కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాచీన శాస్త్రులు మరియు దేవుని వాక్యం

ప్రాచీన శాస్త్రులు మరియు దేవుని వాక్యం

ప్రాచీన శాస్త్రులు మరియు దేవుని వాక్యం

హీబ్రూ లేఖనాలు సా.శ.పూ. ఐదవ శతాబ్దాంతానికల్లా పూర్తిచేయబడ్డాయి. ఆ తర్వాతి శతాబ్దాల్లో యూదా విద్వాంసులు, ప్రత్యేకంగా సొఫరీమ్‌, ఆ తర్వాత వచ్చిన మాసొరెట్‌లు హీబ్రూ మూలపాఠాన్ని భద్రపరచడానికి చాలా జాగ్రత్తగా కృషిచేశారు. అయితే అతి ప్రాచీన బైబిలు పుస్తకాలు మోషే, యెహోషువ కాలంలో అంటే సొఫరీమ్‌ కాలానికి వెయ్యి సంవత్సరాల ముందు రాయబడ్డాయి. ఆ పుస్తకాలు త్వరగా పాడైపోయే వస్తువులమీద రాయబడ్డాయి; కాబట్టి ఆ గ్రంథపు చుట్టలు ఎన్నోసార్లు నకలు చేయబడి ఉండవచ్చు. ఆ ప్రాచీన కాలంలో శాస్త్రుల పని గురించి మనకు అందుబాటులో ఉన్న వివరాలు ఏమిటి? ప్రాచీన ఇశ్రాయేలులో నైపుణ్యవంతులైన లేఖికులు ఉన్నారా?

మృతసముద్ర గ్రంథపు చుట్టల్లోని భాగాలే నేడు మనకు అందుబాటులో ఉన్న అతిపురాతన బైబిలు రాతప్రతులు, వాటిలో కొన్ని సా.శ.పూ. రెండు, మూడు శతాబ్దాల్లో నకలు చేయబడ్డాయి. “బైబిల్లోని భాగాలకు సంబంధించిన అతి ప్రాచీన ప్రతులు మనకు అందుబాటులో లేవు” అని ప్రాచ్య భాషల, పురావస్తుశాస్త్ర విద్వాంసుడైన ప్రొఫెసర్‌ అలెన్‌ ఆర్‌. మిలార్డ్‌ వివరిస్తున్నాడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “ప్రాచీన శాస్త్రులు ఎలా పనిచేసేవారో ఇశ్రాయేలు పొరుగునున్న సంస్కృతులు తెలియజేస్తాయి, వారి పని గురించి తెలుసుకోవడంవల్ల హీబ్రూ మూలపాఠం, దాని చరిత్ర ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించగలుగుతాం.”

ప్రాచీనకాల శాస్త్రుల వృత్తి

నాలుగు వేల సంవత్సరాల క్రితం చారిత్రక, మతసంబంధ, న్యాయశాస్త్ర గ్రంథాల, విద్వాంసుల గ్రంథాల, సాహిత్య మూలపాఠాల రచన మెసొపొతమియాలో జరిగేది. శాస్త్రుల పాఠశాలలు వర్ధిల్లాయి, వారు అనేక అంశాలతోపాటు అందుబాటులో ఉన్న మూలపాఠాలను నమ్మకంగా నకలు చేయడం కూడా బోధించారు. సహస్రాబ్ది లేక అంతకన్నా ఎక్కువకాలంపాటు మళ్లీమళ్లీ నకలు చేయబడిన బబులోను మూలపాఠాల్లో ఆధునిక దిన విద్వాంసులకు అత్యల్ప మార్పులే కనిపిస్తున్నాయి.

శాస్త్రుల వృత్తి మెసొపొతమియాకు మాత్రమే పరిమితంకాలేదు. ది ఆక్స్‌ఫర్డ్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఆర్కియోలజీ ఇన్‌ ద నియర్‌ ఈస్ట్‌ ఇలా పేర్కొంటోంది: “సా.శ.పూ. రెండవ సహస్రాబ్ది మధ్యకాలంలో జీవించిన బబులోను శాస్త్రికి, మెసొపొతమియా, సిరియా, కనానుతోపాటు ఐగుప్తులోవున్న శాస్త్రుల కేంద్రాలన్నిటిలో ఉపయోగించబడిన పద్ధతులు తెలిసే ఉండవచ్చు.” *

