విశ్వాసం, దైవభయం మూలంగా ధైర్యంగా ఉండడం
విశ్వాసం, దైవభయం మూలంగా ధైర్యంగా ఉండడం
“నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము . . . నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.”—యెహోషువ 1:9.
ఇశ్రాయేలు జనాంగం సా.శ.పూ. 1473లో వాగ్దానదేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగావుంది. రాబోయే కష్టాల గురించి మోషే ఆ ప్రజలకిలా గుర్తుచేశాడు: “నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు . . . అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అనుమాట నీవు వింటివి గదా.” (ద్వితీయోపదేశకాండము 9:1, 2) అవును, వారు భారీకాయులైన యుద్ధశూరులుగా పేరుగాంచారు! అంతేకాక, కనానీయుల కొన్నిగుంపులకు గుర్రాలు, చక్రాలకు ఇనుప కత్తులు బిగించిన రథాలతో సర్వసన్నద్ధమైన సైన్యాలు ఉన్నాయి.—న్యాయాధిపతులు 4:12.
2 కానీ ఇశ్రాయేలీయులు బానిస జనాంగంగా ఉండడమే కాక, ఇప్పటివరకు 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపారు. కాబట్టి, మానవ దృక్కోణం నుండి చూస్తే, వారు గెలిచే అవకాశాలు తక్కువే. అయినా, మోషేకు విశ్వాసముంది; యెహోవా వారిని నడిపించడాన్ని ఆయన ‘చూశాడు.’ (హెబ్రీయులు 11:27) ‘నీ దేవుడైన యెహోవా నీ ముందర దాటిపోవుచున్నాడు. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును’ అని మోషే ఆ ప్రజలకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 9:3; కీర్తన 33:16, 17) మోషే మరణించిన తర్వాత, యెహోవా తన మద్దతు కొనసాగుతుందని హామీయిస్తూ యెహోషువకు ఇలా చెప్పాడు: “నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును.”—యెహోషువ 1:2, 5.
3 యెహోవా మద్దతు, నిర్దేశం పొందేందుకు యెహోషువ దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి, ధ్యానిస్తూ దానికనుగుణంగా జీవించాలి. అప్పుడు “నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును” అని యెహోవా చెప్పాడు. (యెహోషువ 1:8, 9) యెహోషువ దేవుని మాట విన్నాడు కాబట్టే, ఆయన ధైర్యవంతునిగా, శక్తిమంతునిగా, విజయసారథిగా నిరూపించబడ్డాడు. అయితే ఆయన తరమువారిలో చాలామంది దేవుని మాట వినలేదు. ఫలితంగా, వారు కృతార్థులుకాలేక అరణ్యంలో మరణించారు.
ధైర్యంలేని, విశ్వాసరహిత ప్రజలు
4 నలభై సంవత్సరాల పూర్వం ఇశ్రాయేలీయులు మొదటిసారిగా కనానీయులను సమీపించినప్పుడు, ఆ దేశాన్ని వేగు చూసేందుకు మోషే 12 మంది వేగులవారిని పంపించాడు. పదిమంది భయకంపితులై తిరిగివచ్చారు. “మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి” అని వాపోయారు. అనాకీయులు మాత్రమే కాక “జనులందరు” భారీకాయులుగా ఉన్నారా? లేదు. అనాకీయులు జలప్రళయానికి పూర్వమున్న నెఫీలీయుల వంశస్థులా? ఎంతమాత్రం కాదు! అయితే, విషయాన్ని గోరంతలు కొండతలు చేసి చెప్పినందువల్ల పాళెమంతా భయం అలుముకుంది. ప్రజలు తాము బానిసలుగావున్న దేశమైన ఐగుప్తుకు తిరిగివెళ్దామని కూడా పట్టుబట్టారు.—సంఖ్యాకాండము 13:31-14:4.
