మెనోనైట్లు బైబిలు సత్యం కోసం వారి అన్వేషణ
మెనోనైట్లు బైబిలు సత్యం కోసం వారి అన్వేషణ
నవంబరు 2000లో ఒకరోజు ఉదయం బొలీవియాలోని యెహోవాసాక్షుల మిషనరీలు కొందరు తమ చిన్న ఇంటి కిటికీలో నుండి బయటకు చూసినప్పుడు, సాధారణ దుస్తులు ధరించిన స్త్రీపురుషుల గుంపు ఒకటి గేటు దగ్గర భయపడుతూ నిలబడి ఉండడం కనిపించింది. మిషనరీలు వెళ్లి గేటు తెరిచినప్పుడు, ఆ సందర్శకులు పలికిన మొదటి మాటలేమిటంటే, “మేము బైబిలు నుండి సత్యం తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం.” ఆ సందర్శకులు మెనోనైట్లు. పురుషులు నిలువుటంగీలు, స్త్రీలు ముదురురంగు ఉపవస్త్రాలు ధరించి వాళ్లలోవాళ్లు జర్మన్ భాషలో మాట్లాడుకుంటున్నారు. వారి కళ్లలో భయం కనిపిస్తోంది. తమను ఎవరైనా వెంబడిస్తున్నారా అని వారు అటూ ఇటూ చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఇంట్లోకి రావడానికి మెట్లెక్కేటప్పుడు కూడా వారిలో ఒక యౌవనుడు, “దేవుని పేరు ఉపయోగించే ప్రజలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను” అని అన్నాడు.
ఇంట్లోకి వచ్చి, అల్పాహారాలు సేవించిన తర్వాత ఆ సందర్శకులు కాస్త సేదతీరారు. వారు సుదూర, మారుమూల వ్యవసాయ కాలనీ నుండి వచ్చారు. అక్కడ వారు పోస్టు ద్వారా గత ఆరు సంవత్సరాలుగా కావలికోట పత్రికను అందుకుంటున్నారు. “ఈ భూమ్మీద పరదైసు ఉంటుందని మేము చదివాం. అది నిజమా?” అని వారడిగారు. సాక్షులు వారికి బైబిలు నుండి సమాధానం చూపించారు. (యెషయా 11:9; లూకా 23:43; 2 పేతురు 3:7, 13; ప్రకటన 21:3, 4) వారిలో ఒక రైతు “చూశారా, అది సత్యం. భూమ్మీద పరదైసు ఉంటుంది” అన్నాడు. మిగిలినవారు, “అవును మనకు సత్యం తెలిసింది” అని పదేపదే అన్నారు.
ఈ మెనోనైట్లు ఎవరు? వారి నమ్మకాలేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు పొందాలంటే మనం 16వ శతాబ్దానికి వెళ్లాల్సిందే.
మెనోనైట్లు ఎవరు?
1,500లలో ఐరోపాలోని సాధారణ భాషల్లోకి బైబిలు అనువాదం, ముద్రణ ఊపందుకున్నప్పుడు అది బైబిలు అధ్యయనంపై సరికొత్త ఆసక్తిని రగిలించింది. మార్టిన్ లూథర్, ఇతర సంస్కరణకర్తలు క్యాథలిక్ చర్చి బోధలను చాలావరకు నిరాకరించారు. అయినప్పటికీ, క్రొత్తగా రూపొందిన చర్చీలు అనేక బైబిలేతర అభ్యాసాలను అలానే అంటిపెట్టుకున్నాయి. ఉదాహరణకు, అధికశాతం మంది క్రొత్తగా పుట్టిన ప్రతీ శిశువు చర్చి సభ్యునిగా బాప్తిస్మం తీసుకోవాలని ఆశించారు. అయితే, ఒక వ్యక్తి బాప్తిస్మానికి ముందు తగిన పరిజ్ఞానం సంపాదించుకున్నప్పుడు మాత్రమే క్రైస్తవ సంఘ సభ్యుడవుతాడని బైబిలు సత్య పరిశోధకులు కొందరు గ్రహించారు. మత్తయి 28:19, 20) ఈ నమ్మకాన్ని సమర్థించిన ఆసక్తిగల ప్రచారకులు పట్టణాల గుండా, గ్రామాల గుండా ప్రయాణిస్తూ బైబిలు బోధించి, వయోజనులకు బాప్తిస్మమిస్తూ వచ్చారు. ఆ విధంగా వారు ఎనబాప్టిస్టులు అంటే “పునఃబాప్తిస్మమిచ్చేవారు” అని పిలవబడ్డారు.