మోషే కాలంలో శాస్త్రుల వృత్తికి చెందినవారికి ప్రత్యేక హోదా ఉండేది. శాస్త్రులు ఎల్లప్పుడూ సాహిత్య గ్రంథాలను నకలు చేసేవారు. ఐగుప్తులో నాలుగు వేలకన్నా ఎక్కువ సంవత్సరాల పురాతన సమాధుల అలంకృతుల్లో వారు చేసిన పని చిత్రీకరించబడింది. పైన ఉల్లేఖించబడిన ఎన్‌సైక్లోపీడియా ఆ తొలి కాలానికి చెందిన ప్రాచీన శాస్త్రుల గురించి ఇలా అంటోంది: “సా.శ.పూ. రెండవ సహస్రాబ్దికల్లా వారు మెసొపొతమియా, ఐగుప్తు నాగరికతలను వర్ణించిన అనేక సాహిత్య రచనలను నకలుచేసి, సేకరించి శాస్త్రుల వృత్తికి చెందినవారికి నీతి సూత్రాలను ఏర్పరిచారు.”

ఆ “నీతి సూత్రాలలో” ప్రధాన మూలపాఠం చివర్లో దాని ఉత్పాదనకు సంబంధించిన వాస్తవాలు చేర్చడం ఇమిడివుంది. ఆ వాస్తవాల్లో శాస్త్రుల పేర్లు, ఆ ఫలకం యజమాని పేరు, తేదీ, అది ఏ ప్రాథమిక మూలపాఠం నుండి నకలు చేయబడింది, వరుసల సంఖ్య మొదలైన వివరాలు ఉంటాయి. తరచూ శాస్త్రులు ఈ వాక్యాన్ని చేర్చేవారు: “ఈ గ్రంథం ప్రాథమిక మూలపాఠంతో పోల్చబడి నకలుచేయబడింది.” ప్రాచీన లేఖికులు ప్రామాణికత విషయంలో శ్రద్ధ వహించారని ఈ వివరాలు సూచిస్తున్నాయి.

మునుపు ప్రస్తావించబడిన ప్రొఫెసర్‌ మిలార్డ్‌ ఇలా పేర్కొంటున్నాడు: “నకలు చేసేందుకు శాస్త్రులు ఒక పద్ధతిని అనుసరించేవారని, దానిలో మూలపాఠంతో పోల్చడం, సరిచేయడం ఇమిడివుందని, తప్పులను నివారించేందుకు వారు నిర్దిష్ట పద్ధతులను పాటించారని గ్రహించవచ్చు. ప్రత్యేకంగా వరుసల సంఖ్యను లేక పదాల సంఖ్యను లెక్కించడం వంటి కొన్ని పద్ధతులు మధ్యయుగాల ప్రారంభంలో మాసొరెట్ల సాంప్రదాయంలో కూడా చేర్చబడ్డాయి.” కాబట్టి, మోషే, యెహోషువ కాలంలో, గ్రంథాలను జాగ్రత్తగా, ఖచ్చితంగా తర్వాతి తరాలకు అందజేయడాన్ని ప్రోత్సహించే దృక్పథం మధ్య ప్రాచ్యంలో అప్పటికే ఉంది.

ఇశ్రాయేలీయుల్లో కూడా అర్హులైన లేఖికులు ఉన్నారా? బైబిల్లోని విషయాలు ఏమి చూపిస్తున్నాయి?

ప్రాచీన ఇశ్రాయేలులో శాస్త్రులు

మోషే ఫరో కుటుంబ సభ్యునిగా పెరిగాడు. (నిర్గమకాండము 2:​10; అపొస్తలుల కార్యములు 7:​21, 22) ప్రాచీన ఐగుప్తు చరిత్రను అధ్యయనం చేసేవారి ప్రకారం, మోషే నేర్చుకున్న విద్యలో ఐగుప్తుకు సంబంధించిన లిపిపై, లేఖికుల నైపుణ్యాల్లో కనీసం కొన్నింటిపై ప్రావీణ్యత సంపాదించడం ఇమిడివుండవచ్చు. ప్రొఫెసర్‌ జేమ్స్‌ కె. హోఫ్మైయర్‌ ఇస్రాయిల్‌ ఇన్‌ ఈజిప్ట్‌ అనే తన పుస్తకంలో ఇలా పేర్కొన్నాడు: “మోషేకు సంఘటనలను నమోదుచేసే, ప్రయాణ వివరాలను సేకరించే సామర్థ్యంతోపాటు, శాస్త్రులకు సంబంధించిన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనే సామర్థ్యం కూడా ఉందని బోధించే బైబిలు సాంప్రదాయాన్ని నమ్మేందుకు కారణం ఉంది.” *

