జార్జియాలో జరిగిన ఒక సమావేశంలో రెండు “అద్భుతాలు”
జార్జియాలో జరిగిన ఒక సమావేశంలో రెండు “అద్భుతాలు”
రెం డు “అద్భుతాలు” జరిగిన మరపురాని సంఘటన, 2006లో జార్జియా దేశంలో జరిగింది. ఆ దేశమంతటా మూడు రోజులు, జూలై 7 నుండి 9 వరకు, “విడుదల సమీపించింది!” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం ఆరు ప్రాంతాల్లో నిర్వహించబడింది. వాటికి హాజరైన 17,000 మంది ఆ ఆధ్యాత్మిక విందును ఆస్వాదించారు.
ప్రధానంగా సమావేశం జరిగే, జార్జియా రాజధాని అయిన టిబిలిసి అనే నగరంలో సమకూడే వేలాదిమంది కోసం సరైన స్థలాన్ని కనుగొనేందుకు 2006 జనవరిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇతర సమావేశ స్థలాలు టెలిఫోను ద్వారా అనుసంధానం చేయబడతాయి.
గత అనేక సంవత్సరాల్లో జార్జియాలో ఆరాధనా స్వేచ్ఛ అంచెలంచెలుగా ఇవ్వబడింది. అందుకే, గతంలో సర్వత్రా వ్యతిరేకత ఉన్నా, రాజధాని నగరంలో సమావేశ స్థలాన్ని కనుగొనవచ్చనే నమ్మకంతో, సాక్షులు నిర్విరామంగా, పట్టుదలతో తమ వేటను కొనసాగించారు. స్వభావసిద్ధంగా జార్జియావాసులు స్నేహపూరితులు, అతిథిప్రియులు. అయితే, కొంతమంది అధికారులకు మత వివక్ష బలంగా ఉంది. వారు తమ వివక్షా భావాలను అధిగమించి, ఒక స్థలాన్ని అద్దెకు తీసుకునేందుకు సాక్షులను అనుమతిస్తారా?
సమావేశ కమిటీలోని సహోదరులు వివిధ స్టేడియంలను, పెద్ద క్రీడా భవనాలను చూశారు. వాటి మేనేజర్లు తమ స్థలాలను ఉపయోగించుకోవడానికి అద్దెకు ఇస్తామని వాగ్దానం చేశారు గానీ నిర్దిష్టమైన తేదీల్లో అద్దెకు ఇవ్వమని సహోదరులు అడిగినప్పుడు వారు తిరస్కరించారు. అందుకే, టిబిలిసి ఫిలార్మానిక్ యాజమాన్యం తమ స్థలాన్ని యెహోవాసాక్షులకు అద్దెకు ఇవ్వడానికి అంగీకరించినప్పుడు ఆ కమిటీ ఆశ్చర్యపోయింది. అత్యంత గౌరవప్రదమైన అనేక కార్యక్రమాలు నిర్వహించబడే ఆ పాటకచ్చేరి భవనం, నగరం నడిబొడ్డున ఉంది.
చివరకు, తమ ప్రయత్నాలు ఫలించడాన్నిబట్టి ప్రోత్సహించబడిన ఆ కమిటీలోని సభ్యులు, టిబిలిసి సమావేశంతోపాటు స్నోరీ, కుటైసి, జుగ్డీడీ, కాస్పీ, గోరీ వంటి పట్టణాల్లో, నగరాల్లో నిర్వహించబడే సమావేశాలను
కూడా వ్యవస్థీకరించడం మొదలుపెట్టారు. ఏకకాలంలో కార్యక్రమం నిర్వహించబడేలా సమావేశ స్థలాలన్నిటినీ టెలిఫోనుతో అనుసంధానం చేయడానికి ఎంతో పని జరిగింది. సమావేశ ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. సమావేశాల ఆరంభానికి కేవలం ఒక వారమే ఉందనగా టిబిలిసి ఫిలార్మానిక్ పాటకచేరి భవన యజమాన్యం అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దుచేసింది. దానికి వారు ఎలాంటి వివరణా ఇవ్వలేదు.మొదటి “అద్భుతం”
సమావేశానికి కొద్దిరోజులే మిగిలివుండగా సహోదరులు ఏమి చేయగలరు? టిబిలిసి వెలుపల 40 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయదారుల సమాజం ఉండే మర్నౌలీ పట్టణానికి వెళ్లడమనే ఒకే ప్రత్యామ్నాయం వారి ముందు మిగిలింది. గతంలో, యెహోవాసాక్షులైన ఒక కుటుంబపువారి స్థలంలో ఎన్నో సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఆ స్థలంలో ఒకప్పుడు పెద్ద తోట ఉండేది. గత పది సంవత్సరాలుగా టిబిలిసిలోని సంఘాలు సమావేశాలను జరుపుకోవడానికి ఉపయోగించుకోగలిగిన ఏకైక స్థలం అది మాత్రమే. అయితే, యెహోవాసాక్షులు మర్నౌలీ పట్టణంలో అల్లరిమూకల భయంకరమైన దాడులను కూడా ఎదుర్కొన్నారు.