సంఖ్యాకాండము 14:9) యెహోషువ, కాలేబులు ఎలాంటి ఆధారం లేకుండానే ఆశావహ భావంతో ఉన్నారా? ఎంతమాత్రం కాదు. మిగతా జనాంగంతోపాటు వారు యెహోవా పదితెగుళ్లతో బలమైన ఐగుప్తును, దాని దేవతలను అణచివేయడం చూశారు. ఆ తర్వాత వారు యెహోవా ఫరోను అతని సైనిక దళాల్ని ఎర్రసముద్రంలో ముంచివేయడాన్ని చూశారు. (కీర్తన 136:15) కాబట్టి, ఆ పదిమంది వేగులవారు, వారి ప్రభావానికి లోనైనవారు ప్రదర్శించిన భయం క్షమార్హమైనది కాదు. యెహోవా ఎంతో బాధతో, “ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు?” అని అన్నాడు.—సంఖ్యాకాండము 14:11.
5 కానీ యెహోషువ, కాలేబు అనే ఇద్దరు వేగులవారు మాత్రం వాగ్దానదేశంలోకి ప్రవేశించేందుకు ఉత్సుకతను ప్రదర్శించారు. కనానీయులు “మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడి” అని వారన్నారు. (6 సమస్యకున్న అసలు కారణమేమిటో యెహోవా చెబుతున్నాడు—ఆ ప్రజల పిరికి స్వభావం వారి విశ్వాసరాహిత్యాన్ని వెల్లడిచేసింది. అవును విశ్వాసానికీ, ధైర్యానికీ దగ్గర సంబంధముంది, అది ఎంత సన్నిహితమంటే అపొస్తలుడైన యోహాను క్రైస్తవ సంఘం గురించి, దాని ఆధ్యాత్మిక యుద్ధం గురించి ఇలా వ్రాయగలిగాడు: “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.” (1 యోహాను 5:4) యెహోషువ, కాలేబులు ప్రదర్శించినలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించడంవల్ల, నేడు వృద్ధులు, యౌవనులు, బలిష్ఠులు, బలహీనులు అనే తేడా లేకుండా అరవైలక్షలమంది యెహోవాసాక్షులు రాజ్య సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు. బలమైన, ధైర్యవంతమైన ఈ సైన్యాన్ని ఏ విరోధీ నిరోధించలేకపోయాడు.—రోమీయులు 8:31.
‘వెనుదీయకండి’
7 నేడు యెహోవా సేవకులు ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకంటే వారికి కూడా అపొస్తలుడైన పౌలుకున్నలాంటి మనస్తత్వమే ఉంది, ఆయనిలా వ్రాశాడు: “మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.” (హెబ్రీయులు 10:39) పౌలు ప్రస్తావించిన ‘వెనుకతీయడం’ అని అనువదించబడిన గ్రీకు పదానికి తాత్కాలిక భయంవల్ల వెనుకతీయడమని అర్థంకాదు, దేవుని నమ్మకమైన సేవకులలో చాలామందిని కొన్నిసార్లు అలాంటి భయం ఆవహించింది. (1 సమూయేలు 21:12; 1 రాజులు 19:1-4) బదులుగా ఆ పదానికి, “సత్యానికి అంటిపెట్టుకొని ఉండడాన్ని నిర్లక్ష్యం చేయడం” అనే అర్థముందని ఒక బైబిలు నిఘంటువు వివరిస్తోంది. దేవుని సేవకు సంబంధించి ‘వెనుదీయడం’ అనే పదం “ఓడ వేగాన్ని తగ్గించేందుకు దాని తెరచాపను క్రిందికి దించడం” అనే రూపకాలంకారంపై ఆధారపడి ఉండవచ్చని కూడా అది చెబుతోంది. అయితే హింస, అనారోగ్యం లేదా మరితర పరీక్షల్లాంటి కష్టాలు ఎదురైనప్పుడు బలమైన విశ్వాసం గలవారు వెనక్కి ‘తగ్గాలనే’ ఆలోచనే చేయరు. బదులుగా, యెహోవాకు తమ పరిమితులు తెలుసనీ, ఆయనకు తమపట్ల ప్రగాఢమైన శ్రద్ధవుందని తెలిసిన వారు ఆయన సేవలో ముందుకు సాగిపోతారు. (కీర్తన 55:22; 103:14) మీకు అలాంటి విశ్వాసముందా?
