“యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు”
“యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు”
“యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దానిని చూశారు. ప్రభువులో దయాదాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.”—యాకోబు 5:11, ఈజీ-టు-రీడ్ వర్షన్.
ఉత్తర పోలాండ్‌లోని డాన్ట్సిగ్‌ను (ఇప్పుడు గడాన్ట్సక్) హిట్లర్ సైన్యం ఆక్రమించే సమయానికి హెరాల్ట్ ఆప్ట్ యెహోవాసాక్షిగా మారి ఒక సంవత్సరమైనా కాలేదు. అక్కడి నిజ క్రైస్తవులకు పరిస్థితులు మారిపోయి, ప్రమాదకరంగా తయారయ్యాయి. తన విశ్వాసాన్ని వదులుకుంటున్నట్లు తెలియజేసే దస్తావేజుపై సంతకం పెట్టేందుకు హెరాల్ట్‌పై ఒత్తిడి తీసుకురావడానికి రహస్య పోలీసులు ప్రయత్నించారు, కానీ ఆయన నిరాకరించాడు. హెరాల్ట్‌ను కొన్నివారాలు చెరసాలలోవుంచి ఆ తర్వాత, సాక్సెన్‌హవుసన్ సామూహిక నిర్బంధ శిబిరానికి పంపి, అక్కడ ఆయనను పదేపదే బెదిరించి, కొట్టారు. ఒక అధికారి శవదహన కొలిమి పొగగొట్టాన్ని చూపిస్తూ హెరాల్ట్‌తో ఇలా అన్నాడు: “నువ్వు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకపోతే 14 రోజుల్లోపు పైకి నీ యెహోవా దగ్గరకు పోతావు.”
2 హెరాల్ట్ బంధించబడే సమయానికి, ఆయన భార్య ఎల్జా పాలు త్రాగే పదినెలల పాపతో ఉంది. అయినా రహస్య పోలీసుల ఎల్జాను వదిలిపెట్టలేదు. ఎంతోకాలం గడవకముందే, ఆమె నుండి బిడ్డను తీసేసుకొని, ఆమెను ఆస్క్‌విట్జ్‌లో సంహరణా శిబిరానికి పంపించారు. అయినప్పటికీ, ఆమె హెరాల్ట్‌లాగే అనేక సంవత్సరాలు సజీవంగా ఉండగలిగింది. వారి సహనం గురించిన మరింత సమాచారాన్ని మీరు కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్ 15, 1980వ సంచికలో చదవవచ్చు. హెరాల్ట్ ఇలా వ్రాశాడు: “దేవునిపై విశ్వాసం కారణంగా నేను నా జీవితంలోని మొత్తం 14 సంవత్సరాలు సామూహిక నిర్బంధ శిబిరాల్లో, చెరసాలలో గడిపాను. నన్నిలా ప్రశ్నించారు: ‘ఇదంతా సహించేందుకు నీ భార్య నీకు సహాయం చేసిందా?’ అవును, ఆమె నిజంగా నాకు సహాయం చేసింది! ఆమె తన విశ్వాసం విషయంలో ఎన్నడూ రాజీపడదని నాకు మొదట్నుంచి తెలుసు, అది నాకు బలాన్నిచ్చింది. నేను రాజీపడిన కారణంగా విడుదలయ్యానని తెలుసుకోవడంకన్నా నన్ను స్ట్రెచర్‌పై శవంగా చూడడానికే ఇష్టపడుతుందని నాకు తెలుసు. . . . జర్మనీ సామూహిక నిర్బంధ శిబిరాల్లోవున్న సంవత్సరాల్లో ఆమె ఎన్నో కష్టాలు సహించింది.”
3 చాలామంది సాక్షులు చెబుతున్నట్లుగా, కీడును భరించడం అంత సులభం కాదు. అందుకే బైబిలు క్రైస్తవులందరికీ ఇలా ఉపదేశిస్తోంది: “ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.” (యాకోబు 5:10) శతాబ్దాలుగా దేవుని సేవకులు అనేకులు అకారణంగా హింసించబడ్డారు. “మేఘమువలె” ఉన్న ఈ “గొప్ప సాక్షి సమూహము” ఉంచిన మాదిరి మన క్రైస్తవ పందెములో ఓపికగా పరుగెత్తేందుకు మనల్ని ప్రోత్సహించగలదు.—హెబ్రీయులు 11:32-38; 12:1.
