మంచి నడవడి ‘దేవుని ఉపదేశమును అలంకరిస్తుంది’
మంచి నడవడి ‘దేవుని ఉపదేశమును అలంకరిస్తుంది’
రష్యాలోని క్రాస్నియార్స్‌క్‌కు చెందిన మరీయా అనే యౌవనస్థురాలు ఎంత చక్కగా పాడుతుందంటే, ఆమె టీచరు ఆమెను పాఠశాల గాయక బృందంలో చేర్చింది. అప్పుడు మరీయా తన టీచర్లలో ఒకరిని కలిసి తాను కొన్ని పాటలను పాడలేనని గౌరవపూర్వకంగా వివరించింది. ఎందుకు? ఎందుకంటే మతసంబంధ పాటలు పాడడం తన బైబిలు ఆధారిత నమ్మకాలకు విరుద్ధమని ఆమె చెప్పింది. ఆ టీచరు ఆశ్చర్యపోతూ, ‘పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడంలో తప్పేముంది?’ అని అనుకుంది.
త్రిత్వ దేవుని గురించిన పాట పాడడానికి తాను ఎందుకు నిరాకరిస్తోందో చూపించడానికి మరీయా తన బైబిలును తెరచి దేవుడు, యేసుక్రీస్తు ఒకే వ్యక్తి కాదని, పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి అని వివరించింది. (మత్తయి 26:39; యోహాను 14:28; అపొస్తలుల కార్యములు 4:31) మరీయా ఇలా చెప్పింది: “మా టీచరుతో నా సంబంధం పాడవలేదు. మా పాఠశాలలో అందరూ మంచి టీచర్లే ఉన్నారు. మేము నిజాయితీగా ఉండాలనే వారు కోరుకుంటారు.”
ఆ సంవత్సరమంతటిలో మరీయా తన టీచర్ల గౌరవాన్ని, తోటి విద్యార్థుల గౌరవాన్ని సంపాదించుకుంది. ఆమె ఇలా చెప్పింది: “బైబిలు సూత్రాలు నాకు నా జీవితంలో సహాయం చేస్తున్నాయి. పాఠశాల సంవత్సరం ముగిసినప్పుడు నాకు నా నిజాయితీకి, క్రమబద్ధతకు అవార్డు లభించింది, నాకు మంచి శిక్షణనిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా అమ్మానాన్నలకు అధికారికంగా పాఠశాలనుండి ఉత్తరం పంపించబడింది.”
మరీయా 2001, ఆగస్టు 18న బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా చెప్పింది: “నేను యెహోవా అంతటి అద్భుతమైన దేవునికి సేవ చేయగలుగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.” ప్రపంచవ్యాప్తంగా యౌవనస్థులైన యెహోవాసాక్షులు తీతు 2:10లోని మాటలకు అనుగుణంగా జీవిస్తున్నారు, అక్కడ మనమిలా చదువుతాము: ‘అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించండి.’
[32వ పేజీలోని చిత్రం]
మరీయా బాప్తిస్మం తర్వాత తన తల్లిదండ్రులతో
[32వ పేజీలోని చిత్రం]
ప్రశంసా పత్రం, గుర్తింపు సర్టిఫికెట్