కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే’

‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే’

‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే’

“వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.” ​—⁠1 కొరిం. 3:7.

మనందరికీ ఉన్న ప్రత్యేకమైన పని గురించి మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు మనల్ని “దేవుని జతపనివారు” అని పిలిచాడు. (1 కొరింథీయులు 3:5-9 చదవండి.) పౌలు అక్కడ శిష్యులను చేసే పని గురించి మాట్లాడాడు. ఆయన ఆ పనిని విత్తనాలు విత్తి, నీళ్లు పోసే పనితో పోల్చాడు. ఈ ప్రాముఖ్యమైన పనిలో మంచి ఫలితాలు సాధించాలంటే మనకు యెహోవా సహాయం అవసరం. ఎందుకంటే, ‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే’ అని పౌలు మనకు గుర్తుచేశాడు.

2 వృద్ధి కలుగజేసేవాడు దేవుడే గాని మన చేతుల్లో ఏమీ లేదనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు పరిచర్యపట్ల మనం సరైన దృక్పథాన్ని కనపర్చగలుగుతాం. మనం ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో ఎంత కృషిచేసినా, ఎవరైనా శిష్యులైతే ఆ ఘనత అంతా యెహోవాకే చెందుతుంది. ఎందుకు? ఎందుకంటే మనలో ఎవరమూ ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి ఎలా ప్రగతి సాధించాలో నిర్ణయించలేము సరికదా, అసలు ఆయన ఎలా శిష్యుడౌతాడో కూడా పూర్తిగా అర్థంచేసుకోలేం. ఆ విషయాన్ని సొలొమోను రాజు సరిగ్గానే వర్ణించాడు. ఆయన, “సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు” అని రాశాడు.​—⁠ప్రసం. 11:5.

3 ఆ విషయాల్ని అర్థం చేసుకోలేకపోయినంత మాత్రాన మన పని నిరాశాజనకంగా ఉంటుందా? ఎంతమాత్రం కాదు. బదులుగా మన పని ఉత్తేజకరంగా, ఆసక్తికరంగా ఉంటుంది. సొలొమోను రాజు ఇలా అన్నాడు: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయ​మందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరి​సమానముగా ఎదుగునో నీవెరుగవు.” (ప్రసం. 11:6) విత్తనాలు విత్తే విషయానికొస్తే అది ఎక్కడ మొలకెత్తుతుందో, అసలు మొలకెత్తుతుందో లేదో మనకు తెలీదు. చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. శిష్యులను చేసే పని విషయంలో కూడా అంతే. మార్కు సువార్త 4వ అధ్యాయంలోని రెండు ఉపమానాల్లో యేసు ఆ విషయాన్నే వివరించాడు. ఆ రెండు ఉపమానాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

వివిధ రకాల నేలలు

4మార్కు 4:1-9 వచనాల్లో యేసు విత్తువాని గురించి మాట్లాడాడు. ఆయన విసిరిన విత్తనాలు వివిధ రకాల నేలలపై పడడం గురించి చెబుతూ యేసు ఇలా అన్నాడు: “వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను.”

5 బైబిలు కాలాల్లో పొలాల్లో విత్తనాలను జల్లేవారు. విత్తువాడు తన వస్త్రపు మడతలో లేదా సంచిలో విత్తనాలు వేసుకెళ్లి పొలంలో జల్లేవాడు. అంటే ఈ ఉపమానంలోని విత్తువాడు కావాలనే వివిధ రకాల నేలలపై విత్తనాలను జల్లలేదు. ఆయన జల్లే విత్తనాలే వివిధ రకాల నేలలపై పడ్డాయి.

6 ఆ ఉపమాన భావమేమిటో తెలుసుకోవడానికి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసు దాన్ని వివరిస్తూ చెప్పిన మాటలు మార్కు 4:14-20 వచనాల్లో ఉన్నాయి: “విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్కనుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. అటువలె రాతినేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను, కలుగగానే వారు అభ్యంతర​పడుదురు. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారు.”

7 ఈ ఉపమానంలో వేర్వేరు రకాల విత్తనాలు ఉపయోగించబడ్డాయనే విషయాన్ని యేసు చెప్పలేదని గమనించండి. కానీ ఒకే రకమైన విత్తనం వివిధ రకాల నేలలపై పడ్డాయనీ, దానివల్ల ఫలితాలు వేర్వేరుగా వస్తాయనీ ఆయన చెప్పాడు. మొదటిది గట్టినేల, రెండవది మట్టి అంతగాలేని రాతినేల, మూడవది ముండ్లపొదలతో నిండివున్న నేల, నాల్గవది సారవంతమైన నేల. (లూకా 8:8) ఆ విత్తనం ఏమిటి? అది దేవుని వాక్యంలోని రాజ్య సందేశం. (మత్త. 13:19) మరి వివిధ రకాల నేలలు వేటిని సూచిస్తున్నాయి? అవి వివిధ రకాల హృదయ పరిస్థితులున్న వ్యక్తులను సూచిస్తున్నాయి.​—⁠లూకా 8:12, 15 చదవండి.