యాకోబు 5:11, ఈజీ-టు-రీడ్ వర్షన్) యోబు అనుభవం, యెహోవా ఆశీర్వదించే నమ్మకస్థులకు లభించే ప్రతిఫలాన్ని గురించిన పూర్వఛాయను మనకు అందిస్తోంది. అంతకన్నా ప్రాముఖ్యంగా, కష్టకాలాల్లో మనకు ప్రయోజనమిచ్చే సత్యాలను అది వెల్లడిచేస్తోంది. యోబు పుస్తకం ఈ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు మనకు సహాయం చేస్తుంది: పరీక్షించబడినప్పుడు, అందులో ఇమిడివున్న ముఖ్యమైన వివాదాంశాలను అర్థం చేసుకునేందుకు మనమెందుకు ప్రయత్నించాలి? మనం సహించేందుకు ఎలాంటి లక్షణాలు, దృక్పథాలు సహాయం చేస్తాయి? కష్టమనుభవించే తోటి క్రైస్తవులను మనమెలా బలపర్చవచ్చు?
4 బైబిలు చరిత్రలో యోబు, సహనానికి మాదిరిగా ఉన్నాడు. “కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్లను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దాన్ని [‘యెహోవా ఇచ్చిన ప్రతిఫలాన్ని,’ NW] చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి” అని యాకోబు వ్రాశాడు. (ఇమిడివున్న వివాదాంశాలను అర్థం చేసుకోవడం
5 కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆధ్యాత్మిక సమతూకాన్ని కాపాడుకునేందుకు మనం దానిలో ఇమిడివున్న వివాదాంశాలను అర్థం చేసుకోవాలి. లేనట్లైతే, వ్యక్తిగత సమస్యలు మన ఆధ్యాత్మిక దృక్కోణాన్ని మరుగుచేయవచ్చు. దేవునిపట్ల విశ్వసనీయతకు సంబంధించిన వివాదాంశం అత్యంత ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా మనం గుర్తుంచుకోవలసిన ఈ విన్నపాన్ని మన పరలోకపు తండ్రి చేస్తున్నాడు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:11) అదెంత ప్రత్యేక ఆధిక్యతో కదా! మనలో బలహీనతలు, అసంపూర్ణతలు ఉన్నప్పటికీ, మనం మన సృష్టికర్తను సంతోషపెట్టవచ్చు. యెహోవాపట్ల మనకున్న ప్రేమ పరీక్షలను, శోధనలను తట్టుకునేందుకు మనకు సహాయం చేసినప్పుడు మనమలా సంతోషపెడతాం. నిజ క్రైస్తవ ప్రేమ అన్నింటినీ సహిస్తుంది. అది శాశ్వతకాలం నిలుస్తుంది.—1 కొరింథీయులు 13:7, 8.
6 యెహోవాను నిందించే వ్యక్తి సాతాను అని యోబు పుస్తకం స్పష్టంగా చెబుతోంది. ఈ అదృశ్య శత్రువు దుష్ట స్వభావాన్ని, దేవునితో మన సంబంధాన్ని నాశనం చేయాలనే అతని కోరికను కూడా అది వెల్లడిచేస్తోంది. యోబు విషయంలో ఉదాహరించబడినట్లుగా, సాతాను ప్రాథమికంగా యెహోవా సేవకులందరికీ స్వార్థపూరిత ఉద్దేశాలున్నట్లు ఆరోపిస్తూ, దేవునిపట్ల వారికున్న ప్రేమ చల్లారగలదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు వేలాది సంవత్సరాలుగా దేవుణ్ణి నిందించాడు. సాతాను పరలోకం నుండి పడద్రోయబడినప్పుడు, పరలోకంలోని ఒక స్వరం అతణ్ణి “మన సహోదరులమీద నేరము మోపువాడు” అని వర్ణిస్తూ, అతడు “రాత్రింబగళ్లు మన దేవునియెదుట” అలాంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పింది. (ప్రకటన 12:10) మనం నమ్మకంగా సహించడం ద్వారా, అతని ఆరోపణలు నిరాధారమైనవని మనం నిరూపించవచ్చు.
