ప్రేమ, నమ్మకం, విధేయతలకు నిదర్శనం
ప్రేమ, నమ్మకం, విధేయతలకు నిదర్శనం
న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌లో ఉన్న వాచ్‌టవర్ వ్యవసాయ క్షేత్రంలో 2005 మే 16 ఉదయాన వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా, ప్రకాశవంతంగా ఉంది. చక్కగా చదునుచేసిన పచ్చికబయళ్ళు, పూలతోటలు తెల్లవారక ముందు కురిసిన వర్షంవల్ల మెరుస్తున్నాయి. ఒక బాతు తన ఎనిమిది పిల్లలతో చెరువు అంచు దగ్గర ఉన్న ప్రశాంతమైన నీటిలో నెమ్మదిగా ఈదుతోంది. ఆ రమణీయ దృశ్యాన్ని చూసి సందర్శకులు అబ్బురపడ్డారు. వారు ఆ ఉదయపు ప్రశాంతతకు భంగంవాటిల్లజేయకూడదు అన్నట్లు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు.
ఆ సందర్శకులు, ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల నుండి విచ్చేసిన యెహోవాసాక్షులు. అయితే వారు ఆ రమణీయమైన దృశ్యాన్ని చూడడానికి రాలేదు. వాల్‌కిల్‌లో ఉన్న అమెరికా బెతెల్ భవన సముదాయంలో ఎర్రని ఇటుకలతో క్రొత్తగా నిర్మించిన ఆ విశాలమైన భవనం లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వారు ఆసక్తి చూపించారు. ఆ భవనం లోపలి భాగంలో వాతావరణం నిశ్శబ్దంగానైనా, ప్రశాంతంగానైనా లేకపోయినా వారు దానిని చూసి మళ్ళీ అబ్బురపడ్డారు.
సందర్శకులు రెండు అంతస్తులకు మధ్య, ఎత్తు తక్కువగా ఉన్న చిన్న అంతస్తు నుండి, క్రమపద్ధతిలో అమర్చి ఉన్న సంక్లిష్టమైన యంత్రాలను చూశారు. ఐదు పెద్ద ముద్రణా యంత్రాలు ఆరు పెద్ద ఫుట్‌బాల్ గ్రౌండ్ల కన్నా పెద్దగా ఉన్న నునుపైన కాంక్రీటు నేలను ఆక్రమించాయి. ఇక్కడే బైబిళ్ళు, పుస్తకాలు, పత్రికలు ముద్రించబడతాయి. ఒక్కొక్కటి 1,700 కిలోగ్రాముల బరువున్న పెద్ద పేపరు చుట్టలు వేగంగా కదిలే ట్రక్కు చక్రాల్లాగా గుండ్రంగా తిరుగుతాయి. 23 కిలోమీటర్ల పొడవు ఉండే పేపరు చుట్ట కేవలం 25 నిమిషాల్లో విడిపోయి ముద్రణాయంత్రాల గుండా పోతుంది. అప్పుడు ముద్రణాయంత్రం ఆ పేపరుకు సిరా పూసి దానిని ఎండబెట్టి, పేపరును పత్రికలుగా మడతపెట్టేందుకు వీలుగా దానిని చల్లారుస్తుంది. సిద్ధమైన పత్రికలు బాక్సుల్లో పెట్టబడి సంఘాలకు పంపించబడేందుకు ఆ యంత్రాల మీద ఉన్న కన్వేయర్లమీద
వేగంగా వెళ్తాయి. వేరే ముద్రణాయంత్రాలు, పుస్తకాల విడివిడి భాగాలను ముద్రించడంలో నిమగ్నమై ఉన్నాయి, ఆ పుస్తకాల విడివిడి భాగాలు బైండరీకి పంపించేంతవరకు, నేల నుండి పైకప్పువరకు విస్తరించి ఉన్న భద్రపరచే ప్రాంతంలోకి వేగంగా తీసుకువెళ్ళబడతాయి. ఈ చర్యలన్నీ కంప్యూటర్ నిర్దేశంలో ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి పొందికగా జరుగుతాయి.