‘కీడును సహించేవారిగా ఉండండి’
‘కీడును సహించేవారిగా ఉండండి’
“ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడక అందరి యెడల సాధువుగాను . . . కీడును సహించువాడుగాను ఉండవలెను.”—2 తిమోతి 2:26.
మీపట్ల, మీరు ప్రాతినిధ్యం వహించే దానిపట్ల సుముఖత చూపించని వారు ఎదురైనప్పుడు మీరెలా స్పందిస్తారు? అంత్యదినాలను వర్ణిస్తూ అపొస్తలుడైన పౌలు ప్రజలు ‘దూషకులుగా, అపవాదకులుగా, అజితేంద్రియులుగా, క్రూరులుగా’ ఉంటారని ప్రవచించాడు. (2 తిమోతి 3:1-5, 12) మీ పరిచర్యలో లేదా ఇతర కార్యకలాపాల్లో అలాంటి వ్యక్తులు మీకు తారసపడవచ్చు.
2 కోపంగా మాట్లాడే ప్రతీ ఒక్కరికీ సరైన విషయాలపట్ల ఏ మాత్రం ఆసక్తి ఉండదని కాదు. ప్రజలు తమ దగ్గరకు వచ్చే ఎవరితోనైనా కోపంగా మాట్లాడేందుకు కారణం, తీవ్ర ఇబ్బంది లేదా విసుగు కావచ్చు. (ప్రసంగి 7:7) బూతులు మాట్లాడడం సర్వసాధారణమైయున్న పరిసరాల్లో నివసించడం, పనిచేయడం కారణంగా కూడా చాలామంది అలా ప్రవర్తించవచ్చు. అయితే అలాంటి సంభాషణ క్రైస్తవులుగా మనకు ఆమోదయోగ్యం కాదు, అయితే ఇతరులు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది. కఠినమైన మాటలకు మనమెలా స్పందించాలి? సామెతలు 19:11 ఇలా చెబుతోంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును.” రోమీయులు 12:17, 18 మనకు ఇలా సలహా ఇస్తోంది: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. . . . శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”
3 మనలో నిజంగా శాంతగుణం ఉంటే, మనం చూపించే స్వభావంలో అది తేటపడుతుంది. మన సామెతలు 17:27) తన శిష్యులను ప్రకటించడానికి పంపిస్తూ యేసు వారికి ఇలా ఉపదేశించాడు: “ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని [‘శాంతి కలుగునుగాక,’ ఈజీ-టు-రీడ్ వర్షన్] చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.” (మత్తయి 10:12, 13) మన సందేశమే ఒక సువార్త. బైబిలు దానిని “సమాధాన సువార్త” అనీ, “దేవుని కృపాసువార్త” అనీ, “ఈ రాజ్య సువార్త” అనీ పిలుస్తోంది. (ఎఫెసీయులు 6:15; అపొస్తలుల కార్యములు 20:24; మత్తయి 24:14) అవతలి వ్యక్తి నమ్మకాలను విమర్శించడం లేదా అతని దృక్కోణాల గురించి వాదించడం కాదుగానీ, అతనితో దేవుని వాక్యంలోని సువార్తను పంచుకోవడమే మన ఉద్దేశం.
మాటలో, క్రియలో బహుశా మన ముఖకవళికల్లో, మన స్వరంలో అది ప్రతిబింబిస్తుంది. (4 ఇంటి యజమాని మనం చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే ఆపి, “నాకు ఆసక్తి లేదు” అని చెప్పవచ్చు. అనేక సందర్భాల్లో మీరు “నేను బైబిలు నుండి ఈ చిన్న వాక్యమే చదవాలని ఆశిస్తున్నాను” అని అతనితో అనే అవకాశం ఉంది. ఆయన దానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇతర సందర్భాల్లో, “అన్యాయమే ఉండని, ప్రజలందరూ పరస్పరం ప్రేమించుకోవడం నేర్చుకునే కాలం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను” అని చెప్పడం సముచితంగా ఉండవచ్చు. ఇంటి యజమాని ఆ వెంటనే మీరు చెబుతున్న విషయాలపై ఆసక్తి చూపించకపోతే మీరు ఇలా అనవచ్చు: “బహుశా మీకిది అనుకూల సమయం కాకపోవచ్చు.” అయినా కూడా ఇంటి యజమాని ప్రతిస్పందన సమాధానకరంగా లేకపోతే, ఆ వ్యక్తి ‘యోగ్యుడు కాదనే’ నిర్ణయానికి మనం రావాలా? ప్రతిస్పందన ఎలాగున్నా, ‘అందరియెడల సాధువుగా కీడును సహించేవారిగా’ ఉండాలనే బైబిలు ఉపదేశాన్ని గుర్తుంచుకోండి.—2 తిమోతి 2:26.