7 అపవాది మనమెదుర్కొనే ఎలాంటి శ్రమనైనా ఉపయోగించుకుని యెహోవా నుండి మనల్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తాడని గుర్తుంచుకోవాలి. అతడు యేసును ఎప్పుడు శోధించాడు? యేసు చాలారోజులు ఉపవాసముండి ఆకలిగా ఉన్నప్పుడే శోధించాడు. (లూకా 4:1-3) అయితే యేసుకున్న ఆధ్యాత్మిక బలం, అపవాది శోధనలను స్థిరంగా త్రిప్పికొట్టేందుకు ఆయనకు సహాయం చేసింది. బహుశా వ్యాధి లేదా వృద్ధాప్యంవల్ల కలిగిన ఎలాంటి శారీరక బలహీనతనైనా ఆధ్యాత్మిక బలంతో ఎదుర్కోవడం ఎంత ప్రాముఖ్యమో కదా! మన “బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు” కాబట్టి మనం నిరుత్సాహానికి గురికాము.—2 కొరింథీయులు 4:16.
యోబు 16:20; 19:2) అదేవిధంగా, ఎక్కువసేపు నిలిచిఉండే కోపం ‘అపవాదికి చోటు [లేదా అవకాశాన్ని]’ ఇవ్వగలదని అపొస్తలుడైన పౌలు సూచించాడు. (ఎఫెసీయులు 4:26, 27) ఆయావ్యక్తులపై విసుగును లేక కోపాన్ని వెళ్లగ్రక్కే బదులు లేదా అన్యాయపు పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించే బదులు “న్యాయముగా తీర్పుతీర్చు” యెహోవా దేవునికి ‘తమనుతాము అప్పగించుకోవడంలో’ యేసును అనుకరించడం క్రైస్తవులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. (1 పేతురు 2:21-23) యేసు “మనస్సును” కలిగివుండడం సాతాను దాడుల నెదుర్కొనే బలమైన రక్షణగా ఉండగలదు.—1 పేతురు 4:1.
8 అంతేకాక, కృంగదీసే భావోద్రేకాలు, ఒకవ్యక్తి ఆధ్యాత్మికతను పాడుచేసే అవకాశముంది. ‘యెహోవా దీనిని ఎందుకు అనుమతిస్తున్నాడు’ అని ఒక వ్యక్తి అనుకోవచ్చు. దురుసు ప్రవర్తనకు గురైన తర్వాత ఒకవ్యక్తి, ‘ఆ సహోదరుడు నాపట్ల అంత దురుసుగా ఎలా ప్రవర్తించగలడు’ అని అడగవచ్చు. అలాంటి భావాలు మనం ముఖ్యమైన వివాదాంశాలను ప్రక్కనబెట్టి, కేవలం వ్యక్తిగత సమస్యల మీదే దృష్టినిలిపేలా చేయవచ్చు. తప్పుదారి పట్టిన తన ముగ్గురు స్నేహితులవల్ల యోబుకు కలిగిన నిరుత్సాహం, ఆయన శరీరానికి అనారోగ్యం కలిగించినంత హానిని ఆయనకు భావోద్రేకంగా కలిగించినట్లు కనిపిస్తోంది. (9 అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, మన సమస్యలు దేవుని కోపానికి ఖచ్చితమైన రుజువని మనమెన్నటికీ అనుకోకూడదు. తనను ఓదార్చడానికి వచ్చిన కపట ఆదరణకర్తలు బాధకలిగించే మాటలతో తనపై దాడిచేసినప్పుడు, యోబు ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోవడమే ఆయనను బాధపెట్టింది. (యోబు 19:21, 22) బైబిలు ఈ మాటలతో మనకు అభయమిస్తోంది: “దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు.” (యాకోబు 1:13) దానికి భిన్నంగా, యెహోవా మనమెలాంటి భారాన్నైనా మోసేందుకు సహాయం చేస్తానని, మనల్ని చుట్టుముట్టే ఎలాంటి శోధననైనా తప్పించుకునే ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 55:22; 1 కొరింథీయులు 10:13) కష్ట సమయాల్లో దేవునికి సన్నిహితమవడం ద్వారా, మనం పరిస్థితిని సరైన దృక్కోణంతో చూస్తూ, అపవాదిని విజయవంతంగా ఎదిరించవచ్చు.—యాకోబు 4:7, 8.
అన్నింటినీ సహించడానికి ఉపకరించే సహాయకాలు
10 యోబు తనను “ఓదార్చేవారి” కఠినమైన మాటలు, తన కష్టాలకుగల అసలు కారణం తెలియని తన అయోమయ పరిస్థితితోపాటు తనకెదురైన విపత్కర పరిస్థితిలో కూడా తన యథార్థతను కాపాడుకున్నాడు. ఆయన సహనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఆయన విజయానికి నిస్సందేహంగా యెహోవాపట్ల ఆయన విశ్వసనీయతే ప్రాముఖ్యమైన కారణం. ‘ఆయన దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు.’ (యోబు 1:1) అదే ఆయన జీవన విధానం. అకస్మాత్తుగా పరిస్థితులు ఎందుకు పూర్తిగా మారిపోయాయో తనకు అర్థం కాకపోయినా, యోబు యెహోవాను నిరాకరించలేదు. మంచికాలాల్లోను, చెడుకాలాల్లోనూ దేవుణ్ణి సేవించాలని యోబు నమ్మాడు.—యోబు 1:21; 2:10.
11 మంచి మనస్సాక్షిని కలిగివుండడం కూడా యోబును ఓదార్చింది. తన ప్రాణంపోతుందనిపించిన సందర్భంలో కూడా, ఇతరులకు సహాయం చేయడానికి తాను శాయశక్తులా కృషిచేశానని, యెహోవా నీతి ప్రమాణాలకు కట్టుబడి ఉన్నానని, ఎలాంటి అబద్ధారాధనకు తాను పాల్పడలేదని తెలుసుకుని ఆయన ఓదార్పుపొందాడు.—యోబు 31:4-11.
12 అయితే యోబుకు కొన్ని అంశాల్లో తన అభిప్రాయాలను మార్చుకునేందుకు సహాయం అవసరమనేది నిజం. ఆయన వినయంగా ఆ సహాయాన్ని అంగీకరించాడు, ఇది ఆయన విజయవంతంగా సహించడానికి దోహదపడిన మరో కీలకం. ఎలీహు జ్ఞానయుక్త మాటల్ని యోబు గౌరవపూర్వకంగా విని యెహోవా దిద్దుబాటుకు సానుకూలంగా స్పందించాడు. “వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక . . . మాటలాడితిని. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను” అని ఆయన ఒప్పుకున్నాడు. (యోబు 42:3, 6) వ్యాధి తననింకా బాధపెడుతున్నప్పటికీ, తన ఆలోచనకు సంబంధించిన ఈ దిద్దుబాటు తనను దేవునికి సన్నిహితుణ్ణి చేసిందని యోబు సంతోషించాడు. “[యెహోవా] నీవు సమస్తక్రియలను చేయగలవని . . . నేనిప్పుడు తెలిసికొంటిని” అని యోబు అన్నాడు. (యోబు 42:2) యెహోవా తన మహత్తును వర్ణించిన కారణంగా, యోబు తనను సృష్టికర్తతో పోల్చుకున్నప్పుడు ఆయన తన స్థానమేమిటో మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.
యోబు 42:8, 10) కాబట్టి, అన్నింటినీ సహించేందుకు పగపెట్టుకోవడం సహాయం చేయదుగానీ, ప్రేమ, కనికరం మాత్రమే సహాయం చేస్తాయనేది స్పష్టం. పగ పెంచుకోకుండా ఉండడం మనకు ఆధ్యాత్మిక పునరుత్తేజాన్ని ఇవ్వడమే కాక, యెహోవా ఆశీర్వాదం కూడా లభిస్తుంది.—మార్కు 11:25.
13 చివరిగా, కనికరం విషయంలో యోబు చక్కని మాదిరినుంచాడు. ఆయన దగ్గరికి వచ్చిన కపట ఆదరణకర్తలు ఆయనను చాలా బాధపెట్టారు, అయినప్పటికీ వారికొరకు ప్రార్థించమని యెహోవా యోబును అడిగినప్పుడు ఆయన ప్రార్థించాడు. ఆ తర్వాత, యెహోవా యోబు ఆరోగ్యాన్ని పునరుద్ధరించాడు. (జ్ఞానులైన సలహాదారులు సహించేందుకు మనకు తోడ్పడతారు
14 యోబు వృత్తాంతం నుండి మనం నేర్చుకోగల మరో పాఠం జ్ఞానయుక్తమైన సలహాదారులు ఉండడంవల్ల కలిగే ప్రయోజనం. అలాంటివారు “దుర్దశలో” సహోదరులుగా ఉంటారు. (సామెతలు 17:17) అయితే యోబు అనుభవం చూపిస్తున్నట్లుగా, కొందరు సలహాదారులు మేలు చేసే బదులు బాధపెడతారు. మంచి సలహాదారుడు ఎలీహు చూపించినట్లే తదనుభూతిని, గౌరవాన్ని, దయను చూపించాలి. సమస్యలతో కృంగిన సహోదరుల ఆలోచనను పెద్దలు, పరిణతిగల క్రైస్తవులు సరిదిద్దాల్సి ఉంటుంది, అలా సరిదిద్దేటప్పుడు అలాంటి సలహాదారులు యోబు పుస్తకం నుండి ఎంతో నేర్చుకోవచ్చు.—గలతీయులు 6:1; హెబ్రీయులు 12:12, 13.
15 ఎలీహు వ్యవహరించిన విధానంలో చక్కని పాఠాలు చాలావున్నాయి. యోబు ముగ్గురు స్నేహితుల తప్పుడు మాటలకు స్పందించే ముందు ఆయన చాలాసేపు విన్నాడు. (యోబు 32:11; సామెతలు 18:13) ఎలీహు యోబును పేరుతో సంబోధించి మాట్లాడుతూ, ఒక స్నేహితునిగా ఆయనకు వినతిచేశాడు. (యోబు 33:1) కపట ఆదరణకర్తలైన ఆ ముగ్గురికి భిన్నంగా, ఎలీహు తననుతాను యోబుకన్నా ఉన్నతుడని భావించలేదు. “నేనును జిగటమంటితో చేయబడినవాడనే” అని అన్నాడు. ఆయన అనాలోచిత మాటలతో యోబు బాధను అధికం చేయాలనుకోలేదు. (యోబు 33:6, 7; సామెతలు 12:18) యోబు గత ప్రవర్తనను విమర్శించే బదులు, యోబు కనబరచిన నీతిని ఎలీహు మెచ్చుకున్నాడు. (యోబు 33:32) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, ఎలీహు విషయాల్ని యెహోవా దృక్కోణం నుండి చూడడమే కాక, యెహోవా ఎన్నటికీ అన్యాయంగా ప్రవర్తించడనే వాస్తవంపై దృష్టి కేంద్రీకరించేందుకు యోబుకు సహాయం చేశాడు. (యోబు 34:10-12) యోబు తన స్వనీతిని ప్రదర్శించడానికి ప్రయాసపడే బదులు, యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండమని ఆయన ప్రోత్సహించాడు. (యోబు 35:2; 37:14, 23) అలాంటి పాఠాల నుండి క్రైస్తవ పెద్దలు, ఇతరులు తప్పక ప్రయోజనం పొందవచ్చు.
