పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
అపొస్తలుల కార్యములు 7:59లో స్తెఫను పలికిన మాటలు, మనం యేసుకు ప్రార్థించాలని సూచిస్తున్నాయా?
అపొస్తలుల కార్యములు 7:59 ఇలా చెబుతోంది: “ప్రభువును గూర్చి మొరపెట్టుచు—యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా [“వేడుకుంటుండగా,” NW] వారు అతనిని రాళ్లతో కొట్టిరి.” ఆ మాటలు కొందరిలో సందేహాలను కలిగించాయి, ఎందుకంటే “ప్రార్థన ఆలకించువాడు” యెహోవా అని బైబిలు చెబుతోంది. (కీర్తన 65:2) స్తెఫను నిజంగానే యేసుకు ప్రార్థించాడా? ఒకవేళ ఆయన యేసుకే ప్రార్థించివుంటే, యేసు యెహోవా ఒకరే అని దానర్థమా?
స్తెఫను “దేవునికి ప్రార్థించాడు” అని కింగ్ జేమ్స్ వర్షన్ చెబుతోంది. అందుకే చాలామంది, బైబిలు వ్యాఖ్యాత అయిన మాథ్యూ హెన్రీ వచ్చిన ముగింపుకే వస్తారు, ఆయన ఇలా చెప్పాడు: “స్తెఫను ఇక్కడ క్రీస్తుకు ప్రార్థిస్తున్నాడు, మనం కూడా ఆయనకే ప్రార్థించాలి.” అయితే ఆ అభిప్రాయం తప్పు. ఎందుకు?
బార్న్స్ నోట్స్ ఆన్ ద న్యూ టెస్టమెంట్ నిజాయితీగా ఇలా ఒప్పుకుంటోంది: “దేవుడు అనే పదం మూలభాషలో లేదు, ఆ పదం అనువాదాల్లో కూడా ఉండకూడదు. అది ప్రాచీన [వ్రాతప్రతుల్లో] గానీ అనువాదాల్లో గానీ లేదు.” మరి ఆ వచనంలో “దేవుడు” అనే పదం ఎందుకు చేర్చబడింది? విద్వాంసుడైన ఏబీల్ అబ్బాట్ లివర్మోర్ అది “అనువాదకులకుండే మతసంబంధిత దురభిప్రాయాలకు ఒక ఉదాహరణ” అని చెప్పాడు. కాబట్టి చాలా ఆధునిక అనువాదాలు ఆ వచనంలో తప్పుగా చేర్చబడిన దేవుడు అనే పదాన్ని తీసివేశాయి.
అయినా చాలా అనువాదాలు స్తెఫను యేసుకు “ప్రార్థించాడు” అని చెబుతున్నాయి. నూతనలోక అనువాదము (ఆంగ్లం)లోని అధస్సూచి కూడా, ‘వేడుకున్నాడు’ అనే పదానికి “విజ్ఞప్తి; ప్రార్థన” అనే అర్థాలు కూడా ఉన్నాయని చెబుతోంది. కాబట్టి అది యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు అని సూచించడం లేదా? లేదు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన గ్రీకు మూలభాషా పదమైన ఎపికాలియోకు “వేడుకొను, విజ్ఞప్తి చేయు; . . . అధికారంలో ఉన్న వ్యక్తిని అర్థించు” అనే భావంతో ఉపయోగించబడిందని వైన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ వివరిస్తోంది. పౌలు “కైసరు ఎదుటనే చెప్పుకొందును” అని ప్రకటించినప్పుడు ఆ పదాన్నే ఉపయోగించాడు. (అపొస్తలుల కార్యములు 25:11) కాబట్టి ద న్యూ ఇంగ్లీష్ బైబిల్, స్తెఫను యేసుకు “మొరపెట్టుకున్నాడు” అని సముచితంగానే అనువదించింది.
స్తెఫను అలా ఎందుకు వేడుకున్నాడు? అపొస్తలుల కార్యములు 7:55, 56 ప్రకారం స్తెఫను “పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను” చూశాడు. మామూలుగా అయితే స్తెఫను యేసు నామమున యెహోవాకే విన్నవించుకునేవాడు. కానీ పునరుత్థానం చేయబడిన యేసును దర్శనంలో చూసిన తర్వాత స్తెఫను, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము” అని నేరుగా ఆయనకే విజ్ఞప్తి చేయడానికి వెనుకాడలేదని స్పష్టమవుతోంది. చనిపోయినవారిని పునరుత్థానం చేసే అధికారం యేసుకు ఇవ్వబడిందని స్తెఫనుకు తెలుసు. (యోహాను 5:27-29) కాబట్టి తనను పరలోకంలో అమర్త్యమైన జీవితానికి పునరుత్థానం చేసేంతవరకూ తన ఆత్మను లేదా జీవ శక్తిని భద్రంగా ఉంచమని యేసును వేడుకున్నాడు.
స్తెఫను చేసిన ఆ క్లుప్తమైన విజ్ఞప్తి, యేసుకు ప్రార్థించాలని సూచిస్తుందా? ఎంతమాత్రం లేదు. యేసు, యెహోవా ఇద్దరు వేర్వేరు వ్యక్తులని స్తెఫను స్పష్టంగా గుర్తించాడు ఎందుకంటే ‘యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండడాన్ని’ ఆయన చూశాడని ఆ వృత్తాంతం చెబుతోంది. అంతేకాక ఆయన ఉన్న పరిస్థితులు అసాధారణమైనవి. స్తెఫను తర్వాత కేవలం అపొస్తలుడైన యోహాను మాత్రమే అలా యేసుకు విజ్ఞప్తి చేశాడు. ఆయన కూడా యేసును దర్శనంలో చూసినప్పుడు నేరుగా ఆయనకే విజ్ఞప్తి చేశాడు.—ప్రకటన 22:16, 20.
నేడు క్రైస్తవులు సరైన విధంగా యెహోవా దేవునికే ప్రార్థించినా, యేసే “పునరుత్థానమును జీవమును” అయ్యున్నాడని వారు కూడా దృఢంగా విశ్వసిస్తారు. (యోహాను 11:25) యేసుకు తన అనుచరులను మరణంనుండి లేపే సామర్థ్యం ఉందనే విశ్వాసం స్తెఫనుకు సహాయం చేసినట్లే మనకు కూడా కష్టసమయాల్లో సహాయం చేయగలదు.