(నెదర్‌లాండ్స్ ఉత్తర భాగంలోవున్న విట్‌మార్సెమ్ గ్రామంలో క్యాథలిక్ ప్రీస్టుగా పనిచేసిన మెనో సైమెన్స్ తన సత్యాన్వేషణలో ఎనబాప్టిస్టులవైపు దృష్టిసారించాడు. ఆయన 1536కల్లా చర్చితో సంబంధాలు తెగతెంపులు చేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయాడు. 1542లో పరిశుద్ధ రోమన్ చక్రవర్తి ఛార్లెస్ V మెనోను పట్టుకొనేవారికి 100 గిల్డర్లు పారితోషికంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అయినప్పటికీ, మెనో ఎనబాప్టిస్టులను కొందరిని సంఘాలుగా సమకూర్చాడు. అనతికాలంలోనే ఆయన, ఆయన అనుచరులు మెనోనైట్లుగా పిలవబడ్డారు.
నేటి మెనోనైట్లు
కాలప్రవాహంలో, వారికి కలిగిన హింస కారణంగా వేలాదిమంది మెనోనైట్లు పశ్చిమ ఐరోపానుండి ఉత్తర అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ వారికి తమ సత్యాన్వేషణను కొనసాగిస్తూ, తమ సందేశాన్ని ఇతరులకు విస్తరింపజేసే అవకాశం లభించింది. అయితే ప్రగతిశీల బైబిలు అధ్యయనంలో, ప్రజలకు ప్రకటించడంలో వారి పితరులు చూపిన చురుకైన ఆసక్తి చాలమట్టుకు సన్నగిల్లింది. చాలామంది త్రిత్వం, అమర్త్యమైన మానవ ఆత్మ, నరకాగ్నివంటి బైబిలు విరుద్ధ బోధలకు హత్తుకున్నారు. (ప్రసంగి 9:5; యెహెజ్కేలు 18:4; మార్కు 12:29) నేడు, మెనోనైట్ల మిషనరీ ప్రయత్నాలు సువార్తకు బదులు వైద్య, సామాజిక సేవలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.
ప్రస్తుతం 65 దేశాల్లో 13,00,000 మంది మెనోనైట్లు ఉన్నారని అంచనా వేయబడింది. అయినప్పటికీ, శతాబ్దాల పూర్వం మెనో తీసుకొచ్చిన ఐక్యత ఇప్పుడు తమలో లేదని ప్రస్తుత దిన మెనోనైట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, లోక సంఘర్షణల విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు భారీ చీలికలకు దారితీసాయి. ఉత్తర అమెరికాలో చాలామంది బైబిలును ఆధారం చేసుకొని సైనిక సేవలో చేరడానికి నిరాకరించారు. అయితే ఎన్ ఇంట్రడక్షన్ టు మెనోనైట్ హిస్టరీ ఇలా చెబుతోంది: “1914వ సంవత్సరానికల్లా సైనిక సేవ నిరాకరణ చాలామట్టుకు పశ్చిమ ఐరోపాలోని మెనోనైట్ల చర్చీల గతచరిత్రగానే మిగిలిపోయింది.” నేడు, కొన్ని మెనోనైటు శాఖలు అధికంగానో, కొద్దిగానో ఆధునిక భావాలను స్వీకరించాయి. మరికొన్ని శాఖలు బట్టలకు గుండీలు వాడే బదులు ఇంకా హుక్కులనే వాడుతూ, పురుషులు గడ్డం గీసుకోకూడదని నమ్ముతున్నాయి.