హానికరుడు, తప్పుదారిపట్టాడు
5 మొదటి శతాబ్దంలో సౌలు అనే వ్యక్తి తన దురుసుతనానికే కాక, తన హింసాయుత ప్రవర్తనకూ పేరుగాంచాడు. అతను “ప్రభువుయొక్క శిష్యులను బెదిరించుటయును, హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు” భావించాడని బైబిలు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 9:1, 2) ఆ తర్వాత ఆయన, తాను ఒకప్పుడు “దూషకుడను, హింసకుడను హానికరుడనైన” వ్యక్తిగా ఉన్నానని ఒప్పుకున్నాడు. (1 తిమోతి 1:12) ఆయన బంధువుల్లో కొందరు అప్పటికే క్రైస్తవులుగా మారినప్పటికీ, క్రీస్తు అనుచరులపట్ల తనకున్న దృక్పథం గురించి ఆయన ఇలా చెప్పాడు: “వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని.” (అపొస్తలుల కార్యములు 23:16; 26:11; రోమీయులు 16:7, 11) సౌలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు యేసు శిష్యులు ఆయనతో బహిరంగ చర్చ కోసం ప్రయత్నించినట్లు ఎలాంటి రుజువూ లేదు.
6 సౌలు ఎందుకలా ప్రవర్తించాడు? చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఇలా వ్రాశాడు: “తెలియక అవిశ్వాసమువలన చేసితిని.” (1 తిమోతి 1:12-13) ఆయన పరిసయ్యునిగా ఉండి, “పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు” విద్యాభ్యాసం చేశాడు. (అపొస్తలుల కార్యములు 22:3) సౌలు బోధకుడైన గమలీయేలు విశాల దృక్పథంతో ఉన్నప్పటికీ, పౌలు సహవాసం చేసిన ప్రధాన యాజకుడైన కయప ఛాందసుడు. యేసుక్రీస్తును చంపడానికి దారితీసిన పన్నాగంలో కయప కీలకపాత్ర వహించాడు. (మత్తయి 26:3, 4, 63-66; అపొస్తలుల కార్యములు 5:34-39) ఆ తర్వాత, యేసు అపొస్తలులను కొరడాలతో కొట్టించి యేసు నామమున ప్రకటించకూడదని ఖండితముగా ఆజ్ఞాపించాడు. స్తెఫనును రాళ్లతో కొట్టడానికి తీసుకెళ్ళడానికి ముందు కోపోద్రేకులైన ప్రజలతో క్రిక్కిరిసిన మహాసభకు కయప అధ్యక్షత వహించాడు. (అపొస్తలుల కార్యములు 5:27, 28, 40; 7:1-60) ఆ రాళ్లతో కొట్టే పనిని సౌలు అమలు చేశాడు, అంతేకాక దమస్కులో యేసు అనుచరులను బంధించి వారిని అణచివేసే తన ప్రయత్నాలను ఇంకా కొనసాగించడానికి కయప ఆయనకు అధికారమిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 8:1; 9:1, 2) కయప ఇచ్చిన ఈ అధికారం కారణంగా, సౌలు దేవునిపట్ల తనకున్న ఆసక్తికి తన ప్రవర్తనే ఒక నిదర్శనమని భావించాడు, కానీ వాస్తవానికి ఆయనలో నిజమైన విశ్వాసం లోపించింది. (అపొస్తలుల కార్యములు 22:3-5) ఫలితంగా, యేసు నిజమైన మెస్సీయ అని సౌలు గ్రహించలేకపోయాడు. అయితే పునరుత్థానం చేయబడిన యేసు అద్భుతరీతిలో దమస్కుకు వెళ్లే దారిలో సౌలుతో మాట్లాడినప్పుడు ఆయన అసలు విషయాన్ని గ్రహించాడు.—అపొస్తలుల కార్యములు 9:3-6.
