భూమిపట్ల దేవుని సంకల్పం త్వరలో నెరవేరనుంది
భూమిపట్ల దేవుని సంకల్పం త్వరలో నెరవేరనుంది
ఆదాము హవ్వలు ఇంకా పరదైసులో ఉన్నప్పుడే వారు దేవుని నుండి ఈ ఆజ్ఞను పొందారు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి.”—ఆదికాండము 1:28.
భూమిని లోబరచుకోవడం అంటే వ్యవసాయం చేయడం లేక దానిలోని చిన్న భాగాన్ని చూసుకోవడం మాత్రమే కాదు. ఆదాము హవ్వలు, వారి సంతానం, భూమినంతటినీ పరదైసుగా మార్చాలి. అయితే, మొదటి మానవ దంపతులు పాపం చేయడంతో, వారు ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. (ఆదికాండము 3:23, 24) అయితే భూమి ఇక ఎన్నటికీ లోబరచుకోబడదని దానర్థం కాదు.
విధేయులైన మానవాళిని దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి వారు భూమిని లోబరచుకోగలుగుతారు. ప్రాచీన ఇశ్రాయేలీయులకు దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు వారి పొలాల్లో చక్కని పంటలు పండాయి, వారి పండ్ల తోటలు మంచి ఫలాలనిచ్చాయి. మన భూమి క్రమంగా పరదైసుగా మారేకొద్దీ అలాంటి పరిస్థితులే నెలకొంటాయి. దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిల్లో వాగ్దానం చేయబడినట్లు, “భూమి దాని ఫలములిచ్చును, దేవుడు, మా దేవుడు, మమ్మును ఆశీర్వదించును.” (కీర్తన 67:6) వాస్తవానికి, భూమ్మీద ఉన్న పచ్చికబయళ్ళు, పర్వతాలు, చెట్లు, పూలు, నదులు, సముద్రాలు ఆనందిస్తాయి. (కీర్తన 96:11-13; 98:7-9) మన భూమి పచ్చని వృక్షాలతో, రంగురంగుల పక్షులతో, అద్భుతమైన జంతువులతో, ఆప్యాయతగల ప్రజలతో కళకళలాడుతుంది.
ఆ నూతనలోకం త్వరలో రానుంది!
మనమిప్పుడు యెహోవా దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకపు ముంగిట్లో ఉన్నాం. “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (2 పేతురు 3:13) పేతురు వ్రాసిన ఆ మాటలు చదివిన తర్వాత, ఈ గ్రహం పరదైసుగా ఎన్నడూ మారదనే నిర్ధారణకు కొందరు రావచ్చు. పాత భౌతిక ఆకాశాలు, భూమి స్థానంలో క్రొత్తవి వస్తాయని వారు అనుకోవచ్చు. అలా జరిగే అవకాశం ఉందా?
“క్రొత్త ఆకాశములు” అంటే ఏమిటి? అవి దేవుడు సృష్టించిన భౌతిక ఆకాశాలు కావు. (కీర్తన 19:1, 2) పేతురు ముందటి వచనాల్లో, సూచనార్థక “ఆకాశముల” గురించి, అంటే తమ పౌరులకన్నా అధికంగా హెచ్చించుకున్న లేక ఉన్నతపరచుకున్న మానవ ప్రభుత్వాల గురించి పేర్కొన్నాడు. (2 పేతురు 3:10-12) ఈ “ఆకాశములు” మానవజాతిని పరిపాలించడంలో విఫలమయ్యాయి, అవి గతించిపోతాయి. (యిర్మీయా 10:23; దానియేలు 2:44) వాటి స్థానంలో వచ్చే “క్రొత్త ఆకాశము” దేవుని రాజ్యం, ఆ రాజ్యానికి యేసుక్రీస్తు రాజుగా, పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడిన 1,44,000 మంది ఆయనకు తోటివారసులుగా ఉంటారు.—రోమీయులు 8:16, 17; ప్రకటన 5:9, 10; 14:1, 3.