సందర్శకులు ఆ ముద్రణాయంత్రాలను చూసిన తర్వాత బైండరీని చూశారు. అక్కడ ఉన్న యంత్రాలు, గట్టి అట్టగల పుస్తకాలను, డీలక్స్ బైబిళ్ళను రోజుకు దాదాపు 50,000 కాపీల చొప్పున తయారు చేస్తాయి. పుస్తకాల విడివిడి భాగాలు సరైన క్రమంలో కూర్చబడి, అతికించబడి, వాటి అంచులు కత్తిరించబడతాయి. ఆ తర్వాత వాటికి అట్టలు అంటించబడతాయి. పూర్తైన పుస్తకాలు కార్టన్లలో పెట్టబడతాయి. ఆ కార్టన్లు యాంత్రికంగా సీలుచేయబడి, లేబుల్స్ వేయబడి, ప్యాలట్ మీద పెట్టబడతాయి. అంతేకాక, పేపర్ బ్యాక్ బుక్ లైన్ అనే యంత్రం, రోజుకు దాదాపు 1,00,000 పుస్తకాలను పోగుచేసి ప్యాక్ చేస్తుంది. ఆ యంత్రంలో కూడా లెక్కలేనన్ని మోటార్లు, కన్వేయర్లు, గేర్లు, చక్రాలు, బెల్టులు వంటి ఎన్నో పరికరాలు ఉన్నాయి, బైబిలు సాహిత్యం ముద్రించేందుకు అవన్నీ అసాధారణమైన వేగంతో పనిచేస్తాయి.
చక్కగా రూపొందించబడిన గడియారమంత ఖచ్చితంగా పని చేసే ముద్రణాలయపు అత్యంతాధునికమైన హైస్పీడ్ యంత్రాలు, ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన ఒక అద్భుతం. మనం గమనించబోతున్నట్లుగా, అది దేవుని ప్రజల ప్రేమ, నమ్మకం, విధేయతలకు నిదర్శనం కూడా. అయితే ముద్రణాపనులు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ నుండి వాల్‌కిల్‌కు ఎందుకు మార్చబడ్డాయి?
ఒకే ప్రాంతంలో పనులను కేంద్రీకరించడం ద్వారా ముద్రణ, షిప్పింగ్ పనులను సరళీకృతం చేయాలన్నదే ప్రధాన కారణం. అనేక దశాబ్దాలపాటు, పుస్తకాల ముద్రణ, షిప్పింగ్ పనులు బ్రూక్లిన్‌లో జరిగేవి, పత్రికల ముద్రణ, షిప్పింగ్ వంటి పనులు వాల్‌కిల్‌లో జరిగేవి. ఆ రెండు పనులను కలిపితే సిబ్బందిని తగ్గించి సమర్పిత నిధులను శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించడానికి వీలవుతుంది. అంతేకాక, బ్రూక్లిన్‌లోని ముద్రణా యంత్రాలు పాతబడిపోతున్నాయి కాబట్టి, రెండు క్రొత్త మాన్ రోలాండ్ లిథోమన్ ముద్రణా యంత్రాలు జర్మనీ నుండి ఆర్డర్ చేయబడ్డాయి. ఆ ముద్రణా యంత్రాలు బ్రూక్లిన్‌లోని ముద్రణాలయంలో పట్టనంత పెద్దవి.
యెహోవా ఆ పనికి మద్దతునిచ్చాడు
దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయాలన్నదే ముద్రణాపనికి ఎల్లప్పుడూ ఉన్న ఉద్దేశం. మొదటి నుండే ముద్రణాపని మీద యెహోవా ఆశీర్వాదం ఉందనేది స్పష్టమైంది. 1879 నుండి 1922 వరకు వాణిజ్య ముద్రణా సంస్థలు పుస్తకాలను ముద్రించేవి. 1922లో బ్రూక్లిన్‌లోని 18 కాన్కార్డ్ స్ట్రీట్‌లో ఉన్న ఆరు అంతస్థుల భవనం అద్దెకు తీసుకోబడి, పుస్తకాలను ముద్రించడానికి యంత్రం కొనుగోలు చేయబడింది. కొందరు ఆ సమయంలో, ముద్రణాపనిని నిర్వర్తించడంలో సహోదరుల సామర్థ్యాన్ని శంకించారు.