7 ఇది జరిగిన కొద్దికాలానికే, సౌలుకు సాక్ష్యమిచ్చేందుకు అననీయ పంపించబడ్డాడు. మీరు అలా సాక్ష్యమిచ్చేందుకు ఆసక్తిని ప్రదర్శించి ఉండేవారా? అననీయ మొదట భయపడినా, ఆ తర్వాత సౌలుతో దయాపూర్వకంగా మాట్లాడాడు. దమస్కుకు వెళ్లే దారిలో యేసు అద్భుతరీతిలో పౌలుకు ఎదురైన అనుభవంతో ఆయన దృక్పథం మారింది. (అపొస్తలుల కార్యములు 9:10-22) అప్పటినుండి ఆయన అత్యాసక్తితో క్రైస్తవ మిషనరీ సేవ చేసిన అపొస్తలుడైన పౌలుగా పేరుగాంచాడు.
సాత్వికుడే కానీ ధైర్యస్థుడు
8 అత్యాసక్తితో రాజ్యాన్ని ప్రకటించిన యేసు సాత్వికుడే కానీ ప్రజలతో ధైర్యంగా వ్యవహరించాడు. (మత్తయి 11:29) తమ దుష్ట మార్గాలను విడిచిపెట్టమని ప్రజలకు ఉద్బోధించే తన పరలోకపు తండ్రి స్వభావాన్ని ఆయన ప్రతిబింబించాడు. (యెషయా 55:6, 7) పాపులతో వ్యవహరించేటప్పుడు యేసు వారిలో మారే స్వభావం ఉన్నవారిని గమనించి అలాంటి వారిని ప్రోత్సహించాడు. (లూకా 7:37-50; 19:2-10) యేసు బాహ్యరూపం ఆధారంగా ఇతరులకు తీర్పు తీర్చకుండా వారిని పశ్చాత్తాపానికి నడిపే ఉద్దేశంతో దయ, సహనం, దీర్ఘశాంతం ప్రదర్శించిన తన తండ్రిని అనుకరించాడు. (రోమీయులు 2:4) మనుష్యులందరూ పశ్చాత్తాపపడి, రక్షణపొందాలనేదే యెహోవా చిత్తం.—1 తిమోతి 2:3, 4.
9 సువార్త రచయితయైన మత్తయి, యేసుక్రీస్తు విషయంలో యెహోవా దృక్కోణమేమిటో చెబుతూ ఈ ప్రవచనార్థక మాటలను ఉల్లేఖిస్తున్నాడు: “ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు.” (మత్తయి 12:17-21; యెషయా 42:1-4) ఈ ప్రవచనార్థక మాటలకు అనుగుణంగా యేసు అరుస్తూ వాదోపవాదాలకు దిగలేదు. ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా, యథార్థపరులకు సత్యం నచ్చేలా మాట్లాడాడు.—యోహాను 7:32, 40, 45, 46.
