వృద్ధ క్రైస్తవులు గతంలో ఒక జంటతో బైబిలు అధ్యయనం చేసేవారు. ఆ జంటకు ఇద్దరు టీనేజీ అమ్మాయిలు ఉండేవారు. వారికి పెద్ద ఇల్లు ఉండేది. వారు ఆయన ఉండడానికి రెండు గదులు ఇచ్చారు. ఆయన ఆ ఇంట్లో ఉన్న దాదాపు 15 సంవత్సరాల్లో వారు కలిసి భోజనం చేశారు, సరదాగా సమయం గడిపారు, ఆయనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అమ్మాయిలు ఆయన విశ్వాసం నుండి, ఆయనకున్న అపారమైన జ్ఞానం నుండి ఎంతో నేర్చుకున్నారు. వారితో సరదాగా సమయం గడిపి ఆయన కూడా ఎంతో సంతోషించాడు. తన 89వ ఏట చనిపోయేంతవరకూ ఆ వృద్ధ సహోదరుడు వారితోనే ఉన్నాడు. ఆయన సహవాసం ద్వారా వారు పొందిన ఎన్నో ఆశీర్వాదాలకు ఆ కుటుంబం ఇప్పటివరకూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తమ తోటి క్రైస్తవుడైన ఆయనకు సహాయం చేసినందుకు వారు ‘ఫలము పోగొట్టుకోరు.’—మత్త. 10:42. *
12 ఈ కుటుంబం చేసినట్టు మీరు ఒక వృద్ధ సహోదరునికి లేక సహోదరినికి సహాయం చేయలేకపోవచ్చు. అయితే వారిని కూటాలకు, క్షేత్రసేవకు తీసుకువెళ్లగలరేమో చూడండి. వారిని ఇంటికి పిలవచ్చు లేక సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు వెంట తీసుకువెళ్లొచ్చు. అప్పుడప్పుడూ, ముఖ్యంగా వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, కదల్లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు వెళ్లి చూసిరావచ్చు. అంతేకాక వారిని ఎల్లప్పుడూ పరిణతిచెందిన వ్యక్తులుగానే చూడండి, అలా చూడాలి కూడ. వారి ఆలోచనా సామర్థ్యం సరిగా ఉన్నంతకాలం వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేముందు వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకోండి. ఆలోచనా సామర్థ్యాన్ని చాలామట్టుకు కోల్పోయినవారు సహితం ఇతరులు తమను గౌరవంగా చూస్తున్నారో లేదో గ్రహించగలుగుతారు.
యెహోవా మీరు చేసే పనులను మరచిపోడు
13 వృద్ధుల మనోభావాల గురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. వారు యౌవనస్థులుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసినన్ని పనులు ఇప్పుడు చేయలేకపోతున్నందుకు వారెంతగానో బాధపడడం సహజమే. ఉదాహరణకు,
దాదాపు 50 సంవత్సరాలు చురుగ్గా యెహోవా సేవలో గడిపి, క్రమ పయినీరుగా సేవ చేసిన ఒక సహోదరి అస్వస్థతకు గురైంది. క్రమక్రమంగా నీరసించిపోవడంవల్ల కూటాలకు వెళ్లడం ఎంతో కష్టమయ్యేది. పరిమితులవల్ల ఇప్పుడు చేస్తున్న సేవను గతంలో చేసిన పరిచర్యతో పోల్చుకుని ఆమె చాలా ఏడ్చింది. ముఖం దించుకుని కంటతడి పెడుతూ, “ఇప్పుడు నేనేమీ చేయలేకపోతున్నాను” అని వాపోయింది.14 మీరు వృద్ధులైతే అప్పడప్పుడూ మీకూ అలాగే అనిపించి బాధపడతారా? యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టాడని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? కీర్తనకర్తకు తన వృద్ధాప్యంలో అలాగే అనిపించివుండవచ్చు. అందుకే ఆయన యెహోవాను ఇలా వేడుకున్నాడు: “వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవా . . . తల నెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.” (కీర్త. 71:9, 18) యెహోవా ఆయనను విడిచిపెట్టలేదు, మిమ్మల్నీ విడిచిపెట్టడు. మరో కీర్తనలో దావీదు దేవుడు తనను సంరక్షిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తంచేశాడు. (కీర్తనలు 68:19 చదవండి.) మీరు నమ్మకంగా సేవచేస్తున్న వృద్ధ క్రైస్తవులైతే యెహోవా మీతోనే ఉన్నాడనే, ఆయన మిమ్మల్ని అనుదినం సంరక్షిస్తాడనే నమ్మకంతో ఉండండి.