కొన్ని మెనోనైటు శాఖలు ఆధునిక లోకం నుండి వేరుగా ఉండాలనే తీర్మానంతో, తమ విషయాల్లో స్థానిక ప్రభుత్వాలు జోక్యం చేసుకోని ప్రాంతాలకు తమ సమాజాలను మార్చుకున్నాయి. ఉదాహరణకు, బొలీవియాలో దాదాపు 38,000 మంది వయోజన మెనోనైట్లు అనేక మారుమూల కాలనీల్లో నివసిస్తున్నట్లు అంచనా వేయబడింది, ప్రతి కాలనీకీ విభిన్నమైన ప్రవర్తనా నియమాలు ఉన్నాయి. కొన్ని కాలనీలు మోటారు వాహనాలను నిషేధిస్తూ, కేవలం గుర్రాలను, గుర్రపు బగ్గీలను మాత్రమే అనుమతిస్తాయి. మరికొన్ని కాలనీలు రేడియో, టీవీ, సంగీతాన్ని నిషేధిస్తాయి. ఇంకాకొన్ని కాలనీలైతే తాము నివసిస్తున్న దేశ భాషను నేర్చుకోవడాన్ని సహితం నిషేధిస్తున్నాయి. “మమ్మల్ని తమ ఆధీనంలో ఉంచుకొనేందుకు పాస్టర్లు మమ్మల్ని స్పానిష్ నేర్చుకోవడానికి అనుమతించరు” అని ఒక కాలనీవాసి వాపోయాడు. చాలామంది తాము అణచివేయబడుతున్నట్లు భావిస్తూ, సమాజ బహిష్కరణకు గురవుతామనే తీవ్ర భయంతో జీవిస్తున్నారు, బయటి జీవితం ఏ మాత్రం తెలియని వారికి అది నిజంగా చాలా భయంకరమైనదే.
అక్కడ సత్యపు విత్తనం ఎలా నాటబడింది?
ఇలాంటి పరిస్థితుల్లోనే, యోహాన్ అనే ఒక మెనోనైటు రైతు తన పొరుగువారి ఇంట్లో కావలికోట పత్రికను చూశాడు. యోహాన్ కుటుంబం కెనడా నుండి మెక్సికోకు ఆ తర్వాత బొలీవియాకు వలసవెళ్లింది. అయితే యోహాన్
తన బైబిలు సత్యాన్వేషణలో ఎల్లప్పుడూ సహాయాన్ని ఆశించాడు. చదివి ఇచ్చేస్తానని ఆయన ఆ పత్రిక తీసుకున్నాడు.ఆ తర్వాత యోహాన్ తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి నగరంలో ఉన్నప్పుడు, మార్కెట్టులో కావలికోట పత్రికను అందిస్తున్న ఒక సాక్షి దగ్గరకు వెళ్లాడు. ఆమె యోహాన్‌ను జర్మనీ మాట్లాడే మిషనరీ దగ్గరకు పంపించింది, ఫలితంగా ఆయన కొంతకాలానికే జర్మన్ భాషలో కావలికోట అందుకోవడం ఆరంభించాడు. ప్రతీ సంచిక జాగ్రత్తగా పఠించబడేది, ఆ పత్రిక పాతబడిపోయేంతవరకు ఆ కాలనీలోని ప్రతీ కుటుంబానికి అది పంపించబడేది. కొన్నిసార్లు కుటుంబాలు ఒక దగ్గరకు చేరి కావలికోట పత్రికలో ఉదాహరించబడిన లేఖనాలు చూస్తూ అర్థరాత్రి వరకు దానిని అధ్యయనం చేసేవారు. భూవ్యాప్తంగా ఐకమత్యంతో దేవుని చిత్తం చేస్తున్నవారు యెహోవాసాక్షులే అని యోహాన్‌కు నమ్మకం ఏర్పడింది. చనిపోయేముందు యోహాన్ తన భార్యాపిల్లలకు ఇలా చెప్పాడు: “మీరు ఎల్లప్పుడూ కావలికోట చదవాలి. బైబిలును అర్థం చేసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది.”
