కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవామీద పూర్తి నమ్మకముంచడాన్ని నేను నేర్చుకున్నాను

యెహోవామీద పూర్తి నమ్మకముంచడాన్ని నేను నేర్చుకున్నాను

జీవిత కథ

యెహోవామీద పూర్తి నమ్మకముంచడాన్ని నేను నేర్చుకున్నాను

ఆబ్రీ బ్యాక్ట్సర్‌ చెప్పినది

1940వ సంవత్సరం, ఒక శనివారం సాయంత్రం, ఇద్దరు వ్యక్తులు నామీద దాడి చేసి నన్ను ఎంతగా కొట్టారంటే నేను కూలబడ్డాను. దగ్గర్లోవున్న ఇద్దరు పోలీసులు నాకు సహాయం చేయాల్సిందిపోయి, నన్ను బూతులు తిట్టి రౌడీల వెన్నుతట్టారు. వారలా నాతో క్రూరంగా ప్రవర్తించడానికి దారితీసిన సంఘటనలు, నా జీవితంలో దాదాపు ఐదేళ్ల క్రితం నేను బొగ్గు గనిలో పనిచేస్తున్నప్పుడు జరిగాయి. ఆ సంఘటనలను నన్ను వివరించనివ్వండి.

మాఇంట్లోని నలుగురు అబ్బాయిల్లో నేను మూడవవాణ్ణి. నేను 1913లో, ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోని స్వాన్సీ అనే కోస్తా పట్టణంలో పుట్టాను. నాకు ఐదేళ్లున్నప్పుడు మా కుటుంబమంతటికీ స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెన్జా సోకింది, అప్పట్లో అది ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది జీవితాలను బలితీసుకొని ఉండవచ్చు. సంతోషకరంగా, మేమందరం బ్రతికి బయటపడ్డాం. అయితే, 1933లో మా అమ్మ 47 ఏళ్ల వయస్సులో మరణించినప్పుడు మా కుటుంబంలో విషాదం అలముకుంది. దైవభక్తిగల ఆమె అంతకుముందు, యెహోవాసాక్షులు పంచిపెట్టిన బైబిలు అధ్యయన సహాయకమైన లైట్‌ పుస్తకపు రెండు సంపుటాలను సంపాదించింది.

ఆ సమయంలో నేను బొగ్గు గనిలో పనిచేస్తున్నాను. నా పనిస్థలంలో కొద్దిసేపు తీరికలేకుండా పనిచేయాల్సి వచ్చేది, తర్వాత అంతగా పని ఉండేదికాదు కాబట్టి, నేను నా పనిస్థలానికి పుస్తకాలను తీసుకెళ్లి, నా హెల్మెట్‌కు ఉండే కార్బైడ్‌ దీపం సహాయంతో వాటిని చదివేవాణ్ణి. కొంతకాలానికి నేను సత్యాన్ని కనుగొన్నానని గ్రహించాను. అంతేకాక, యెహోవాసాక్షులు రేడియోలో ప్రసారంచేస్తున్న బైబిలు ప్రసంగాలను వినడం మొదలుపెట్టాను. మా నాన్న, నా సహోదరులు బైబిలు సత్యంపట్ల ఆసక్తి చూపించడం ప్రారంభించడంతో నా ఆనందం రెట్టింపయ్యింది.

1935లో నా తమ్ముడు బిల్లీ నిమోనియాతో మరణించినప్పుడు మా కుటుంబంలో మళ్లీ విషాదం అలముకుంది. వాడికి అప్పుడు 16 ఏళ్లే. అయితే ఈసారి మా కుటుంబం పునరుత్థాన నిరీక్షణనుబట్టి ఓదార్పుపొందింది. (అపొస్తలుల కార్యములు 24:14) కొంతకాలానికి మా నాన్న, మా అన్నలైన వెర్నర్‌, హరాల్డ్‌లతోపాటు వారి భార్యలు దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యుల్లో నేను మాత్రమే బ్రతికివున్నాను. అయితే, వెర్నర్‌ రెండవ భార్య మార్జరీ, హరాల్డ్‌ భార్య ఎలిజబెత్‌ యెహోవా సేవలో ఇప్పటికీ చురుకుగా పనిచేస్తున్నారు.