8 ఒక సందర్భంలో అపొస్తలులు తమలో విశ్వాసం లోపించిందని భావించి “మా విశ్వాసము వృద్ధిపొందించుము” అని యేసును అడిగారు. (లూకా 17:5) వారి యథార్థ విన్నపానికి, ప్రాముఖ్యంగా సా.శ. 33 పెంతెకొస్తుదినాన, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ శిష్యులపై కుమ్మరించబడి వారికి దేవుని వాక్యానికి, సంకల్పానికి సంబంధించిన లోతైన అంతర్దృష్టి ఇవ్వబడినప్పుడు జవాబు దొరికింది. (యోహాను 14:26; అపొస్తలుల కార్యములు 2:1-4) విశ్వాసం బలపడిన ఆ శిష్యులు హింస ఎదురైనా ప్రకటనాపనిని ఆరంభించి “ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి” సువార్తను ప్రకటించారు.—కొలొస్సయులు 1:23; అపొస్తలుల కార్యములు 1:8; 28:22.
9 పరిచర్యలో ముందుకు సాగిపోయేలా మన విశ్వాసం బలపడేందుకు మనం కూడా లేఖనాల్ని అధ్యయనం చేసి ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. యెహోషువ, కాలేబు, తొలి శతాబ్దపు క్రైస్తవ శిష్యుల్లాగే దేవుని సత్యాన్ని మన మనసులపై, హృదయాలపై బలంగా ముద్రించుకున్నప్పుడే, మనం ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేస్తూ విజయభేరి మ్రోగించడానికి అవసరమైన ధైర్యాన్ని ఇవ్వగల విశ్వాసం మనకు లభిస్తుంది.—రోమీయులు 10:17.
విశ్వాసమంటే వట్టి నమ్మకమే కాదు
10 ప్రాచీనకాల యథార్థపరులు కనబరచినట్లుగా, ధైర్యానికీ, సహనానికీ నడిపించే విశ్వాసంలో దేవునిపై నమ్మకంకన్నా ఇంకా ఎక్కువే ఇమిడివుంది. (యాకోబు 2:19) దానికి మనం యెహోవాను ఒక వ్యక్తిగా తెలుసుకొని ఆయనపై ప్రగాఢ విశ్వాసముంచాలి. (కీర్తన 78:5-8; సామెతలు 3:5, 6) అంటే దేవుని నియమాలకు, సూత్రాలకు చెవియొగ్గడం మనకెంతో ప్రయోజనకరమని మనస్ఫూర్తిగా నమ్మాలి. (యెషయా 48:17, 18) విశ్వాసంలో, యెహోవా తన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని, “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” పూర్తి నిశ్చయతతో ఉండడం కూడా ఇమిడివున్నాయి.—హెబ్రీయులు 11:1, 6; యెషయా 55:11.
11 అలాంటి విశ్వాసం ప్రగాఢమౌతుంది. మన జీవితాల్లో సత్యాన్ని అన్వయించుకుంటూ, ప్రయోజనాల్ని ‘రుచిచూస్తూ,’ మన ప్రార్థనలకు లభించే జవాబులను ‘చూస్తూ,’ మరితర రీతుల్లో యెహోవా మన జీవితాలకు ఇస్తున్న నిర్దేశాన్ని గమనిస్తుండగా అది పెరుగుతుంది. (కీర్తన 34:8; 1 యోహాను 5:14, 15) యెహోషువ కాలేబులు దేవుని మంచితనాన్ని రుచి చూసినప్పుడు వారి విశ్వాసం బలపడిందని మనం నమ్మవచ్చు. (యెహోషువ 23:14) ఈ విషయాలను పరిశీలించండి: దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ప్రాణాలతో బయటపడ్డారు. (సంఖ్యాకాండము 14:27-30; 32:11, 12) కనానుపై విజయం సాధించిన ఆరు సంవత్సరాల్లో వారికి క్రియాశీలక పాత్ర అప్పగించబడింది. చివరగా, వారు చక్కని ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ఆస్వాదించడమే కాక, వ్యక్తిగత స్వాస్థ్యాన్ని కూడా పొందారు. యెహోవా తనను విశ్వాసపాత్రంగా, ధైర్యంగా సేవించేవారిని ఎంతగా ఆశీర్వదిస్తాడో కదా!—యెహోషువ 14:6, 9-14; 19:49, 50; 24:29.