యోహాన్ కుటుంబీకుల్లో కొందరు బైబిలు నుండి తాము నేర్చుకుంటున్న విషయాల గురించి తమ పొరుగువారితో మాట్లాడడం ఆరంభించారు. “భూమి నాశనం కాదు. బదులుగా దేవుడు దానిని పరదైసుగా మారుస్తాడు. దేవుడు ప్రజలను నరకంలో బాధించడు” అని వారు చెప్పారు. వారి సంభాషణా విషయాలు త్వరలోనే చర్చి పాస్టర్ల చెవినపడగా, ఆ పని మానకపోతే బహిష్కరిస్తామని వారు యోహాన్ కుటుంబాన్ని బెదిరించారు. ఆ తర్వాత, మెనోనైటు పెద్దలు తీసుకొస్తున్న వత్తిడి గురించిన కుటుంబ చర్చలో, ఒక యౌవనుడు ఇలా అన్నాడు: “మన చర్చి పెద్దలు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో నాకర్థం కావడంలేదు. సత్యమైన మతమేదో మనందరికీ తెలుసు, మనం దాని గురించి ఏమీ చేయలేదు.” ఈ మాటలు ఆ యౌవనుని తండ్రి హృదయాన్ని తాకాయి. త్వరలోనే ఆ కుటుంబంలోని 10 మంది సభ్యులు యెహోవాసాక్షులను అన్వేషించే రహస్య ప్రయాణం ఆరంభించి చివరకు పైన ప్రస్తావించిన ఆ మిషనరీల ఇల్లు చేరారు.
మరుసటి రోజు, ఆ మిషనరీలు కాలనీలోని వారి క్రొత్త స్నేహితులను సందర్శించడానికి వెళ్లారు. ఆ కాలనీ రోడ్డుమీద మిషనరీల మోటారు వాహనం మాత్రమే ఉంది. నెమ్మదిగా గుర్రపు బగ్గీలను దాటి వెళుతూ వారు స్థానికులను కళ్లతోనే పలకరించారు. ఎంతోసేపు కాకముందే, ఆ మిషనరీలు రెండు కుటుంబాలకు చెందిన పదిమంది మెనోనైట్లతో ఒక బల్లదగ్గర కూర్చున్నారు.
ఆ రోజు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము * పుస్తకంలో 1వ పాఠం అధ్యయనం చేయడానికి నాలుగు గంటలు పట్టింది. ప్రతీ పేరాకు ఆ రైతులు అదనపు బైబిలు లేఖనాలు తెరిచిచూస్తూ, ఆ వచనాలను తాము సరిగా అన్వయిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రతీ అధ్యయన ప్రశ్న తర్వాత చాలా నిమిషాలు ఆ రైతులు తమలో తాము లోజర్మన్ అనే భాషలో సంప్రదించుకొని చివరకు ఆ గుంపులో ఒకరు స్పానిష్ భాషలో జవాబిచ్చేవారు. అదొక మరుపురాని రోజు, అయితే హింస విరుచుకుపడబోతోంది. దాదాపు ఐదు శతాబ్దాల పూర్వం బైబిలు సత్యాన్వేషణ ఆరంభించినప్పుడు మెనో సైమెన్స్ ఎదుర్కొన్నట్లే వారు కూడా పరీక్షలు ఎదుర్కోబోతున్నారు.
సత్యం కోసం పరీక్షలను ఎదుర్కోవడం
కొన్ని రోజుల తర్వాత, చర్చి నాయకులు యోహాన్ కుటుంబీకుల ఇంటికొచ్చి, ఆసక్తిపరులకు ఇలా చివరి హెచ్చరిక జారీ చేశారు: “యెహోవాసాక్షులు మిమ్మల్ని సందర్శిస్తున్నారని మేము విన్నాం. మళ్లీ రావద్దని వారికి చెప్పండి, కాల్చివేయడానికి వారి సాహిత్యాలను మీరు మాకివ్వకుంటే, మీకు బహిష్కరణ తప్పదు.” వారు సాక్షులతో కేవలం ఒక అధ్యయనం చేశారు, దానికి ఈ భయంకరమైన పరీక్ష వారికి ఎదురైంది.