యెహోవామీద నమ్మకముంచడాన్ని నేర్చుకోవడం

1935లో యూక్రేయిన్‌ దేశస్థురాలైన ఒక మహిళ సైకిల్‌మీద మా ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారిగా యెహోవాసాక్షులతో పరిచయమేర్పడింది. తర్వాతి ఆదివారం నేను క్రైస్తవ కూటానికి మొదటిసారి హాజరయ్యాను, ఒక వారం తర్వాత, నేను వారి గుంపుతో కలిసి క్షేత్రసేవలో పాల్గొన్నాను. క్షేత్రసేవ కూటాన్ని నిర్వహిస్తున్న సాక్షి నాకు కొన్ని చిన్న పుస్తకాలను ఇచ్చి, ఇంటింటి పరిచర్యకు నన్ను ఒంటరిగా పంపించినప్పుడు నేనెంతో ఆశ్చర్యపోయాను. మొదటి ఇంటి దగ్గర నేను ఎంతగా కంగారుపడ్డానంటే భూమి తన నోరు తెరచి నన్ను మ్రింగేస్తే బాగుండు అనిపించింది! అయితే గృహస్థుడు స్నేహపూర్వకంగా స్పందించడమే కాకుండా సాహిత్యాలను కూడా తీసుకున్నాడు.

ప్రసంగి 12:1, మత్తయి 28:19, 20 వంటి లేఖనాలు నన్ను ఎంతగా ఆకట్టుకున్నాయంటే నేను పయినీరుగా, లేదా పూర్తికాల పరిచారకునిగా సేవచేయాలనుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయానికి మా నాన్న మద్దతునిచ్చాడు. నేను ఇంకా బాప్తిస్మం తీసుకోకపోయినా, 1936 జూలై 15న పయినీరు సేవ ప్రారంభించాలనుకున్నాను. ఆ రోజు నేను సిడ్నీలో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వెళ్లాను, సిడ్నీ శివార్లలోవున్న డాలిజ్‌ హిల్‌ అనే ప్రాంతంలో 12 మంది ఉన్న పయినీర్ల గుంపుతో సేవచేయమని వారు నాకు చెప్పారు. చేత్తో తిప్పే గోధుమ పిండిమరను ఎలా ఉపయోగించాలో వారు నాకు నేర్పించారు, ఆ కాలంలో పయినీర్లు దానిలో గోధుమ పిండి చేసుకొని భోజన ఖర్చులను తగ్గించుకునేవారు.

అడవిప్రాంతంలో పయినీరు సేవ

అదే సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆబ్రే విల్స్‌, క్లీవ్‌ షేడ్‌ అనే మరో ఇద్దరు పయినీర్లతో కలిసి సేవచేయడానికి మధ్య క్వీన్స్‌ల్యాండ్‌కు నియమించబడ్డాను. ఆబ్రేకున్న వ్యాన్‌, కొన్ని సైకిళ్లు, బైబిలు ప్రసంగాలను ప్రసారం చేయడానికి పోర్టబుల్‌ ఫోనోగ్రాఫ్‌, తర్వాతి మూడు సంవత్సరాలు మా గృహంగా మారిన ఒక గుడారం, మూడు పరుపులు, ఒక బల్ల, ఒక ఇనుప వంటపాత్ర, ఇవి మా సామగ్రి. ఒకరోజు సాయంత్రం వంట చేయడానికి నావంతు వచ్చినప్పుడు, కూరగాయలతో, గోధుమ గంజితో “ప్రత్యేక” భోజనం వండాలనుకున్నాను. అయితే, మాలో ఎవరమూ దానిని తినలేకపోయాం. ఆ సమయంలో దగ్గర్లో ఒక గుర్రం ఉంది, దాని ముందు ఆ భోజనాన్ని ఉంచాను. అది వాసన చూసి, తలవూపి అక్కడి నుండి వెళ్లిపోయింది! అంతటితో నా వంట ప్రయోగాలు ఆగిపోయాయి.