అలా శంకించినవారిలో, మన పుస్తకాల్లో చాలా వాటిని ముద్రించిన కంపెనీ అధ్యక్షుడు ఒకరు. ఆయన కాన్కార్డ్ స్ట్రీట్‌ను చూడడానికి వచ్చినప్పుడు ఇలా అన్నాడు: “ఇక్కడ మీ దగ్గర అతి శ్రేష్ఠమైన ముద్రణా యంత్రం ఉంది, కానీ దానిని ఎలా ఉపయోగించాలో తెలిసినవారు మీ దగ్గర ఎవరూ లేరు. ఆరు నెలల్లోనే యంత్రమంతా పాడవుతుంది; మీ ముద్రణాపనిని చేయడానికి తగినవారు మీ ముద్రణాపనిని ఇప్పటివరకు చేసినవారేనని, ముద్రణా వృత్తికి సంబంధించినవారేనని గ్రహిస్తారు.”
ఆ సమయంలో ప్రింటరీ పైవిచారణకర్తగా ఉన్న రాబర్ట్ జె. మార్టిన్ ఇలా వ్యాఖ్యానించాడు: “అది సహేతుకమైనదిగా అనిపించింది, కానీ ఆ వ్యాఖ్యానం ప్రభువును ఉపేక్షించింది, ఆయన ఎల్లప్పుడూ మాతో ఉన్నాడు . . . ఆ తర్వాత ఎంతోకాలం గడవక ముందే మేము పుస్తకాలను ముద్రించడం మొదలుపెట్టాం.” ఆ తర్వాతి 80 సంవత్సరాల్లో, యెహోవాసాక్షులు తమ సొంత ముద్రణా యంత్రాల్లో కోట్లాది సాహిత్య ప్రతులను ముద్రించారు.
ఆ తర్వాత, 2002 అక్టోబరు 5న, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్షిక సమావేశంలో, అమెరికా బ్రాంచి కార్యాలయపు ముద్రణాపనులను వాల్‌కిల్‌కు మార్చడాన్ని పరిపాలక సభ ఆమోదించిందనే ప్రకటన చేయబడింది. 2004 ఫిబ్రవరిలో అందేలా రెండు క్రొత్త ముద్రణా యంత్రాల కోసం ఆర్డర్లు చేయబడ్డాయి. సహోదరులు ముద్రణాలయానికి నమూనా వేసి, దాన్ని
విస్తరింపజేసి 15 నెలల్లో క్రొత్త ముద్రణా యంత్రాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత, తర్వాతి తొమ్మిది నెలల్లో క్రొత్త బైండరీని, షిప్పింగ్‌ను స్థాపించే పనులు పూర్తి చేయాలి. ఆ కాలపట్టిక విన్నప్పుడు కొంతమంది మనసుల్లో సందేహాలు ఉత్పన్నమైవుండవచ్చు ఎందుకంటే, ఆ పని దాదాపు అసాధ్యమన్నట్లే అనిపించింది. అయినా యెహోవా సహాయంతో అది సాధ్యమవుతుందని సహోదరులకు తెలుసు.“సంతోషకరమైన సహకార స్ఫూర్తి”
యెహోవా ప్రజలు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తారని సహోదరులకు తెలుసు కాబట్టి వారు ఆ ప్రణాళికను ప్రారంభించారు. (కీర్తన 110:3) ఆ పెద్ద ప్రణాళికకు బెతెల్ నిర్మాణ విభాగాలలో అందుబాటులో ఉన్నవారి కన్నా ఎక్కువమంది పనివారు అవసరం. అమెరికా నుండి, కెనడా నుండి నిర్మాణ నైపుణ్యాలున్న దాదాపు 1,000 కన్నా ఎక్కువమంది సహోదర సహోదరీలు తాత్కాలిక సేవా కార్యక్రమంలో భాగంగా ఒక వారం నుండి మూడు నెలల వరకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రణాళికలో భాగం వహించడానికి అంతర్జాతీయ సేవ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నుండి ఇతరులు ఆహ్వానించబడ్డారు. రీజనల్ బిల్డింగ్ కమిటీలు కూడా ఎంతో సహాయం చేశాయి.