15 యెహోవాసాక్షులైన మీరు ఆయనను మహిమపరిచేందుకు గతంలో చేసిన పనులను, ఇప్పుడు చేస్తున్న పనులను ఆయన ఎప్పుడూ మరచిపోడు. “మీరు చేసిన కార్యమును . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 6:10) వృద్ధాప్యం వల్ల యెహోవాకు మీరు ఇక ఎంతమాత్రం ఉపయోగపడరని పొరబడి ప్రతికూల భావాలను పెంపొందించుకోకండి. కృంగదీసే, నిరాశపరిచే విషయాల గురించి ఆలోచించే బదులు మంచి విషయాల గురించి ఆలోచించండి. ఇప్పుడున్న ఆశీర్వాదాల విషయంలో, భవిష్యత్ నిరీక్షణ విషయంలో సంతోషించండి. “రాబోవు కాలమందు” మనకు ఎంతో మంచి “నిరీక్షణ” ఉందని సృష్టికర్త హామీనిచ్చాడు. (యిర్మీ. 29:11, 12; అపొ. 17:31; 1 తిమో. 6:18, 19) మీకున్న నిరీక్షణ గురించి ఆలోచించండి. యౌవనుల్లాగే ఆశావహ దృక్పథంతో ఉండండి. సంఘంలో మీకెంతో విలువ ఉందనేది మరచిపోకండి! *
16 యోహాన్ సహోదరుని ఉదాహరణ చూడండి. ఆయనకిప్పుడు 80 ఏళ్లు. తనతో ఎంతో నమ్మకంగా జీవించిన భార్య సానీ మంచానపడడంతో ప్రస్తుతం ఆయన రోజంతా ఆమెను చూసుకుంటూ ఉండాల్సివస్తుంది. * ఆయన కూటాలకు, పరిచర్యకు వెళ్లేందుకు వీలుగా సహోదరీలు వంతులవారీగా ఆమెను చూసుకుంటుంటారు. ఇటీవలి ఆయన మానసికంగా ఎంతగా కృంగిపోయాండంటే సంఘంలో పెద్దగా ఇక సేవచేయలేనేమో అని అనుకున్నాడు. “సంఘానికి అవసరమైన ఏ పనీ చేయలేకపోతున్నాను” అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఆయన అనుభవం, ఆలోచనా సామర్థ్యం సంఘానికి ఎంతో అవసరమని చెప్పి ఇతర పెద్దలు ఆయనను ఓదార్చారు. ఆయన ఎక్కువ పని చేయలేకపోయినా పెద్దగా కొనసాగాలని కోరారు. దానివల్ల ఎంతగానో ప్రోత్సహించబడిన ఆయన ఇప్పటికీ పెద్దగా సేవచేస్తూ సంఘానికి ఒక ఆశీర్వాదంగా ఉన్నాడు.
యెహోవాకు మీపట్ల నిజంగానే శ్రద్ధ ఉంది
17 వృద్ధాప్యంతో వచ్చే సమస్యలున్నా వారు యెహోవా సేవలో ఫలిస్తూ ఉండవచ్చని లేఖనాలు స్పష్టంచేస్తున్నాయి. కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా మందిరములో నాటబడినవారై . . . వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు.” (కీర్త. 92:13-15) బహుశా ఏదో ఒక బాధను అనుభవించిన అపొస్తలుడైన పౌలు “బాహ్య పురుషుడు కృశించుచున్ననూ” ‘అధైర్యపడలేదు.’—2 కొరింథీయులు 4:16-18 చదవండి.
18 వృద్ధులు ‘ఇంక చిగురు పెట్టగలరు’ లేదా వర్ధిల్లగలరు అని నేడు అనేకమంది సహోదరుల అనుభవాలు చూపిస్తున్నాయి. బాధ్యతతో ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ సహాయం చేసే కుటుంబ సభ్యులున్నా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం వారిని నిరుత్సాహపరచవచ్చు. కొన్నిసార్లు వారిని చూసుకునేవారు కూడా పూర్తిగా అలసిపోవచ్చు. వృద్ధులపట్ల, వారిని చూసుకునే వారిపట్ల తమకున్న ప్రేమను క్రియల రూపంలో చూపించే అవకాశం, బాధ్యతా సంఘ సభ్యులకు ఉన్నాయి. (గల. 6:10) అవసరమైన సహాయం చేయకుండా “సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని” అని చెప్పేవారి గురించి యాకోబు ప్రస్తావించాడు. మనం సహాయం చేసినప్పుడు యాకోబు ప్రస్తావించినవారిలా ఉండం.—యాకో. 2:15-17.
19 వయసు పైబడే కొద్దీ క్రైస్తవులు చేసే పనిలో కొంతమేరకు మార్పులు రావచ్చేమోగానీ కాలం గడిచేకొద్దీ తనను నమ్మకంగా సేవచేసే వృద్ధులపట్ల యెహోవాకున్న ప్రేమ మాత్రం తగ్గదు. బదులుగా నమ్మకమైన క్రైస్తవులందరినీ ఆయన అమూల్యంగా పరిగణిస్తాడు, వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. (కీర్త. 37:28; యెష. 46:4) వారి వృద్ధాప్యమంతటిలో యెహోవా వారిని సంరక్షిస్తూ నడిపిస్తాడు.—కీర్త. 48:14.