కొంతకాలం తర్వాత, మేము మా క్షేత్రాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రతీ ఒక్కరం ఒకొక్క భాగంలో పనిచేయడం ద్వారా క్షేత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. సాయంత్రానికల్లా, తరచూ నేను సైకిల్‌లో గుడారానికి తిరిగి రాలేనంత దూరంలో ఉండేవాణ్ణి, కాబట్టి, నేను కొన్నిసార్లు అతిథులను ఆదరించే పల్లెవాసులతో రాత్రి గడిపేవాణ్ణి. ఒక సందర్భంలో, పశుపాలనా క్షేత్రంలో ఉండే అతిథి గృహంలోని విలాసవంతమైన పరుపుమీద పడుకున్నాను, మరుసటి రోజు రాత్రి, కంగారూ వేటగాని గుడిసెలో, చుట్టూ కంపువాసనగొట్టే చర్మాల కుప్పలతో రోతగా ఉన్న నేలమీద పడుకున్నాను. నేను తరచూ అడవిప్రాంతంలో నిద్రపోయేవాణ్ణి. ఒకసారి అడవికుక్కలు నేను పడుకున్న స్థలానికి కొంతదూరంలో చుట్టుముట్టాయి, అవి రాత్రంతా భయపెట్టే విధంగా మొరిగాయి. రాత్రంతా మెలకువగా ఉన్న తర్వాత, ఆ కుక్కలు నా మీద కాదు గానీ దగ్గర్లోని చెత్తకుప్పలో పడవేయబడ్డ మాంసపు ముద్దలమీద కన్నేశాయని నేను తెలుసుకున్నాను.

సౌండ్‌ కారును ఉపయోగించి ప్రకటించడం

దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి మేము సౌండ్‌ కారును చక్కగా ఉపయోగించాం. ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో ఉన్న టౌన్స్‌విల్‌ నగరం నడిబొడ్డులో దానిని పెట్టుకొనేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించారు. అయితే, రికార్డ్‌ చేయబడిన ఆ ప్రసంగం సాల్వేషన్‌ ఆర్మీకి చెందిన కొంతమంది సభ్యులకు కోపం తెప్పించింది, ఆ ప్రాంతం విడిచివెళ్లమని వారు మమ్మల్ని బెదిరించారు. మేము దానికి ఒప్పుకోనప్పుడు వారిలో ఐదుగురు మా వ్యాన్‌ను బలంగా ఊపారు. ఆ సమయంలో నేను లోపల సౌండ్‌ ఆపరేట్‌ చేస్తున్నాను. మా హక్కుల గురించి వాదించడం జ్ఞానయుక్తం కాదనిపించింది కాబట్టి, వారలా ఊపడం ఆపేసినప్పుడు మేము ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టివెళ్లాం.

బండాబర్గ్‌ పట్టణం గుండా ప్రవహించే బర్నెట్‌ నదిలో మేము ప్రసంగాలను ప్రసారం చేసేలా ఆసక్తిగల ఒక వ్యక్తి తన పడవను ఉపయోగించుకోవడానికి అనుమతించాడు. ఆబ్రే, క్లీవ్‌లు సౌండ్‌ పరికరంతో పడవలో ప్రయాణిస్తుంటే, నేను అద్దెకు తీసుకున్న హాల్‌లో ఉండిపోయాను. ఆ రోజు రాత్రి, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి చెందిన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌గారి రికార్డ్‌ చేయబడిన గంభీరమైన స్వరం, బండాబర్గ్‌ పట్టణమంతా మారుమోగి, శక్తివంతమైన బైబిలు సందేశాన్ని ప్రకటించింది. నిజంగా అవి దేవుని ప్రజలు ధైర్యం, విశ్వాసం చూపించవలసిన ఉత్తేజభరితమైన కాలాలు.

యుద్ధంవల్ల మరిన్ని సవాళ్లు ఎదురుకావడం

రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబరులో ప్రారంభమైన కొంతకాలానికే, కావలికోట నవంబరు 1 సంచిక, రాజకీయాల విషయంలో, యుద్ధం విషయంలో క్రైస్తవులు చూపించాల్సిన తటస్థత గురించి చర్చించింది. ఆ సమయోచితమైన సమాచారాన్ని అధ్యయనం చేసినందుకు ఆ తర్వాత నేనెంతో సంతోషించాను. ఈ లోగా ఆబ్రే, క్లీవ్‌లతోపాటు మూడేళ్లు కలిసి సేవచేసిన తర్వాత మేము వేర్వేరు నియామకాలు పొందాం. నేను ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లో ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాను, యెహోవామీద నాకున్న నమ్మకాన్ని అది తరచూ పరీక్షించింది.