పేతురు పేర్కొన్న “క్రొత్తభూమి” క్రొత్త గ్రహంకాదు. మానవుడు శాశ్వతకాలం జీవించేందుకు అనువుగా యెహోవా భూమిని సృష్టించాడు. (కీర్తన 104:5) కొన్నిసార్లు బైబిలు “భూమి” అనే పదాన్ని ప్రజలను సూచించడానికి ఉపయోగిస్తుంది. (ఆదికాండము 11:1) కాబట్టి త్వరలో నాశనం చేయబడే భూమి అనేది, ఈ దుష్ట లోకంలో తమనుతాము భాగంగా చేసుకున్న ప్రజలే. నోవహు దినాల్లో కూడా దైవభక్తిలేని ప్రజలతో కూడిన లోకం జలప్రళయంలో నాశనం చేయబడింది. (2 పేతురు 3:5-7) మరి “క్రొత్తభూమి” అంటే ఏమిటి? అది ప్రజల క్రొత్త సమాజాన్ని అంటే “యథార్థహృదయులైన” దేవుని సత్యారాధకులను సూచిస్తోంది. (కీర్తన 125:4; 1 యోహాను 2:17) “క్రొత్తభూమికి” సంబంధించిన నియమాలన్నీ “క్రొత్త ఆకాశముల” నుండి వస్తాయి. భూమ్మీది నమ్మకమైన వ్యక్తులు, ఆ నియమాల్ని అమలుచేస్తారు.
ఆ మార్పులు క్రొత్తగా అద్భుతకరంగా ఉంటాయి!
మానవులు జీవించడానికి భూమిని సృష్టించినప్పుడు యెహోవా మనకు అద్భుతమైన గృహాన్నే ఇచ్చాడు. తాను భూమ్మీద చేసినదంతా “చాలామంచిదిగ” ఉందని ఆయనే స్వయంగా చెప్పాడు. (ఆదికాండము 1:31) అపవాదియైన సాతాను, ఆదాము హవ్వలు తిరుగుబాటు చేసేలా నడిపించాడు. (ఆదికాండము 3:1-5; ప్రకటన 12:9) అయితే, యథార్థవంతులు “వాస్తవమైన జీవమును” పొందేలా దేవుడు త్వరలో చర్యతీసుకుంటాడు. పరదైసులోని పరిపూర్ణ పరిస్థితుల్లో “నిత్యజీవమే” ఆ జీవితం. (1 తిమోతి 6:12, 18) ఆ కాలంలో మానవులు చవిచూసే కొన్ని ఆశీర్వాదాలను మనం పరిశీలిద్దాం.
క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో సాతాను నిర్బంధించబడతాడు కాబట్టి, మానవజాతికి కష్టాలు తీసుకురాలేడు. అపొస్తలుడైన యోహాను ఇలా చెబుతున్నాడు: “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత [ప్రధాన దూతయైన మిఖాయేలు, లేదా యేసుక్రీస్తు] పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను.” (ప్రకటన 20:1-3; 12:12) రాజ్య పరిపాలనలో, సాతాను అగాధములో బంధించబడినప్పుడు, మానవజాతి సాతాను ప్రభావం నుండి విముక్తి పొందడమే కాక మరితర అనేక ఆశీర్వాదాలను కూడా చవిచూస్తుంది.
దుష్టత్వం, హింస, యుద్ధం గతించిన విషయాలవుతాయి. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును కీర్తన 37:10, 11, 29) యెహోవా దేవుడు ‘భూదిగంతములవరకు యుద్ధాలు లేకుండా చేస్తాడు.’ (కీర్తన 46:9) భద్రతకు, శాంతికి సంబంధించిన ఎంతటి అద్భుతకరమైన వాగ్దానాలో కదా!
జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం సమృద్ధిగా లభ్యమవుతుంది. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును” అని కీర్తనకర్త పాడాడు. (కీర్తన 72:16) ఆ కాలంలో తీవ్రమైన ఆకలిబాధతో అలమటించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు.
అనారోగ్యంతో, వ్యాధులతో ఎవరూ బాధపడరు. నిజానికి, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24; 35:5, 6) యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన కుష్ఠరోగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని స్వస్థపరిచాడు. (మత్తయి 9:35; మార్కు 1:40-42; యోహాను 5:5-9) ఆయన నూతనలోకంలో ఏమి చేస్తాడో ఒకసారి ఊహించండి! గ్రుడ్డివారు, బధిరులు, కుంటివారు, మూగవారు స్వస్థపరచబడినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో ఆలోచించండి.
విధేయులైన మానవజాతి పరిపూర్ణులయ్యేకొద్దీ, వృద్ధాప్యంవల్ల కలిగే హానికరమైన ప్రభావాలు తొలగిపోతాయి. కళ్లద్దాల, చేతికర్రల, ఊతకర్రల, చక్రాల కుర్చీల, ఆసుపత్రుల, మందుల అవసరం ఇక ఎన్నటికీ ఉండదు. మనం మన యౌవనబలాన్ని తిరిగిపొందినప్పుడు ఎన్ని మార్పులు సంభవిస్తాయో కదా! (యోబు 33:25) సుఖనిద్రవల్ల విశ్రాంతిపొంది, ప్రతీ ఉదయం మనకు ఆనందాన్నిచ్చే కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమై నిద్రనుండి మేల్కొంటాం.
ప్రియమైనవారి, మరితరుల పునరుత్థానం మన హృదయాలకు ఆనందాన్నిస్తుంది. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15) హేబెలు, నోవహు, అబ్రాహాము, శారా, యోబు, మోషే, రూతు, దావీదు, ఏలీయా, ఎస్తేరు వంటివారినెందరినో ఆహ్వానించడం ఎంత పులకింపజేస్తుందో కదా! కోట్లాదిమంది ఇతరులు కూడా పునరుత్థానం చేయబడతారు. వారిలో చాలామంది యెహోవా గురించి ఎన్నడూ తెలుసుకోనివారు ఉంటారు, అయితే దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించేందుకు ఆసక్తిగా ఎదురుచూసే ప్రజలు వారిని స్వాగతిస్తారు. పునరుత్థానమైనవారు తమ సృష్టికర్త గురించి తెలుసుకునేకొద్దీ, యెహోవా గురించిన జ్ఞానంతో భూమి నిజంగా నిండుతుంది.
అన్నింటికన్నా శ్రేష్ఠమైనదేమిటంటే, ఏకైక సత్య దేవుణ్ణి మనం నిరంతరం ఆరాధించగలుగుతాం. “సంతోషముతో యెహోవాను సేవించే” గొప్ప అవకాశం మనకు లభిస్తుంది, మనం అందమైన గృహాలను నిర్మిస్తున్నప్పుడు, నేలను సాగుచేస్తున్నప్పుడు, చివరకు భూమిని లోబరచుకున్నప్పుడు మనం సామరస్యంగా కలిసి పనిచేస్తాం. (కీర్తన 100:1-3; యెషయా 65:21-24) యెహోవా పరిశుద్ధ నామాన్ని ఘనపర్చే ఫలవంతమైన, శాంతియుతమైన, అందమైన పరదైసులో నిరంతరం జీవించడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా!—కీర్తన 145:21; యోహాను 17:3.