[అధస్సూచీలు]
^ పేరా 9 కావలికోట జూన్ 1, 2007లోని “వృద్ధులు—యౌవనులకు ఒక వరం” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 11 కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలోని “మన వృద్ధ తల్లిదండ్రులను సన్మానించడం” అనే 15వ అధ్యాయాన్ని చూడండి.
^ పేరా 15 కొన్ని దేశాల్లో, ప్రభుత్వ సహాయం అందేలా కూడా సహాయం చేయాల్సిరావచ్చు. కావలికోట జూన్ 1, 2006లోని “దేవుడు వృద్ధులపట్ల శ్రద్ధ చూపిస్తాడు” అనే అర్టికల్‌ను చూడండి.
^ పేరా 16 కావలికోట సెప్టెంబరు 1, 2003లోని “యెహోవా ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు” అనే ఆర్టికల్‌ను చూడండి.
^ పేరా 21 కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1993లోని “తలనెరపుకున్న సౌందర్యము” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 22 పేర్లు మార్చబడ్డాయి.
మీరెలా జవాబిస్తారు?
• నమ్మకంగా సేవచేసే వృద్ధ క్రైస్తవులను మీరెందుకు అమూల్యమైనవారిగా పరిగణిస్తారు?
• వయసు పైబడే తోటి ఆరాధకుల విషయంలో మనమెలా వాత్సల్యాన్ని చూపించగలం?
• వృద్ధులైన యెహోవా సేవకులు ఆశావహ దృక్పథంతో ఉండడానికి వారికి ఏది సహాయం చేయగలదు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) తెల్లని జుట్టుతో ఉన్నవారిని చూసినప్పుడు మీకు ఏమి గుర్తుకురావచ్చు? (బి) యెహోవా వృద్ధ క్రైస్తవులను ఎలా దృష్టిస్తాడు?
3. వృద్ధులైన తోటి విశ్వాసులను మనమెందుకు విలువైనవారిగా పరిగణించాలి?
4. మనం ఎందుకు వృద్ధ క్రైస్తవులను గౌరవించాలి, ఎందుకు వారికోసం ప్రార్థించాలి?
5. వృద్ధులైన యెహోవా ఆరాధకులతో సహవసించడం వల్ల మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
6. మీరు వృద్ధ సహోదరులను నిజంగానే విలువైనవారిగా ఎంచుతున్నారని ఎలా తెలియజేయవచ్చు?
7. వృద్ధులను సంరక్షించే బాధ్యతను యెహోవా ప్రాథమికంగా ఎవరికి ఇచ్చాడు?
8. వృద్ధ క్రైస్తవులపట్ల సంఘ సభ్యులు ఎందుకు శ్రద్ధ చూపించాలి?
9. వృద్ధాప్యం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు?
10. వృద్ధులకు అవసరమైన సహాయం అందేలా సంఘ పెద్దలు ఏమి చేయవచ్చు?
11. ఒక వృద్ధ సహోదరునికి ఒక కుటుంబం ఎలా సహాయం చేసిందో వివరించండి.
12. మీరు వృద్ధ సహోదరసహోదరీలపట్ల వాత్సల్యాన్ని చూపించడానికి ఏమి చేయవచ్చు?
13. వృద్ధ క్రైస్తవుల మనోభావాల గురించి ఆలోచించడం ఎందుకు ప్రాముఖ్యం?
14. వృద్ధులైన యెహోవా సేవకులు కీర్తనల నుండి ఎలాంటి ప్రోత్సాహం పొందవచ్చు?
15. వృద్ధులు ఆశావహ దృక్పథంతో ఉండడానికి ఏది సహాయం చేయగలదు?
16. ఒక వృద్ధ సహోదరుడు పెద్దగా ఉండకూడదని ఎందుకు అనుకున్నాడు, కానీ పెద్దలు ఆయనను ఎలా ప్రోత్సహించారు?
17. వృద్ధ క్రైస్తవులకు బైబిలు ఏ హామీలనిస్తోంది?
18. వృద్ధులైన తోటి విశ్వాసులకు, వారిని చూసుకునేవారికి ఇతరుల సహాయం ఎందుకు అవసరం?
19. నమ్మకంగా సేవచేసే వృద్ధ క్రైస్తవులు భవిష్యత్తు విషయంలో ధైర్యంగా ఎందుకు ఉండవచ్చు?
[18వ పేజీలోని చిత్రాలు]
సంఘ సభ్యులు వృద్ధులను ఎంతో గౌరవిస్తారు