అలాంటి ఒక సంఘటన 2000, సెప్టెంబరు 16న జరిగింది. సాక్షులు సమావేశ స్థలానికి చేరకుండా చేయడానికి మర్నౌలీ నగర పోలీసులు రోడ్డుమీద అడ్డంకులు పెట్టారు. ఆ తర్వాత పదవీచ్యుతుడైన వసీలీ మకాలావిష్వీలీ అనే ఆర్థొడాక్స్ ప్రీస్టు నేతృత్వంలో బస్సులనిండా గూండాలు వచ్చారు. మర్నౌలీ సమావేశానికి వెళ్తున్న కార్లను, బస్సులను ఆపి, వాహనాల నుండి ప్రతినిధులను బయటికి ఈడ్చి, నిర్దాక్షిణ్యంగా వారిని కొట్టారు, ఇతర ప్రయాణీకుల బైబిళ్లు, బైబిలు సాహిత్యాలతోపాటు వస్తువులను కూడా దోచుకున్నారు.
మర్నౌలీ సమావేశ స్థలంమీద కూడా దాదాపు 60 మందివున్న అల్లరిమూక దాడిచేసింది. దాదాపు 40 మంది సాక్షులు గాయపడ్డారు. ఒక సహోదరుణ్ణి ఛాతిమీద కత్తితో పొడిచారు. దాడిచేసినవారిలో కొంతమంది చిన్న తుపాకులను పట్టుకొని వచ్చి కోపంగా గాల్లో కాల్పులు జరిపారు. వారిలో ఒకరు ఆ స్థలం యజమానురాలిమీద తుపాకి గురిపెట్టి డబ్బు, నగలు ఇవ్వమని బెదిరించారు. సమావేశ స్థలానికి ఒకప్రక్కనున్న ఆమె ఇంటిని ఆ అల్లరిమూక నాశనం చేసి విలువైన వస్తువులను దొంగలించింది. ఆ ఇంటి కిటికీలన్నింటినీ పగులగొట్టిన తర్వాత వారు బైబిలు సాహిత్యాన్ని, సమావేశం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బెంచీలను తగులబెట్టారు. ఒకటిన్నర టన్నుల సాహిత్యాన్ని వారు నాశనం చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు, జరుగుతున్న నేరాన్ని ఆపే బదులు సాక్షులపై దౌర్జన్యం చేయడంలో ఆ అల్లరిమూకతో చేతులు కలిపారు. *
హింసా బెదిరింపులేకాక, సాధారణంగా 2,500 మంది
పట్టే స్థలంలో 5,000 మందిని ఎలా కూర్చోబెట్టాలనే సవాల్ని కూడా సమావేశ కమిటీ ఎదుర్కొంది. అంత తక్కువ వ్యవధిలో ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు? ప్రక్కనున్న స్థలాల యజమానులు సహోదరుల దగ్గరికి వచ్చి తమ తోట స్థలాలను అద్దెకు ఇస్తామని చెప్పినప్పుడు అది ఒక అద్భుతంగానే అనిపించింది.ఆ స్థలాలను సమావేశానికి అనువైనవిగా మార్చడం అంత సులభమైన పనేంకాదు. వాతావరణం, పరిస్థితిని మరింత కష్టతరం చేసింది. సమావేశానికి ముందు, వారమంతా వర్షాలు కురిశాయి. పొరుగువారి పొలాల్లో బంగాళాదుంపల మొక్కలు నాటబడ్డాయి కాబట్టి వాటి కోతపని జరగాలి. మొదటిగా, స్వచ్ఛంద సేవకులు మట్టిని త్రొవ్వి ఆ బంగాళాదుంపను బయటికి తీయడానికి వర్షంలో సమకూడారు. ఆ తర్వాత కంచెలను తొలగించి, ప్రేక్షకులకు ఎండ నుండి, వర్షం నుండి రక్షణ కల్పించే పైకప్పులను ఏర్పాటుచేసేందుకు ఫ్రేములను పాతారు. మరిన్ని చెక్క బెంచీలను తయారుచేయాల్సిన అవసరం ఏర్పడింది, అంతేకాక మరికొన్ని సౌండ్ పరికరాలను అమర్చారు. స్వచ్ఛంద సేవకులు వడ్రంగి పనులన్నింటినీ రాత్రనక పగలనక చేశారు, కొందరు నిద్ర కూడా మానుకున్నారు.