నేను 1940 ఆగస్టులో టౌన్స్‌విల్‌ సంఘంలో సేవచేశాను, ఆ సంఘంలో భార్యాభర్తలైన పర్సీ ఇస్లబ్‌, ఇల్మ ఇస్లబ్‌ *, తోబుట్టువులైన నార్మన్‌ బెలోటీ, బీయట్రస్‌ బెలోటీ అనే నలుగురు పయినీర్లు సేవచేసేవారు. ఆరేళ్ల తర్వాత బీయట్రస్‌ నా భార్య అయింది. ఒక శనివారం సాయంత్రం మాలో కొందరు వీధి సాక్ష్యం పూర్తిచేసిన తర్వాత ప్రారంభంలో ప్రస్తావించబడిన దాడి జరిగింది. అయితే, ఆ అన్యాయం, యెహోవా సేవలో కొనసాగేందుకే నన్ను ఉత్తేజపరిచింది.

ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లో యునా కిల్పార్టిక్‌, మర్ల్‌ కిల్పార్టిక్‌ అనే ఇద్దరు పయినీరు సహోదరీలు ఉత్సాహంగా ప్రకటించేవారు. నేను పరిచర్యలో వారితో కలిసి ఆనందంగా గడిపిన తర్వాత నది అవతలి ఒడ్డుమీద ఉన్న ఆసక్తిగల కుటుంబం దగ్గరికి తమను పడవలో తీసుకువెళ్లమని వారు నన్ను కోరారు. అలా తీసుకెళ్లాలంటే అవతలి ఒడ్డుమీద లంగరు వేయబడ్డ తెడ్లున్న పడవ దగ్గరికి ఈదుకుంటూ వెళ్లి దాన్ని ఈ ఒడ్డుకు తీసుకువచ్చి ఆ తర్వాత సహోదరీలను అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లాలి. అయితే నేను పడవ దగ్గరికి చేరుకొనే సరికి పడవ తెడ్లు కనిపించలేదు! ఒక వ్యతిరేకి వాటిని దాచిపెట్టినట్లు ఆ తర్వాత మేము తెలుసుకున్నాం. అతని పన్నాగం మమ్మల్ని ఆపలేదు. నేను గతంలో అనేక సంవత్సరాలు లైఫ్‌గార్డ్‌గా పనిచేశాను, అంతేకాక అప్పటికీ నేను బాగా ఈదేవాణ్ణి. కాబట్టి లంగరుకు వేసే తాడును నా నడుముకు కట్టుకొని, పడవను ఆ ఇద్దరు సహోదరీలు ఉన్న ఒడ్డు దగ్గరికి తీసుకువెళ్లి వారిని అవతలి ఒడ్డుకు చేర్చాను. యెహోవా మా ప్రయత్నాలను ఆశీర్వదించాడు, ఎందుకంటే, ఆసక్తి కనబరిచిన ఆ కుటుంబం కొంతకాలానికి సాక్షులయ్యారు.

యెహోవా కాపుదల క్రింద

భద్రతా కారణాలరీత్యా, సైనిక దళం ఐనస్ఫాల్‌ పట్టణానికి దిగువున దారికి అడ్డంగా అవరోధాన్ని పెట్టింది. నేను ఆ పట్టణవాస్తవ్యుణ్ణి కాబట్టి నేను ప్రవేశ అనుమతి సంపాదించగలిగేవాణ్ణి, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి ప్రతినిధులు వచ్చినప్పుడు అది ఎంతో ఉపయోగపడింది. వారిని ఆ అవరోధాన్నుంచి దాటించడానికి నా కారు వెనుక సీటు కింద మరుగున ఉన్న కంపార్ట్‌మెంట్‌లో వారిని దాచేవాణ్ణి.

ఆ రోజుల్లో పెట్రోలును పరిమితంగా ఇచ్చేవారు, అనేక వాహనాలకు గ్యాస్‌ ఉత్పత్తి చేసే యూనిట్‌ బిగించబడేది. ఇంజిన్‌ నడిచేలా ఈ పరికరం, వేడి బొగ్గు సహాయంతో మండే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేను రాత్రిపూట, సహోదరులు దాగివున్న కంపార్ట్‌మెంట్‌ మీద బొగ్గు సంచీలను పెట్టుకొని ప్రయాణించేవాణ్ణి. అవరోధం ఉన్న చోట ఆపాల్సివచ్చినప్పుడు, ఇంజిన్‌ను వేగంగా నడుపుతూ బొగ్గువున్న పెట్టె ఎంతో వేడిగా ఉండేలా చూసేవాణ్ణి. “నేను కారును ఆపేస్తే గ్యాస్‌-గాలి మిశ్రమం దెబ్బతింటుంది, మళ్లీ కారును స్టార్ట్‌ చేయడం కష్టమౌతుంది” అని ఒక రోజు రాత్రి గార్డులకు అరచి చెప్పాను. వేడి, ధ్వని, పొగ భరించలేక గార్డులు పైపైనే తనిఖీ చేసి నన్ను పోనిచ్చారు.

ఆ రోజుల్లో స్థానిక సాక్షుల కోసం టౌన్స్‌విల్‌లో సమావేశాన్ని వ్యవస్థీకరించే బాధ్యత నాకప్పగించబడింది. అప్పట్లో ఆహారం పరిమితంగా ఇవ్వబడేది, మాకు కావాల్సినవి సమకూర్చుకోవడానికి స్థానిక మెజిస్ట్రేట్‌ ఆమోదం పొందాల్సివచ్చేది. ఆ సమయంలో, మన క్రైస్తవ సహోదరులు తమ తటస్థత కారణంగా జైళ్లలో వేయబడుతున్నారు. అందుకే, నేను మెజిస్ట్రేట్‌ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నప్పుడు నేనిలా అనుకున్నాను, ‘నేను జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నానా లేక నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్నానా?’ ఏదేమైనా, నేను ఆదేశించబడిన దానిప్రకారం చేశాను.

చక్కగా కనిపించే ఒక పెద్ద బల్లకు ఆ ప్రక్క కూర్చున్న మెజిస్ట్రేట్‌ నన్ను కూర్చోమని చెప్పాడు. నేనెందుకు వచ్చానో ఆయనకు వివరించినప్పుడు ఆయన నిశ్చేష్టుడై ఎంతోసేపు భావరహితంగా నన్ను తేరిచూశాడు. ఆ తర్వాత ప్రశాంతంగా మారి ఇలా అడిగాడు, “మీకు ఎంత ఆహారం కావాలి?” అవసరమైన వస్తువులను చాలా తక్కువ పరిమాణంలో కోరుతున్న ఒక లిస్ట్‌ ఆయన చేతికిచ్చాను. ఆయన ఆ లిస్టును పరిశీలించి ఇలా అన్నాడు: “అది సరిపోదనుకుంటా. వాటి పరిమాణం రెట్టింపు చేయడం మంచిది.” నమ్మకం విషయంలో మరో పాఠాన్ని నేర్పించిన యెహోవాపట్ల ఎంతో కృతజ్ఞతతో ఆయన కార్యాలయం నుండి బయటికి వచ్చాను.

ఆస్ట్రేలియాలో 1941 జనవరిలో, యెహోవాసాక్షుల పని నిషేధించబడింది. అనేకమంది మమ్మల్ని అనుమానించి జపానీయుల కోసం గూఢచార పని చేస్తున్నామని కూడా నిందించారు! ఒక సందర్భంలో, రెండు కార్లనిండా వచ్చిన పోలీసులు, సైనికులు, ఆథర్టన్‌ పీఠభూమిలో ఆహారపంటలు పండించడానికి మేము కొనుగోలు చేసిన స్థలమైన కింగడమ్‌ ఫామ్‌ మీద దాడిచేశారు. శత్రువులకు సంకేతాలివ్వడానికి మేము ఉపయోగిస్తున్నట్లు వారు భావించిన పెద్ద దీపం కోసం వెదికారు. విమానంలో నుండి చదవగలిగే కోడ్‌ ఆకృతిలో మొక్కజొన్నలను సాగుచేస్తున్నామని కూడా మా మీద అభియోగం మోపారు! ఆ అభియోగాలన్నీ తప్పని నిరూపించబడ్డాయి.

నిషేధం కారణంగా మేము సాహిత్యాలను నేర్పుతో జాగ్రత్తగా అందజేయాల్సివచ్చేది. ఉదాహరణకు, చిల్డ్రన్‌ అనే పుస్తకం విడుదల చేయబడినప్పుడు నేను బ్రిస్బేన్‌లో ఆ పుస్తకాల కార్టన్‌ను తీసుకొని ఉత్తర దిశగా రైలులో ప్రయాణించి, సంఘాలున్న స్టేషన్‌లో పుస్తకాలు అందించాను. పోలీసులు, సైనిక ఇన్స్పెక్టర్‌లు కార్టన్‌ను తనిఖీ చేయకుండా ఉండేందుకు, నేను రంపం పట్టీని నాతోపాటు తెచ్చుకొని రైలు నుండి దిగే ముందు దాన్ని కార్టన్‌కు చుట్టేవాణ్ణి. ఈ ఉపాయం మామూలుగా కనిపించినా అది ఎన్నడూ విఫలంకాలేదు. ఆ నిషేధం “అన్యాయమైనది, తగిన ముందాలోచన లేకుండా విధించబడినది, అణచివేసేది” అని ఒక న్యాయాధిపతి వర్ణించాడు, యెహోవా ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఆ నిషేదం 1943 జూన్‌లో ఎత్తివేయబడింది.