మానవజాతికి చివరి పరీక్ష
యేసు తన వెయ్యేండ్ల పరిపాలనలో తన విమోచన క్రయధన బలి ప్రయోజనాలు విధేయులైన మానవులందరూ పొందేలా చూస్తాడు. చివరకు పాపమంతా తొలగించబడి, మానవజాతి పరిపూర్ణతకు చేరుకుంటుంది. (1 యోహాను 2:2; ప్రకటన 21:1-4) ఆదాము పాపపు ప్రభావాలు తొలగించబడిన కారణంగా పరిపూర్ణ మానవులు, భౌతికంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. అలా వారు పాపరహిత పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు సంపూర్ణ భావంలో ‘బ్రతుకుతారు.’ (ప్రకటన 20:5) ఇలాంటి పరిస్థితి, పరదైసు భూమి యెహోవాను ఎంతగా ఘనపరుస్తాయో కదా!
క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన కొంతకాలానికి సాతాను, అతని దయ్యాలు లేక దుష్టదూతలు దాదాపు పది శతాబ్దాల క్రితం తాము పడద్రోయబడిన అగాధము నుండి విడుదల చేయబడతారు. (ప్రకటన 20:1-3) ప్రజలను దేవుని నుండి మరల్చడానికి చివరి ప్రయత్నం చేసేందుకు వారు అనుమతించబడతారు. కొందరు చెడు కోరికలకు లొంగిపోయినా, ఆ తిరుగుబాటు విఫలమవుతుంది. యెహోవా, అలా తిరుగుబాటు చేసిన స్వార్థపరులను సాతాను, అతని దయ్యాలతో పాటు నిర్మూలిస్తాడు. దుష్టత్వం ఇక ఎన్నడూ ఉండదు. తప్పిదస్థులందరూ శాశ్వతంగా నిర్మూలించబడతారు, నీతిమంతులు నిత్యజీవాన్ని పొందుతారు.—ప్రకటన 20:7-10.
మీరక్కడ ఉంటారా?
యెహోవా దేవుణ్ణి ప్రేమించేవారి ఎదుట నిత్య సంతోషమనే భావి నిరీక్షణ ఉంది. పరదైసులో అనుభవించే నిత్య జీవితంలో విసుగుపుట్టించే ఏ అంశమూ ఉండదు. వాస్తవానికి, సమయం గడిచేకొద్దీ జీవితం మరింత ఆసక్తికరంగా మారుతుంది, ఎందుకంటే యెహోవా దేవుని జ్ఞానానికి అంతులేదు. (రోమీయులు 11:33) మీరు ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయం నేర్చుకుంటారు, జ్ఞానం సంపాదించుకోవడానికి మీకు ఎంతో సమయం దొరుకుతుంది. ఎందుకు? ఎందుకంటే, మీరు కేవలం 70 లేక 80 సంవత్సరాలే జీవించరు గానీ నిరంతరం జీవిస్తారు.—కీర్తన 22:26; 90:10; ప్రసంగి 3:11.
మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, ఆయన చిత్తాన్ని చేయడానికి మీరు ఎల్లప్పుడూ ఎంతో సంతోషిస్తారు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) నీతియుక్తమైన క్రియలు చేయడం ద్వారా యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మిమ్మల్ని ఏదీ ఆపకుండును గాక. దేవుని వాక్యమైన బైబిలు మీ ముందుంచే అద్భుతమైన నిరీక్షణను గుర్తుంచుకోండి. యెహోవా చిత్తం చేయడంపై మీ మనసు నిలిపి, ఆ మార్గం నుండి ఎన్నడూ ప్రక్కదారి పట్టకండి. మీరు ప్రక్కదారి పట్టకుండా ఉంటే, భూమి విషయంలో దేవుని సంకల్పం నెరవేరినప్పుడు, మన భూగృహం నిత్య పరదైసుగా మారినప్పుడు మీరుంటారు.
[4వ పేజీలోని చిత్రం]
దేవుని ఆశీర్వాదంతో ఇశ్రాయేలులోని పొలాల్లో సమృద్ధిగా పంట పండింది
[7వ పేజీలోని చిత్రం]
మీరు పరదైసులో ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించాలని ఆశిస్తున్నారు?