జీవితం విలువైనదా, పనికిరానిదా?
జీవితం విలువైనదా, పనికిరానిదా?
“మానవుడు దేవుని స్వరూపములో చేయబడ్డాడు కాబట్టి, మనిషిని హత్య చేయడం ప్రపంచంలోనే అత్యంత విలువైన, అతి పరిశుద్ధమైన దానిని నాశనం చేసినట్లవుతుంది.”—విలియమ్ బార్క్లే వ్రాసిన ద ప్లెయిన్ మ్యాన్స్ గైడ్ టు ఎథిక్స్.
‘జీవం ప్రపంచంలోనే అత్యంత విలువైనది.’ మీరూ అలాగే భావిస్తున్నారా? ప్రజల ప్రవర్తనా విధానం చూస్తే, చాలామంది ఆ రచయితతో ఏకీభవించడంలేదని స్పష్టమవుతోంది. తోటి మానవుల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా స్వార్థపూరిత లక్ష్యాల కోసం ప్రాకులాడిన దౌర్జన్యపూరిత ప్రజలు, లక్షలాదిమందిని నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు.—ప్రసంగి 8:9.
అవసరానికి వాడుకొని పారేయవచ్చు
దానికి మొదటి ప్రపంచ యుద్ధమే ఒక పెద్ద ఉదాహరణ. ఘోరమైన ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు పదేపదే “ఏ కారణం లేకుండానే మనుష్యుల ప్రాణాలు బలి తీసుకోబడ్డాయి” అని చరిత్రకారుడైన ఏ.జె.పి. టేలర్ చెబుతున్నాడు. కీర్తి ప్రతిష్ఠల కోసం ప్రాకులాడిన సైనికాధికారులు, సైనికులు ఎందుకూ పనికిరానివారన్నట్లు వారిని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చన్నట్లు ప్రవర్తించారు. ఫ్రాన్స్‌లోని వెర్డూన్ కోసం జరిగిన యుద్ధంలో ఐదు లక్షలకంటే ఎక్కువమంది మరణించారు. “[యుద్ధపరంగా చూస్తే] లాభం పొందింది, నష్టపోయింది అంటూ ఏమీ లేదు, మనుష్యులు చంపబడడం, ఖ్యాతి పొందడం మాత్రం జరిగింది” అని టేలర్ వ్రాస్తున్నాడు.—ద ఫస్ట్ వరల్డ్ వార్.
జీవితపు విలువను ఇలా అలక్ష్యం చేయడం ఇప్పటికి కూడా ప్రబలంగానే ఉంది. ఇటీవలి కాలాల్లో “జనాభా విపరీతంగా పెరిగిపోవడంవల్ల ప్రపంచ కార్మికుల జాబితాలో లక్షలాదిమంది నిరుపేదలు, బలహీనులు చేరిపోయారు” అని విద్వాంసుడైన కెవిన్ బేల్స్ సూచించాడు. “జీవితాన్ని విలువలేనిదిగా” మార్చివేసే నిర్దాక్షిణ్య వాణిజ్య వ్యవస్థలో బ్రతికి బట్టకట్టడానికి వారు జీవితాంతం పోరాడవలసి వస్తుంది. అణచివేసేవారు వారిని బానిసలకంటే హీనంగా చూస్తూ “డబ్బు సంపాదన కోసం వాడుకొని, అవసరం
తీరిన తర్వాత పారేసే పనికిరాని వస్తువుల్లా” ఉపయోగించుకుంటారు అని బేల్స్ చెబుతున్నాడు.—డిస్పోజబుల్ పీపుల్.
‘గాలికై ప్రయాసపడడం’
లక్షలాదిమంది తాము విలువలేనివారమని భావిస్తూ నిరాశా నిస్పృహలకు గురై తాము చచ్చినా బ్రతికినా పట్టించుకునే వారెవ్వరూ లేరని బాధపడడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. యుద్ధాలు, అన్యాయంతోపాటు, వర్షాభావం, కరవులు, వ్యాధులు, వియోగం, ఇంకా ఎన్నో విషయాలు మానవులందరినీ పట్టి పీడిస్తున్నాయి, అందుకే ప్రజలు అసలు తమ జీవితం జీవించదగినదేనా అని ఆలోచిస్తున్నారు.—ప్రసంగి 1:8, 14.
అయితే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తీవ్రంగా నష్టపోయి బాధలు అనుభవించరు. అయితే భయంకరమైన నిరంకుశత్వాన్ని తప్పించుకున్నవారు కూడా ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అభిప్రాయాన్నే తరచూ వ్యక్తం చేస్తారు, ఆయన ఇలా ప్రశ్నించాడు: “సూర్యునిక్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటిచేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?” దాని గురించి ఆలోచించిన తర్వాత చాలామంది తాము చేసినవాటిలో చాలామట్టుకు ‘వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నాయి’ అని గ్రహిస్తారు.—ప్రసంగి 2:22, 26.
చాలామంది వెనక్కి తిరిగి తమ జీవితాన్ని చూసుకున్నప్పుడు “జీవితమంటే ఇంతేనా?” అని ప్రశ్నిస్తారు. అవును, పితరుడైన అబ్రాహాము వలే తాము ‘సుదీర్ఘంగా సంతృప్తికరంగా’ జీవించామని భావిస్తూ తమ జీవితాన్ని ముగించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? (ఆదికాండము 25:8, ఈజీ-టు-రీడ్ వర్షన్) చాలామంది తమ జీవితం వ్యర్థమని బలంగా నమ్ముతారు. అయితే నిజానికి జీవితం అలా వ్యర్థంగా ఉండనవసరం లేదు. దేవుడు ప్రతి మనిషి జీవితాన్ని విలువైనదిగా పరిగణిస్తాడు, మనలో ప్రతి ఒక్కరమూ నిజంగానే సంపూర్ణంగా సంతృప్తికరంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అదెలా సాధ్యమవుతుంది? ఈ విషయం గురించి తర్వాతి ఆర్టికల్ చెబుతున్న విషయాలను పరిశీలించండి.