12 యెహోషువ, కాలేబులపట్ల దేవుడు చూపించిన కృప కీర్తనకర్త పలికిన ఈ మాటల్ని గుర్తుచేస్తాయి: “నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు.” (కీర్తన 138:2) యెహోవా తాను చేసిన వాగ్దానం గురించి హామీ ఇవ్వడానికి తన పేరును ఉపయోగించినప్పుడు, ఆ వాగ్దాన నెరవేర్పు ‘గొప్పచేయబడుతుంది’ అంటే అది ఊహించిన దానికన్నా మరెంతో విస్తృతస్థాయిలో ఉంటుందని అర్థం. (ఎఫెసీయులు 3:20) అవును, “యెహోవానుబట్టి సంతోషించు”వారిని ఆయనెప్పుడూ నిరాశపర్చడు.—కీర్తన 37:3, 4.
“దేవునికి ఇష్టుడైన” వ్యక్తి
13 క్రైస్తవకాలాలకు పూర్వం జీవించిన మరోవ్యక్తి అంటే హనోకు ఉదాహరణను పరిశీలించడం ద్వారా విశ్వాసం, ధైర్యం గురించి మనమెంతో నేర్చుకోవచ్చు. తాను ప్రవచించడం ఆరంభించకముందే తన విశ్వాసం, ధైర్యం పరీక్షించబడతాయని హనోకుకు తెలుసు. ఎలా? ఎలాగంటే, దేవుని సేవించేవారికి, అపవాదియగు సాతానును సేవించేవారికి మధ్య శతృత్వం లేదా ద్వేషం ఉంటుందని యెహోవా ఏదెనులో చెప్పాడు. (ఆదికాండము 3:15) మానవ చరిత్రారంభంలో కయీను తన తమ్ముడైన హేబెలును హతమార్చినప్పుడు ఆ ద్వేషం మొదలైందని కూడా హనోకుకు తెలుసు. నిజానికి, వారి తండ్రియైన ఆదాము హనోకు పుట్టిన తర్వాత దాదాపు 310 సంవత్సరాలు బ్రతికాడు.—ఆదికాండము 5:3-18.
14 అయితే ఈ పరిస్థితులున్నా, హనోకు ధైర్యంగా “దేవునితో నడుచుచు,” యెహోవాకు విరోధంగా ప్రజలు మాట్లాడిన “కఠినమైన మాటలన్నిటిని” ఖండించాడు. (ఆదికాండము 5:22; యూదా 14, 15) సత్యారాధనపట్ల ఇలా ధైర్యంగా నిలబడిన కారణంగా హనోకుకు అనేకమంది శత్రువులు తయారవగా ఆయన ప్రాణం ప్రమాదంలో పడింది. ఈ ప్రత్యేక పరిస్థితిలో యెహోవా తన ప్రవక్తను మరణపాశముల నుండి తప్పించాడు. ఆయన “దేవునికి ఇష్టుడైయుండెనని” హనోకుకు వెల్లడిచేసిన తర్వాత బహుశా యెహోవా ప్రవచనార్థక గాఢనిద్రలో ఆయనను మరణమునకు ‘కొనిపోయాడు.’—హెబ్రీయులు 11:5, 13; ఆదికాండము 5:24.
15 హనోకు కొనిపోబడడాన్ని ప్రస్తావించిన వెంటనే పౌలు మళ్లీ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ఇలా అన్నాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీయులు 11:6) అవును, విశ్వాసం కలిగివుండడమే యెహోవాతో నడుస్తూ, భక్తిహీన లోకానికి ఆయన తీర్పు సందేశాన్ని ప్రకటించే ధైర్యాన్ని హనోకుకు ఇచ్చింది. ఈ విషయంలో హనోకు మనకోసం చక్కని మాదిరినుంచాడు. సత్యారాధనను వ్యతిరేకిస్తూ, అన్ని విధాలైన చెడుతనంతో నిండివున్న లోకంలో మనం కూడా ఆయనలాగే పనిచేయాలి.—కీర్తన 92:7; మత్తయి 24:14; ప్రకటన 12:17.
దైవభయం నుండి ఉద్భవించే ధైర్యం
16 విశ్వాసమే కాక, మరో లక్షణం కూడా ధైర్యానికి దోహదపడుతుంది, అదే దేవునిపట్ల భక్తిపూర్వక భయం. ఏలీయా ప్రవక్త, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన 1 రాజులు 16:30-33; 18:19.