8 మరి విత్తువాడు ఎవరిని సూచిస్తున్నాడు? రాజ్య సువార్త ప్రకటించే దేవుని జతపనివారిని సూచిస్తున్నాడు. పౌలు, అపొల్లోల్లాగే వారు విత్తి నీళ్లు పోస్తారు. వారెంత కష్టపడి పనిచేసినా ఫలితాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ఎందుకలా? ఎందుకంటే రాజ్య సందేశాన్ని వినేవారి హృదయ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. ఈ ఉపమానంలోని విత్తువాడు ఫలితాలను మార్చలేడు. నమ్మకమైన మన సహోదరసహోదరీలు కొందరు అనేక సంవత్సరాలు, మరికొందరు అనేక దశాబ్దాలు ఈ పనిలో పాల్గొన్నారు. అయినా వారు పెద్దగా ఫలితాలు సాధించలేకపోయారు. అలాంటివారికి ఈ ఉపమానం ఎంత ఓదార్పుకరంగా ఉంటుందో కదా! * ఎందుకు?

9 విత్తువాడు ఎంత నమ్మకంగా పనిచేశాడనేది వచ్చిన ఫలితాలనుబట్టి చెప్పలేం. పౌలు దాని గురించి పరోక్షంగా ఇలా అన్నాడు: “ప్రతి వాడు తాను చేసిన కష్టము​కొలది జీతము పుచ్చుకొనును.” (1 కొరిం. 3:8) ప్రతీ వ్యక్తికి తన కష్టాన్నిబట్టి జీతం దొరుకుతుంది కాని కష్టానికి వచ్చిన ఫలితాలనుబట్టి కాదు. తన శిష్యులు ఒక సందర్భంలో ప్రకటనా పనికి వెళ్లి వచ్చిన తర్వాత యేసు అదే విషయాన్ని నొక్కిచెప్పాడు. యేసు నామాన్ని ఉపయోగించినప్పుడు దయ్యాలు కూడ లోబడుతున్నాయని వాళ్లు ఎంతో సంతోషించారు. వారెంత ఉత్సాహంగా ఉన్నా ఆయన వారికిలా చెప్పాడు: “దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి.” (లూకా 10:17-20) విత్తువాని పనికి ఎక్కువగా ఫలితాలు రాకపోయినంత మాత్రాన ఆయన ఇతరులకన్నా తక్కువ పనిచేశాడనీ లేక ఇతరులంత నమ్మకంగా పనిచేయలేదనీ అర్థంకాదు. సాధారణంగా వినేవారి హృదయ పరిస్థితిని బట్టే ఫలితాలు వస్తాయి. కానీ చివరకు వృద్ధిచేసేవాడు మాత్రం దేవుడే.

వాక్యం వినేవారి బాధ్యత

10 వాక్యం వినేవారి విషయమేమిటి? వారు ఫలాని​విధంగా స్పందిస్తారని ముందే నిర్ణయించబడుతుందా? లేదు. వారు మంచినేలగా ఉండాలనుకుంటున్నారో లేదో వారే నిర్ణయించుకోవాలి. ఒకరి హృదయ స్థితి మంచిగానైనా మారొచ్చు లేదా చెడ్డగానైనా మారొచ్చు. (రోమా. 6:17) కొందరు వాక్యము “వినిన వెంటనే” సాతాను వచ్చి దాన్ని ఎత్తుకుపోతాడని యేసు తన ఉపమానంలో చెప్పాడు. కానీ అందరి విషయంలో అలా జరగాలనేమీ లేదు. క్రైస్తవులు ‘అపవాదిని ఎదిరించాలని’ యాకోబు 4:7లో ప్రోత్సహించబడ్డారు. వారలా చేస్తే వాడు వారి దగ్గరినుండి పారిపోతాడు. మరికొందరు మొదట్లో వాక్యాన్ని సంతోషంగా అంగీకరించినా “వేరు లేనందున” అభ్యంతరపడతారని యేసు చెప్పాడు. కానీ దేవుని సేవకులు మాత్రం వాక్యపు ‘వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించగలిగేలా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను’ గ్రహించగలిగేలా ‘వేరుపారి స్థిరపడాలని’ ప్రోత్సహించబడుతున్నారు.​—⁠ఎఫె. 3:15-19; కొలొ. 2:6, 7.