ఆ కుటుంబ యజమానుల్లో ఒకరు, “మీరు చెప్పినట్లు మేము చేయం. వారు మాకు బైబిలు బోధించడానికి వచ్చారు” అని సమాధానమిచ్చాడు. ఆ పెద్దలు ఎలా స్పందించారు? బైబిలు అధ్యయనం చేసినందుకు
వారిని బహిష్కరించారు. అది నిజంగా ఒక క్రూరమైన చర్య. ఆ కాలనీకి చెందిన జున్ను కర్మాగారపు వాహనం వారినుండి పాలు సేకరించకుండానే వారి ఇల్లు దాటిపోయింది. అదే వారి ఏకైక జీవనాధారం. ఒక కుటుంబ యజమానిని ఉద్యోగంలో నుండి తీసేశారు. మరొకరిని కాలనీ దుకాణం నుండి సరుకుల్ని కొననివ్వలేదు, ఆయన పదేళ్ళ కుమార్తెను పాఠశాల నుండి తొలగించారు. చుట్టుప్రక్కలవాళ్లు ఒక స్త్రీ ఇంటిని చుట్టుముట్టి, ఆమె భర్త బహిష్కరించబడ్డాడు కాబట్టి ఆమె ఆ యువకునితో ఉండడానికి వీల్లేదని లాక్కెళ్లిపోడానికి వచ్చారు. ఇన్ని జరిగినా, బైబిలు అధ్యయనం చేసిన ఆ కుటుంబాలు వారి సత్యాన్వేషణను విడిచిపెట్టలేదు.ఆ మిషనరీలు దూరమైనా బైబిలు అధ్యయనం చేయడానికి వారం వారం అక్కడికి వెళ్లారు. ఆ అధ్యయనాలు ఆ కుటుంబాలను ఎంత బలపరిచాయో కదా! వాటికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యుల్లో కొందరు గుర్రం మీద, గుర్రపు బగ్గీలో రెండేసి గంటలు ప్రయాణంచేసి వచ్చేవారు. ఆ మిషనరీల్లో ఒకరు ప్రార్థన చేయాలని ఆ కుటుంబాలు మొదటిసారి ఆహ్వానించిన సందర్భం ఎంతో భావావేశాన్ని నింపింది. ఈ కాలనీల్లో మెనోనైట్లు ఎప్పుడూ బిగ్గరగా ప్రార్థించరు, అందువల్ల తమ పక్షాన ఎవరైనా ప్రార్థించడాన్ని వారు ఎన్నడూ వినలేదు. పురుషుల కళ్లలో నీళ్లు మెదిలాయి. ఆ మిషనరీలు తమకు కూడా ఒక పెద్ద టేపు రికార్డరు తెచ్చినప్పుడు వారెంత కుతూహలపడ్డారో మీరు ఊహించగలరా? వారి కాలనీలో సంగీతం ఎన్నడూ అనుమతించబడలేదు. శ్రావ్యమైన కింగ్‌డమ్ మెలొడీస్ విని వాళ్లెంత పొంగిపోయారంటే, ప్రతీ అధ్యయనం తర్వాత రాజ్యగీతాలు పాడాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే, మారిన ఈ క్రొత్త పరిస్థితులను వారెలా తట్టుకుని జీవించగలరు అనే ప్రశ్న మిగిలిపోయింది.