వాల్కిల్ ప్రణాళిక కోసం స్వచ్ఛంద సేవ చేయాలంటే చాలామంది పెద్ద మొత్తంలో ప్రయాణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది, ఉద్యోగానికి ఎక్కువకాలం సెలవుపెట్టాల్సి ఉంటుంది. అయినా వారు ఆనందంగా ఆ త్యాగాలు చేశారు. అలా అదనంగా వచ్చిన చాలామంది స్వచ్ఛంద సేవకులకు వసతి సౌకర్యం, ఆహార ఏర్పాట్లు కల్పించాలి కాబట్టి, ప్రణాళికకు మద్దతుగా తీవ్రంగా కృషి చేయడానికి బెతెల్ కుటుంబానికి అవకాశాలు లభించాయి. బ్రూక్లిన్, ప్యాటర్సన్, వాల్‌కిల్‌కు చెందిన దాదాపు 535 కన్నా ఎక్కువమంది బెతెల్ కుటుంబ సభ్యులు తమ సాధారణ వారపు నియామకాలతో పాటు శనివారాల్లో ఆ ప్రణాళికలో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. యెహోవా ఆ ప్రణాళికకు మద్దతు ఇచ్చాడు కాబట్టే ఈ చారిత్రాత్మకమైన ప్రయత్నానికి దేవుని సేవకులు గొప్ప మద్దతు ఇవ్వగలిగారు.
మరికొందరు ఆర్థిక సహాయం చేశారు. ఉదాహరణకు, తొమ్మిది ఏండ్ల ఎబి నుండి సహోదరులకు ఒక ఉత్తరం అందింది. ఆమె ఇలా వ్రాసింది: “అద్భుతమైన పుస్తకాలు ముద్రించడానికి సంబంధించిన పనులన్నీ చేస్తున్నందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞురాలిని. నేను త్వరలో అక్కడికి రావచ్చు. మేము వచ్చే సంవత్సరం మిమ్మల్ని సందర్శించనున్నామని మా డాడీ చెప్పారు! నేనెవరినో మీరు గుర్తుపట్టేలా నేను ఒక బ్యాడ్జ్‌ను ధరిస్తాను. క్రొత్త ముద్రణా యంత్రాల కోసం నేను 20 డాలర్లు (900 రూపాయలు) పంపిస్తున్నాను. ఇది నా చేతి ఖర్చులకు ఇచ్చిన డబ్బు, అయినా దానిని సహోదరులైన మీకు ఇవ్వాలనుకుంటున్నాను.”