11 మరికొందరు తమలోని వాక్యాన్ని ‘ఐహిక విచారాలు, ధనమోసం’ అణచివేసేందుకు అనుమతించారని ఉపమానంలో వర్ణించబడింది. (1 తిమో. 6:9, 10) అలా జరుగకూడదంటే వారేమి చేయాలి? అపొస్తలుడైన పౌలు దానికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.”​—⁠హెబ్రీ. 13:5.

12 మంచినేలపై విత్తబడినవారు ‘ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలిస్తారు’ అని యేసు చివరిగా చెప్పాడు. వాక్యాన్ని అంగీకరించే​వారిలో కొందరికి మంచి హృదయ పరిస్థితి ఉండి ఫలాలు ఫలిస్తున్నా, వారు ఎంతమేరకు సువార్త ప్రకటించగలుగుతారనేది వారివారి పరిస్థితులనుబట్టి ఉంటుంది. ఉదాహరణకు, కొందరు వృద్ధాప్యం వల్ల లేదా ఆరోగ్యం క్షీణిస్తుండడం వల్ల ప్రకటనా పనిలో అంతగా పాల్గొనలేకపోతుండవచ్చు. (మార్కు 12:43, 44 పోల్చండి.) ఈ పరిస్థితుల్లో కూడా విత్తువాడు ఏమీ చేయలేడు కానీ యెహోవా దాన్ని వృద్ధిచేసినప్పుడు చూసి సంతోషిస్తాడు.​​—⁠కీర్తన 126:5, 6 చదవండి.

నిద్రపోయిన విత్తువాడు

13మార్కు 4:26-29 వచనాల్లో విత్తువాని గురించిన మరో ఉపమానాన్ని మన చూస్తాం: “ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచునుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలిపెట్టి కోయును.”

14 ఈ ఉపమానంలోని విత్తువాడు ఎవరు? ఆయన యేసేనని క్రైస్తవమత సామ్రాజ్యంలోని కొందరు నమ్ముతారు. మరి యేసు నిద్రపోయాడనీ, ఆయనకు తెలీకుండా విత్తనం మొలిచిందనీ చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే యేసుకు అదెలా వృద్ధిచెందుతుందో తెలిసే ఉంటుంది. మొదటి ఉపమానంలోని విత్తువానిలాగే ఈ విత్తువాడు, ఉత్సాహంగా రాజ్య విత్తనాన్ని విత్తుతున్న రాజ్య ప్రచారకులను సూచిస్తున్నాడు. వారు నేలపై జల్లే ఆ విత్తనం వారు ప్రకటించే వాక్యం. *

15 విత్తువాడు ‘రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచునుండును’ అని యేసు చెప్పాడు. విత్తువాడు తన పనిని నిర్లక్ష్యంచేస్తున్నాడని దానర్థంకాదు. ప్రజలు సాధారణంగా ప్రతీరోజు చేసేదే ఆయనా చేశాడని యేసు మాటలు తెలియజేస్తున్నాయి. కొంతకాలంపాటు ప్రతీరోజు ఉదయం పనిచేసి రాత్రి పడుకోవడాన్ని ఆ వచనంలోని మాటలు సూచిస్తున్నాయి. ఆ కాలంలో ఏమి జరిగిందో యేసు వివరిస్తూ ‘ఆ విత్తనము మొలిచి పెరుగుతుందనీ,’ అది ఎలా పెరుగుతుందో కూడా ‘వానికి తెలియదనీ’ చెప్పాడు. ‘దానంతటదే’ పెరుగుతుందనే విషయాన్నే యేసు ఇక్కడ నొక్కిచెప్పాడు. *

16 యేసు ఇక్కడ అసలు ఏమి చెబుతున్నాడు? విత్తనం అంచెలంచెలుగా పెరిగి మొక్కగా మారడాన్ని గురించే చెబుతున్నాడని గమనించండి. “భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.” (మార్కు 4:28) విత్తనం క్రమంగా అంచెలంచెలుగా పెరుగుతుంది. దాన్ని బలవంతపెట్టో, తొందరపెట్టో పెంచలేం. ప్రజలు కూడా అలాగే అంచెలంచెలుగా శిష్యులౌతారు. వాక్యం విషయంలో “నిర్ణయింపబడిన [‘సరైన మనోవైఖరిగల,’ NW]” వ్యక్తి హృదయంలో సత్యపు విత్తనం మొలకెత్తేలా యెహోవా చేసినప్పుడు ఆయన అంచెలంచెలుగా శిష్యుడౌతాడు.​​—⁠అపొ. 13:48; హెబ్రీ. 6:1.