రాజైన అహాబు కాలంలో నివసించిన దైవభయంగల ఒక వ్యక్తి ఉదాహరణను మనం పరిశీలిద్దాం. అహాబు పరిపాలనలో బయలు ఆరాధన అసాధారణ రీతిలో ఉత్తర రాజ్యాన్నంతటినీ భ్రష్టుపట్టించింది. నిజానికి, 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది దేవతాస్తంభాల ప్రవక్తలను అహాబు భార్యయైన ‘యెజెబెలు పోషించింది.’—17 యెహోవాకు క్రూర శత్రువైన యెజెబెలు ఆ దేశం నుండి సత్యారాధనను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె యెహోవా ప్రవక్తల్లో కొందరిని చంపడమే కాక, ఏలీయాను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించగా ఆయన దేవుని నిర్దేశం మేరకు యొర్దానువైపు పారిపోయి తప్పించుకున్నాడు. (1 రాజులు 17:1-3; 18:13) ఆ కాలంలో ఉత్తర రాజ్యంలో సత్యారాధనను సమర్థించడం ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఊహించగలరా? మీరొకవేళ రాజసౌధంలోనే పనిచేస్తుంటే అది మరింత కష్టంగా ఉండదా? అహాబు గృహ నిర్వాహకుడైన దైవభయంగల ఓబద్యా * అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నాడు.—1 రాజులు 18:3.
18 ఓబద్యా యెహోవాను ఆరాధించే విషయంలో నిస్సందేహంగా అప్రమత్తంగా, వివేచనయుక్తంగా ఉన్నాడు. అయినా ఆయన రాజీపడలేదు. నిజానికి, 1 రాజులు 18:3 మనకిలా చెబుతోంది: “ఓబద్యా యెహోవాయందు బహు భయభక్తులుగలవాడై” ఉన్నాడు. అవును, దేవునిపట్ల ఓబద్యాకున్న భయం అసాధారణం! ఆరోగ్యదాయకమైన ఈ భయం ఆయనకు అసాధారణ ధైర్యాన్నిచ్చింది. యెజెబెలు యెహోవా ప్రవక్తల్ని హతమార్చిన వెనువెంటనే ఇది ప్రదర్శించబడింది.
19 మనమిలా చదువుతాం: “యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా [ఓబద్యా] గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.” (1 రాజులు 18:4) వందమందిని రహస్యంగా పోషించడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని మీరు ఊహించవచ్చు. ఓబద్యా అహాబు, యెజెబెలు కంట పడకుండా ఉండడమే కాక, తరచూ రాజసౌధానికి వచ్చే 850 మంది ప్రవక్తలు కనిపెట్టడాన్ని కూడా తప్పించుకోవాలి. అంతేకాక, ఆ దేశంలోని అనేక ఇతర వర్గాల అబద్ధారాధకులు రాజురాణీల అనుగ్రహం సంపాదించుకునేందుకు, ఓబద్యా రహస్యాన్ని వెల్లడిచేయగల ఏ అవకాశాన్నీ జారవిడుచుకొని ఉండకపోవచ్చు. అయినాసరే, ఈ అబద్ధారాధకులందరి కళ్లుగప్పి ఓబద్యా ధైర్యంగా యెహోవా ప్రవక్తల్ని పోషించాడు. దేవుని భయమెంత శక్తివంతంగా ఉండగలదో కదా!
20 దైవభయం మూలంగా ఓబద్యా తన ధైర్యాన్ని ప్రదర్శించిన కారణంగా, యెహోవా ఆయనను తన శత్రువులనుండి కాపాడాడు. సామెతలు 29:25 ఇలా చెబుతోంది: “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.” ఓబద్యా మానవాతీత వ్యక్తేమీ కాదు; మనలాగే పట్టుబడి చంపబడతాననే భయం ఆయనకూ ఉంది. (1 రాజులు 18:7-9, 12) అయినప్పటికీ, దైవభయం మనుష్యుల భయాన్ని పూర్తిగా అధిగమించే ధైర్యాన్ని ఆయనకిచ్చింది. ఓబద్యా మనందరికీ, ప్రత్యేకంగా తమ స్వేచ్ఛను లేదా తమ ప్రాణాల్ని సహితం పణంగాపెట్టి యెహోవాను ఆరాధించేవారికి చక్కని మాదిరిగా ఉన్నాడు. (మత్తయి 24:9) అవును, మనమందరం “భయభక్తులతో” యెహోవాను ఆరాధించేలా కృషి చేయుదము గాక!—హెబ్రీయులు 12:28.