“సమావేశం జరుగుతున్నప్పుడు కూడా వర్షం కురిస్తే అప్పుడేమిటి? ప్రతినిధులు బురదమయంగా ఉన్న పొలంలో కూరుకుపోతారా” అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. బురదగా ఉన్న నేలను కప్పేయడానికి ఎండు గడ్డిని కొన్నారు. చివరకు, ఎండ వచ్చింది! సమావేశం జరిగిన మూడు రోజులూ సమావేశ స్థలంలో ఎండ బాగా కాసింది.
ప్రతినిధులు సమావేశానికి వచ్చినప్పుడు ఎంతో రమణీయమైన ప్రకృతి దృశ్యం వారికి కనిపించింది. ప్రశాంతమైన ఆ పల్లె వాతావరణం నూతనలోకపు పూర్వఛాయలా అనిపించింది. సౌకర్యవంతంగా కూర్చున్న ప్రతినిధుల చుట్టూ అంజూరపు చెట్లు, ఇతర పండ్ల చెట్లు, జొన్న, టమాటా పొలాలు ఉన్నాయి. స్టేజీ వెనుక భాగం ద్రాక్షతోటలతో అలంకరించబడింది. కార్యక్రమం మధ్యలో కోడికూతలు, గుడ్లను సేకరిస్తున్నప్పుడు కోడిపెట్టలు చేసే శబ్దాలు సభికులకు అప్పుడప్పుడు వినిపించాయి. పల్లెప్రాంతంలో సాధారణంగా ఉండే ఇతర శబ్దాలు కూడా వినిపించాయి, అయితే హాజరైనవారు వాటిని ఉల్లాసపరిచే గీతాలుగానే పరిగణించారు. సభికులు చక్కని బైబిలు ఆధారిత కార్యక్రమాన్ని శ్రద్ధగా వినాలనుకున్నారు కాబట్టి ఆ శబ్దాలనుబట్టి ఏకాగ్రత కోల్పోయే బదులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, సమావేశానికి సంబంధించిన మరపురాని క్షణాలు ఇవి మాత్రమే కాదు.
రెండవ “అద్భుతం”
శుక్రవారపు ఉదయకాల కార్యక్రమం ముగింపులో, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడు జెఫ్రీ జాక్సన్ పూర్తి పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదమును జార్జియన్ భాషలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. * ఆశ్చర్యపోయిన అనేకమంది కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక కుటుంబం ఉత్సాహంగా ఇలా చెప్పింది: “యెహోవా ఈ అద్భుతం చేసినందుకు మా కృతజ్ఞతను తెలియజేయకుండా ఉండలేకపోతున్నాం. అంతటి అసాధారణమైన పని అతి కొద్ది కాలంలోనే పూర్తికావడం అద్భుతమే!”
టెలిఫోను ద్వారా కార్యక్రమాన్ని విన్న టాలెంజీహా పట్టణానికి చెందిన ఒక సహోదరి ఇలా అంది: “మాకు పూర్తి బైబిలు లభించినప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అసాధారణమైన ఈ మూడు రోజుల సమావేశం ఏర్పాటు చేసినందుకు నేను మీకు కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాను. అది నిజంగా ఒక చరిత్రాత్మక సంఘటనే.” పశ్చిమ జార్జియాలో, నల్లసముద్ర తీరానున్న సంఘానికి చెందిన ఒక కుటుంబం ఇలా అంది: “ఇప్పటివరకు మా కుటుంబానికి ఒకే బైబిలు ఉండేది, కానీ ఇప్పుడు మా నలుగురికీ నూతనలోక అనువాదము బైబిలు ఉంది. ఇప్పుడు మేమందరం వ్యక్తిగతంగా బైబిలును అధ్యయనం చేయవచ్చు.”