16 ఎలీహు జ్ఞానయుక్తమైన సలహా ఎలీఫజు, బిల్దదు, జోఫరుల బాధపెట్టే మాటలకు భిన్నంగా ఉంది. “మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు” అని యెహోవా వారితో అన్నాడు. (యోబు 42:7) తమకు మంచి ఉద్దేశాలున్నట్లు వారు చెప్పుకున్నా, వారు నమ్మకమైన స్నేహితులుగా కాక, సాతాను ఉపకరణాలుగా వ్యవహరించారు. మొదట్నుంచి ఆ ముగ్గురు యోబు ఎదుర్కొంటున్న కష్టాలకు తానే బాధ్యుడని భావించారు. (యోబు 4:7, 8; 8:6; 20:22, 29) ఎలీఫజు ప్రకారం, దేవునికి తన సేవకులపై నమ్మకం లేదు, మనం యథార్థవంతులుగా ఉన్నామా లేదా అనేది ఆయన పట్టించుకోడు. (యోబు 15:15; 22:2, 3) ఎలీఫజు యోబు చేయని తప్పుల విషయంలో కూడా ఆయనను నిందించాడు. (యోబు 22:5, 9) అయితే దానికి భిన్నంగా ఎలీహు, యోబుకు ఆధ్యాత్మికంగా సహాయం చేశాడు, అన్ని సందర్భాల్లో ప్రేమగల సలహాదారుని లక్ష్యమదే.
17 సహనం విషయంలో యోబు పుస్తకం నుండి మనం నేర్చుకోగల మరో పాఠముంది. మన ప్రేమగల దేవుడు మన పరిస్థితిని గమనిస్తూ వివిధ రీతుల్లో మనకు సహాయం చేసేందుకు ఇష్టపడడమే కాక, ఆయన సహాయం కూడా చేయగలడు. ఇంతకుముందు మనం ఎల్జా ఆప్ట్ అనుభవం గురించి చదివాం. చివరికామె ఏ ముగింపుకొచ్చిందో ఆలోచించండి: “నేను బంధించబడడానికి ముందు, తీవ్ర పరీక్షను ఎదుర్కొన్నప్పుడు యెహోవా ఆత్మ మనలో ప్రశాంతతను నింపుతుందని చెప్పిన సహోదరి ఉత్తరాన్ని నేను చదివాను. ఆమె కాస్త అతిశయోక్తిగా చెబుతోందని నేను అనుకున్నాను. కానీ నేనే స్వయంగా ఆ పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, ఆమె చెప్పింది వాస్తవమేనని నేను తెలుసుకున్నాను. నిజంగా ఆమె చెప్పినట్లే జరిగింది. మీరు అనుభవించనట్లైతే అదెలా ఉంటుందో ఊహించడం కష్టం. కానీ అది నిజంగా నాకు సంభవించింది. యెహోవా సహాయం చేస్తాడు.” యెహోవా వేలాది సంవత్సరాల పూర్వం యోబు కాలంలో ఏమి చేయగలిగాడో లేదా చేశాడో అనేది ఎల్జా మాట్లాడడం లేదు. ఆమె మన కాలం గురించి మాట్లాడుతోంది. అవును, “యెహోవా సహాయం చేస్తాడు!”
సహించే వ్యక్తి ధన్యుడు
18 మనలో కొందరు యోబులా తీవ్ర శ్రమను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఈ విధానం మనమీదికి ఎలాంటి పరీక్షలు తీసుకొచ్చినా, యోబులాగే మన యథార్థతను కాపాడుకునేందుకు మనకు సరైన కారణాలున్నాయి. వాస్తవానికి, సహనం యోబు జీవితాన్ని మెరుగుపరిచింది. అది ఆయనను సంపూర్ణునిగా, లోపంలేని వ్యక్తిగా చేసింది. (యాకోబు 1:2-4) అది దేవునితో ఆయన సంబంధాన్ని బలపర్చింది. “వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను” అని యోబు నొక్కిచెప్పాడు. (యోబు 42:5) యోబు యథార్థతను పాడుచేయలేని సాతాను అబద్ధికుడని నిరూపించబడ్డాడు. వందల సంవత్సరాల తర్వాత కూడా, యెహోవా తన సేవకుడైన యోబు నీతికి మాదిరిగా ఉన్నాడని పేర్కొన్నాడు. (యెహెజ్కేలు 14:14) యథార్థత, సహనానికి సంబంధించిన ఆయన చరిత్ర నేడు కూడా దేవుని ప్రజలను పురికొల్పుతోంది.