ఒక సహోదరి ఇలా వ్రాసింది: “దీనురాలినైన నేను నా స్వహస్తాలతో అల్లిన టోపీలను దయచేసి నా కానుకగా స్వీకరించండి. వాల్కిల్ ప్రణాళికలో పనిచేస్తున్న పనివారికి ఈ టోపీలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాతావరణ వివరాల పుస్తకం ఒకటి ఈ శీతాకాలం చలి తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది. ఆ పుస్తకపు ప్రచురణకర్తల అంచనా సరైనదో కాదో నాకు తెలియదు. కానీ వాల్‌కిల్‌లో చాలావరకు పని ఆరుబయటే జరుగుతుందని నాకు తెలుసు. నా సహోదర సహోదరీలు తమ తలలను వెచ్చగా ఉంచుకొనేలా చూడాలనుకుంటున్నాను. నిర్మాణ పనికి సహోదరులు కోరుకొనే ఎలాంటి నైపుణ్యమూ నా దగ్గర లేదు, కానీ నాకు అల్లడంవచ్చు, కాబట్టి నేను ఈ నైపుణ్యాన్ని నా చేతనైనంత
సహాయం చేసేందుకు ఉపయోగించాలని అనుకున్నాను.” ఆమె ఆ ఉత్తరంతో పాటు తాను అల్లిన 106 టోపీలను పంపించింది!ముద్రణాలయపు నిర్మాణ పని సమయానికి పూర్తైంది. ప్రింటరీ పైవిచారణకర్త జాన్ లార్సన్ ఇలా అన్నాడు: “అక్కడ ఎంతో సంతోషకరమైన సహకార స్ఫూర్తి ఉంది. ఆ పనిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడా లేదా అని ఎవరు సందేహించగలరు? ప్రణాళిక చాలా త్వరగా పూర్తైంది. 2003 మేలో సహోదరులు ఈ భవనానికి పునాదులు వేస్తున్నప్పుడు మట్టినేల మీద నిల్చొని వారిని గమనించడం నాకు గుర్తుంది. ఒక సంవత్సరం కూడా గడవకముందే నేను అదే స్థలంలో నిల్చొని పని చేస్తున్న ముద్రణా యంత్రాలను గమనించాను.”
ప్రతిష్ఠాపన కార్యక్రమం
క్రొత్త ముద్రణాలయంతో పాటు మూడు నివాస భవనాలు ప్రతిష్ఠించే కార్యక్రమం 2005, సోమవారం, మే 16న వాల్‌కిల్‌లో నిర్వహించబడింది. ప్యాటర్సన్, బ్రూక్లిన్ బెతెల్ భవన సముదాయాలతో పాటు కెనడా బెతెల్ కూడా వీడియో ద్వారా అనుసంధానం చేయబడింది. ఆ కార్యక్రమానికి మొత్తం 6,049 మంది హాజరయ్యారు. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్ జారస్ కార్యక్రమ అధ్యక్షునిగా పనిచేశారు, ఆయన ముద్రణాపనికి సంబంధించిన చరిత్ర గురించి క్లుప్తంగా వివరించారు. బ్రాంచి కమిటీ సభ్యులు జాన్ లార్సన్, జాన్ కికాట్లు, అమెరికాలోని నిర్మాణ ప్రణాళిక గురించిన చరిత్రను, ముద్రణాపనుల గురించిన చరిత్రను ఇంటర్వ్యూల ద్వారా, వీడియో ప్రదర్శనల ద్వారా సమీక్షించారు. పరిపాలక సభ సభ్యుడైన జాన్ బార్ చివరి ప్రసంగాన్నిచ్చి, క్రొత్త ముద్రణాలయాన్ని, మూడు నివాస భవనాలను యెహోవాకు సమర్పించాడు.
ఆ తర్వాతి వారం, ప్యాటర్సన్కు, బ్రూక్లిన్కు చెందిన బెతెల్ సభ్యులకు క్రొత్త సముదాయాలను చూసే అవకాశం లభించింది. ఆ సమయంలో మొత్తం 5,920 మంది క్రొత్త భవన సముదాయాలను చూశారు.
మనం ముద్రణాలయాన్ని ఎలా దృష్టిస్తాం?
సహోదరుడు బార్ ప్రతిష్ఠాపన ప్రసంగంలో, యంత్రాల కారణంగా కాదుగానీ ప్రజల కారణంగానే ముద్రణాలయానికి ప్రాధాన్యత చేకూరుతుందని తన శ్రోతలకు గుర్తు చేశాడు. మనం ముద్రించే సాహిత్యాలు ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి.