అయితే తెరవెనుక అన్నీ సవ్యంగా ఏమీ జరగలేదు. ఉదాహరణకు, పూర్తి నూతనలోక అనువాదము ముద్రించబడి, సకాలంలో సమావేశం కోసం జార్జియాకు పంపించబడినా, కస్టమ్స్ అధికారులు ఆ బైబిళ్లు సరిహద్దు దాటడానికి అనుమతించలేదు. సహోదరులు ఓమ్‌బడ్స్‌మన్ అధికారి (అధికారుల అవినీతి చర్యలమీద వచ్చే ఫిర్యాదులను పరిశోధించే అధికారి) కార్యాలయానికి అప్పీలు చేశారు. ఆ అధికారి, సరిగ్గా జిల్లా సమావేశం ప్రారంభమయ్యేనాటికి బైబిళ్లను విడిపించగలిగాడు. అంతేగాక, ఆయన తమ కార్యాలయం కోసం క్రొత్త బైబిళ్ల కాపీలను సంపాదించడానికి తన అసిస్టెంటును మర్నౌలీ సమావేశానికి పంపించాడు.
జార్జియన్ పద్ధతిలో హృదయపూర్వక స్వాగతం
మర్నౌలీ జిల్లా సమావేశం యెహోవాసాక్షులకు ప్రాముఖ్యమైన సందర్భం అవడానికి మరో కారణం కూడా ఉంది. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడు కార్యక్రమ భాగాల్లో పాల్గొన్నాడు. హాజరైనవారు ఎంతగా పులకించిపోయారంటే వారు ఆయనకు వ్యక్తిగతంగా సాంప్రదాయబద్ధమైన రీతిలో హృదయపూర్వక స్వాగతం తెలపాలని కోరుకున్నారు. సహోదరుడు జాక్సన్ సమావేశానికి ముందు, సమావేశం జరుగుతున్నప్పుడు, దాని తర్వాత గంటలకొద్దీ నిలబడి సహోదర సహోదరీలను పలకరించాల్సివచ్చింది, అయితే వారి కోరికను మన్నించడానికి ఆయన సంతోషించాడు.
1903లో మరో సమావేశ ముగింపులో ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “నేను పేదవాణ్ణైనా ఈ సమావేశంలో పొందిన ప్రయోజనాలకు బదులు వెయ్యి డాలర్లు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగాలేను.” ఒక శతాబ్దంకన్నా ఎక్కువకాలం తర్వాత, 2006 వేసవిలో, జార్జియా దేశంలో నిర్వహించబడిన అత్యంత ప్రాముఖ్యమైన సమావేశాలకు హాజరైన సాక్షుల భావాలు ఖచ్చితంగా అలాగే ఉన్నాయి.
[అధస్సూచీలు]
^ పేరా 10 జార్జియాలోని యెహోవాసాక్షులకు ఎదురైన హింస గురించిన మరిన్ని వివరాల కోసం తేజరిల్లు! జనవరి 22, 2002 (ఆంగ్లం) సంచికలోని 18-24 పేజీలను చూడండి.
^ పేరా 16 2004లో, జార్జియన్ భాషలో క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం) విడుదల చేయబడింది.
[19వ పేజీలోని బాక్సు]
“ఒంటరియైనవాడు” వృద్ధి చెందాడు
జార్జియాలో యెషయా 60:22లోని మాటలు నెరవేరాయి: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” కేవలం 20 సంవత్సరాల్లో, జార్జియాలో 100 కన్నా తక్కువగా ఉన్న రాజ్య ప్రచారకుల సంఖ్య నేడు దాదాపు 16,000కు చేరుకుంది. దేవుని వాక్యాన్ని ఉత్సాహంగా ప్రకటించే జార్జియాలోని ప్రచారకులు ప్రతీవారం దాదాపు 8,000 గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. జార్జియాలో మరింత ప్రగతి జరిగే అద్భుతమైన అవకాశం ఉందని అది చూపిస్తుంది.
[16వ పేజీలోని డయాగ్రామ్/మ్యాపులు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
రష్యన్ ఫెడరేషన్
జార్జియా
⇨ జుగ్డీడీ
⇨ కుటైసి
మర్నౌలీ ⇨ గోరీ
⇨ కాస్పీ
⇨ స్నోరీ
టిబిలిసి
టర్కీ
ఆర్మేనియా
అజీర్‌బైజాన్
[చిత్రసౌజన్యం]
భూగోళం: NASA/Visible Earth imagery ఆధారంగా
[16వ పేజీలోని చిత్రం]
టిబిలిసిలోని విగ్రహం
[17వ పేజీలోని చిత్రాలు]
మర్నౌలీలోని సమావేశం ఐదు ఇతర స్థలాలతో మొబైల్ ఫోన్ల ద్వారా అనుసంధానం చేయబడింది
[18వ పేజీలోని చిత్రాలు]
జార్జియన్ భాషలో పూర్తి “పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము” విడుదల చేయబడినప్పుడు ప్రతినిధులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు