కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నిజంగా సంతోషించవచ్చు

మీరు నిజంగా సంతోషించవచ్చు

మీరు నిజంగా సంతోషించవచ్చు

సంతోషాన్ని, నిజమైన శాశ్వత సంతోషాన్ని పొందడం కొన్నిసార్లు కష్టం. ఎందుకంటే అనేకమంది సంతోషం కోసం తాము చేసే ప్రయత్నాల్లో దానిని తప్పుడు మార్గాల్లో పొందేందుకు ప్రయత్నిస్తారు. వారిని సరైన దిశలో నడిపించే నమ్మదగిన, అర్హుడైన స్నేహితుడు ఉంటే ఎంత బాగుంటుందో కదా!

ఆ అవసరమైన నిర్దేశాన్ని అందించే మూలం బైబిలు. దానిలో కేవలం కీర్తనలు అనే ఒక్క పుస్తకాన్నే పరిశీలించండి. ఈ పుస్తకంలో యెహోవా దేవుని స్తుతించేందుకు వ్రాయబడిన 150 పవిత్ర పాటలున్నాయి, ఆ పాటల్లో సగానికి సగం ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు కూర్చాడు. ఈ పుస్తక రచయితలు ఎవరు అనేది తెలుసుకోవడంకన్నా, మానవజాతి గొప్ప స్నేహితుడైన యెహోవా ప్రేరణతోనే అది వ్రాయబడిందనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి, మన ప్రయోజనార్థమైన దైవిక నిర్దేశం, సంతోషం పొందే మార్గం గురించి ఈ పుస్తకంలో వ్రాయబడిందని మనం నమ్మవచ్చు.

ఒక వ్యక్తి దేవునితో మంచి సంబంధం ఏర్పరచుకోవడంవల్ల సంతోషంగా ఉండవచ్చని కీర్తన రచయితలు నమ్మారు. “యెహోవాయందు భయభక్తులుగలవాడు . . . ధన్యుడు” లేదా సంతోషంగా ఉంటాడు అని కీర్తనకర్త వ్రాశాడు. (కీర్తన 112:⁠1) “యెహోవా తమకు దేవుడుగాగల జనుల”లో ఒకరిగా ఉండడంవల్ల కలిగే సంతోషాన్ని ఏ విధమైన మానవ సంబంధాలు, వస్తు సంపదలు, వ్యక్తిగత విజయాలు తీసుకురాలేవు. (కీర్తన 144:​15) అనేక ఆధునిక దిన దేవుని సేవకుల జీవితాలు ఆ మాటల సత్యాన్ని రుజువుచేస్తున్నాయి.

వాటిలో 40వ పడిలో ఉన్న సూజన్‌ జీవితం ఒక ఉదాహరణ. * ఆమె ఇలా చెప్పింది: “నేడు, చాలామంది ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు లేక ఉమ్మడి ప్రయోజనాలను పొందేందుకు కొన్ని గుంపుల్లోకి చేరుతారు. అయితే, వారు ఆ గుంపులో ఉన్న అందరినీ స్నేహితులుగా భావించడం అరుదు. యెహోవా ప్రజల విషయంలో అలా కాదు. యెహోవాపట్ల మనకున్న ప్రేమ మనం ఒకరిపట్ల ఒకరం అనురాగం చూపించేలా పురికొల్పుతుంది. మనం ప్రస్తుతం ఎక్కడున్నా మనం దేవుని ప్రజలతో ఉంటే మన సొంతవారి మధ్య ఉన్నట్లు మనకనిపిస్తుంది. ఈ ఐక్యత మన జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. పూర్తి భిన్నమైన సామాజిక వర్గాలకు, నేపథ్యాలకు, వేర్వేరు దేశాలకు చెందిన స్నేహితులు తమకున్నారని వేరే ఇంకెవరు చెప్పగలరు? యెహోవా ప్రజల్లో ఒకరిగా ఉండడంవల్లనే సంతోషించవచ్చని నేను హృదయపూర్వకంగా చెప్పగలను.”

ఒక వ్యక్తి సంతోషం పొందాలంటే యెహోవాతో చక్కని సంబంధం కలిగివుండడం కూడా చాలా ప్రాముఖ్యమని స్కాట్లాండ్‌లో జన్మించిన మారీ తెలుసుకుంది. “బైబిలు సత్యం తెలుసుకునే ముందు నేను హారర్‌ సినిమాలను చూడడానికి ఇష్టపడేదాన్ని. కానీ రాత్రుల్లో సిలువను పట్టుకునిపడుకోకపోతే నాకు నిద్రపట్టేది కాదు, ఎందుకంటే దయ్యాలు, పిశాచాల నుండి అది నన్ను కాపాడుతుందని అనుకునేదాన్ని, చాలా సినిమాలు దయ్యాలు, పిశాచాల గురించినవే ఉండేవి. అయితే, నేను సత్యం తెలుసుకున్నాక అలాంటి చిత్రాలను చూడడం మానేశాను, యెహోవాతో నాకున్న సంబంధంవల్ల భయపడకుండా నిద్రపోగలుగుతున్నాను, దయ్యాలు లేక నేను ఊహించుకున్న పిశాచాలకన్నా ఎంతో శక్తిమంతుడైన దేవుణ్ణి సేవిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.”

యెహోవామీద నమ్మకముంచడం

సంతోషాన్నిస్తుంది

సృష్టికర్త సర్వశక్తిని, ఆయన అనంత జ్ఞానాన్ని సందేహించేందుకు మనకు ఎలాంటి కారణంలేదు. తాను యెహోవామీద పూర్తి నమ్మకాన్ని ఉంచవచ్చని, తాను ఆయనను ఆశ్రయించవచ్చని తెలిసిన దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.”​—⁠కీర్తన 40:⁠4.

మారియా ఇలా చెప్పింది: “స్పెయిన్‌లో, మరితర దేశాల్లో నాకు ఎదురైన అనుభవాల నుండి నేను తెలుసుకున్నదేమిటంటే, మన భావాలు, భావోద్రేకాలు యెహోవా మార్గానికి విరుద్ధంగా ప్రవర్తించేలా మనల్ని పురికొల్పినా, మనం ఆయన పద్ధతిలో పనులు చేసినప్పుడు మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. దానివల్ల సంతోషం కలుగుతుంది ఎందుకంటే యెహోవా మార్గం ఎల్లప్పుడూ శ్రేష్ఠమైనది.”

యెహోవామీద మనం నమ్మకముంచవచ్చని, వివిధ యూరప్‌ దేశాల్లో సేవచేసిన ఆండ్రియాస్‌ అనే క్రైస్తవ పెద్ద కూడా తన వ్యక్తిగత అనుభవం నుండి తెలుసుకున్నాడు. ఆయన ఇలా చెప్పాడు: “నా విశ్వాసం పంచుకోని మా అన్న, నేను యౌవనునిగా ఉన్నప్పుడు బాగా డబ్బుదొరికే ఉద్యోగం కోసం ప్రయత్నించమని ప్రోత్సహిస్తూ, నాపై చాలా ఒత్తిడి తెచ్చాడు. నేను లోకసంబంధ ఫించను పథకాలిచ్చే నామకార్థ భద్రతపై ఆధారపడకుండా, పూర్తికాల పరిచర్య చేపట్టినప్పుడు ఆయన ఎంతో నిరాశ చెందాడు. నా పూర్తికాల సేవలో నేనెప్పుడూ లేమిని అనుభవించలేదు, ఇతరులకు కలగా మాత్రమే మిగలగల ఆశీర్వాదాలను నేను చవిచూశాను.”

పంతొమ్మిదివందల తొంభైమూడులో, జర్మనీలోని సెల్టర్స్‌లోవున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో విస్తరణకోసం జరుగుతున్న క్రొత్త భవన నిర్మాణ పనుల్లో సహాయం చేసేందుకు ఫెలిక్స్‌ ఆహ్వానించబడ్డాడు. నిర్మాణ పని పూర్తైన తర్వాత, ఆయన అక్కడున్న బెతెల్‌ కుటుంబంలో శాశ్వత సభ్యుడయ్యేందుకు ఆహ్వానించబడ్డాడు. ఆయన దానికి ఎలా ప్రతిస్పందించాడు? “భవిష్యత్తు గురించిన కొన్ని సందేహాలతో నేను ఆ ఆహ్వానాన్ని స్వీకరించాను. అయితే నేనిక్కడ దాదాపు పది సంవత్సరాలుగా ఉంటున్నాను, నా ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడనే నేను నమ్ముతున్నాను. నాకేది మంచిదో ఆయనకు తెలుసు. ఆయనమీద పూర్తి నమ్మకముంచి, నన్ను నిర్దేశించేందుకు అనుమతించడం ద్వారా ఆయన నా నుండి ఏమి కోరుతున్నాడో చూపించేందుకు ఆయనకు అవకాశమిస్తాను.”

ముందు పేర్కొనబడిన సూజన్‌ పూర్తికాల పరిచారకురాలిగా, ఒక పయినీరుగా సేవ చేయాలనుకుంది, కానీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం సంపాదించుకోవడం ఆమెకు కష్టమైంది. ఉద్యోగం కోసం ఒక ఏడాది వేచివున్న తర్వాత, యెహోవామీద నమ్మకంతో ఆమె చర్యతీసుకుంది. ఆమె ఇలా చెప్పింది: “నేను క్రమ పయినీరు సేవ కోసం దరఖాస్తు పెట్టాను. సాధారణ ఖర్చుల కోసం దాదాపు ఒక నెలకు సరిపడా డబ్బును నేను ఆదా చేశాను. అది ఎంతటి ఉత్తేజకరమైన నెలగా నిరూపించబడిందో! నా పరిచర్యవల్ల నేనెంతో గొప్ప ఆనందాన్ని చవిచూశాను, నా ఉద్యోగ ఇంటర్వ్యూలు ఒకటి తర్వాత మరొకటి విఫలమయ్యాయి. అయితే, యెహోవా వాగ్దానం చేసినట్లు ఆయన నన్ను విడువలేదు. నెల చివరి రోజున నేను ఒక ఉద్యోగ ఒప్పందం మీద సంతకం చేయగలిగాను. నేను యెహోవామీద నిజంగా నమ్మకముంచవచ్చని నాకు తెలిసింది! పూర్తికాల పరిచర్యలో నాకు ఎదురైన ఈ తొలి అనుభవం ప్రతిఫలదాయకమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందేందుకు దోహదపడింది.”

దైవిక సలహాను అంగీకరించడం

సంతోషాన్ని అధికం చేస్తుంది

దావీదు రాజు కొన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడు. కొన్నిసార్లు ఆయనకు జ్ఞానయుక్తమైన సలహా అవసరమైంది. దావీదు సలహాను, ఉపదేశాన్ని అంగీకరించేందుకు ఇష్టపడినట్లే మనం కూడా ఇష్టపడతామా?

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిడా, తానొక గంభీరమైన తప్పిదం చేశానని ఒకసారి గుర్తించింది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది: “యెహోవాతో నా సంబంధాన్ని పూర్వస్థితికి తీసుకువచ్చే విషయం గురించే నేను ఎక్కువగా ఆలోచించాను. వేరే ఏ విషయమూ నేను ఆలోచించలేదు.” ఆమె క్రైస్తవ పెద్దల సహాయం అడిగింది. దాదాపు 14 కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల పరిచర్యలో సేవచేసిన తర్వాత ఆమె ఇప్పుడు ఇలా చెబుతోంది: “యెహోవా నా తప్పిదాలను క్షమించాడని తెలుసుకోవడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా!”

దైవిక సలహాను అంగీకరించేందుకు సిద్ధంగా ఉండడం మనం తప్పు చేయకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. యూడిట్‌ ఇలా వివరిస్తోంది: “నా 20 ఏండ్ల వయసులో, నన్ను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన జర్మనీకి చెందిన ఒక వ్యాపార స్నేహితుని వ్యామోహంలో పడ్డాను. ఆయనకు సమాజంలో గౌరవం ఉంది, మంచి వృత్తి ఉంది, అయితే ఆయనకు అప్పటికే వివాహం అయింది! యెహోవా నియమాలకు విధేయత చూపించాలా లేదా ఆయనను తిరస్కరించాలా అనే నిర్ణయం నా ముందుందని నేను గుర్తించాను. మా తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పాను. మా నాన్న సూటిగా, యెహోవా నా నుండి ఆశిస్తున్నవాటిని నాకు గుర్తుచేశాడు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడాడు. అప్పుడు నాకు అదే అవసరం! అయినా, నా హృదయం వంకలు వెతకడం మొదలుపెట్టింది. అనేక వారాలపాటు, దేవుని నియమాల ప్రాముఖ్యత గురించి, ప్రాణాలను రక్షించేందుకు వాటికున్న శక్తి గురించి మా అమ్మ సాయంత్రాలు నాతో మాట్లాడేది. నా హృదయం క్రమంగా యెహోవా వైపు ఆకర్షించబడినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఆయన ద్వారా శిక్షించబడి, బోధించబడడం నాకెంతో సంతోషాన్నిచ్చింది, నేను పూర్తికాల పరిచర్యలో ఎన్నో ప్రతిఫలదాయకమైన సంవత్సరాలు గడపగలిగాను, యెహోవాను, నన్ను నిండుహృదయంతో ప్రేమించే ఓ చక్కని క్రైస్తవ భర్త నాకు దొరికాడు.”

స్పష్టంగా, అలాంటి అనుభవాలు దావీదు మాటలకున్న సత్యసంధతను, ప్రాముఖ్యతను నొక్కిచెబుతున్నాయి: “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.”​—⁠కీర్తన 32:​1, 2.

ఇతరులపట్ల శ్రద్ధ చూపించడంవల్ల కలిగే సంతోషం

“బీదలను కటాక్షించువాడు ధన్యుడు” అని దావీదు వ్రాశాడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును, భూమిమీద వాడు ధన్యుడగును.” (కీర్తన 41:​1, 2) దావీదు తన ప్రియ స్నేహితుడైన యోనాతాను అవిటి కుమారుడైన మెఫీబోషెతుపట్ల చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధ, దీనులపట్ల చూపించాల్సిన సరైన దృక్పథానికి ఒక ఉదాహరణగా ఉంది.​—⁠2 సమూయేలు 9:​1-13.

మిషనరీ సేవలో 47 సంవత్సరాలు గడిపిన మార్లీస్‌కు ఆఫ్రికా, ఆసియా తూర్పు యూరప్‌లలోని సంక్షోభ ప్రాంతాల నుండి పారిపోవాల్సి వచ్చిన ప్రజలకు ప్రకటించే ఆధిక్యత లభించింది. ఆమె ఇలా చెప్పింది: “వారికి వివిధ రకాల సమస్యలున్నాయి, తాము బయటివారిగా పరిగణించబడుతున్నామని, వాస్తవానికి తమపట్ల వివక్ష చూపించబడుతోందని వారు సాధారణంగా భావిస్తారు. అలాంటి ప్రజలకు సహాయం చేయడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది.”

నలభైయ్యవ పడిలో ఉన్న మెరీనా ఇలా వ్రాసింది: “మనకు సహాయం చేసే స్నేహితులున్నారని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుందని ఒక అవివాహితగా నాకు తెలుసు. ప్రజలకు ఫోను చేయడం ద్వారా లేక ఉత్తరాలు వ్రాయడం ద్వారా వారిని ప్రోత్సహించేందుకు అది నన్ను పురికొల్పుతుంది. చాలామంది తమ కృతజ్ఞతను వ్యక్తంచేశారు. ఇతరులకు సహాయం చేయడం నాకు ఆనందాన్నిస్తుంది.”