బైబిలు, ప్రాచీన ఇశ్రాయేలులో శాస్త్రుల నైపుణ్యాలు ఉన్న ఇతరుల గురించి పేర్కొంటోంది. ద కేంబ్రిడ్జ్‌ హిస్టరీ ఆఫ్‌ ద బైబిల్‌ ప్రకారం, మోషే “నిర్ణయాలను, అధికార వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలను నమోదుచేయడానికి, . . . అక్షరాస్యులైన అధికారులను నియమించాడు.” ఈ నిర్ధారణ ద్వితీయోపదేశకాండము 1:⁠15 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీద ఆధారపడివుంది, అదిలా చెబుతోంది: “మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న[వారిని] . . . మీకు నాయకులుగా నేను చేసాను. వారిలో కొందరిని 1000 మందికి నాయకులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, కొందరిని 50 మందికి నాయకులుగాను, కొందరిని 10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను వారిని మీ వంశాలకు అధికారులుగా చేసాను.” ఈ అధికారులు ఎవరు?

‘అధికారి’ అనే పదానికి ఉపయోగించబడిన హీబ్రూ పదం, మోషే, యెహోషువల కాలం గురించి పేర్కొంటున్న బైబిలు లేఖనాల్లో అనేకసార్లు కనిపిస్తుంది. ఈ పదం “నమోదు చేసే కార్యదర్శిని,” “‘రాసే’ లేక ‘నమోదుచేసే’ వ్యక్తిని,” “కార్యదర్శికి సంబంధించిన పనుల్లో న్యాయాధిపతికి సహాయం చేసే అధికారిని” సూచిస్తోందని అనేకమంది విద్వాంసులు వివరిస్తున్నారు. అలాంటి కార్యదర్శులు ఇశ్రాయేలులో చాలామంది ఉండేవారని, ప్రారంభంలో ఆ జనాంగానికి సంబంధించిన అధికార నిర్వహణలో వారు ఎన్నో ప్రాముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించేవారని ఆ హీబ్రూ పదం అనేకసార్లు కనిపించడం సూచిస్తోంది.

ఇశ్రాయేలు యాజకుల గురించిన ఉదాహరణ మూడవది. యాజకులు “మతసంబంధ, లౌకిక బాధ్యతలను నిర్వహించాలంటే వారు అక్షరాస్యులుగా ఉండాలి” అని ఎన్‌సైక్లోపీడియా జుడైకా పేర్కొంటోంది. ఉదాహరణకు, మోషే లేవీ కుమారులను ఇలా ఆజ్ఞాపించాడు: “ప్రతి యేడవ సంవత్సరాంతమున . . . ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.” యాజకులు ధర్మశాస్త్రానికి సంబంధించిన అధికారిక ప్రతిని చూసుకునేవారిగా తయారయ్యారు. వారి అనుమతితో, వారి పర్యవేక్షణలో క్రొత్త ప్రతులు రాయబడేవి.​—⁠ద్వితీయోపదేశకాండము 17:​18, 19; 31:​10, 11.

ధర్మశాస్త్రానికి సంబంధించిన మొదటి ప్రతి ఎలా తయారుచేయబడిందో పరిశీలించండి. మోషే తన జీవితపు చివరి నెలలో ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువబెట్టి వాటిమీద సున్నము పూసి . . . ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.” (ద్వితీయోపదేశకాండము 27:​1-4) యెరికో, హాయి నాశనమైన తర్వాత ఇశ్రాయేలీయులు వాగ్దానదేశం నడిబొడ్డున ఉన్న ఏబాలు కొండ దగ్గర సమకూడారు. అక్కడ యెహోషువ బలిపీఠము రాళ్లమీద ‘మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథపు ఒక ప్రతిని’ రాయించాడు. (యెహోషువ 8:​30-32) అలా రాయించాలంటే రాసేవారు, చదివేవారు ఉండాలి. తమ పవిత్ర మూలపాఠాల సమగ్రతను భద్రపరచుకోవడానికి కావాల్సిన భాషా పరిజ్ఞానం, నైపుణ్యం తొలి ఇశ్రాయేలీయులకు ఉన్నాయని అది సూచిస్తోంది.