మిలటరీ సేవకోసం పిలుపు

దాని ముందటి సంవత్సరం, ఆబ్రే విల్స్‌కు, నార్మన్‌ బెలోటీకి, నాకూ మిలటరీ సేవ కోసం పిలుపు వచ్చింది. ఆబ్రే, నార్మన్‌లు నాకన్నా ఒక వారం ముందు న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సిందిగా ఆదేశం పొందారు, వారికి ఆరు నెలల కారాగారశిక్ష విధించబడింది. ఆ కాలంలో పరిచయమున్న సాక్షుల చిరునామాలకు పంపించబడే కావలికోట పత్రికలను పోస్టాఫీసు స్వాధీనం చేసుకునేది కానీ వేరే చందాదారులకు పంపించబడే పత్రికల జోలికైతే వెళ్లేది కాదు. ఆ చందాదారులలో ఒకరిని కనుగొని, పత్రికల నకలు తీసి వాటిని తోటి సాక్షులకు పంచిపెట్టడమే మా పని. అలా మాకు క్రమంగా ఆధ్యాత్మిక ఆహారం అందేది.

నాకు ఆరేళ్ల శిక్ష విధించబడినప్పుడు, సిడ్నీలోని బ్రాంచి కార్యాలయ ఆదేశానుసారంగా నేను వెంటనే అప్పీలు చేసుకున్నాను. నేను చేసే పనికి మరొకరు నియమించబడేంతవరకు నా శిక్షను వాయిదా వేయాలన్నదే మా లక్ష్యం. ఆ స్వేచ్ఛా కాలాన్ని ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో నిర్బంధించబడిన దాదాపు 21 మంది సాక్షులను కలుసుకునేందుకు ఉపయోగించుకున్నాను. వారిలో చాలామంది సాక్షులు ఒకే కారాగారంలో ఉన్నారు, ఆ కారాగార వార్డెన్‌ మమ్మల్ని ద్వేషించేవాడు. ఇతర మతాల పరిచారకులు తమ మతస్థులను కలుసుకోవడానికి అనుమతించబడడం గురించి నేను ఆయనకు గుర్తుచేసినప్పుడు ఆయన కోపోద్రిక్తుడయ్యాడు. “నాకే గనుక అధికారం ఉంటే యెహోవాసాక్షులందరినీ వరుసలో నిల్చోబెట్టి కాల్చిపారేసేవాణ్ణి!” అని ఆయన అరిచాడు. అక్కడి గార్డులు నన్ను త్వరత్వరగా అక్కడినుండి బయటికి తీసుకువెళ్ళిపోయారు.

నా అప్పీలు విచారణకు వచ్చినప్పుడు చట్టప్రకారం నాకు న్యాయపరమైన సహాయం దొరికింది. అయితే, నిజానికి, నా కేసును నేనే నిర్దేశించుకున్నాను, అలా చేయడానికి నేను యెహోవామీద ఎంతో ఆధారపడాల్సి వచ్చింది. ఆయన కూడా నన్ను నిరాశపరచలేదు. (లూకా 12:11, 12; ఫిలిప్పీయులు 4:6, 7) ఆశ్చర్యకరంగా, చార్జిషీటులో కనబడిన పొరపాట్ల కారణంగా నేను అప్పీలు గెలిచాను!

1944లో దక్షిణ ఆస్ట్రేలియాలో, ఉత్తర విక్టోరియాలో, సిడ్నీలోని న్యూ సౌత్‌ వేల్స్‌ నగరంలో ఉన్న సంఘాలుగల పెద్ద సర్క్యూట్‌కు నేను నియమించబడ్డాను. ఆ తర్వాతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రసంగాలను ఇచ్చే కార్యక్రమం ప్రారంభించబడింది, ప్రతీ ప్రసంగీకుడు సంస్థ ఇచ్చే ఒక పేజీ సంక్షిప్త ప్రతి ఆధారంగా సొంత ప్రసంగాన్ని తయారుచేసుకోవాలి. ఒక గంటపాటు సాగే ప్రసంగాలను ఇవ్వడంలో క్రొత్త సవాళ్లు ఎదురయ్యాయి, అయితే మేము యెహోవామీద పూర్తి నమ్మకంతో ముందుకుసాగాం, ఆయన మా కృషిని ఆశీర్వదించాడు.