ఇరవయ్యవ పడిలో ఉన్న డిమిటా ఇలా చెప్పాడు: “ఒంటరి తల్లి అయిన మా అమ్మ నన్ను పెంచింది. నా చిన్నప్పుడు, సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త, పరిచర్యలో నాకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతీవారం తనతోపాటు తీసుకువెళ్లినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయన చూపించిన పట్టుదలకు నేను ఇప్పటికీ కృతజ్ఞుణ్ణి. నన్ను ప్రోత్సహించడం ప్రతీసారి సులభంగా లేదని నాకు తెలుసు.” తనకు ఒకప్పుడు లభించిన సహాయంపట్ల కృతజ్ఞతతో డిమిటా ఇప్పుడు ఇతరులకు సహాయం చేస్తున్నాడు: “నెలకొక్కసారైనా నాతోపాటు పరిచర్యలో పనిచేయడానికి ఒక యౌవనుణ్ణే కాక, ఒక వృద్ధుణ్ణి కూడా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాను.”

సంతోషం కలిగించే మరికొన్ని విషయాల గురించి కూడా కీర్తనల పుస్తకం పేర్కొంటోంది. వాటిలో ఒకటి, మన స్వశక్తిమీద ఆధారపడడం కన్నా, యెహోవా శక్తిమీద ఆధారపడడానికున్న ప్రాముఖ్యత: “[యెహోవా] వలన బలము నొందు మనుష్యులు ధన్యులు.”​—⁠కీర్తన 84:⁠5.

కొరిన్న ఈ విషయంలో తన అనుభవం చెప్పగలదు. ఆమె పరిచర్య అవసరం ఎక్కువగా ఉన్న దేశానికి తరలివెళ్లింది. “నాకు క్రొత్త భాష, క్రొత్త సంస్కృతి, క్రొత్త ఆలోచనా విధానం ఎదురైంది. నేను వేరే గ్రహంమీద ఉన్నట్లు నాకనిపించింది. వింత వాతావరణంలో ప్రకటించడం అనే ఆలోచననుబట్టి కంగారుపడ్డాను. నేను యెహోవా సహాయం అడిగాను, ఆయన శక్తితోనే ఆ మారుమూల క్షేత్రంలో దినమంతా ప్రకటించగలిగాను. కొంతకాలానికి, అలా ప్రకటించడం అతి సాధారణ విషయంగా అనిపించింది. నేను అనేక బైబిలు అధ్యయనాలను ప్రారంభించాను, నేను ఇప్పటికీ ఈ అనుభవం నుండి ప్రయోజనం పొందుతున్నాను. మనం అధిగమించలేనంత పెద్దగా కనిపించే అవరోధాలను కూడా యెహోవా శక్తితో అధిగమించవచ్చని నేను తెలుసుకున్నాను.”

అవును, దేవునితో, ఆయన ప్రజలతో స్నేహాన్ని పెంపొందించుకోవడం, యెహోవాపట్ల పూర్తి నమ్మకాన్ని కనపరచడం, ఆయన సలహాను అంగీకరించడం, ఇతరులపట్ల శ్రద్ధ చూపించడం వంటి వివిధ అంశాలు సంతోషాన్నిస్తాయి. యెహోవా మార్గాల్లో నడిచి, ఆయన నియమాలకు లోబడడం ద్వారా మనం సంతోషంగా ఆయన అనుగ్రహాన్ని చవిచూడవచ్చు.​—⁠కీర్తన 89:15; 106:3; 112:1; 128:​1, 2.

[అధస్సూచి]

^ పేరా 5 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[12వ పేజీలోని చిత్రం]

మారియా

[13వ పేజీలోని చిత్రం]

మారీ

[13వ పేజీలోని చిత్రం]

సూజన్‌, ఆండ్రియాస్‌

[15వ పేజీలోని చిత్రం]

కొరిన్న

[15వ పేజీలోని చిత్రం]

డిమిటా