లేఖనాల సమగ్రత

మోషే, యెహోషువల కాలం తర్వాత, అనేక ఇతర హీబ్రూ బైబిలు గ్రంథపు చుట్టలు రాయబడి, వాటి ప్రతులు చేతితో నకలు చేయబడ్డాయి. ఈ ప్రతులు పనికిరాకుండా పోయిన తర్వాత లేదా తేమ లేక బూజువల్ల పాడైనప్పుడు, వాటి స్థానంలో క్రొత్తవాటిని చేర్చాల్సివచ్చింది. అలా నకలు చేసే ప్రక్రియ చాలా శతాబ్దాలవరకు కొనసాగింది.

బైబిలు లేఖికులు జాగ్రత్త వహించినా కొన్ని తప్పులు దొర్లాయి. అయితే లేఖికుల తప్పులు బైబిలు మూలపాఠాన్ని గణనీయంగా మార్చాయా? లేదు. స్థూలంగా చెప్పాలంటే, ఈ తప్పులు అల్పమైనవని, బైబిలు మూలపాఠానికి సంబంధించిన సమగ్రతను అవి మార్చలేదని ప్రాచీన రాతప్రతుల విశ్లేషణలో తేలింది.

క్రైస్తవుల విషయానికొస్తే, తొలి బైబిలు పుస్తకాల విషయంలో యేసుక్రీస్తు దృక్పథం పరిశుద్ధ లేఖనాల మూలపాఠానికి సంబంధించిన సమగ్రతను రుజువుచేస్తుంది. “మోషే గ్రంథం[లో] . . . మీరు చదువలేదా?” “మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా?” వంటి మాటలు, తాను భూమ్మీద ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న రాతప్రతులు నమ్మదగినవని యేసు పరిగణించినట్లు చూపిస్తోంది. (మార్కు 12:​26; యోహాను 7:​19) అంతేకాక, యేసు హీబ్రూ లేఖనాలన్నిటి సమగ్రతను ఇలా చెప్పడం ద్వారా ధృవీకరించాడు: “మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెను.”​—⁠లూకా 24:​44.

కాబట్టి, పరిశుద్ధ లేఖనాలు పూర్వకాలం నుండి తర్వాతి తరాలవారికి ఖచ్చితంగా అందజేయబడిందని నమ్మడానికి మనకు కారణాలు ఉన్నాయి. అది ప్రేరేపిత ప్రవక్తయైన యెషయా పేర్కొన్నట్లే ఉంది: “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”​—⁠యెషయా 40:⁠8.

[అధస్సూచీలు]

^ పేరా 6 సా.శ.పూ. రెండవ సహస్రాబ్ది మధ్యకాలంలో జీవించిన యెహోషువ, కిర్యత్సేఫెరు అనే పట్టణం గురించి ప్రస్తావిస్తున్నాడు, ఆ పేరుకు “పుస్తక నగరం” లేదా “శాస్త్రుల పురం” అని అర్థం.​—⁠యెహోషువ 15:​15, 16.

^ పేరా 12 చట్టానికి సంబంధించిన విషయాలను మోషే నమోదు చేశాడని నిర్గమకాండము 24:​4, 7; 34:​27, 28; ద్వితీయోపదేశకాండము 31:​24-26 వచనాల్లో చూడవచ్చు. ఆయన ఒక పాటను నమోదు చేశాడని ద్వితీయోపదేశకాండము 31:⁠22 చెబుతోంది, అరణ్యంలో అనుసరించిన ప్రయాణ వివరాలను ఆయన నమోదు చేశాడని సంఖ్యాకాండము 33:⁠2 సూచిస్తోంది.

[18వ పేజీలోని చిత్రం]

పనిలో నిమగ్నమైవున్న ఐగుప్తు శాస్త్రి

[19వ పేజీలోని చిత్రం]

బైబిల్లోని అతి ప్రాచీన పుస్తకాలు మోషే కాలానికి చెందినవి