10 యేసు తన పరిచర్య కాలంలో అనేకమంది పరిసయ్యులతో మాట్లాడాడు. మాటల్లో ఆయనను తప్పు పట్టుకోవాలని కొందరు ప్రయత్నించినా, వారందరిలో చెడు భావాలు ఉన్నాయనే నిర్ధారణకు యేసు రాలేదు. కాస్త విమర్శనాత్మక స్వభావంగల పరిసయ్యుడైన సీమోను యేసును పరీక్షిద్దామనే ఉద్దేశంతో ఆయనను భోజనానికి ఆహ్వానించాడు. యేసు ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, అక్కడున్న వారికి సాక్ష్యమిచ్చాడు. (లూకా 7:36-50) మరో సందర్భంలో, నీకొదేమనే ప్రముఖ పరిసయ్యుడు రాత్రిపూట యేసు దగ్గరకు వచ్చాడు. చీకటిపడిన తర్వాత వచ్చినందుకు యేసు ఆయనను నిందించలేదు. బదులుగా, విశ్వాసముంచే వారి రక్షణార్థం తన కుమారుణ్ణి పంపించడం ద్వారా దేవుడు చూపించిన ప్రేమను గురించి నీకొదేముకు సాక్ష్యమిచ్చాడు. దేవుని ఏర్పాటుపట్ల విధేయత చూపించవలసిన ప్రాముఖ్యతను కూడా యేసు ప్రేమతో నొక్కిచెప్పాడు. (యోహాను 3:1-21) ఆ తర్వాత, ఇతర పరిసయ్యులు యేసును గురించిన ప్రశంసాత్మక నివేదికను చులకన చేసి మాట్లాడినప్పుడు, నీకొదేము యేసుకు అనుకూలంగా మాట్లాడాడు.—యోహాను 7:46-51.
11 తనను చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నించిన వారి వేషధారణను యేసు పసిగట్టకుండా ఉండలేదు. వ్యతిరేకులు తనను వ్యర్థమైన చర్చల్లోకి లాగడానికి ఆయన అనుమతించలేదు. అయితే సముచితమైనప్పుడు మాత్రం, ఒక సూత్రాన్ని చెప్పడం ద్వారా లేదా ఒక ఉపమానాన్ని ఉపయోగించడం ద్వారా లేదా ఒక లేఖనాన్ని ఉల్లేఖించడం ద్వారా క్లుప్తంగానే అయినా శక్తిమంతంగా జవాబిచ్చాడు. (మత్తయి 12:38-42; 15:1-9; 16:1-4) ఇంకా కొన్ని సందర్భాల్లో, జవాబు ఇచ్చినంత మాత్రాన ప్రయోజనమేమీ లేదని గ్రహించినప్పుడు యేసు మిన్నకున్నాడు.—మార్కు 15:2-5; లూకా 22:67-70.
12 కొన్ని సందర్భాల్లో, అపవిత్రాత్మలు పట్టిన ప్రజలు యేసుపై కేకలు వేశారు. అలాంటి సమయాల్లో ఆయన నిగ్రహం పాటించడమే కాక, విడుదల చేయడానికి దేవుడు ఇచ్చిన శక్తిని కూడా ఉపయోగించాడు. (మార్కు 1:23-28; 5:2-8, 15) మనం పరిచర్యలో ఉన్నప్పుడు కొందరు కోపం తెచ్చుకొని మనపై కేకలు వేసినప్పుడు, మనం కూడా నిగ్రహం పాటిస్తూ, పరిస్థితిని స్నేహగుణంతో, ఔచిత్య ధోరణితో చక్కదిద్దడానికి ప్రయత్నించాలి.—కొలొస్సయులు 4:6.
కుటుంబంలో
13 యేసు అనుచరులు కుటుంబంలోనే ఎక్కువ నిగ్రహం పాటించాల్సిన అవసరం తరచూ కనబడుతోంది. బైబిలు సత్యాలు ప్రగాఢంగా ముద్రవేయబడిన ఒక వ్యక్తి, తనలాగే తన కుటుంబమూ ప్రతిస్పందించాలని కోరుకోవచ్చు. అయితే యేసు చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించవచ్చు. (మత్తయి 10:32-37; యోహాను 15:20, 21) దీనికి వివిధ కారణాలున్నాయి. ఉదాహరణకు, బైబిలు బోధలు మనం నిజాయితీపరులుగా, బాధ్యతగలవారిగా, గౌరవనీయులుగా మారేందుకు సహాయం చేయవచ్చు, ఏ పరిస్థితిలోనైనా సృష్టికర్తపట్ల మనకు ఎక్కువ బాధ్యత ఉందని కూడా లేఖనాలు బోధిస్తున్నాయి. (ప్రసంగి 12:1, 13; అపొస్తలుల కార్యములు 5:29) యెహోవాపట్ల మన యథార్థత కారణంగా కుటుంబంలో తన ప్రాబల్యం తగ్గిందని భావించే కుటుంబ సభ్యుడు నొచ్చుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, నిగ్రహం పాటించిన యేసు మాదిరిని మనం అనుసరించడం ఎంత ప్రాముఖ్యమో కదా!—1 పేతురు 2:21-23; 3:1, 2.
14 ఇప్పుడు యెహోవా సేవ చేస్తున్న అనేకులు, ఒకప్పుడు తాము బైబిలు అధ్యయనం చేస్తూ మార్పులు చేసుకుంటుండగా వివాహ భాగస్వామి నుండి లేదా ఇతర కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నవారే. ఆ వ్యతిరేకులు యెహోవాసాక్షుల గురించి ప్రతికూల వ్యాఖ్యానాలు విని ఉండవచ్చు, బహుశా వారు తమ కుటుంబంపై ఏదైనా ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడి ఉండవచ్చు. వారు తమ దృక్పథాన్ని మార్చుకోవడానికి కారణం ఏమిటి? చాలామంది విషయంలో మంచి మాదిరే ప్రధాన కారణంగా ఉంది. ఎందుకంటే విశ్వాసి నిలకడగా బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకొని క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవుతూ, పరిచర్యలో పాల్గొంటూనే కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ దూషణను సహించిన కారణంగా కొన్నిసార్లు కుటుంబంలో వ్యతిరేకత తగ్గింది.—1 పేతురు 2:12.
15 దురభిమానం లేదా అహంకారం కారణంగా కూడా వ్యతిరేకించే వ్యక్తి బైబిలు వివరణను వినడానికి నిరాకరించి ఉండవచ్చు. అమెరికాలో, తాను నిజమైన దేశ భక్తుణ్ణి అని చెప్పుకున్న ఒక వ్యక్తి విషయంలో అదే జరిగింది. ఒకసారి, ఆయన భార్య సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయన తన బట్టలన్నీ సర్దుకొని బయటకు వెళ్లిపోయాడు. మరోసారి, తుపాకి తీసుకొని ఇల్లువదిలి వెళ్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తన అనుచిత ప్రవర్తనకు ఆమె మతమే కారణమని నిందించాడు. అయితే ఆమె బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడానికే కృషి చేసింది. ఆమె యెహోవాసాక్షి అయిన ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన కూడా యెహోవాసాక్షి అయ్యాడు. అల్బేనియాలో ఒక స్త్రీ, తన కూతురు యెహోవాసాక్షులతో అధ్యయనం చేసి బాప్తిస్మం తీసుకున్నందుకు కోపం తెచ్చుకుంది. 12 సార్లు ఆ తల్లి తన కూతురు బైబిలును నాశనం చేసింది. ఆ తర్వాత ఒకరోజు, తన కూతురు బల్లమీద పెట్టిన కొత్త బైబిలును ఆమె తెరిచింది. అనుకోకుండా అది మత్తయి 10:36కు తెరుచుకుంది, అక్కడ ఉన్నది తనకే అన్వయిస్తున్నట్లు ఆమె గ్రహించింది. అయినప్పటికీ, తన కూతురు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి తన కూతురు ఇతర సాక్షులతోపాటు, ఇటలీలో జరిగే సమావేశానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు చెప్పడానికి పడవ వరకు వచ్చింది. ఆమె ఆ గుంపు సభ్యుల్లోని ప్రేమను, వారు ఆప్యాయంగా కౌగలించుకోవడాన్ని, వారి చిరునవ్వులను చూసినప్పుడు, వారు సంతోషంగా నవ్వుకోవడాన్ని విన్నప్పుడు ఆమెలోని భావాలు మారడం ఆరంభమయ్యాయి. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆమె బైబిలు అధ్యయనానికి ఒప్పుకుంది. నేడు ఆమె మొదట్లో వ్యతిరేకించే వారికి సహాయం చేయడానికి కృషి చేస్తోంది.
16 ఒకానొక సందర్భంలో, ఒక భర్త కత్తి పట్టుకుని తీవ్ర నిందారోపణలు చేస్తూ, రాజ్య మందిరానికి వస్తున్న తన భార్యకు ఎదురువచ్చాడు. అప్పుడామె మృదువుగా “స్వయంగా రాజ్యమందిరంలోకి వచ్చి నువ్వే చూడు” అని బదులిచ్చింది. ఆయన లోనికి రావడమే కాదు, ఆ తర్వాత కొంతకాలానికి క్రైస్తవ పెద్ద కూడా అయ్యాడు.