19 సహనం గురించి మొదటి శతాబ్దపు క్రైస్తవులకు యాకోబు వ్రాసినప్పుడు, సహనం తీసుకొచ్చే సంతృప్తిని ఆయన సూచించాడు. యెహోవా తన నమ్మకమైన సేవకులకు చక్కని ప్రతిఫలమిస్తాడని గుర్తుచేసేందుకు ఆయన యోబు మాదిరిని ఉపయోగించాడు. (యాకోబు 5:11) మనం యోబు 42:12లో ఇలా చదువుతాం: “యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.” దేవుడు యోబు పోగొట్టుకున్న దానికి రెండింతలు అనుగ్రహించాడు, ఆ తర్వాత ఆయన చాలాకాలం సంతోషంగా జీవించాడు. (యోబు 42:16, 17) అదేవిధంగా, ఈ విధానాంతంలో మనం సహించే ఏ కష్టమైనా, బాధైనా లేదా వేదనైనా దేవుని నూతన విధానంలో తుడిచివేయబడి మరువబడుతుంది. (యెషయా 65:17; ప్రకటన 21:4) యోబు సహనం గురించి మనం విని, యెహోవా సహాయంతో యోబు మాదిరిని అనుకరించాలనే దృఢనిశ్చయంతో ఉన్నాం. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.”—యాకోబు 1:12.
మీరెలా జవాబిస్తారు?
• యెహోవా హృదయాన్ని మనమెలా సంతోషపర్చవచ్చు?
• మన సమస్యలు దేవుని కోపానికి రుజువనే నిర్ధారణకు మనమెందుకు రాకూడదు?
• అన్నింటినీ సహించేలా యోబుకు ఏ విషయాలు సహాయం చేశాయి?
• తోటి విశ్వాసులను బలపర్చడంలో ఎలీహు మాదిరిని మనమెలా అనుకరించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. పోలాండ్‌లో ఒక జంట ఎలాంటి పరీక్షను ఎదుర్కొంది?
3, 4. (ఎ) కష్టాలను సహించేందుకు ఎవరి ఉదాహరణలు క్రైస్తవులను ప్రోత్సహించగలవు? (బి) యోబు అనుభవాన్ని పరిశోధించమని బైబిలు మనకెందుకు ఉద్బోధిస్తోంది?
5. మనకు పరీక్షలు, శోధనలు ఎదురైనప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన వివాదాంశమేమిటి?
6. సాతాను యెహోవాను ఎలా నిందిస్తున్నాడు, ఎంతగా నిందిస్తున్నాడు?
7. శారీరక బలహీనతను మనమెలా సమర్థంగా ఎదుర్కోవచ్చు?
8. (ఎ) కృంగదీసే భావాలు ఎలా బలహీనపరిచే ప్రభావం చూపించగలవు? (బి) యేసు ఎలాంటి వైఖరి ప్రదర్శించాడు?
9. మనం మోయవలసిన భారం విషయంలో లేదా మనమెదుర్కొనే శోధనల విషయంలో దేవుడు మనకెలాంటి అభయమిస్తున్నాడు?
10, 11. (ఎ) అన్నింటినీ సహించేందుకు యోబుకు ఏది సహాయం చేసింది? (బి) మంచి మనస్సాక్షిని కలిగివుండడం యోబుకెలా సహాయం చేసింది?
12. ఎలీహు నుండి తనకందిన సహాయానికి యోబు ఎలా స్పందించాడు?
13. కనికరం చూపించడం యోబుకెలా మేలు చేసింది?
14, 15. (ఎ) ఇతరులకు మేలు చేసేందుకు ఒక సలహాదారునికి ఏ లక్షణాలు సహాయం చేస్తాయి? (బి) యోబు సహాయం చేయడంలో ఎలీహు ఎందుకు విజయం సాధించాడో వివరించండి.
16. యోబు కపట ఆదరణకర్తలు ముగ్గురూ ఎలా సాతాను ఉపకరణాలయ్యారు?
17. మనం పరీక్షించబడినప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి?
18. సహనం చూపించడం ద్వారా యోబు ఎలాంటి ప్రయోజనాలు పొందాడు?
19. సహనం ప్రయోజనకరమని మీకెందుకు అనిపిస్తోంది?
[28వ పేజీలోని చిత్రం]
మంచి సలహాదారుడు తదనుభూతిని, గౌరవాన్ని, దయను చూపిస్తాడు
[29వ పేజీలోని చిత్రాలు]
ఎల్జా, హెరాల్ట్ ఆప్ట్