క్రొత్త ముద్రణాయంత్రాల్లో ఒక్కొక్కటి కేవలం గంటలో పది లక్షల కరపత్రాలను ముద్రించగలవు! అయినా ఒకే ఒక కరపత్రం కూడా ఒకరి జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపించగలదు. ఉదాహరణకు, 1921లో దక్షిణాఫ్రికాలోని రైలుమార్గపు నిర్వహణ బృందం ఒకటి, రైలు పట్టాలమీద పనిచేస్తోంది. ఆ బృందంలో క్రిస్టియాన్ అనే వ్యక్తి పట్టాల క్రింద ఇరుక్కుపోయిన ఒక పేపరును గమనించాడు. ఆ పేపరు మన కరపత్రాల్లో ఒకటి. క్రిస్టియాన్ దానిని ఎంతో ఆసక్తితో చదివాడు. ఆయన తన అల్లుడి దగ్గరికి పరిగెత్తుకొనివెళ్ళి ఉత్సాహంతో ఇలా చెప్పాడు: “నేను ఈ రోజు సత్యాన్ని కనుగొన్నాను!” కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు అదనపు సమాచారం కోసం బ్రాంచి కార్యాలయానికి వ్రాశారు. దక్షిణాఫ్రికా బ్రాంచి కార్యాలయం వారికి అదనపు బైబిలు సాహిత్యాన్ని పంపించింది. ఆ ఇద్దరు వ్యక్తులు అధ్యయనం చేశారు, బాప్తిస్మం తీసుకున్నారు, ఆ తర్వాత బైబిలు సత్యాన్ని ఇతరులతో పంచుకున్నారు. తత్ఫలితంగా చాలామంది సత్యాన్ని అంగీకరించారు. వాస్తవానికి, 1990ల తొలిభాగానికల్లా వారి వంశంలో వందకన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులుగా ఉన్నారు, ఒక వ్యక్తి రైలు పట్టాల మీద కరపత్రం చూసిన కారణంగానే ఇదంతా జరిగింది!
మనం ముద్రించే సాహిత్యం వ్యక్తులను సత్యంలోకి తీసుకువస్తుంది, వారు సత్యంలో నిలిచి ఉండేలా చేస్తుంది, దానిపట్ల అధిక ఉత్సాహం చూపించేందుకు ప్రోత్సహిస్తుంది, సహోదరత్వాన్ని ఐక్యపరుస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, మనమందరం ఇతరులకు పంచే సాహిత్యాలు మన దేవుడైన యెహోవాను ఘనపరుస్తాయి!
యెహోవా ముద్రణాలయాన్ని ఎలా దృష్టిస్తాడు?
యెహోవా ముద్రణాలయాన్ని ఎలా దృష్టిస్తాడో పరిశీలించమని సహోదరుడు బార్ ప్రేక్షకులకు చెప్పాడు. ఆయన దానిమీద ఆధారపడడు. ఆయన రాళ్ళు సువార్త ప్రకటించేలా చేయగలడు! (లూకా 19:40) అంతేకాక, ఆయన యంత్రాల సంక్లిష్టత, పరిమాణం, వేగం, సామర్థ్యాలనుబట్టి ముగ్ధుడుకాడు. ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించాడు. (కీర్తన 147:10, 11) సాహిత్యాన్ని ముద్రించడంలో అత్యాధునిక విధానాలు, అంటే మానవులు ఇప్పటివరకు రూపొందించని విధానాలు, ఊహించని విధానాలు కూడా యెహోవాకు తెలుసు. అయితే యెహోవా తాను నిజంగా అమూల్యంగా ఎంచే దేన్ని చూస్తాడు? ఆయన ఈ ముద్రణాలయంలో తన ప్రజల అమూల్య లక్షణాలైన ప్రేమ, నమ్మకం, విధేయత వంటివి చూస్తాడు.
ప్రేమ ఎలా ఇమిడివుందో వివరించేందుకు సహోదరుడు బార్ ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక పాప తన తల్లిదండ్రుల కోసం కేక్ తయారుచేస్తుంది. తల్లిదండ్రులు దానినిబట్టి సంతోషిస్తారు. అవును, కేక్ రుచి ఎలా ఉన్నా, ఆ పాప ప్రేమపూర్వక చర్యలో వెల్లడైన ఆమె ప్రేమే తల్లిదండ్రులను ప్రభావితం చేస్తుంది. అలాగే, యెహోవా ఈ క్రొత్త ముద్రణాలయాన్ని చూసినప్పుడు ఆయన భవనాన్ని, యంత్రాలను మాత్రమే చూడడు. ఆయన ప్రాథమికంగా వాటిని, తన నామంపట్ల ఉన్న ప్రేమకు వ్యక్తీకరణగా చూస్తాడు.—హెబ్రీయులు 6:10.
అంతేకాక, యెహోవా ఎలాగైతే ఓడను నోవహు నమ్మకానికి వ్యక్తీకరణగా దృష్టించాడో అలాగే ఈ ముద్రణాలయాన్ని మన నమ్మకానికి సుస్పష్టమైన రుజువుగా దృష్టిస్తాడు. దేనిపట్ల నమ్మకం? యెహోవా ప్రవచించిన విషయాలు నెరవేరతాయనే నమ్మకం నోవహుకు ఉంది. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే, సువార్త భూమ్మీద ప్రకటించబడుతున్న అతి ప్రాముఖ్యమైన సందేశమనే, ప్రజలు దానిని వినడం చాలా ప్రాముఖ్యమనే నమ్మకం మనకుంది. బైబిలు సందేశం ప్రాణాలను రక్షిస్తుందని మనకు తెలుసు.—రోమీయులు 10:13, 14.
యెహోవా ఈ ముద్రణాలయంలో మన విధేయతకు వ్యక్తీకరణను కూడా ఖచ్చితంగా చూస్తాడు. అంతం రాక ముందు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడాలనేది ఆయన చిత్తమని మనకు తెలుసు. (మత్తయి 24:14) ఈ ముద్రణాలయంతోపాటు భూగోళంలోని వేరే ప్రాంతాల్లో ఉన్న ఇతర ముద్రణాలయాలు ఆ ఆజ్ఞను నెరవేర్చడంలో ఒక పాత్రను పోషిస్తాయి.
అవును అవసరమైన నిధులను సమకూర్చడంలో, నిర్మాణ పనిలో, ఈ సదుపాయాలను ఉపయోగించే విషయంలో చూపించబడిన ప్రేమ, నమ్మకం, విధేయత, అన్నిచోట్లా ఉన్న యెహోవా ప్రజలు, వినేవారందరికీ సత్యాన్ని ప్రకటించే ఉత్సాహపూరితమైన పనిలో కొనసాగుతున్నప్పుడు కూడా కనిపిస్తాయి.
[11వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
అమెరికాలో ముద్రణాపని విస్తరణ
1920: 35 మార్టల్ ఎవెన్యూ, బ్రూక్లిన్‌లో మొదటి రోటరీ ప్రెస్ పత్రికలను ముద్రించింది.
1922: ముద్రణాలయం 18 కాన్కార్డ్ స్ట్రీట్‌లో ఆరంతస్థుల భవనానికి మార్చబడింది. అప్పటినుండి పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది.
1927: ముద్రణాలయం 117 ఆడమ్స్ స్ట్రీట్‌లో నిర్మించబడిన క్రొత్త భవనానికి మార్చబడింది.
1949: తొమ్మిది అంతస్థులు చేర్చడం ద్వారా ముద్రణాలయపు పరిమాణం రెండింతలు పెరిగింది.
1956: 77 సాండ్స్ స్ట్రీట్‌లో క్రొత్త భవనం నిర్మించబడినప్పుడు ఆడమ్స్ స్ట్రీట్ ముద్రణాలయపు పరిమాణం మళ్ళీ రెండింతలు అయింది.
1967: పది అంతస్థుల భవనం నిర్మించబడింది, మొదటి భవనం కన్నా పది రెట్లు పెద్దదైన అనుసంధానం చేయబడిన ముద్రణాలయం ఏర్పడింది.
1973: ప్రాథమికంగా పత్రికల ముద్రణ కోసమే వాల్‌కిల్‌లో అనుబంధ ముద్రణాలయం నిర్మించబడింది.
2004: అమెరికాలోని ముద్రణ, బైండిగ్, షిప్పింగ్ కార్యకలాపాలన్నీ వాల్‌కిల్‌లో సమైక్యం చేయబడ్డాయి.