17 మీ కుటుంబ సభ్యులందరూ క్రైస్తవులే అయినప్పటికీ, కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు, మానవ అపరిపూర్ణత కారణంగా మాటలు కఠినంగా ఎఫెసీయులు 4:31) ఎఫెసు క్రైస్తవుల పరిసర పరిస్థితులు, వారి అపరిపూర్ణత, కొన్ని సందర్భాల్లో వారి గతజీవిత విధానం వారిని ప్రభావితం చేసిందనేది స్పష్టం. మరి వారు మారడానికి ఏమి సహాయం చేస్తుంది? వారు “[తమ] చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై” ఉండాలి. (ఎఫెసీయులు 4:23) వారు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, తమ జీవితాలను అది ఎలా ప్రభావితం చేయాలో ధ్యానిస్తూ, తోటి క్రైస్తవులతో సహవసిస్తూ, మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మఫలాలు వారి జీవితాల్లో మరింత ఎక్కువగా కనబడతాయి. వారు ‘ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు వారిని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించడం’ నేర్చుకుంటారు. (ఎఫెసీయులు 4:32) ఇతరులు మనకేమి చేసినా మనం నిగ్రహం పాటిస్తూ దయ, కరుణ చూపిస్తూ క్షమించేవారిగా ఉండాలి. అవును, మనం “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.” (రోమీయులు 12:17, 18) దేవుణ్ణి అనుకరిస్తూ నిజమైన ప్రేమను చూపించడం ఎల్లప్పుడూ సరైనదిగానే ఉంటుంది.—1 యోహాను 4:8.
మారవచ్చు. ప్రాచీన ఎఫెసులోని క్రైస్తవులు ఇలాంటి ఉపదేశం పొందారనే విషయం గమనార్హం: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (క్రైస్తవులందరి కోసం ఉపదేశం
18 ‘కీడును సహించువారిగా ఉండవలెను’ అనే సలహా క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. (2 తిమోతి 2:26) అయితే అలాంటి సలహా మొదట తిమోతిని ఉద్దేశించి ఇవ్వబడింది, ఆయన ఎఫెసులో పెద్దగా సేవ చేసినప్పుడు ఆయనకది అవసరమైంది. అక్కడి సంఘంలో కొందరు తమ దృక్కోణాలను బాహాటంగా వ్యక్తం చేస్తూ తప్పుడు సిద్ధాంతాలను బోధించారు. మోషే ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని పూర్తిగా గ్రహించని కారణంగా వారు విశ్వాసం, ప్రేమ, మంచి మనస్సాక్షి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు. క్రీస్తు బోధల సారాన్నీ, దైవభక్తి ప్రాముఖ్యతనూ గుర్తించకుండా కేవలం పదాల గురించి వాదోపవాదాలు జరుగుతుండగా అహంకారం వారిలో తగవులను సృష్టించింది. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి తిమోతి, లేఖన సత్యాలపట్ల స్థిరంగా ఉండడమే కాక, తన సహోదరులతో వ్యవహరించేటప్పుడు మృదువుగా కూడా ఉండాలి. మంద తనది కాదని, అందువల్ల క్రైస్తవ ప్రేమకు, ఐక్యతకు తోడ్పడేలా ఇతరులతో వ్యవహరించాలని నేటి పెద్దలకు తెలిసినట్లే ఆయనకు తెలుసు.—ఎఫెసీయులు 4:1-3; 1 తిమోతి 1:3-11; 5:1, 2; 6:3-5.
19 “సాత్వికులై” ఉండమని దేవుడు తన ప్రజలకు ఉద్బోధిస్తున్నాడు. (జెఫన్యా 2:3) “సాత్వికము” అని అనువదించబడిన హీబ్రూ మాట, ఒక వ్యక్తి విసుక్కోకుండా, పగతీర్చుకునే ఉద్దేశం లేకుండా హానిని భరించేందుకు దోహదపడే వైఖరిని సూచిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిగ్రహం పాటించగలిగేలా, ఆయనకు సరైన రీతిలో ప్రాతినిధ్యం వహించేలా సహాయం చేయమని యెహోవాకు మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం.