17 ‘పంట పండిన’ వెంటనే విత్తువాడు కోత​పనిలో ఏ విధంగా పాల్గొంటాడు? కొత్త శిష్యుని హృదయంలో రాజ్య సత్యం పెరిగేలా యెహోవా చేసినప్పుడు ఆయన ప్రగతి సాధించి, దేవునిమీదున్న ప్రేమతో చివరకు సమర్పించుకునే స్థాయికి చేరుకుంటాడు. తర్వాత ఆయన తన సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకుంటాడు. పరిణతి సాధిస్తూవుండే సహోదరులైతే కొంతకాలానికి సంఘంలో మరిన్ని బాధ్యతలను చేపట్ట​గలుగుతారు. ఒక వ్యక్తి శిష్యునిగా మారినప్పుడు అతనిలో వాక్యాన్ని విత్తిన వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తి శిష్యుడయ్యేందుకు పరోక్షంగా సహాయం చేసిన ఇతర రాజ్య ప్రచారకులు కూడా సంతోషిస్తారు. (యోహాను 4:36-38 చదవండి.) అవును, ‘విత్తువాడును కోయువాడును కూడ సంతోషిస్తారు.’

మనకు పాఠాలు

18 మార్కు సువార్త 4వ అధ్యాయంలోని ఈ రెండు ఉపమానాలను పరిశీలించడం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? మనకిప్పుడు విత్తే పని అప్పగించబడిందని స్పష్టంగా తెలుసుకున్నాం. బహుశా సమస్యలు, కష్టాలు ఎదురౌతాయనుకుని, లేదా సాకులు చెప్పి ఈ పనిని ఎన్నడూ ఆపుచేయకూడదు. (ప్రసం. 11:4) అదే సమయంలో దేవుని జతపనివారిగా ఉండే ఆశీర్వాదం మనకుందని మనకు తెలుసు. మన ప్రయత్నాలను, వాక్యాన్ని అంగీకరించేవారి ప్రయత్నాలను ఆశీర్వదిస్తూ వారు శిష్యులయ్యేలా సహాయం చేసేది యెహోవాయే. మనం ఎవ్వరినీ బలవంతంగా శిష్యులుగా చేయ​లేమని గ్రహించాం. అంతేకాక, మనం ప్రకటించినప్పుడు వారు శిష్యులుగా మారకపోతే లేదా ప్రగతి సాధించడానికి చాలా సమయం తీసుకుంటే మనం నిరుత్సాహపడకూడదు. ‘రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా’ ప్రకటించమని యెహోవా మనకిచ్చిన పనిని మనమెంత నమ్మకంగా చేస్తున్నాం, ఆయనకు ఎంత నమ్మకంగా ఉంటున్నాం అనే దాన్నిబట్టే యెహోవా మన విజయాన్ని కొలుస్తాడు. అదెంత ఓదార్పుకరమైన విషయం!​—⁠మత్త. 24:14.

19 కొత్త శిష్యులు ప్రగతి సాధించడం గురించి, రాజ్య ప్రకటనా పని గురించి యేసు ఇంకా ఏమి బోధించాడు? ఆ ప్రశ్నకు జవాబు, సువార్త పుస్తకాల్లోని ఇతర ఉపమానాల్లో కనిపిస్తుంది. వాటిలో కొన్నింటిని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించనున్నాం.

[అధస్సూచీలు]

^ పేరా 11 ఉదాహరణకు, జార్జి ఫ్యోల్నర్‌ లిండాల్‌ సహోదరుడు ఐస్‌లాండ్‌లో చేసిన పరిచర్య గురించిన అనుభవం కావలికోట 1993, సెప్టెంబరు 15, 24-25 పేజీల్లో ఉంది. వెంటనే ఫలితాలు సాధించలేకపోయినా అనేక సంవత్సరాలపాటు ఐర్లాండ్‌లో నమ్మకంగా సేవచేసిన సహోదరుల అనుభవాల కోసం 1988 యెహోవాసాక్షుల వార్షికపుస్తకములోని (ఆంగ్లం) 82-99 పేజీలు చూడండి.

^ పేరా 19 పూర్వం ఈ పత్రికలో, విత్తనం మనం అంతకంతకూ మెరుగుపరచుకోవాల్సిన లక్షణాలను సూచిస్తుందనీ, మనం ఉంటున్న వాతావరణాన్నిబట్టి అవి మలచబడతాయనీ వివరించబడింది. అయితే, యేసు ఉపమానంలోని విత్తనం చెడిపోవడమో, దాని ఫలాలు కుళ్లిపోవడమో జరగదని గమనించండి. అది కేవలం పెద్దదై ఫలిస్తుంది అంటే మెరుగౌతుంది.​—⁠కావలికోట జూన్‌ 15, 1980, 17-19 పేజీలు చూడండి.

^ పేరా 20 ఈ వచనంలోని పదప్రయోగం మళ్లీ అపొస్తలుల కార్యములు 12:10లో మాత్రమే కనిపిస్తుంది, అక్కడ ఇనుప గవిని “దానంతట అదే” తెరుచుకుందని వర్ణించబడింది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• విత్తనాలు విత్తడానికి, రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి మధ్య ఉన్న కొన్ని పోలికలేమిటి?

• ఒక రాజ్య ప్రచారకుడు ఎంత నమ్మకంగా ఉన్నాడనేదాన్ని యెహోవా ఎలా కొలుస్తాడు?

• విత్తనాలు పెరగడానికి, వ్యక్తులు శిష్యులుగా మారడానికి మధ్య ఉన్న ఏ పోలికను యేసు నొక్కిచెప్పాడు?

• ‘విత్తువాడును కోయువాడును కూడ’ ఏ విధంగా ‘సంతోషిస్తారు’?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం ఏ పనిలో ‘దేవుని జతపనివారిగా’ ఉన్నాం?

2. ‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే’ అన్న వాస్తవం పరిచర్యపట్ల సరైన దృక్పథాన్ని కనపర్చేందుకు మనకు ఎలా సహాయం చేస్తుంది?

3. విత్తనాలు విత్తడానికి, శిష్యులను చేయడానికి మధ్య ఎలాంటి పోలికలున్నాయి?

4, 5. విత్తనాలు జల్లే విత్తువాని గురించిన యేసు ఉపమానాన్ని క్లుప్తంగా చెప్పండి.

6. విత్తువాని ఉపమానాన్ని యేసు ఎలా వివరించాడు?

7. విత్తనం, వివిధ రకాల నేలలు వేటిని సూచిస్తున్నాయి?

8. (ఎ) విత్తువాడు ఎవరిని సూచిస్తున్నాడు? (బి) రాజ్య సందేశానికి ప్రజల స్పందన ఎందుకు వేర్వేరుగా ఉంటుంది?

9. అపొస్తలుడైన పౌలు, యేసు ఇద్దరూ ఓదార్పుకరమైన ఏ సత్యాన్ని నొక్కిచెప్పారు?

10. వాక్యం వినే వ్యక్తి మంచి నేలను పోలివున్నాడో లేదో అనేది దేన్నిబట్టి నిర్ణయించబడుతుంది?

11. ఐహిక విచారాలు, ధనమోసం తనలోని వాక్యాన్ని అణచివేయకుండా ఉండాలంటే ఒక వ్యక్తి ఏమి చేయాలి?

12. మంచినేలను సూచించేవారు ఎందుకు వివిధ మొత్తాల్లో ఫలిస్తారు?

13, 14. (ఎ) విత్తనాన్ని జల్లే విత్తువాని గురించిన యేసు ఉపమానాన్ని సంక్షిప్తంగా చెప్పండి. (బి) విత్తువాడు ఎవరు, ఆయన జల్లే విత్తనం ఏమిటి?

15, 16. విత్తనం పెరగడాన్ని గురించిన, వ్యక్తి శిష్యుడవడాన్ని గురించిన ఏ సత్యాన్ని యేసు విత్తువాని ఉపమానంలో చెప్పాడు?

17. ఒక వ్యక్తి శిష్యుడైనప్పుడు ఎవరెవరు సంతోషిస్తారు?

18, 19. (ఎ) యేసు ఉపమానాలను పరిశీలించడం వల్ల మీరెలా ప్రోత్సహించబడ్డారు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో వేటి గురించి పరిశీలించబోతున్నాం?

[13వ పేజీలోని చిత్రాలు]

యేసు రాజ్య ప్రచారకుణ్ణి విత్తనాలు విత్తువానితో ఎందుకు పోల్చాడు?

[15వ పేజీలోని చిత్రాలు]

మంచి నేలను పోలివున్నవారు మనస్ఫూర్తిగా తమతమ పరిస్థితులు అనుకూలించినంత మేరకు రాజ్య ప్రకటనా పనిలో పాల్గొంటారు

[16వ పేజీలోని చిత్రాలు]

వృద్ధిచేసేవాడు దేవుడే