పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
“మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు” అని నిర్గమకాండము 23:19లో ఉన్న నిషేధాన్నిబట్టి మనమేమి నేర్చుకోవచ్చు?
మోషే ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిన ఆ నియమం బైబిల్లో మూడుసార్లు కనిపిస్తుంది, అది యెహోవా దృష్టిలో సరైనది గ్రహించడానికి, ఆయన కనికరాన్ని, మృదుత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అబద్ధ ఆరాధన ఆయనకు అసహ్యమని కూడా అది నొక్కిచెబుతోంది.—నిర్గమకాండము 34:26; ద్వితీయోపదేశకాండము 14:21.
మేకపిల్లను లేక వేరే జంతువును దాని తల్లిపాలతో ఉడకబెట్టడం, యెహోవా ఏర్పాటు చేసిన సహజ ప్రక్రియలకు విరుద్ధం. మేకపిల్లను పోషించి అది ఎదిగేందుకు సహాయం చేయడానికి దేవుడు దాని తల్లిపాలను ఏర్పాటుచేశాడు. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టడం ఒక విద్వాంసుని మాటల్లో చెప్పాలంటే, “తల్లీబిడ్డల మధ్య దేవుడు స్థాపించి, పవిత్రపరచిన సంబంధంపట్ల తిరస్కార భావాన్ని” ప్రదర్శించడమే అవుతుంది.
అంతేకాక, వర్షం కురవడానికి మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టడం అన్యుల ఆచారంకావచ్చని కొందరు భావిస్తున్నారు. అదే నిజమైతే, ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న జనాంగాలు ఆచరించే అవివేకమైన, క్రూరమైన మత సంబంధ ఆచారాల నుండి వారిని రక్షించేందుకు ఆ నిషేధం సహాయం చేసివుండవచ్చు. ఆ జనాంగాల ఆచారాలనుబట్టి నడుచుకోవద్దని మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు నిర్దిష్టంగా బోధించింది.—లేవీయకాండము 20:23.
చివరగా, మనం ఈ నియమంలో యెహోవా మహా వాత్సల్యాన్ని గమనిస్తాం. నిజానికి, జంతువులపట్ల క్రూరంగా వ్యవహరించడానికి వ్యతిరేకంగా, సహజ ప్రక్రియలకు విరుద్ధంగా పనిచేయకుండా రక్షణగా, ధర్మశాస్త్రంలో అలాంటి అనేక నియమాలున్నాయి. ఉదాహరణకు, ఒక జంతువు దాని తల్లితో కనీసం ఏడు దినాలు ఉంటే తప్ప దాన్ని బలిగా అర్పించడాన్ని, తల్లిని, పిల్లను ఒకేరోజు వధించడాన్ని, పక్షిగూట్లో నుండి తల్లిపక్షితోపాటు దాని గుడ్లను గానీ పిల్లలను గానీ తీసుకోవడాన్ని నిషేధించే నియమాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి.—లేవీయకాండము 22:27, 28; ద్వితీయోపదేశకాండము 22:6, 7.
స్పష్టంగా, ధర్మశాస్త్రం సంక్షిష్టమైన నియమాలూ, నిషేధాలూ ఉన్న పట్టిక మాత్రమే కాదు. ధర్మశాస్త్రంవల్ల ఉన్న ఒక ప్రయోజనం ఏమిటంటే, దానిలోని సూత్రాలు యెహోవా అద్భుత లక్షణాలను నిజంగా ప్రతిబింబించే ఉన్నత నైతిక గ్రహణశక్తులను మనం పెంపొందించుకునేందుకు సహాయం చేస్తాయి.—కీర్తన 19:7-11.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Timothy O’Keefe/Index Stock Imagery