మీరేమి నేర్చుకున్నారు?
• మీరు హానికరమైన మాటలకు గురైనప్పుడు, మీకు ఏ లేఖనాలు సహాయం చేయగలవు?
• సౌలు ఎందుకు హానికరంగా ప్రవర్తించాడు?
• అన్నిరకాల ప్రజలతో సముచితంగా వ్యవహరించేందుకు యేసు మాదిరి మనకు ఎలా సహాయం చేస్తుంది?
• ఇంట్లో మన సంభాషణను అదుపులో పెట్టుకోవడం ఎలాంటి ప్రయోజనాలు తెస్తుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1. క్రైస్తవ పనిలో ఉన్నప్పుడు, కఠినంగా మాట్లాడే ప్రజలు మనకు అప్పుడప్పుడు ఎందుకు తారసపడతారు?
2. మనతో కోపంగా మాట్లాడే ప్రజలతో జ్ఞానయుక్తంగా వ్యవహరించడానికి మనకు ఏ లేఖనాలు సహాయం చేయవచ్చు?
3. మనం ప్రకటించే సందేశంలో శాంతి ఎలా ఇమిడివుంది?
4. మీరు రావడానికి కారణమేమిటో చెప్పే అవకాశమే ఇవ్వకుండా “నాకు ఆసక్తి లేదు” అంటే మీరేమి చెప్పవచ్చు?
5, 6. సౌలు యేసు అనుచరులతో ఎలా ప్రవర్తించాడు, ఆయన ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడు?
7. దమస్కుకు వెళ్లే దారిలో యేసు పౌలుకు ఎదురైనప్పుడు ఆయనకు ఏమి జరిగింది?
8. చెడుపనులు చేసిన ప్రజలపట్ల యేసు తన తండ్రి దృక్పథాన్ని ఎలా ప్రతిబింబించాడు?
9. యెషయా 42:1-4 యేసు విషయంలో నెరవేరిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
10, 11. (ఎ) యేసును వ్యతిరేకించిన వారిలో పరిసయ్యులే ప్రముఖంగా ఉన్నప్పటికీ, వారిలో కొందరికి ఆయన ఎందుకు సాక్ష్యమిచ్చాడు? (బి) వ్యతిరేకులకు యేసు కొన్నిసార్లు ఎలాంటి జవాబు ఇచ్చాడు, అయితే ఆయన ఏమి చేయలేదు?
12. ప్రజలు తనపై కేకలు వేసినప్పటికీ, యేసు ప్రజలకు ఎలా సహాయం చేయగలిగాడు?
13. యెహోవాసాక్షులతో అధ్యయనం ఆరంభించిన కుటుంబ సభ్యుణ్ణి ప్రజలు కొన్నిసార్లు ఎందుకు వ్యతిరేకించవచ్చు?
14-16. తమ కుటుంబ సభ్యులను మొదట్లో వ్యతిరేకించిన కొందరిలో మార్పు రావడానికి కారణం ఏమిటి?
17. క్రైస్తవ గృహంలో కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏ లేఖన ఉపదేశం సహాయం చేయగలదు?
18. రెండవ తిమోతి 2:26లోని ఉపదేశం ప్రాచీన ఎఫెసులోని ఒక పెద్దకు ఎందుకు సముచితం, అది క్రైస్తవులందరికీ ఎలా ప్రయోజనం చేకూర్చగలదు?
19. మనమందరం “సాత్వికులై” ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
[26వ పేజీలోని చిత్రం]
సౌలుకు ఎలాంటి పేరున్నా, అననీయ ఆయనతో ప్రేమగా వ్యవహరించాడు
[29వ పేజీలోని చిత్రం]
ఒక క్రైస్తవుడు నమ్మకంగా తన బాధ్యతలు నిర్వర్తించడం కుటుంబ వ్యతిరేకతను తగ్గించగలదు
[30వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ప్రేమకు, ఐక్యతకు తోడ్పడతారు