ప్రేమగల సహోదరత్వాన్ని కనుగొనడం
తమ సమాజం నుండి వేరుపడిన ఆ కుటుంబాలు సొంతగా జున్ను తయారు చేయడం ఆరంభించాయి. వారినుండి జున్ను కొనేవారిని కనుగొనేందుకు ఆ మిషనరీలు వారికి సహాయం చేశారు. ఒక దక్షిణ అమెరికా మెనోనైటు కాలనీలో పెరిగి పెద్దవాడై ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒక దీర్ఘకాల సాక్షి ఆ కుటుంబాల పరిస్థితి గురించి విన్నాడు. వారికి సహాయపడాలనే ఒక ప్రత్యేక కోరిక ఆయనకుంది. ఒక వారంలోపే వారిని సందర్శిద్దామని ఆయన విమానంలో బొలీవియాకు వెళ్లాడు. ఆ కుటుంబాలకు ఎంతో ఆధ్యాత్మిక ప్రోత్సాహమివ్వడమే కాక, వారు రాజ్య మందిరంలో కూటాలకు హాజరవడానికీ, తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్టుకు చేరవేయడానికి అనువుగా సొంత ట్రక్కు కొనుక్కొనేలా ఆయన వారికి సహాయం చేశాడు.
“మేము ఆ సమాజం నుండి బహిష్కరించబడిన తర్వాత మాకు చాలా కష్టమైంది. మేము విచార వదనాలతో రాజ్యమందిరాలకు వెళ్లినా, ఆనందంతో తిరిగి వచ్చేవాళ్లం” అని ఒక కుటుంబ సభ్యుడు గుర్తుచేసుకుంటున్నాడు. అవును, స్థానిక సాక్షులు పరిస్థితిని అర్థం చేసుకొని తగిన మద్దతు అందించారు. కొందరు జర్మన్ భాష నేర్చుకున్నారు, జర్మన్ భాష మాట్లాడే చాలామంది సాక్షులు ఐరోపా నుండి బొలీవియాకు వచ్చి జర్మన్ భాషలో క్రైస్తవ కూటాలు నిర్వహించడానికి తోడ్పడ్డారు. అనతికాలంలోనే, మెనోనైటు సమాజాల నుండి 14 మంది రాజ్య సువార్తను ఇతరులకు ప్రకటించడం ఆరంభించారు.
మిషనరీల ఇంటికి మొదటిసారి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోపే అంటే 2001 అక్టోబరు 12న ఒకప్పటి ఎనబాప్టిస్టుల్లో 11 మంది మళ్లీ బాప్తిస్మం తీసుకున్నారు, అయితే ఈసారి యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటినుండి, ఇంకా ఎంతోమంది బాప్తిస్మం తీసుకున్నారు. ఒకాయన ఆ తర్వాత ఇలా వ్యాఖ్యానించాడు: “బైబిలు నుండి సత్యం నేర్చుకున్న దగ్గరనుండి, మేము విడుదలైన బానిసల్లా భావిస్తున్నాం.” మరొకాయన ఇలా అన్నాడు: “తమ సమాజంలో ప్రేమ లేకపోవడం గురించి చాలామంది మెనోనైట్లు ఫిర్యాదు చేస్తారు. అయితే యెహోవాసాక్షులు పరస్పరం శ్రద్ధ చూపించుకుంటారు. వారిమధ్య సురక్షితంగా ఉన్నట్లు నేను భావిస్తున్నాను.” బైబిలు నుండి సత్యాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి మీరు అన్వేషిస్తుంటే, మీరు కూడా కష్టాలపాలు కావచ్చు. అయితే, మీరు కూడా ఈ కుటుంబాల్లాగే యెహోవా సహాయం కోసం ప్రయత్నిస్తూ, విశ్వాస ధైర్యాల్ని ప్రదర్శిస్తే, మీరు కూడా విజయం సాధించి, సంతోషాన్ని కనుగొంటారు.
[అధస్సూచి]
^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినది.
[25వ పేజీలోని చిత్రం]
జర్మన్ భాషలో బైబిలు సాహిత్యాలను ఆనందంగా అందుకోవడం
[26వ పేజీలోని చిత్రం]
సంగీతం ఎల్లప్పుడూ నిషేధించబడినప్పటికీ, వారిప్పుడు ప్రతీ బైబిలు అధ్యయనం తర్వాత పాటలు పాడతారు