వివాహం, క్రొత్త బాధ్యతలు

బీయట్రస్‌ బెలోటీ, నేనూ 1946 జూలైలో వివాహం చేసుకున్నాం, ఆ తర్వాత మేమిద్దరం పయినీర్లుగా సేవచేశాం. మా ఇల్లు చెక్కతో చేసిన బండి, లేక ట్రేయిలర్‌. మా ఒక్కగానొక్క అమ్మాయి జానస్‌ (జ్యాన్‌) 1950 డిసెంబరులో పుట్టింది. మేము న్యూసౌత్‌వేల్స్‌లోని కెంప్సీ పట్టణంతోపాటు అనేక ప్రాంతాల్లో పయినీరు సేవ చేశాం, ఆ పట్టణంలో, ప్రారంభంలో మేము తప్ప వేరే సాక్షులెవ్వరూ లేరు. ప్రతీ ఆదివారం మేము స్థానిక కమ్యూనిటీ హాల్‌కు వెళ్లేవారం, మేము కరపత్రాలతో ప్రచారం చేసిన ప్రసంగాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండేవాణ్ణి. కొన్ని నెలలవరకు, బీయట్రస్‌, చిన్నారి జ్యాన్‌ మాత్రమే నా శ్రోతలు. అయితే కొంతకాలానికి, నెమ్మదిగా ఇతరులు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు కెంప్సీ పట్టణంలో వర్ధిల్లుతున్న రెండు సంఘాలున్నాయి.

జ్యాన్‌కు రెండేళ్లు ఉన్నప్పుడు మేము బ్రిస్బేన్‌లో స్థిరపడ్డాం. ఆమె పాఠశాల చదువు పూర్తిచేసుకున్న తర్వాత, మేము ఒక కుటుంబంగా న్యూసౌత్‌వేల్స్‌లోని సెస్నోక్‌ పట్టణంలో నాలుగేళ్లు సేవచేసి, అనారోగ్యంగా ఉన్న బీయట్రస్‌ వాళ్ల అమ్మకు సహాయం చేయడానికి బ్రిస్బేన్‌కు తిరిగివచ్చాం. ప్రస్తుతం చార్మ్‌సిడ్‌ సంఘంలో పెద్దగా సేవచేసే ఆధిక్యత నాకుంది.

యెహోవాను తెలుసుకునేలా 32 మందికి సహాయం చేసే ఆధిక్యతతోపాటు లెక్కలేనన్ని ఇతర ఆశీర్వాదాలు మాకు ఇచ్చినందుకు నేను నా భార్య యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాకు మంచి భార్యను ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఆమె నెమ్మదస్థురాలు, మృదుస్వభావి అయినా బైబిలు సత్యం కోసం ధైర్యంగా పోరాడింది. దేవునిపట్ల ఆమెకున్న ప్రేమ, ఆయనపై ఆమెకున్న నమ్మకం, ఆమె తన ‘కంటిని తేటగా’ ఉంచుకోవడం వంటి గుణాలు ఆమెను నిజంగా యోగ్యురాలైన భార్యగా, తల్లిగా చేశాయి. (మత్తయి 6:22, 23; సామెతలు 12:4) మేమిద్దరం నిజాయితీగా ఇలా చెప్పగలం: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.”—యిర్మీయా 17:7.

[అధస్సూచి]

^ పేరా 19 పర్సీ ఇస్లబ్‌ జీవిత కథ, ఈ పత్రిక మే 15, 1981 సంచికలో ప్రచురించబడింది.

[9వ పేజీలోని చిత్రం]

ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో మేము ఈ సౌండ్‌కారును ఉపయోగించాం

[10వ పేజీలోని చిత్రం]

ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో, వర్షాకాలంలోని ఒకరోజు కిల్పార్టిక్‌ అక్కాచెల్లెళ్ల వాహనాన్ని బయటికి తీయడానికి సహాయం చేయడం

[12వ పేజీలోని చిత్రం]

మా పెళ్లిరోజున