21 విశ్వాసం, దైవభయం మాత్రమే ధైర్యాన్ని నింపే లక్షణాలు కాదు; ప్రేమ మరింత బలమైన శక్తిగా ఉండగలదు. “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు” అని పౌలు వ్రాశాడు. (2 తిమోతి 1:7) ఈ అపాయకరమైన అంత్యదినాల్లో యెహోవాను ధైర్యంగా సేవించేందుకు ప్రేమ మనకెలా సహాయం చేయగలదో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.—2 తిమోతి 3:1.
[అధస్సూచి]
^ పేరా 24 ఈయన ప్రవక్తయైన ఓబద్యా కాదు.
మీరు జవాబివ్వగలరా?
•యెహోషువ, కాలేబుల ధైర్యానికి ఏది దోహదపడింది?
•నిజమైన విశ్వాసంలో ఏమి ఇమిడివుంది?
•హనోకు దేవుని తీర్పు సందేశాల్ని ఎందుకు నిర్భయంగా ప్రకటించగలిగాడు?
•దైవభయం ధైర్యానికి ఎలా తోడ్పడుతుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) మానవ దృక్కోణం నుండి చూస్తే, ఇశ్రాయేలీయులు కనానీయులను గెలిచే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి? (బి) యెహోషువకు ఎలాంటి అభయమివ్వబడింది?
3. యెహోషువ విశ్వాసానికీ, ధైర్యానికీ ఏమి తోడ్పడింది?
4, 5. (ఎ) ఆ పదిమంది వేగులవారి దృక్పథంతో పోలిస్తే యెహోషువ, కాలేబులు ఎలా భిన్నంగా ఉన్నారు? (బి) ప్రజల విశ్వాసరాహిత్యం విషయంలో యెహోవా ప్రతిస్పందన ఎలావుంది?
6. విశ్వాసానికీ, ధైర్యానికీ ఎలాంటి సంబంధముంది, ఆధునిక కాలాల్లో దీనినెలా చూడవచ్చు?
7. ‘వెనుకతీయడం’ అంటే అర్థమేమిటి?
8, 9. (ఎ) యెహోవా తొలి క్రైస్తవుల విశ్వాసాన్ని ఎలా బలపర్చాడు? (బి) మన విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు మనమేమి చేయవచ్చు?
10. నిజమైన విశ్వాసంలో ఏమి ఇమిడివున్నాయి?
11. తమ విశ్వాసం, ధైర్యం కారణంగా యెహోషువ, కాలేబులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు?
12. యెహోవా ఎలా తన ‘వాక్యమును గొప్పచేస్తాడు’?
13, 14. హనోకుకు విశ్వాసం, ధైర్యం ఎందుకు అవసరమయ్యాయి?
15. నేటి యెహోవా సేవకుల కోసం హనోకు ఎలాంటి చక్కని మాదిరినుంచాడు?
16, 17. ఓబద్యా ఎవరు, ఆయన ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు?
18. ఓబద్యాను ఏది యెహోవా అసాధారణ ఆరాధకునిగా చేసింది?
19. ఏ పని చేయడం ద్వారా ఓబద్యా తన ధైర్యాన్ని ప్రదర్శించాడు?
20. దైవభయం ఓబద్యాకు ఎలా సహాయం చేసింది, ఆయన మాదిరి మీకెలా సహాయం చేస్తుంది?
21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?
[16, 17వ పేజీలోని చిత్రం]
“నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము” అని యెహోవా యెహోషువను ఆదేశించాడు
[18వ పేజీలోని చిత్రం]
ఓబద్యా దేవుని ప్రవక్తలను కాపాడి, పోషించాడు
[19వ పేజీలోని చిత్రాలు]
హనోకు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు